సీమంద్రాలో తెదేపా, వైకాపా బలాబలాలు
posted on Apr 9, 2014 @ 8:32PM
తెలంగాణాలో నామినేషన్ల పర్వం ముగియడంతో ఇప్పుడందరి దృష్టి సీమాంధ్ర వైపు మళ్ళింది. తెలంగాణాలో వ్యతిరేఖ ఫలితాలు వచ్చినా వాటి వల్ల తెదేపా, వైకాపాలకు పెద్ద ప్రమాదం ఏమీ ఉండదు. కానీ, సీమాంధ్రలో విజయం సాధించలేకపోతే మాత్రం ఆ ప్రభావం చాలా దారుణంగా ఉండవచ్చును. పదేళ్ళపాటు తెదేపా అధికారానికి దూరంగా ఉన్నపటికీ పార్టీ చెల్లాచెదురు కాకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకొంటూ వచ్చిన చంద్రబాబుకి ఈ ఎన్నికలలో తప్పని సరిగా గెలవడం అత్యవసరం. లేకుంటే మరో ఐదేళ్ళు ప్రతిపక్ష బెంచీలలో కూర్చొని కాలక్షేపం చేయడం కష్టం. అందువల్ల ఈ ఎన్నికలు ఆయన రాజకీయానుభవానికి, నాయకత్వ లక్షణాలకి కూడా ఒక అగ్ని పరీక్ష వంటివేనని చెప్పవచ్చును.
ఇక అనేక సీబీఐ కేసులలో చిక్కుకొని తీవ్రమయిన ఆర్ధిక నేరారోపణలు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో రాష్ట్రంలో కూడా చక్రం తిప్పగల విధంగా ఈ ఎన్నికలలో తిరుగులేని మెజార్టీతో గెలిచినపుడే వాటి నుండి క్షేమంగా బయటగలరు. లేకుంటే ఆయనకు మళ్ళీ కేసులు, కోర్టుల సమస్యలు ఎదుర్కోక తప్పదు.
ప్రస్తుతం సీమాంధ్రలో తెదేపా, వైకాపాలు రెండూ సమవుజ్జీలుగా కనబడుతున్నాయి. బలమయిన కాంగ్రెస్ నేతలను, బీసీ, యస్సీ, ఎస్టీ వర్గాలను పార్టీలోకి ఆకర్షించడం ద్వారా తెదేపా చాలా బలోపేతం అయింది. ఇక జాతీయ స్థాయిలో విజయావకాశాలు స్పష్టంగా కనబడుతున్న బీజేపీతో పొత్తులు పెట్టుకోవడంతో, ఆ ప్రభావం, మోడీ ప్రభావం మరియు ఆయనతో చంద్రబాబుకి ఉన్న సాన్నిహిత్యం కూడా తేదేపాకు ప్రజలలో అనుకూలతను పెంచాయి. మంచి నాయకత్వ లక్షణాలు, కార్యదక్షత, అపార అనుభవం కలిగిన వారిరువురూ చేతులు కలపడం మరో సానుకూలాంశంగా మారింది. రాష్ట్రానికి మళ్ళీ కొత్త పునాదులు వేయవలసిన ఈ పరిస్థితుల్లో ఇవే అంశాలు తేదేపాకు ప్రత్యేకతను కలిగిస్తున్నాయి.
అదేవిధంగా వైకాపా కూడా చాలా మంది కాంగ్రెస్ నేతలను, రెడ్డి, మైనార్టీ వర్గాలను పార్టీవైపు ఆకర్షించగలిగింది. గత రెండు నెలలుగా జగన్మోహన్ రెడ్డి విస్తృతంగా చేస్తున్న యాత్రల ద్వారా, వివిధ జిల్లాలలో స్థానిక నేతలను చాలా మందిని వైకాపా వైపు తిప్పుకొంటూ, పార్టీని జిల్లా స్థాయి నుండి బలోపేతం చేసుకోగలిగారు.
ఇక అన్నిటి కంటే ముఖ్యమయిన అంశం ఏమిటంటే, రాజశేఖర్ రెడ్డి చనిపోయి అప్పుడే దాదాపు ఐదేళ్ళు పూర్తి కావస్తున్నా, జగన్ కుటుంబ సభ్యుల నిరంతర ప్రయత్నాల వలన నేటికీ ఆ సానుభూతిని అదే స్థాయిలో కాకపోయినా, ఇంకా బలంగానే నిలుపుకోగలగడం విశేషం. గనుక ఈ ఎన్నికలలో తప్పనిసరిగా ఆ అంశం వైకాపాకు కొంతమేర ప్రయోజనం కలిగించవచ్చును.
అదే విధంగా జగన్ చేసిన సమైక్యాంధ్ర పోరాటంలో నిజాయితీ లేకపోయినా అతనే అసలయిన సమైక్యవాది అని చాల మంది ప్రజలు నమ్మడం వైకాపాకు కలిసి వచ్చే అంశంగా మారవచ్చును. కిరణ్ కుమార్ రెడ్డి చివరి వరకు ఈ విషయంలో అతనికి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, స్వయంక్రుతాపరాధం వల్ల ఆ పేరు పోగొట్టుకొని జగన్ ఆ స్థానం ఆక్రమించుకొనేందుకు అవకాశం కల్పించారు.
ఇక చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి ఇరువురూ కూడా ఏపీయన్జీవోలను తమవైపు ఆకర్షించడంలో విఫలమవడంతో ఇదే అదునుగా జగన్ వారిని తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ వారిలో అశోక్ బాబు వంటి కొందరు ముఖ్యనేతలకి జగన్ గనుక టికెట్స్ ఇచ్చినట్లయితే, ఉద్యోగుల ఓట్లు గంపగుత్తగా కాకపోయినా చాల భారీగానే వైకాపా ఖాతాలో జామా అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల బహుశః చంద్రబాబు నాయుడు కూడా ఉద్యోగ సంఘ నేతలకి టికెట్స్ ఇచ్చి పార్టీవైపు ఆకర్షించే ప్రయత్నం చేసినా ఆశ్చర్యం లేదు. ఉద్యోగ సంఘాలు ఏ పార్టీవైపు మొగ్గినా మిగిలిన పార్టీలకి ఆ లోటుని పూడ్చుకోవడం అంత తేలిక కాబోదు.
రెండు పార్టీలు ఇదే విధంగా సాగుతూ సమానంగా ఓట్లు చీల్చుకొంటే దానివల్ల వారే కాక ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోతారు. ప్రస్తుతం రెండు పార్టీలు సమనవుజ్జీలుగా కనబడుతున్నప్పటికీ, ఎన్నికలు దగ్గర పడే నాటికి అవి వేసే ఎత్తులు జిత్తులతో వాటిలో ఏదో ఒకటి కొంచెం ముందంజ వేయవచ్చును. అందువల్ల నిత్యం వెలువడుతున్న అనేక సర్వే నివేదికలు ఏదో ఒక పార్టీకి మెజార్టీ వస్తుందని చెపుతున్నపటికీ, అసలు సంగతి మాత్రం చివరి వారంలోనే చూచాయగా తెలియవచ్చును.