తెలంగాణాలో పార్టీల బలాబలాలు
posted on Apr 6, 2014 @ 11:08AM
తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత జరుగుతున్న మొట్ట మొదటి ఎన్నికలు గనుక సహజంగానే ప్రజలలో తెలంగాణా సెంటిమెంటు చాలా బలంగా ఉంటుంది. దానిని కేసీఆర్ మరియు తెరాసలోని ఆయన కుటుంబ సభ్యులు తమ మాటలతో మరింత రగుల్చుతూ ఎన్నికలలో గెలిచేందుకు గట్టిగా ప్రయత్నిస్తారు. ఈ ఎన్నికలలో తెలంగాణా సెంటిమెంటు, తెలంగాణా సాధన, పునర్నిర్మాణం, సామాజిక న్యాయం అనే నాలుగు అంశాలే అన్ని పార్టీల భవితవ్యం నిర్దేశించబోతున్నాయి. అందువలన ఒక్కో పార్టీ వీటిలో తమకు అనువుగా ఉన్నఅంశాలను హైలైట్ చేస్తూ ప్రజలను ఆకట్టుకోవాలని ప్రయత్నించవచ్చును.
కాంగ్రెస్, తెదేపాలతో పోలిస్తే తెరాసకు బలమయిన యంపీ అభ్యర్ధులు లేరనే చెప్పవచ్చును. అయితే తెరాస ప్రధాన లక్ష్యం మెజార్టీ అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకొని స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడమే గనుక బహుశః యంపీ స్థానాల కోసం మరీ అంతగా ఆరాటపడకపోవచ్చును. అలాగని పూర్తిగా వదులుకొంటుందని కాదు.
కాంగ్రెస్ మాత్రం వీలయినన్ని యంపీ స్థానాలను గెలుచుకోవడమే ప్రధాన లక్ష్యంగా పోరాడుతుంది. అందుకే పార్టీలో హేమాహేమీలనదగ్గ సిట్టింగ్ యంపీలకే మళ్ళీ స్థానాలు ఖరారు చేసింది. టీ-కాంగ్రెస్ పార్టీ తెలంగాణా సాధన, పునర్నిర్మాణం అనే రెండు అంశాలతో ఎన్నికల బరిలోకి దిగబోతోంది. కానీ, టీ-కాంగ్రెస్ నేతలు అలవాటు ప్రకారం ఒకరి కాళ్ళు మరొకరు లాక్కొంటూ, తమ బంధు జనాలందరికీ అసెంబ్లీ టికెట్స్ ఇప్పించుకొనేందుకు నేటికీ కుస్తీలు పడుతూనే ఉన్నారు. వారు ఈ బలహీనతను జయించలేరు. జయించగలిగితే వారిని తట్టుకోవడం తెరాస వల్ల కూడా కాదు. ఏమయినప్పటికీ, అసెంబ్లీ స్థానాలకు బరిలో దిగనున్న టీ-కాంగ్రెస్ నేతలు ఏ రకంగా కూడా తెరాసకు తీసిపోరు. వారిలో చాలా మంది కేవలం తమ వ్యక్తిగత బలంతోనే గెలవగల సమర్ధులు. కానీ, అంతమంది హేమాహేమీలను కేసీఆర్ ఒక్కడే బలంగా డీ కొంటుంటే, వారిలో ఏ ఒక్కరూ కూడా అతనిని గట్టిగా ఎదుర్కొనేందుకు ప్రయత్నించకపోగా డిల్లీలో టికెట్స్ కోసం పైరవీలు చేసుకొనేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అందువల్ల వారి అనైక్యతే తెరాసకు శ్రీ రామరక్ష అని చెప్పుకోవచ్చును.
ఇక తెదేపా తెలంగాణా పునర్నిర్మాణం, సామాజిక న్యాయం అనే రెండు అంశాలతో తన ప్రత్యర్ధులను ఎదుర్కొనేందుకు సిద్దమవుతోంది. తెదేపా-బీజేపీలు పొత్తులు పెట్టుకోవడం ఖాయమయితే, ఆ రెండు పార్టీలకు ఉన్న బలమయిన క్యాడర్, నేతల అండతో విడివిడిగా పోటీ చేస్తున్నకాంగ్రెస్, తెరాసలను నిలువరించగలవు. తెదేపా బీసీ మంత్రం పటిస్తూ, పునర్నిర్మాణం గురించి మాట్లాడుతూ ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తే, బీజేపీ నరేంద్ర మోడీ పేరు చెప్పుకొని ఓట్లు రాబట్టుకొనే ప్రయత్నం చేయవచ్చును.
బీజేపీ నేతలు ఈసారి ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసినా తెలంగాణాలో విజయం సాధించగలమని అతిశయం ప్రదర్శిస్తున్నప్పటికీ వారికి అంత సీను లేదు. టీ-కాంగ్రెస్,తెరాస, తెదేపాల బలాలతో పోలిస్తే ఆ పార్టీ తెలంగాణాలో నాలుగవ స్థానంలోనే ఉంది, ఉంటుంది కూడా. తమ పార్టీ తెలంగాణా బిల్లుకి మద్దతు ఇచ్చింది గనుక తెలంగాణా ప్రజలు తమకే ఓటేస్తారని అనుకొంటే అది ఆత్మవంచన చేసుకోవడమే అవుతుంది. అందువల్ల రేపు ఎన్నికలలో ఆ పార్టీకి పడే ఓట్లన్నీకేవలం మోడీ మొహం చూసి వేసినవే అనుకోవచ్చును.
ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్, తెరాస, తెదేపా-బీజేపీ బాలా బలాలు ఇంచుమించు సరిసమానంగానే ఉన్నట్లు కనబడుతోంది. ఎన్నికల వరకు ఇదే పరిస్థితి కొనసాగినట్లయితే తెలంగాణాలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం లేదు. కొత్తగా ఏర్పడుతున్న తెలంగాణా రాష్ట్రానికి ఇది చాల నష్టం కలిగిస్తుంది. ఒకవేళ ఎన్నికలు సమీపించే సమయానికి ఈ పార్టీలలో ఏదో ఒకటి మరింత బలం పుంజుకొని రేసులో ముందుకు దూసుకుపోయినట్లయితే ఇటువంటి దుస్థితి నివారించవచ్చును.