కాంగ్రెస్ పార్టీని ముంచుతున్న ఆ ఇద్దరూ
posted on Apr 11, 2014 7:42AM
మహాభారతంలో శకుని, శల్యుడు అనే రెండు గొప్ప పాత్రలున్నాయి. వారిరువురూ కూడా కౌరవ పక్షం వహించినప్పటికీ చివరికి వారినే నాశనం చేసారు. ఇంతకీ ఇప్పుడు ఈ పురాణాలు ఎందుకు అంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కూడా అటువంటి పెద్దమనుషులు ఇద్దరు కనబడుతున్నారు. దాదాపు మూడున్నర దశాబ్దాలుగా మధ్యప్రదేశ్ లో రాజ్యం ఏలుతున్న కాంగ్రెస్ పార్టీని నిలువునా ముంచేసి, ఆ రాష్ట్రంలో అధికారాన్ని బీజేపీకి అప్పగించేసిన పెద్దమనిషి ఒకరయితే, మరోకాయన తెలంగాణాలో కూడా పార్టీని తుడిచిపెట్టేయడానికి కంకణం కట్టుకొన్నారు. వారే దిగ్విజయ్ సింగ్ మరియు జైరామ్ రమేష్ అనే ఇద్దరు పెద్ద మనుషులు.
గులాం నబీ ఆజాద్ అనే మరో పెద్దమనిషి రాష్ట్ర విభజన చేయడానికి ఏళ్ల తరబడి మీనమేషాలు లెక్కిస్తుంటే, కాలుపెట్టిన చోటల్లా కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసేయగల సమర్ధుడు, కాంగ్రెస్ పక్షపాతి అయిన దిగ్విజయ్ సింగ్ రాష్ట్రాన్ని ‘హ్యండోవర్’ చేసుకొన్న రెండు మూడు వారాల్లోనే ఆ పని మొదలుపెట్టేసి, ఊహించినట్లుగానే సీమాంధ్రలో కూడా తమ కాంగ్రెస్ పార్టీని సమూలంగా తుడిచి పెట్టేసారు. ఇక ఎన్నికలలో రాష్ట్రాన్ని వేరే ఏదో పార్టీకి అప్పగించేయడమే మిగిలి ఉంది. ఆయన తను వచ్చిన పని పూర్తి చేయగానే మళ్ళీ బాధ్యతలను జైరామ్ రమేష్ అనే మరో మేధావికి అప్పగించి చేతులు దులుపుకొన్నారు.
ఈ జైరామ్ రమేష్ ఆయన కంటే నాలుగాకులు ఎక్కువే చదివాడు. పైగా అనర్గళంగా ఇంగ్లీషులో ఉపన్యాసాలు దంచగలడు. ఇతను ‘శల్య సారధ్యం’ చేయడంలో మంచి దిట్ట. తెలంగాణాలో ఉన్నప్పుడు ఆంధ్రా వాళ్ళని, ఆంధ్రాలో ఉన్నపుడు తెలంగాణా వాళ్ళని తిడుతూ స్థానిక ప్రజలను బుట్టలో వేసుకోవాలని ప్రయత్నిస్తూ, కాంగ్రెస్ పార్టీకి శల్యసారధ్యం చేస్తూ దాని పరిస్థితి రెంటికీ చెడిన రేవడిలా మార్చేందుకు గట్టిగా కృషి చేస్తుంటారు.
రాష్ట్ర విభజనకు పూనుకొన్న మూలపురుషులలో ఈయనదే ప్రధానపాత్ర. ఆ భుజకీర్తులు తగిలించుకొన్న కారణంగా కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారం చేయడానికి ఈయన కూడా తెలంగాణాలో వాలిపోయారు. ఒక్క కాంగ్రెస్ తప్ప మరే ఇతర పార్టీలు తెలంగాణా పునర్నిర్మాణం చేయలేవని, అందువలన తమ పార్టీకే ఓటేయమని చెపుతున్నారు.
ఆయన చెపుతున్న ప్రకారం కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే తెలంగాణా పునర్నిర్మాణం చేయగలదనుకొన్నా, మరి గత 5౦ ఏళ్లగా అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణాను ఎందుకు అభివృద్ధి చేయలేదు? చేసి ఉంటే రాష్ట్ర విభజన కోసం ఉద్యమాలు ఎందుకు జరిగాయి? ఇప్పుడు ఓటేస్తే మాత్రం చేస్తుందని నమ్మకం ఏమిటి? కనీసం పార్టీ గురించి కూడా ఆలోచించకుండా టికెట్స్ కోసం, పదవుల కోసం తన్నుకొంటున్న టీ-కాంగ్రెస్ నేతలు తెలంగాణకు మాత్రం మేలు చేస్తారని గ్యారంటీ ఏమిటి? అనే సామాన్య ప్రశ్నలకు జైరామ్ రమేష్ కనీసం ఇంగ్లీషులో జవాబులు చెప్పినా వాటిని తెలుగులోకి తర్జుమా చేయించుకొని ప్రజలు అర్ధం చేసుకోగలరు. ఏది ఏమయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్రలో దిగ్విజయ్ సింగ్, తెలంగాణాలో జైరామ్ రమేష్ మంగళ హారతి ఇచ్చే బాధ్యతలు చేపడితే మేము మాత్రం కాదంటామా? అని ప్రతిపక్షాలు మురిసిపోతున్నాయి.