ఎన్నికలలో తెరాసకు పోటీ వద్దంటున్న కేసీఆర్
posted on Apr 2, 2014 @ 10:14AM
మెదక్ జిల్లా అందోల్‌లో నిన్న జరిగిన తెరాస తెలంగాణా విజయోత్సవ సభలో మాటల మాంత్రికుడు కేసీఆర్ ఒకపక్క ప్రజలలో తెలంగాణా సెంటిమెంటుని రాజేస్తూనే, తనకు అధికారం కట్టబెడితే ఒక్కరూపాయి కూడ అవినీతిలేని పాలన అందిస్తానని సరికొత్త పల్లవి అందుకొన్నారు. తెరాసను ‘ఇంటి పార్టీగా’ ప్రజలు స్వీకరించాలని కోరారు. తమిళనాడు, ఒరిస్సా, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలే పరిపాలించుకొంటూ రాష్ట్రాలను అభివృద్ధి చేసుకొంటున్నాయని, అందువల్ల తెలంగాణలోకూడా ఇంటి పార్టీ- తెరాసకే ప్రజలు పట్టం కట్టాలని ఆయన కోరారు. ఎంతో దైర్యంతో పోరాడి తెలంగాణా సాధించిన తానే తెలంగాణకు ‘కొత్త మేస్త్రిగా’ ‘సేవ’ చేసుకొంటానని విన్నవించుకొన్నారు.
ఇంతకాలంగా ఆంధ్రా పార్టీలు, ఆంద్ర నాయకులు కలిసి తెలంగాణా నీళ్ళను, భూములను, ప్రజలను కూడా దోచుకొన్నారని అందువలన తెలంగాణాలో ఇకపై ఆంధ్రా పార్టీలకు ‘నో ఎంట్రీ’ అని బోర్డు కూడా పెట్టేసారు. వాటికి కూడా ఉద్యోగులలాగే ఆప్షన్స్ లేవని, తెలంగాణా విడిచి వెళ్లిపోవల్సిందేనని ప్రకటించేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే విద్యార్ధులకు ‘కేజీ టు పీజీ’ ఉచితవిద్య, రైతులకు రుణమాఫీ, గిరిజనులకు, మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్స్ తదితర అనేక హామీలు గుప్పించారు.
కేసీఆర్ ఎన్నికలలో గెలిచేందుకు హామీలు ఇచ్చుకోవడం వరకు బాగానే ఉంది కానీ ఎన్నికల బరిలో తమ పార్టీకి పోటీగా అసలు ప్రత్యర్ధులే ఉండకూడదని భావిస్తున్నట్లుంది. తెలంగాణాలో తమకంటే చాలా బలంగా ఉన్నకాంగ్రెస్ పార్టీకి అవినీతి ముద్ర, తెదేపాకు ఆంధ్రా పార్టీ ముద్రవేసేసి ప్రజలు ఓటేయడానికి అనర్హమయినవని ఆయనే డిసైడ్ చేసేసారు. పనిలోపనిగా తన తెరాసకు ‘ఇంటి పార్టీ ముద్ర’ గుద్దేసుకొని ఇది ప్రజల పార్టీయేనని నమ్మమని చెపుతున్నారు.
మొన్నటిదాకా దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తానని చెప్పిన ఆయన ఇప్పుడు తానే ‘తెలంగాణకు కొత్త మేస్త్రిగా’ సేవ చేసుకొంటానని చెపుతున్నారు. కేసీఆర్ తను చాలా గొప్ప త్యాగమూర్తిన్ని భావించవచ్చుగాక, కానీ ఆయన, ఆయన కుటుంబ సభ్యులు యంపీ, యం.యల్యే. కేంద్రమంత్రులుగా పనిచేసినప్పటికీ వారు తెలంగాణా రైతన్నలకు, నేతన్నలకు, బీడీ కార్మీకులకి, గల్ఫ్ బాధితులకి గానీ వారు చేసిందేమీ లేదు. అయినప్పటికీ తెలంగాణా ప్రజలు కూడా ఆయన నిజంగా త్యాగమూర్తేనని భావిస్తే ఆయన తన గురించి, తన పార్టీ గురించి ఇంతగా స్వోత్కర్ష చేసుకోనవసరం లేదు.
తెలంగాణా సాధనలో ఆయన పాత్రను, తెరాస పాత్రను ఎవరూ కూడా ప్రశ్నించలేరు. కానీ వారు అందుకు ఎంచుకొన్న విద్వేష ప్రచార మార్గం, అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యుల దౌర్జన్యాలు, బలవంతపు వసూళ్ళు, పార్టీలో సాగుతున్న కుటుంబ పెత్తనం వలననే నేడు ఆయన ప్రజలను ఓట్ల కోసం ఈవిధంగా వేడుకోవలసి వస్తోంది. తెలంగాణా ఏర్పడితే కాపలా కుక్క పాత్ర పోషిస్తానని చెప్పిన ఆయన ఇప్పుడు తాను తన కుటుంబ సభ్యులు అందరూ కూడా అధికారం పంచుకొంటామని నిస్సిగ్గుగా చెప్పుకొంటున్నారు. అందుకోసమే మళ్ళీ ఆయన ప్రజలలో తెలంగాణా సెంటిమెంటు రెచ్చగొడుతూ ఎప్పటికప్పుడు ప్రజల హృదయాలలో విద్వేష భావాలు నింపుతూ స్వచ్చమయిన తెలంగాణా ప్రజల హృదయాలను కూడా కలుషితం చేస్తున్నారు.
ఇంత పదవీ లాలస కలిగి, మాట నిలకడలేని వ్యక్తి కేసీఆర్ నేటికీ ప్రజలను తన మాటకారితనంతో మభ్యపెట్టాలని చూస్తున్నారు. కానీ తను అధికారంలో రావడం కోసం వేరే ఏ పార్టీలు పోటీలో ఉండకూడదనే దొరల అహంకారం, ఇంకా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం ఒక రాజకీయ పార్టీకి ఉండవలసిన లక్షణాలు కావు. మనది ప్రజాస్వామ్య వ్యవస్థ. అందుకు తగ్గట్టుగా ఆయన తీరు మార్చుకొని ప్రజల వద్దకు వెళితే వారే ఆయనను నెత్తిన పెట్టుకొంటారు.