వైఎస్ కుటుంబంలో అభిప్రాయ బేధాలు ?
posted on Dec 3, 2012 8:41AM
కడప పార్లమెంట్ సీటుకు అభ్యర్ధిని ఎంపిక చేసే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభిప్రాయ భేదాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే వైఎస్ కుటుంబ సభ్యుల మధ్య చిచ్చుకు కారణం కాబోతోందా ? ప్రస్తుత చోటుచేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే వీటికి సమాధానం అవుననే అగుపిస్తోంది.
2014 లో కడప స్థానం నుండి తన బాబాయి కుమారుడు అవినాష్ రెడ్డి పోటీ చేస్తారని జగన్ మోహన్ రెడ్డి సంవత్సరం క్రితమే ప్రకటించారు. దీనితో ఈ నియోజక వర్గంలో పాద యాత్రతో తన ప్రచారాన్ని మొదలపెట్టాలని ఆయన పధక రచన చేసుకున్నారు. అయితే, జగన్ సోదరి షర్మిలా కూడా ఇదే స్థానం నుండి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలియడంతో అవినాష్, అయన కుటుంబ సభ్యులు అసంతృప్తి తో ఉన్నారు. షర్మిలా కడప నుండి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తోందని తెలియడంతో ప్రమాదాన్ని నివారించడానికి తన పాద యాత్రను వాయిదా వేసుకోవాలని పార్టీ నాయకులు అవినాష్ కు సూచించారు.
అయితే, జగన్ జైలులో ఉండడంతో, షర్మిలా మాటే చెల్లుబాటు అయ్యే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వివేకానంద రెడ్డి జగన్ నుండి గతంలో దూరం కావడంతో చీలిన వై ఎస్ కుటుంబం మరో సారి ఈ సీటు విషయంలో అదే జరుగుతుందా అనే ఆందోళనలు వై ఎస్ కుటుంబంలో నెలకొని ఉన్నాయి.