పురందేశ్వరి, టి ఎస్ ఆర్ ల మధ్య ‘కోల్డ్ వార్’ ?
posted on Dec 6, 2012 @ 2:58PM
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో విశాఖపట్నం నుండి పోటీ చేసే విషయంలో కేంద్ర మంత్రి పురందేశ్వరి, పారిశ్రామిక వేత్త, టి. సుబ్బరామి రెడ్డి ల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. 1996, 1998 సంవత్సరాల్లో 11 వ, 12 వ లోక్ సభలకు జరిగిన ఎన్నికల్లో సుబ్బరామి రెడ్డి ఇక్కడ నుండి పోటీ చేసి గెలుపొందారు.
గత ఉప ఎన్నికలో ఆయన నెల్లూరు లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి,మేకపాటి రాజ మోహన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. కాగా, గత ఎన్నికల్లో పురందేశ్వరి విశాఖ నుండి పోటీ చేసి గెలుపొందారు. వచ్చే 2014 ఎన్నికల్లో తనకు ఈ స్థానమే కావాలని సుబ్బరామి రెడ్డి అధిష్టానం వద్ద పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.
మరో వైపు వచ్చే ఎన్నికల్లో ఈ స్థానం పురందేశ్వరికి ఇవ్వవద్దని కొందరు నేతలు ఇటీవల వచ్చిన రాహుల్ గాంధీ దూతలకు సూచించారు. దూత జితేందర్ నిన్న విశాఖలో ఈ స్థానం విషయంలో నాయకులు, మాజీ కార్పొరేటర్ల నుండి అభిప్రాయ సేకరణ చేశారు. ఎక్కువ మంది నేతలు పురందేశ్వరికి ఈ స్థానం కేటాయించవద్దని జితేందర్ కు సూచించినట్లు సమాచారం. ఈ సీటు విషయంలో వీరిద్దరి మధ్య ప్రస్తుతం మాటల యుద్ధం నడుస్తోందని తెలుస్తోంది.