కొడాలిపై విరుచుకుపడ్డ బాలకృష్ణ ఫ్యాన్స్
posted on Dec 5, 2012 @ 12:36PM
తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన గుడివాడ ఎంఎల్ఏ కొడాలి నాని విషయంలో ‘మాటకు మాట’ విధంగా పరిణామాలు జరుగుతున్నాయి.కొడాలి నాని నటుడు బాల కృష్ణ ఫై చేసిన విమర్శలకు బాల కృష్ణ అభిమానులు ఘాటుగా స్పందించారు.
‘ఎన్ టీ ఆర్ అభిమానివనీ, నందమూరి కుటుంబానికి వీర విదేయుడవనీ ఇన్ని రోజులు నీకు విలువనిచ్చాం. మా బాలకృష్ణ ఫై పిచ్చి కూతలు కూస్తావా, ఖబడ్దార్’ అంటూ అఖిల భారత నందమూరి బాల కృష్ణ అభిమాన సంఘం కన్వీనర్ జి ఎల్ శ్రీధర్ ఘాటు పదజాలంతో కొడాలి నానికి వార్నింగ్ ఇచ్చారు. సిట్టింగ్ ఎంఎల్ఏ ను కాదని పార్టీనీకు రెండుసార్లు టికెట్ ఇచ్చినా, బాలయ్య ఫైనే పిచ్చి కూతలు కూస్తావా అంటూ శ్రీధర్ నానీకి హెచ్చరిక చేశారు.
నాని తాను చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా బాలయ్యకు క్షమాపణలు చెప్పాలని శ్రీధర్ డిమాండ్ చేశారు. నందమూరి పేరు చెప్పుకొని కోట్లు సంపాదించిన కొడాలి నాని ప్రస్తుతం జగన్ పార్టీకి అమ్ముడుపోయారని ఆయన వ్యాఖ్యానించారు.‘నీ మీద పోటీ చేయడానికి బాలకృష్ణ అక్కర్లేదు. గుడివాడలో ఓ సాధారణ కార్యకర్తను నిలబెట్టి కూడా గెలిపించుకోగలం’ అని శ్రీధర్ వ్యాఖ్యానించారు.
‘బాలకృష్ణ రాష్ట్రంలో ఎక్కడి నుండి అయినా పోటీ చేసి గెలవగలరు. కొడాలి నాని గుడివాడ దాటితే, వెయ్యి ఒట్లయినా ఆయనకు వస్తాయా’ అని తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు వ్యాఖ్యానించారు.తమ నేత జగన్ మోహన్ రెడ్డి ఆదేశిస్తే బాల కృష్ణ ఫై కూడా పోటీ చేస్తానని కొడాలి నాని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.