అమీతుమీకి కిరణ్, డిఎల్ ?
posted on Dec 1, 2012 @ 10:33AM
మొదటి నుండీ బద్ధ వైరం తో ఉంటూ వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి డి ఎల్ రవీంద్రారెడ్డి ల మధ్య వైరం తుది దశకు చేరినట్లే. మంత్రి ధర్మాన ప్రసాద రావును ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతిని నిరాకరిస్తూ రాష్ట్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా డి ఎల్ డీసెంట్ నోట్ రాయడమే ఇందుకు కారణం.
డీసెంట్ నోట్ రాసే నిభందనేదీ రాజ్యాంగంలో లేదనీ, క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలకు మంత్రి మండలి అంతా కట్టుబడి ఉండాల్సిందేనని మఖ్యమంత్రి స్పష్టం చేశారు. క్యాబినెట్ నిర్ణయాలను వ్యతిరేకించేవారు తమ మంత్రి పదవులకు రాజీనామాలు చేయవచ్చని, లేదా తానే వారిని తొలగిస్తానని కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించడంతో ఈ వివాదం తారా స్థాయికి చేరింది.
ఏ మంత్రి అయినా, క్యాబినెట్ నిర్ణయానికి అభ్యంతరం వ్యక్తం చేస్తే వారు తమంతట తాముగా తమ మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుందనీ సుప్రీంకోర్టు ఓ తీర్పులో స్పష్టం చేసిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.
మోపిదేవి విషయం, ధర్మాన విషయం వేరని ముఖ్యమంత్రి అన్నారు. మోపిదేవిని సిబిఐ అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేసిందనీ,అందుకు ప్రభుత్వ అనుమతి కోరలేదని అయన అన్నారు. అయితే, ధర్మాన ను ప్రాసిక్యూట్ చేయడానికి సిబిఐ తమ అనుమతి కోరిందని ముఖ్యమంత్రి వివరించారు.
పొతే పోవచ్చని ముఖ్య మంత్రి వ్యాఖ్యానించడం, సి ఎం, డి,ఎల్ ఇద్దరూ తమ వైఖరులకు కట్టుబడి ఉండడంతో, ఈ పరిణామం ఎటు వైపు కు దారి తీస్తుందో నని పార్టీలో ఆందోళన నెలకొంది.