ఎన్డిఏ వైపు కేసిఆర్ ?
posted on Dec 3, 2012 @ 11:27AM
ప్రత్యెక తెలంగాణా రాష్ట్రం ఇక కాంగ్రెస్ వల్ల రాదని తేల్చుకున్న టిఆర్ఎస్ అధినేత కే. చంద్ర శేఖర రావు ఎన్డిఏ వైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తన పార్టీ నాయకులతో అన్నట్లు సమాచారం. కాంగ్రెస్ హై కమాండ్ తెలంగాణా విషయంలో తమను మోసం చేసిందనే అభిప్రాయంతో ఉన్న కేసిఆర్ ఇక ఎన్డిఏ ను నమ్ముకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు భావిస్తున్నారు.
తాము అధికారంలోకి వస్తే, వంద రోజుల్లో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ఇస్తామని బిజెపి గతంలో అనేక సార్లు ప్రకటించిన విషయాన్ని కూడా కేసిఆర్ తన పార్టీ నాయకులకు గుర్తు చేస్తున్నారు.అకస్మాత్తుగా, కేసిఆర్, ఎన్డిఏ మంత్రం జపించడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
2014 లో కేంద్రంలో ఎన్డిఏ అధికారంలోకి రావడం దాదాపు ఖాయమని కేసిఆర్ భావిస్తుండడం కూడా ఇందుకు ఒక కారణం. ఒక వేళ అది నిజమైతే తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు తధ్యమని కేసిఆర్ భావిస్తున్నారు. ఎన్డిఏ ద్వారా తెలంగాణా ఏర్పడితే, తమ పార్టీనే ఆ రాష్ట్రంలో అధికారంలో ఉంటుందనీ, అదే కాంగ్రెస్ ద్వారా ప్రత్యెక రాష్ట్రం ఏర్పడితే, టిఆర్ఎస్ ను తమ పార్టీలో విలీనం చేయాలని కాంగ్రెస్ షరతులు పెడుతుందని కేసిఆర్ భావిస్తున్నారు.