పార్లమెంట్లో ఎన్టీఆర్ విగ్రహం
posted on Dec 6, 2012 @ 9:46AM
తెలుగువారి ఆత్మగౌరవ నినాదాన్ని ఎలుగెత్తి చాటిన మాజీ ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు (నందమూరి తారకరామారావు) విగ్రహాన్ని పార్లమెంట్ లో ఏర్పాటు చేసేందుకు ఉన్న అన్ని అడ్డంకులూ తొలగిపోయాయి. ఎన్టీఆర్ విగ్రహాన్ని సమర్పించాలని లోక్ సభ సెక్రటరీ జనరల్ కేంద్ర మంత్రి, ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరికి సూచించారు.
హైదరాబాద్ కు చెందిన మహా చార్య అనే శిల్పి దీనిని తయారు చేయనున్నారు. అయితే, విగ్రహాన్నితామే సమర్పిస్తామని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఒకరితో ఇకరు పోటీకి వచ్చారు. అయితే, చివరకు ఈ అవకాశం పురందేశ్వరికే దక్కింది.
ఈ విగ్రహం రాజ్యసభ ఆరో నంబర్ విశ్రాంతి మందిరం పక్కన, తమిళ నేత మురసోలి మారన్ విగ్రహం ఎదురుగా ప్రతిష్టించనున్నారు. తాము ఇచ్చే విగ్రహం రాగి, సీసం, తగరం, జింకు వంటి లోహాలతో తయారుచేయాలని లోక్ సభ సెక్రటేరియట్ మంత్రికి సూచించింది. ఎన్టీఆర్ జయంతి అయిన మే 28 న పార్లమెంట్లో ఈ విగ్రహాన్ని ప్రతిష్టించాలని పురందేశ్వరి ప్రయత్నిస్తున్నారు.