మళ్ళీ నిద్ర లేచిన కే.సి.ఆర్.
posted on Dec 4, 2012 8:13AM
ఇక తెలంగాణా ప్రజలకి నేనూ నా పార్టీ తప్ప మరొక దిక్కు లేదు, అని హోల్ సేల్ గా అటు తెలంగాణా ప్రజలమీదా ఇటు తెలంగాణా విషయం మీదా పేటెంట్ హక్కులు పొందినట్లు మాట్లాడే తె.రా.స. అధ్యక్షులవారు శ్రీమాన్ చంద్రశేఖరులు ఆ అభిజాత్యం తోనే ఇంత వరకు మిగిలిన పార్టీలవారిని ముఖ్యంగా బిజేపిని, తెలంగాణా కాంగ్రేసు వాళ్ళని చులకనగా చూసేవారు. ఒక వైపు చంద్రబాబు మరో వైపు షర్మిల కూడా తమ పెరట్లో చక్కబెట్టేస్తున్నప్పటికీ, 'అవి తమ పెరట్లో తిరిగే కోళ్ళు వాటిని తానూ ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోవచ్చు' అనే భ్రమలో ఇంతవరకు ఉపేక్షించిన ఆయన ఒక్కసారిగా షర్మిలమ్మ 'గద్వాల్ సవాల్తో' ఉళ్లికిపడి లేఛి చూసేసరికి మరోవైపు చంద్రబాబు కూడా తన ఇలాకాలో అప్పుడే 1000 రోజులు బట్టి తిరుగుతున్నట్లు తెలిసింది ఆయనకీ.
అది గాకుండా, తెలంగాణా మేము తప్పక ఇస్తామని ప్రతిజ్ఞ చేసిన బి.జే.పి.తో పంతానికి పోయి దానితోదూరం ఉన్నందుకూ, కోదండాచార్యులవారిని పట్టించుకోనందుకూ మొన్న జరిగిన తెలంగాణా జే.ఏ.సి.సమావేశంలో కే.సి.ఆర్.కి కొందరు సుద్దులు కూడా చెప్పడం అయిన తరువాత ఆయనలో మార్పో లేక చలనమో వచ్చినట్లు కనిపిస్తోంది. ఇంతవరకూ అటువంటి మతతత్వపార్టీతో అంటకాగితే రేపు మైనార్టీ వర్గాల ఓట్లు రాలవేమో అని కాస్త దూరం పాటించిన కే.సి.ఆర్.గారికి అలనాడు బోధీ వృక్షం క్రింద కూర్చొని తపస్సు చేసిన గౌతమ బుద్దునికి జ్ఞానోదయం అయినట్లు,తెలంగాణా జే.ఏ.సి.సమావేశంలోజ్ఞానోదయం అయినట్లు కనిపిస్తోంది.
ఇంతవరకూ తానూ కాంగ్రేసు తోక పట్టుకొని తెలంగాణా కోసం యెంత ఈదిన అది ఒడ్డుకి జేరక పోవడంతో, ఇప్పుడు ఏ బి.జే.పి.ని ముట్టుకొంటే తానూ మైలపడిపోతననుకోన్నడో ఇప్పుడు అదే బి.జే.పి.ని నమ్ముకోవడమే మంచిదేమో అనే ఒక ధర్మ సందేహం కూడా బయట పెట్టేరు.అయిష్టంగానయినా తెలంగాణా బి.జే.పి నాయకులతో ఎన్నికల సర్దుబాట్లు తప్పనిసరి అని గ్రహించినట్లు కనిపిస్తోంది. అంతేగాక,తెలంగాణా జే.ఏ.సి. ఆద్వర్యంలో ఇక 'పల్లెబాట' పట్టేందుకు సిద్దం అయి, ఇక తన పెరట్లో తిరుగుతున్న తే.దే.పా. మరియు పిల్ల కాంగ్రేసుల సంగతీ అటో ఇటో తెల్చేసందుకు తన కత్తులు పదును పెట్టుకొంటునట్లు తెలుస్తోంది. చంద్రబాబు చెప్పినట్లు ఆరు నెలలు పడుకొని, ఆరు నెలలు లేచి మాట్లాడే కే.సి.ఆర్. మళ్ళీ నిద్రలోంచి లేచినట్లు కనిపిస్తోంది. మళ్ళీ నిద్రలోకి జారుకోనక మునుపే, కొన్ని పనులయిన చక్క బెట్టక పొతే మళ్ళీ మేలుకోనేసరికి పరిస్తితులు చేయి దాటి పోవచ్చునని తెలుసుకోన్నట్లు కనిపిస్తోంది.