‘అఖిలపక్షం’ ఫై టిఆర్ఎస్, జెఎసిల్లో ఆనందం
posted on Dec 5, 2012 @ 4:42PM
తెలంగాణా విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ నెల 28 న అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించడం తో ఒక్కసారిగా ప్రత్యేక తెలంగాణా రాజకీయాలు వేడెక్కాయి. ఏది ఏమైనా తెలంగాణా రాష్ట్ర సమితి నాయకులు మాత్రం ఈ ప్రకటనతో ఆనందంతో ఉన్నారు. అలాగే, తెలంగాణా జెఎసి విషయం కూడా.
రాష్ట్రంలోని ఒక్కో పార్టీ నుండి ఒక్కరినే ఈ సమావేశానికి పిలవాలని హరీష్ రావు, కోదండ రామ్ వంటి నేతలు డిమాండ్ చేస్తున్నారు. వారు పార్టీ అధ్యక్షులు అయితే ఇంకా బాగుంటుందని వారన్నారు.
మరో వైపు ఈ ప్రకటనతో తెలంగాణా వస్తుందన్న నమ్మకం పూర్తి స్థాయిలో ఏర్పడిందని, ఇది చారిత్రాత్మకమని తెలంగాణా కు చెందిన కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తెలంగాణా ఫై అఖిల పక్షాన్ని డిమాండ్ చేసిన తెలుగు దేశం ప్రస్తుతం ఏ నిర్ణయం తీసుకుంటుందనే విషయం ఫై అంతటా ఉత్కంట నెలకొని ఉంది.
ప్రత్యేక రాష్ట్రం విషయంలో కేంద్రమే ఓ నిర్ణయం తీసుకోవాలని గతంలో తీర్మానించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఏమి చేస్తుందనేది కూడా సస్పెన్సే. బహుశా, ముందుగా కాంగ్రెస్ తన నిర్ణయాన్ని ప్రకటించాలని జగన్ పార్టీ సూచించే అవకాశాలున్నాయి.
ఏది ఎలా ఉన్నా, రాష్ట్రంలో ఇక ‘తెలంగాణా’ రాజకీయాలు వేడెక్కే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. అయితే, కాంగ్రెస్ పెద్దలు తీసుకొన్న ఈ చొరవను తన ఖాతాలో వేసుకోవడానికి టిఆర్ఎస్ నేతలు ప్రయత్నించడం కొసమెరుపు.