జగన్ బెయిల్ పిటీషన్ కు అనర్హుడు
posted on Dec 4, 2012 @ 5:19PM
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ కు సిబిఐ కోర్టు మరో సారి బెయిల్ ను నిరాకరించింది. ప్రస్తుత దశలో జగన్ బెయిల్ అడగటానికి వీలు లేదని సిబిఐ కోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు సూచనల మేరకు ఏడు అంశాల ఫై విచారణ జరుగుతోందని, కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న ఈ తరుణంలో జగన్ కు బెయిల్ ఇస్తే, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, అందువల్ల బెయిల్ ఇవ్వవద్దన్న సిబిఐ వాదనతో కోర్టు ఏకీభవించి జగన్ కు బెయిల్ నిరాకరించింది.
ఆయనకు బెయిల్ ఇస్తే, విచారణకు అవాంతరాలు ఏర్పడతాయని కూడా సిబిఐ, కోర్టుకు విన్నవించింది. ఆరు నెలల వరకూ జగన్ ఏ కోర్టు లోనూ బెయిల్ కు పిటీషన్ వేయకూడదని సుప్రీంకోర్టు సూచించిన విషయాన్ని కూడా సిబిఐ అధికారులు కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. దీనితో కోర్టు జగన్ బెయిల్ పిటీషన్ ను తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు సిబిఐ దర్యాప్తునకు కాల పరిమితి విధించలేదని ప్రత్యెక కోర్టు స్పష్టం చేసింది. దేశంలోని ఏ న్యాయస్థానమైనా సుప్రీంకోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉండాల్సిందేనని న్యాయమూర్తి వివరించారు.