ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. హస్తినలో మొదలైన ఎన్నికల సందడి
posted on Jan 6, 2020 @ 4:14PM
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఫిబ్రవరి 8 న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరి 11 న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. మొత్తం 13,750 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేయనుంది ఈసి. కోటీ నలభై ఆరు లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. 90 వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉంటారు. మొత్తం 70 స్థానాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని అన్ని పార్టీలు ఉధృతం చేశాయి. సీఎం కేజ్రీవాల్ మరోసారి సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 7 ఎంపీ సీట్లను గెలుచుకున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం సాధించేందుకు ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తోంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికే బూత్ లెవల్ ప్రచారం ప్రారంభించారు.
జనవరి 14 న అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించడంతో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 67 స్థానాల్లో విజయం సాధించగా.. బిజెపి 3 సీట్లలో మాత్రమే గెలిచింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. అందుకే ప్రచార బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నారు అమిత్ షా. ఢిల్లీలో త్రిముఖ పోటీ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు బిజెపి, కాంగ్రెస్ కూడా రేసులో ఉన్నాయి. ఆప్, కాంగ్రెస్ ల మధ్య ఓట్లు చీలితే తమ విజయం సులభమవుతుందన్న భావన బిజెపి నేతల్లో ఉంది. సీనియర్ సిటిజన్ల కోసం ఈసీ ప్రత్యేక రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తుంది.