కేటీఆర్ కు సన్మానం... హరీష్ కు అవమానం..!
posted on Jan 7, 2020 8:45AM
ఒకరు కేటీఆర్... మరొకరు హరీష్ రావు... ఇద్దరూ మంత్రులే... పైగా ఒకరు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తనయుడు కాగా... మరొకరు స్వయానా మేనల్లుడు... అయితే, వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం కోసం ఇద్దరూ తమతమ కుటుంబాలతో తిరుమల వెళ్లారు. ఇద్దరి హోదాలూ దాదాపు ఒక్కటే... కానీ, టీటీడీ అధికారులు... కేటీఆర్ ను ఒకలా... హరీష్ రావును మరోలా ట్రీట్ చేశారు. మంత్రి కేటీఆర్ ...ఏపీలో అడుగుపెట్టింది మొదలుకొని... శ్రీవారి దర్శనం పూర్తయ్యేవరకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. కేటీఆర్ తిరుపతిలో అడుగుపెట్టగానే ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సాదర స్వాగతం పలికారు. ఆ తర్వాత దాదాపు కేటీఆర్ వెన్నంటే ఉంటూ వచ్చిన చెవిరెడ్డి... దర్శనం ముగిసేవరకూ అడుగడుగునా స్వాగత సత్కారాలు చేశారు.
అయితే, కేటీఆర్ కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన వైసీపీ నేతలు, టీటీడీ అధికారులు... మంత్రి హరీష్ రావు విషయంలో మాత్రం సరిగా స్పందించలేదు. మంత్రి హోదాలో ఉన్నా... కనీసం ప్రోటోకాల్ పాటించకుండా అవమానకరంగా ప్రవర్తించారు. దాంతో, హరీష్ రావు తీవ్రంగా నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. టీటీడీ అధికారుల తీరుపై హరీష్ అసంతృప్తి వ్యక్తంచేశారు. అంతేకాదు దర్శనం కూడా చేసుకోకుండానే వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. అయితే, విషయం తెలుసుకున్న టీటీడీ పాలకమండలి సభ్యుడు దామోదర్.... మంత్రి హరీష్ రావును శాంతింపజేశారు. వీఐపీల తాకిడి ఎక్కువగా ఉండటం... అలాగే, మంత్రి హరీష్ రావు రాకపై సరైన సమాచారం లేకపోవడం వల్లే తప్పిదం జరిగిందంటూ వివరణ ఇచ్చారు. ఆ తర్వాత హరీష్ రావును దగ్గరుండి శ్రీవారి దర్శనం చేయించారు.
అయితే, నిబంధనలకు విరుద్ధంగా కేటీఆర్ కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన టీటీడీ అధికారులు.... పుష్కరిణి వైపు నుంచి ఆలయంలోకి తీసుకెళ్లడంపై భక్తులు మండిపడుతున్నారు. అదే సమయంలో, హరీష్ రావును పట్టించుకోవడంపైనా విమర్శలు చెలరేగుతున్నాయి. పైగా, హరీష్ 13 వీఐపీ టికెట్లు అడిగితే... కేవలం ఆరు మాత్రమే ఇచ్చారని అంటున్నారు. ఇక, కేటీఆర్ కు అడుగడుగునా స్వాగత సత్కారాలు చేసిన టీటీడీ అధికారులు.... హరీష్ కు మాత్రం స్వాగతం కాదు కదా... దర్శనంపై కనీసం సమాచారం కూడా ఇవ్వలేదంటున్నారు. అయితే, హరీష్ మాత్రం తిరుమలలో తనకెలాంటి అవమానం జరగలేదని చెబుతున్నారు. మొత్తానికి తిరుమల కొండపై టీటీడీ అధికారుల తీరు వివాదాస్పదమైంది.