తెలుగు రాష్ట్రాల్లో ఏకాదశి శోభ... తిరుమలకు క్యూకట్టిన వీఐపీలు...
posted on Jan 6, 2020 @ 9:35AM
తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి సందడి నెలకొంది. ప్రముఖ ఆలయాలన్నీ వైకుంఠ ఏకాదశి వైభవంతో కళకళలాడుతున్నాయి. స్వామివార్ల దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. కొన్ని ఆలయాల్లో అర్ధరాత్రి నుంచి... మరికొన్ని ఆలయాల్లో తెల్లవారుజాము నుంచి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు క్యూకట్టారు. ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు అర్ధరాత్రి నుంచే క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఇక, అర్ధరాత్రి నుంచే తిరుమల శ్రీవారికి కైంకర్యాలు మొదలయ్యాయి. తిరుప్పావై పఠనంతో శ్రీవారిని మేల్కొలిపి... శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వారాలను తెరిచి భక్తులను దర్శనానికి అనుమతించారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం పలువురు ప్రముఖులు తిరుమలకు క్యూకట్టారు. ఉభయ రాష్ట్రాల మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు... ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా కుటుంబ సమేతంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. కేటీఆర్‌కు ఎంపీ మిథున్ రెడ్డి, ఏపీ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.
వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తరద్వార దర్శనం చేసుకుంటే ముక్తి, మోక్షం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే, తిరుమల శ్రీవారి పర్వదినాలు అన్నింటిలో వైకుంఠ ఏకాదశిని చాలా ముఖ్యమైనదిగా చెబుతారు పండితులు. ఎందుకంటే, బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ తర్వాత తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉండే రోజు వైకుంఠ ఏకాదశి. ఏడాదిలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రెండు రోజులు మాత్రమే ఆలయంలో వైకుంఠా ద్వారాలు తెరిచి ఉంచుతారు. ఇక, ఏకాదశి రోజున స్వామివారిని క్షణకాలం చూసినా పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత వైకుంఠ ద్వారాల నుంచి వెళ్తే ముక్తి కలుగుతుందని భక్తులు భావిస్తారు. పైగా లక్షీదేవి విగ్రహం దగ్గర్నుంచి వైకుంఠ ద్వారం ఉండటంతో లక్షీ కటాక్షం కూడా సిద్దిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే, గంటల తరబడి వేచి ఉండైనా వెంకన్నను దర్శించుకుంటున్నారు భక్తులు.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా యాదగిరి లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలోనూ క్యూలైన్లు నిండిపోయాయి. లక్ష్మీ సమేతంగా నరసింహస్వామి ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిస్తున్నారు. అలాగే, వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి శోభ కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో తరలివస్తోన్న భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఉత్తర ద్వారం నుంచి పల్లకి సేవపై వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు.
అలాగే, భద్రాచలంలో రాములోరు ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే ఉత్తర ద్వార దర్శనానికి అనుమతించారు. ఇక, వైకుంఠ ఏకాదశి సందర్భంగా భద్రాద్రి రామయ్య తెప్పోత్సవం వైభవంగా జరిగింది. హంస వాహనంపై గోదావరిలో రామచంద్రుడు విహరించారు.