30 మందికి పైగా గాయాలు.. ఢిల్లీ 'జేఎన్ యూ'లో అల్లరి మూకల దాడులు!!
posted on Jan 6, 2020 @ 11:23AM
ఢిల్లీలోని జేఎన్ యూలో మళ్లీ హింస చెలరేగింది. యూనివర్సిటీ క్యాంపస్ లోకి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ముసుగులు ధరించి చొరబడ్డారు. అలా చొరబడిన వ్యక్తులు విద్యార్థుల పై, ప్రొఫెసర్ల పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో జేఎన్ యూ ప్రెసిడెంట్ అయిషేయ్ ఘోష్ కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
తమపై దాడికి పాల్పడింది ఏబీవీపీ కార్యకర్తలే అని ఆరోపించారు అయిషేయ్ ఘోష్. ఆ అనుమానాస్పద వ్యక్తులు రాడ్లు, కర్రలతో దాడి చేయడంతో దాదాపు 30 మందికి విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. అడ్డుగా వచ్చిన ప్రొఫెసర్లపై కూడా దాడి చేశారు. ఈ ఘటన తర్వాత యూనివర్సిటీలో భారీగా పోలీసులు మోహరించారు. అక్కడ దాడి జరిగిన దృశ్యాలు కేమరాలకు చిక్కడంతో వాటిపై దృష్టి పెట్టారు పోలీసులు.
జేఎన్ యూలో గత కొద్దిరోజులుగా విద్యార్ధి సంఘాలు పోటా పోటీగా నిరసనలు చేస్తున్నాయి. హాస్టల్ ఫీజుల పెంపును నిరసిస్తూ విద్యార్థులు చాలా రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నారు. అయితే తాజాగా జరిగిన హింసలో బయటి వ్యక్తుల ప్రమేయం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. హాస్టల్లో ఫర్నీచర్ ను కూడా ధ్వంసం చేశారు ఆందోళనకారులు. క్యాంపస్ లో హింసకు ఏఐఎస్ఐ విద్యార్థులే కారణమని ఏబీవీపీ ఆరోపించింది. కాంగ్రెస్ లెఫ్ట్ నేతలు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల పై దాడులు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని లెఫ్ట్ నేతలు ప్రశ్నించారు