తెలంగాణ సీఎంగా కేటీఆర్.. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్!!
posted on Jan 6, 2020 @ 1:13PM
తెలంగాణ రాష్ర్టానికి యువనేత కేటీఆర్ ను సీఎం చేయాలని మంత్రివర్గంలోని సభ్యులతో పాటు పార్టీ సీనియర్ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. మునిసిపల్ ఎన్నికలు పూర్తయితే రాష్ట్రంలో నాలుగేళ్ల వరకు మళ్ళీ ఎన్నికలు ఉండే అవకాశం లేదు. దీంతో మునిసిపల్ ఎన్నికల అనంతరమే సీఎం పీఠంపై కేటీఆర్ ను కూర్చోబెట్టాలనే కార్యకర్తల ఆకాంక్ష రోజురోజుకు పెరుగుతోంది. కేటీఆర్ ను సీఎం చేస్తే తప్పేంటని ప్రశ్నించారు సీనియర్ నేత మంత్రి కొప్పుల ఈశ్వర్. గతంలో ఇలానే ఇద్దరు ముగ్గురు మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మంత్రివర్గంలోని మిగతా సభ్యులు కూడా చేస్తున్నారు. పార్టీ పెద్దల నుంచి సంకేతాలు రాని పక్షంలో మంత్రులు ఇలాంటి వ్యాఖ్యలు చేసే అవకాశం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
కేటీఆర్ ను సీఎం పీఠంపై కూర్చొబెడితే.. కేసీఆర్ రాజకీయ భవిష్యత్తు ఏంటనే అంశంపై పలు ఊహాగానాలు తెరపైకొస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాలను నడిపించాలనుకుంటే ప్రభుత్వ పరంగా అడ్వైజరీ కమిటీ నియమించి దానికి చైర్మన్ గా కేసీఆర్ అటు ప్రభుత్వంలోనూ ఇటు పార్టీలోనూ చక్రం తిప్పవచ్చనే మాటలు వినిపిస్తున్నాయి. ఇక జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలంటే రాజ్య సభ స్థానం నుంచి పార్లమెంటు వైపు అడుగులు వెయ్యొచ్చు. అదే జరిగితే గజ్వేల్ నియోజక వర్గం నుంచి ఆయన కుమార్తె కవితను ఎమ్మెల్యేగా బరిలో దించేందుకు కూడా అవకాశం ఉంటుందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అది కూడా జరగని పక్షంలో జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు కేసీఆర్ తెరపైకి తెచ్చిన ఫెడరల్ ఫ్రంట్ నినాదాన్ని మరోసారి అందుకోవచ్చనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో కూడా కేసీఆర్ రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై ఆరేళ్లుగా తాను చేసిన పనుల పై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్ వ్యాఖ్యల వెనుక మర్మమేమిటని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.