పాక్ సైన్యం నుండి ఏపీ మత్స్యకారులను విడిపించిన నేతలు!
posted on Jan 6, 2020 @ 1:26PM
భారత దౌత్యాధికారులు పాకిస్థాన్ అధికారులతో కలిసి చర్చలు జరిపారు. గత 13 నెలలుగా పాకిస్థాన్ చెరలో బందీలుగా ఉన్న శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులను పాకిస్థాన్ అధికారులు విడుదల చేశారు. మొత్తం 20 మందిని రేపు ( జనవరి 7వ తేదీన ) వాఘా సరిహద్దుల్లో శ్రీకాకుళం మత్స్యకారులను విదేశాంగ శాఖ అధికారులకు పాక్ అప్పగించనుంది.
పాకిస్థాన్ చెరలో మగ్గిన ఏపీ మత్స్యకారులను స్వస్థలానికి తీసుకు వచ్చేందుకు భారత్ పాక్ సరిహద్దు ప్రాంతం వాఘా వెళ్లారు మంత్రి మోపిదేవి వెంకట రమణ. తెలుగు మత్స్యకారులను పాకిస్థాన్ విడిచిపెట్టడంతో వారిని తీసుకురావాలని మోపిదేవిని సీఎం జగన్ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో వాఘా బోర్డర్ పయనమైన మోపిదేవి అక్కడికి చేరుకున్నారు. లాంఛనాలు పూర్తయ్యాక పాక్ అధికారులు ఏపీ మత్స్యకారులను భారత అధికారులకు అప్పగించనున్నారు. కొంతకాలంగా వైసీపీ ఎంపీలు అవిశ్రాంతంగా ప్రయత్నాలు చేయడంతో పాక్ చెర నుంచి మత్స్యకారుల విడుదలకు మార్గం సుగమం అయ్యిందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడానికి విజయసాయిరెడ్డి తోడ్పడ్డారని ఆయన అన్నారు.
గుజరాత్ లో చేపల వేటకు వెళ్లిన వీళ్ళు పొగ మంచు కారణంగా పాక్ జలాశయాలలోకి ప్రవేశించారు. దీంతో పాక్ కోస్ట్ గాడ్స్ వారిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, వైసీపీ విజయసాయి రెడ్డి వంటి నేతలు.. మత్స్యకారులను విడిపించాలని కేంద్రాన్ని కోరారు. ఎట్టకేలకు ప్రయత్నాలు ఫలించి మత్స్యకారులు పాక్ చెర నుండి విడుదల అయ్యారు. మొత్తానికి మత్స్యకారుల కుటుంబాలల్లో ఆనందాన్ని తీసుకువచ్చేందుకు నేతలు తీవ్రంగా కష్టపడ్డారనే చెప్పుకోవాలి.