ప్రకృతి సేద్యంతో పదింతల లాభం పొందుతున్న గుంటూరు రైతు
posted on Jan 6, 2020 @ 3:42PM
దేశంలో పెరిగిపోయిన పెట్టుబడి ఖర్చులు, గిట్టుబాటు కాని ధరలు తదితర కారణాలతో సేద్యమంటేనే రైతులు కాడిని వదిలేస్తున్నారు. ప్రత్యామ్నయ దారులు వెతుక్కుంటున్నారు. కానీ గుంటూరు జిల్లాకు చెందిన ఓ రైతు పెట్టుబడులను తగ్గించుకుంటూ ప్రకృతి వ్యవసాయంలో కూరగాయలను పండిస్తున్నాడు. నాణ్యమైన దిగుబడులు తీస్తూ మంచి ఆదాయాన్ని పొందుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినవడ్లపూడి గ్రామానికి చెందిన రైతు నల్లబోతు లక్ష్మణరావు వంగ తోటను వేశారు. ప్రకృతి వ్యవసాయంలో ఎకరంలో వంగను సాగు చేస్తూ నాణ్యమైన దిగుబడులను తీస్తున్నాడు. కూరగాయల్లో రాజు ఎవరంటే వంకాయ అంటారు. ఆ వంకాయను పండించిన ఈ రైతు కూడా రాజవుతున్నాడు.
రైతు లక్ష్మణరావు గత 15 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు. అయితే గతంలో రసాయన ఎరువులు వాడి పంట పండించేవారు. పంట దిగుబడులు వచ్చినా పెట్టుబడులు పెరిగిపోయేవి.. అంతగా లాభం ఉండేది కాదు. ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకుని తాను కూడా ఈ విధానంలో సాగును ఆరంభించారు. ప్రస్తుతం నిమ్మ తోటలో అంతర పంటగా ఎకరంలో వంగను సాగు చేస్తున్నారు. వంగ మామూలుగా ఆరు నెలల పంట, కానీ ప్రకృతి విధానంలో సాగు చేయటం వలన మరో రెండు మూడు నెలల పంటకాలం పెరుగుతోంది. ఈ ఏడాది నుండి రసాయన ఎరువుల జోలికి పోకుండా సొంతంగా తయారు చేసుకున్న కషాయాలు ఎరువులను వాడుతున్నారు. ముఖ్యంగా పంటకు మూడు సార్లు ద్రవ జీవామృతాన్ని డ్రిప్ ద్వారా అందించారు. చీడపీడల నివారణకు అగ్ని అస్త్రం బ్రహ్మాస్త్రం మొక్కల బలానికి పంచగవ్యను వాడుతున్నారు. పూత రాలిపోకుండా ఉండేందుకు కోడుగుడ్డు, నిమ్మరసం, పుల్లటి మజ్జిగ లాంటివి పిచికారీ చేస్తున్నారు. వేపగింజల కషాయం కూడా కొట్టడంతో తోటలో ఎలాంటి చీడపీడలు ఆశించడం లేదు. ఇటు దిగుబడి కూడా నాణ్యమైనది రావడం మార్కెట్ లో మంచి ధర పలుకుతుంది. ప్రకృతి వ్యవసాయ విధానంలో వంగ సాగు చేసే రైతు లక్ష్మణరావు ఎకరాకు 15,000 పెట్టుబడి పెట్టాడు. దిగుబడి పది నుంచి పదిహేను టన్నుల వరకూ వచ్చే అవకాశం ఉంది. మార్కెట్ లో సరాసరి కిలో ధర 15 నుంచి 20 కాగా రెండు లక్షల వరకు ఆదాయం పొందనున్నాడు. ఈ రైతును చూసి మిగతా రైతులు కూడా రసాయన ఎరువులను వాడకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తే పెట్టుబడులు తగ్గి అధిక లాభాలు ఆర్జించవచ్చు.