మోదీతో భేటీ.. బీజేపీలో చేరనున్న నటుడు మోహన్ బాబు!!
posted on Jan 6, 2020 @ 2:41PM
2019 ఎన్నికల సమయంలో తెలుగుదేశాన్ని విభేదిస్తూ.. వైసీపీకి మద్దతు తెలిపాడు నటుడు మోహన్ బాబు. అలాంటిది ఆయన తన కుటుంబ సభ్యులతో ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. ప్రధానమంత్రితో అరగంటకు పైగా చర్చించారు. మోహన్ బాబు మోదీని కలిసినప్పుడు కూతురు లక్ష్మీ ప్రసన్న , కుమారుడు విష్ణు , కోడలు వెరోనికా ఉన్నారు. మోదీ ఆహ్వానం మేరకే వీళ్లు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లి మోదీని కలిశారని తెలుస్తోంది. ఈ భేటీపై మంచు లక్ష్మి ట్వీట్ కూడా చేశారు.
గతంలో మోహన్ బాబు కొన్నాళ్లు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయన పని చేశారు. 2019 ఎన్నికలకు వైసిపికి మద్దతు ప్రకటించారు. జగన్ తో బంధుత్వం కూడా ఉంది ఆయన కుటుంబానికి. మరి ఇప్పుడు ఊహించని విధంగా ప్రధాని మోదీని కుటుంబంతో సహా కలుసుకున్నారు. మోదీ కూడా ఆయనను బీజేపీలోకి ఆహ్వానించారని తెలుస్తోంది. మోహన్ బాబు బీజేపీలో చేరుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది . మోహన్ బాబు బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా లేదా అనే విషయం ఆయనే స్వయంగా చెప్పాలి లేదంటే లక్ష్మి చేసే మరో ట్వీట్ ద్వారా తెలియాలి. అది కూడా మరికాసేపట్లోనే తెలిసే అవకాశం కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.