నందికొట్కూరు మార్కెట్ యార్డు చైర్మన్ పదవి.. వైసీపీ నేతల్లో మొదలైన అలజడి!
posted on Jan 5, 2020 @ 11:11AM
నందికొట్కూరు మార్కెట్ యార్డు చైర్మన్ పీఠం కోసం పోరు కొనసాగుతోంది. నాలుగు దశాబ్ధాలకు పైగా చరిత్ర ఉన్న మార్కెట్ యార్డ్ ఛైర్మన్ పదవి అధికార వైసీపీలో సెగలు రాజేస్తోంది. 1975 లో మార్కెట్ యార్డు ఏర్పాటైనప్పటి నుంచి ఎన్నడూ లేని విధంగా ఈ సారి టఫ్ ఫైట్ కొనసాగుతోంది. మార్కెట్ యార్డ్ ఆరంభం నుంచి నేటి వరకు ఈ కుర్చీలో మిడుతూరు మండలానికి చెందిన నేతలే కూర్చుంటూ వచ్చారు.
అయితే మార్కెట్ కమిటీ రిజర్వేషన్ల ప్రకారం నందికొట్కూరు మార్కెట్ యార్డును ఓసీ జనరల్ కు కేటాయించింది కొత్త ప్రభుత్వం. దీంతో ఆశావహుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది.నందికొట్కూరు శాసన సభ్యుడు ఆర్ధర్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, నందికొట్కూరు నియోజక వర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనుచరులు ప్రధానంగా బరిలో నిలిచారు. నామినేటెడ్ పోస్టు కావడం దీనికి తోడు సొంత నియోజకవర్గం కనుక తమకే ఈ పీఠం దక్కుతుందని ఎమ్మెల్యే ఆర్థర్ వర్గం ధీమాగా ఉంది. మరో వైపు శ్రీశైలం నియోజక వర్గ శాసన సభ్యుడు శిల్పా చక్రపాణి రెడ్డి బంధువర్గం జూపాడు బంగ్లా మండలంలో ఎక్కువగా ఉన్నారు. వీరు కూడా ఈ పదవిపై కన్నేశారు. ఇదే సమయంలో నందికొట్కూరు నియోజక వర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గం సైతం బరిలోకి దిగింది. ఈ ముగ్గురు నేతల అనుచరులు మార్కెట్ యార్డు చైర్మన్ పీఠం కోసం హోరాహోరీకి దిగడంతో స్థానిక రాజకీయం రక్తికడుతోంది.
40 దశాబ్దాల తరువాత రిజర్వేషన్ మారడంతో నందికొట్కూరు మార్కెట్ యార్డు చైర్మన్ పదవి కోసం పోటీ తీవ్రమైంది. ఇప్పటికే కొంత మంది గ్రామ మండల స్థాయి నాయకులు రేస్ లోకి దిగి ముఖ్యనేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరి కొందరు మంత్రుల స్థాయిలో పైరవీలు చేస్తున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో సత్తా చాటుకోగల నాయకుడికే మార్కెట్ యార్డు చైర్మన్ పీఠం కట్టబెట్టాలని వైసీపీ అధిష్టానం ఆలోచిస్తోంది. జూపాడు బంగ్లా , మిడ్తూరు నాయకుల మధ్య గట్టి పోటీ నెలకొనడంతో ఎవరిని ఎంపిక చేయాలో ముఖ్యనేతలకు సైతం తెలియడం లేదు. మార్కెట్ యార్డు చైర్మన్ అభ్యర్థిని స్థానిక ఎన్నికలకు ముందే డిక్లేర్ చేయండి లేదా మీ మండలానికే ఇస్తామని గట్టి హామీ ఇవ్వమని జూపాడుబంగ్లా ప్రజలు అంటున్నారు. దీంతో ఆ ముగ్గురు నేతలు ఈ విషయం పై జిల్లా ఇన్ చార్జి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో చర్చించారు. మొత్తానికి ఈ వ్యవహారం స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సెగ రాజేస్తున్న మాట వాస్తవం.