గర్భిణీలపై కేసీఆర్ కిట్ ఎఫెక్ట్... తెలంగాణలో కొత్త రికార్డులు
posted on Jan 6, 2020 9:21AM
తెలంగాణ ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగాయి. మాతాశిశు మరణాలను తగ్గించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకం సత్ఫలితాలను ఇస్తోంది. కేసీఆర్ కిట్ వచ్చిన తర్వాత ప్రభుత్వాస్పత్రుల్లో డెలివరీల సంఖ్య భారీగా పెరిగింది. గతంలో 30శాతం కూడా ప్రసవాలు జరగని సర్కారు దవాఖానాల్లో ఇప్పుడు 50శాతానికి పైగా డెలివరీలు నమోదు అవుతున్నాయి. గతేడాది సర్కారు దవాఖానాల్లో 50శాతానికి పైగా ప్రసవాలు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంతేకాదు, ప్రభుత్వాస్పత్రుల్లో జరుగుతోన్న ప్రసవాల్లో ఎక్కువగా నార్మల్ డెలివరీలే జరుగుతుండటం మరో విశేషం.
కేసీఆర్ కిట్ రాకతో ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయని వైద్యారోగ్యశాఖ అధికారులు అంటున్నారు. కేసీఆర్ కిట్ అందజేయడంతోపాటు ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా వైద్యం అందిస్తున్నట్లు చెబుతున్నారు. కేసీఆర్ కిట్ కింద... రెండు చీరలు, బేబీ సోప్, బేబీ ఆయిల్‌తోపాటు దోమ తెర అందిస్తారు. అలాగే, ఆడబిడ్డ పుడితే 15వేలు... మగబిడ్డ పుడితే 14వేలు నగదు అందజేస్తున్నామని, అలాగే నార్మల్ డెలివరీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, దాంతో గర్భిణీలు ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలకు మొగ్గుచూపుతున్నారని అంటున్నారు.
2016లో కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రారంభించిన నాటి నుంచి, 2019 జూన్ వరకు 4లక్షల 46వేల 400మంది... ప్రభుత్వాస్పత్రుల్లో పురుడు పోసుకున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంతేకాదు, ఒక్క హైదరాబాద్‌లోనే లక్షా 2వేల మంది... ప్రభుత్వాస్పత్రుల్లో డెలివరీలు జరిగినట్లు అధికారులు అంటున్నారు. మొత్తానికి కేసీఆర్ కిట్ బాగానే పనిచేస్తుందని... ఆ పథకం ద్వారా అందుతోన్న నగదు, వస్తువులను అందుకోవడానికైనా... ప్రసవాల కోసం ప్రభుత్వాస్పత్రుల్లో చేరుతున్నారని అంటున్నారు.