ఒక పక్క ఆందోళనలు... మరోపక్క తరలింపు... జగన్ ప్రభుత్వం సాహసం...
posted on Jan 7, 2020 9:07AM
విశాఖ సాగరతీరం ...సంక్రాంతి తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిపాలనా నగరంగా మారనుంది. సంక్రాంతి తర్వాత విశాఖ నుంచే పరిపాలన సాగించేందుకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించే ప్రక్రియ మొదలుకానుంది. ముందుగా జీఏడీ నుంచి మూడు, ఫైనాన్స్ నుంచి 2, మైనింగ్ నుంచి 2, హోంశాఖ నుంచి 4, ఆర్ అండ్ బీ నుంచి 4 సెక్షన్లు తరలివెళ్లనున్నాయి. ప్రస్తుతానికి, 34 ప్రభుత్వ శాఖలను విశాఖకు తరలివెళ్లాలంటూ మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
అయితే, విశాఖ మిలీనియం టవర్స్ నుంచి ప్రభుత్వ పాలన సాగనున్నట్లు తెలుస్తోంది. విశాఖ-భీమిలి బీచ్ రోడ్‌లోని రుషికొండ ఐటీ పార్కులో నిర్మించిన మిలీనియం టవర్-1ను సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఈ భవనాన్ని 4 ఎకరాల విస్తీర్ణంలో 145కోట్లతో నిర్మించారు. 10 అంతస్థుల ఈ భవనంలో అధునాతన సౌకర్యాలతో 2లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉంది. అలాగే, లక్షన్నర చదరపు అడుగుల పార్కింగ్ ప్లేస్ కూడా రెడీగా ఉంది. ప్రస్తుతం విదేశీ ఐటీ కంపెనీ కాండ్యుయెంట్ వినియోగిస్తున్న ఈ భవనాన్ని ఖాళీ చేయించి.... అందులో సీఎం క్యాంపు కార్యాలయం పెడతారని చెబుతున్నారు.
మిలీనియం టవర్-1 పక్కనే టవర్-2 పేరుతో మరో భవనాన్ని 80 కోట్లతో నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే మరో లక్ష చదరపు అడుగుల స్థలం అందుబాటులోకి వస్తుంది. మిలీనియం టవర్స్ పక్కనే 70కోట్లతో నిర్మించిన స్టార్టప్ విలేజ్‌లో 50వేల చదరపు అడుగుల స్థలం రెడీగా ఉంది. ఇక్కడున్న స్టార్టప్ కంపెనీలను 3నెలల క్రితమే ఖాళీ చేయించారు. ఇవన్నీ రుషికొండ హిల్ నెంబర్ త్రీలోనే ఉన్నాయి. ఇక, వైఎస్ హయాంలో కెనెక్సా కంపెనీకి కేటాయించిన 25 ఎకరాల్లో 20 ఎకరాలను ఆ కంపెనీ వెనక్కి ఇచ్చేసింది. అలాగే, హిల్ నెంబర్-2లో పలు ఐటీ కంపెనీలకు స్థలాలు కేటాయించినా, ఇప్పటివరకు నిర్మాణాలు చేపట్టకపోవడంతో వాటిని కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, రుషికొండ ఐటీ పార్కుకు సమీపంలో... జాతీయ రహదారి పక్కనున్న 20 ఎకరాల వీఎంఆర్‌డీఏ స్థలాన్ని కూడా తీసుకుని ప్రభుత్వ కార్యాలయాల కోసం భవనాలు నిర్మించే అవకాశముందంటున్నారు.
జనవరి 20న నిర్వహించే అత్యవసర అసెంబ్లీ సమావేశం తర్వాత విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని అంటున్నారు. మరోవైపు, రిపబ్లిక్ డే పరేడ్‌ను కూడా విశాఖలోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకపక్క అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతుంటే... మరోపక్క సంక్రాంతి తర్వాత విశాఖ కేంద్రం పరిపాలన కొనసాగించేందుకు జగన్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అయితే, రాజధాని మార్పుతో ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా వైసీపీ సర్కారు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.