చెట్లు ఎక్కే బైక్
ప్రాణనష్టాన్ని నివారించే యత్నం
బైక్ పై కూర్చోని రివ్వున పైకి వెళ్లే ఈ అమ్మాయిని చూశారా ఇది ఎమ్యూజ్ మెంట్ పార్క్ లో కాదండి. ఆకాశాన్ని తాకేలా నిటారుగా పెరిగిన కొబ్బరితోటలోని దృశ్యం. సుప్రియ అనే అమ్మాయి తన తండ్రి తయారుచేసిన బైక్ ను పరీక్షిస్తున్న వైనం.
కర్ణాటక లోని బట్వాల్ గ్రామంలో గణపతి భట్ తన స్నేహితుడితో కలిసి తయారుచేసిన బైక్ ఇది. 80అడుగుల ఎత్తు వరకు నిటారుగా పెరిగే చెట్లను ఎక్కడానికి ఈ బైక్ ఎంతో ఉపయోగపడుతుంది. తాటి, కొబ్బరి చెట్లు ఎక్కడానికి, కాయలు సులభంగా కోయడానికి చెట్టు ఎక్కే పనిని ఈ బైక్ సులభతరం చేస్తుంది. చెట్టు పైకి వెళ్లడం, తిరిగి కిందికి రావడం అంతా క్షణాల్లో జరుగుతుంది. ఒక వ్యక్తి చెట్టు ఎక్కడానికి సగటున ఎనిమిది నిమిషాలు పడుతుంది. ఈ బైక్ వల్ల నిమిషంలో చెట్టు పైకి చేరుకోవచ్చు. ఇది చాలా సులభమైన పద్దతిలో నడుస్తూ క్షణాల్లో చెట్టు పైకి చేరుస్తుంది.
28కిలోల బరువు ఉన్న ఈ బైక్ టూ స్ట్రోక్ ఇంజన్ తో నడుస్తోంది. హైడ్రాలిక్ డ్రోమ్ షాక్ అబ్జర్వస్ తో పనిచేస్తోంది. ఒక లీటర్ పెట్రోల్ తో దాదాపు 80చెట్లు ఎక్కిదిగవచ్చు. సులభంగా చెట్లు ఎక్కడానికి ఉపయోగపడే ఈ ఇంజన్ ను కర్ణాటక ప్రభుత్వం గుర్తించి వర్క్ షాపులు నిర్వహించడానికి సిద్ధమవుతోంది. ఈ బైక్ ధర 75వేల రూపాయలు.
ఈ బైక్ నడపడానికి ఎలాంటి భయం లేదంటుందోంది గణపతి కుమార్తె సుప్రియ. ఎవరైనా సులభంగా ఈ బైక్ ను నడిపేలా తయారుచేశారు.
ఆకాశాన్ని అంటేలా పొడవుగా పెరిగే కొబ్బరి, తాటి చెట్లపైకి ఎక్కాలంటే చాలా నైపుణ్యత కావాలి. కొబ్బరి తోటలు ఎక్కువగా ఉండే కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో నైపుణ్యం గల చెట్టులేక్కేవారికి చాలా కొరత ఉంది. చెట్టు పై నుంచి పడి చనిపోతున్న వారి సంఖ్య కూడా ఎక్కువే ఉంది. మానవ వనరులు సరిగ్గా లేకపోవడం, సమయం ఎక్కువ తీసుకోవడం, ప్రమాదాలు జరగడం తదితర కారణాలతో కొత్త గా కొబ్బరి తోటలు వెయాలంటే భయపడుతున్నారు. అయితే ఈ సమస్యను అధిగమించడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సులభంగా చెట్లు ఎక్కడానికి ఉపకరించే చిన్నచిన్న పరికరాల రూపకల్పన జరిగింది. కానీ, ఇవీ ఏవీ అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. వీటిని ఉపయోగించడానికి కూడా కొత్త నైపుణ్యత అవసరం కావడంతో ఈ ప్రయత్నాలు అన్నీ విఫలం అయ్యా యి
కొబ్బరి తోటలను ప్రపంచంలోని 93 కి పైగా దేశాలలో సాగుచేస్తారు. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, భారతదేశం ప్రపంచంలోని ప్రధాన ఉత్పత్తి దేశాలు. మన దేశంలో దాదాపు 18.95 లక్షల హెక్టార్లలో పండిస్తారు కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, గోవా, పశ్చిమ బెంగాల్, పాండిచేరి, మహారాష్ట్ర, అస్సాం, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, త్రిపుర, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాలు కొబ్బరి సాగు చేస్తున్నాయి. అయితే కొబ్బరి చెట్లు ఎక్కడం మాత్రం స్థానికుల తరతరాల సంప్రదాయ వృత్తిగా వస్తోంది. నైపుణ్యం గల వ్యక్తులు లభించక చాలా ప్రాంతాల్లో కొత్తగా కొబ్బరి సాగు చేయడానికి భయపడుతున్నారు. కూలీలు అధిక మొత్తంలో డిమాండ్ చేస్తుండటంతో ఖరీదైన పంటగా మారుతుంది. కేవలం కొబ్బరికాయలు తెంచడానికే కాదు పురుగుమందులు వేయాలన్నా చెట్టు ఎక్కాల్సిందే. ఈ సమస్యను నివారించాలంటే సాంకేతికను జోడించాలని చాలా మంది ప్రయత్నాలు చేశారు. చెట్లు ఎక్కి కొబ్బరి కాయలను తెంచడానికి అనేక పరికరాలను తయారుచేశారు.
తాజాగా కర్ణాటక లోని ఒక రైతు తన స్నేహితునితో కలిసి తయారుచేసిన బైక్ మంచి ఫలితాలను ఇస్తోంది. కర్ణాటక ప్రభుత్వం వర్క్ షాపులు నిర్వహిస్తూ చెట్లు ఎక్కే ఈ బైక్ ను కొబ్బరి, పోక, తాటి మొదలైన నిటారుగా పెరిగే చెట్ల కాయలను కోయడానికి అనుగుణంగా శిక్షణ ఇస్తోంది. స్థానికులను ప్రోత్సహించేలా శిక్షణ ఇస్తూ, వారిలోని నైపుణ్యాలను పెంచుతున్నారు. ఎంతో మందికి ఉపాధి కల్పించే ప్రయత్నంతో పాటు వాణిజ్యపంటల సాగును పెంచేందుకు, ప్రాణనష్టాన్ని నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.