బీజేపీ చేతిలో ఫేస్‌బుక్ కీలుబొమ్మ.. వాల్ స్ట్రీట్ కథనం పై ఫేస్‌బుక్ వివరణ
posted on Aug 17, 2020 @ 11:54AM
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ను బీజేపీ తన గుప్పిట్లో పెట్టుకుందని.. బీజేపీ నేతలు హింసను ప్రేరేపించేలా, రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నా.. వీడియోలను షేర్ చేస్తున్నా.. ఫేస్‌బుక్ చూసీ చూడనట్లు వదిలేస్తోందని అమెరికాకు చెందిన అంతర్జాతీయ పత్రిక వాల్‌స్ర్టీట్ జర్నల్ ఒక కథనం ప్రచురించింది. ‘ఫేస్‌బుక్ ఇండియా ఉన్నతాధికారి అంకిత్ దాస్ బీజేపీని తన భుజాలకెత్తుకున్నారు. ఆ పార్టీ నేతల ఫేస్‌బుక్ పేజీల్లో ఉన్న వివాదాస్పద పోస్టులపై వారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అంతేకాకుండా ఫేస్‌బుక్ ఉద్యోగులు ఆ సాహసం చేయకుండా అడ్డుకుంటున్నారు. అదేమంటే.. భారత ప్రభుత్వంతో సంబంధాలు దెబ్బతింటాయని దాంతో భారత్‌లో వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడుతుందని అంకిత్ చెబుతున్నారు అని ఆ సంస్థ ప్రస్తుత, మాజీ అధికారులు పేర్కొన్నట్లు ఆ పత్రిక కథనం వెల్లడించింది.
వాల్‌స్ర్టీట్ జర్నల్ ప్రచురించిన ఈ కథనం దేశంలో పెద్ద రాజకీయ దుమారం రేపుతోంది. ఇదే సమయంలో ఫేస్‌బుక్ నిష్పాక్షికతపై కూడా చర్చకు దారి తీసింది. అయితే ఈ వివాదం మరింత ముదిరితే సంస్థకు ముప్పు తప్పదని భావించిన ఫేస్‌బుక్ తాజా పరిణామాలపై స్పందించింది. హింసను ప్రేరేపించే విద్వేషపూరిత ప్రసంగాలను, సమాచారాన్ని తాము నిషేధిస్తామని… ప్రపంచవ్యాప్తంగా తాము ఇదే విధానాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేసింది. ఏ ఒక్క రాజకీయ పార్టీ నేతకు, పార్టీకి తాము అనుకూలంగా పనిచేయడం లేదని తేల్చి చెప్పింది. అయితే, ఈ విషయంలో ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని భావిస్తున్నాం. ఇందుకోసం రెగ్యులర్ నియంత్రణా విధానాన్ని అమలు చేస్తున్నాం. కచ్చితత్వం, నిజానిజాలే సోషల్ మీడియాలో ఉండాలన్నదే మా విధానం. ఇదే సందర్భంలో ద వాల్ స్ట్రీట్ జర్నల్ కథన పూర్తిగా సత్యదూరమని ఫేస్‌బుక్ వెల్లడించింది.