గవర్నర్ పై వ్యాఖ్యలు చేసిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి.. రాష్ట్ర బిజెపి డిమాండ్
తెలంగాణ రాష్ట్రంలో కోవిద్ 19 వ్యాప్తిని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న విషయాన్ని ప్రస్తావించిన రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందర్య రాజన్ పై టిఆర్ఎస్ నాయకులు విమర్శలు చేయడాన్ని బిజేపి రాష్ట్ర నాయకులు తప్పు పట్టారు. సోషల్ మీడియాలో గవర్నర్ పై పోస్టులు పెట్టిన నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్ర గవర్నర్ కు రాజకీయాలను ఆపాదించడం అప్రజాస్వామికం అన్నారు. గవర్నర్ ని టార్గెట్ చేయడం ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడమే అన్నారు. కొందరు టిఆర్ఎస్ నేతలు చేస్తున్న కామెంట్ లను ముఖ్యమంత్రి చేష్టలుడిగి నట్లు చూస్తున్నారని విమర్శించారు. బిజేపి జాతీయ నాయకులు డాక్టర్ కె.లక్ష్మణ్ ,అధికార ముఖ్య ప్రతినిధి కె.కృష్ణసాగర్ రావు, కోర్ కమిటీ సభ్యులు సుధాకర్ రెడ్డి, మహిళామోర్చా నాయకులు డిమాండ్ చేశారు.
రాజ్యంగ పదవిలో ఉన్న గవర్నర్ కు రాజకీయాలు ఆపాదిస్తూ చేసిన విమర్శలను ఉపసంహరించుకోవాలని భారతీయ జనతాపార్టీ కోర్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. డాక్టర్ గా ఆమె కోవిద్ 19 వైరస్ వ్యాప్తి జరుగుతున్న తీరు, ప్రజలు పడుతున్న అవస్థలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారని, ప్రభుత్వానికి పలు సూచనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి తో పాటు ఇతర టిఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంవరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.. పార్టీ అదినేత గా ముఖ్యమంత్రి కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని కోరారు.. సోషల్ మీడియాలో పోస్టులను పెట్టిన నేతల ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా కట్టడి లో విఫలమైన ప్రభుత్వం గవర్నర్ ని టార్గెట్ చేయడం అప్రజాస్వామికం ,శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ పదవి లో ఉండి ఒక వైద్యరాలిగా ప్రభుత్వానికి, సి ఎస్ కు ,వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు పీరియాడికల్ గా విలువైన సూచనలు గవర్నర్ చేశారు. అయితే ఆ సూచనలు ఏవీ పాటించకుండా రాష్ట్రంలో కేసీఆర్ ఒంటెద్దు పోకడలు అందరూ గమనిస్తూనే ఉన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను గాలికి వదిలేశారు. వాస్తవాలు చెప్పి, బాధ్యతయుతంగా సూచనలు చేసిన గవర్నర్ పై విమర్శలు చేయడం ఎంత వరకు సమంజసమో గమించాలన్నారు. కేంద్రం ఇచ్చిన వెంటిలేటర్ లను బిగించలేని దుస్థితి లో ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు .
అధికారపార్టీ కబ్జాల కారణంగానే..
టిఆర్ఎస్ నేతల భూకబ్జాల కారణంగానే వరంగల్ నగరం వరదలకు అతలాకుతలమైనదని విమర్శించారు. రాష్ట్రంలో ఎమ్మార్వో లపై ఏసీబీ దాడులు కేసీఆర్ అవినీతి పాలనకు పరాకాష్ట అని సుధాకర్ రెడ్డి విమర్శించారు .
ఇకనైనా పద్దతి మార్చుకోండి - కె. లక్ష్మణ్
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ 19 ఎదుర్కోవడంలో దారుణ వైఫల్యం చెంది, సంక్షోభానికి కారణమైన కేసీఆర్ ప్రభుత్వానికి గవర్నర్ డా. తమిళిసై చివాట్లు పెట్టడాన్ని బీజేపీ స్వాగతిస్తోంది. ఇకనైనా టిఆర్ఎస్ ప్రభుత్వం తమ పంథా మార్చుకుని కోవిడ్ విషయంలో వ్యవహరిస్తోన్న పద్ధతిని సరిచేసుకోవాలని డాక్టర్ లక్ష్మణ్ సూచించారు.
తెలంగాణ వ్యాప్తంగా, జిల్లాల్లోనూ, హైదరాబాద్ లోనూ చాలా కాలనీల్లో, అపార్టుమెంట్లలో అనేక మరణాలు సంభవిస్తున్నాయి. కానీ వాటి వివరాలు సేకరించే వ్యవస్థ ఈ రాష్ట్రంలో లేకుండా పోయింది. స్వయంగా వైద్యురాలైన గవర్నర్ మార్చి నుంచీ టిఆర్ఎస్ ప్రభుత్వం కరోనా విషయంలో వ్యవహరిస్తోన్న తీరు, నేరపూరిత నిర్లక్ష్యాన్ని అర్థం చేసుకున్నారు. చివరికి ఇప్పుడు, ఆఖరి అస్త్రంగా బహిరంగంగా టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను బయటకు తెచ్చారు. ప్రజల ఆరోగ్యం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న గవర్నర్ పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. వెంటనే వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.