అమరావతి కేసులో కొత్త ట్విస్ట్.. సుప్రీంలో విచారణ 19 కి వాయిదా..
posted on Aug 17, 2020 @ 2:04PM
ఏపీలో తీవ్ర న్యాయ పోరాటంగా మారిన రాజధాని వికేంద్రీకరణ బిల్లుల వ్యవహారం పై సుప్రీం కోర్టు లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే రాజధాని బిల్లుల పైన విచారించిన హైకోర్టు తొలుత ఈ నెల 14 వ తేదీ వరకు స్టేటస్ కో విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అయితే, ఈ నెల 14న మరోసారి విచారించిన హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులను ఈ నెల 27వ తేదీ వరకు పొడిగిస్తూ మరోసారి నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల పైన స్టే ఇవ్వాలంటూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీని పైన ఈ రోజు సుప్రీం కోర్టులో కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.
సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ ఈరోజు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని బెంచ్ ముందుకు వచ్చింది. అయితే ఆ సమయంలో ఈ కేసులో వాదిస్తున్న రంజిత్ కుమార్ అనే న్యాయవాది సుప్రీం చీఫ్ జస్టిస్ ముందు ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ.. అమరావతి రాజధాని రైతులు దాఖలు చేసిన పిటీషన్ పైన ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతున్న విషయాన్నీ ప్రస్తావిస్తూ.. ఇదే విషయమై హైకోర్టు ఇచ్చిన స్టిటిస్ కో ఉత్తర్వుల పైన ఏపీ ప్రభుత్వం సుప్రీంకు వచ్చిందనే విషయాన్ని గుర్తు చేసారు. అయితే రాజధాని రైతుల తరపున సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బంధువులే న్యాయస్థానాల్లో వాదిస్తున్న విషయాన్నిఅయన ప్రస్తావించారు. దీంతో ఈ కేసు విచారణ నుండి తాను తప్పుకుంటున్నానని తెలుపుతూ "నాట్ బిఫోర్ మీ" అంటూ ఈ కేసును మరో బెంచ్ కు బదిలీ చేయాలని చీఫ్ జస్టిస్ ఆదేశాలిచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ కేసు విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసారు.