హైకోర్టు, సుప్రీం కోర్టుల పై ఏపీ డిప్యూటీ సీఎం సెన్సేషనల్ కామెంట్స్ ..
posted on Aug 17, 2020 @ 4:30PM
ఏపీలో జగన్ ప్రభుత్వ నిర్ణయాలను తప్పు పడుతూ ఇప్పటికే పలు మార్లు హైకోర్టు, సుప్రీం కోర్టులు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుల పై కొంత మంది వైసిపి నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారాయి. తాజాగా అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల విషయంలో హైకోర్టు స్టే పై తాము కలగచేసుకోమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. తాజాగా ఈ విషయం పై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. సుప్రీంకోర్టు, హైకోర్టులకు చెప్పి రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికలు తయారు చేయవని ఆయన అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని తాము తమ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చామని ఆయన అన్నారు.
పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వకుండా కోర్టులు స్టే ఇవ్వడం సరి కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇళ్ల పట్టాల కేసులను కోర్టులు త్వరగా పరిష్కరించాలని ఆయన అన్నారు. అంతేకాకుండా ఉన్నవాళ్లు భూకబ్జాలు చేస్తారు కానీ పేదవాళ్లు చేయరని ఆయన అన్నారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ప్రతిపక్ష నేత చంద్రబాబు తపన అని ఆయన విమర్శించారు.
ఇప్పటికే అమరావతిలో శాసన రాజధానిని మాత్రమే కొనసాగిస్తూ కార్యనిర్వాహక రాజధానిని విశాఖపట్నానికి, న్యాయ రాజధానిని కర్నూలుకు తరలించాలని జగన్ సర్కార్ నిర్ణయించుకోవడంతో.. ఈ విషయంపై ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతోంది.