ట్వీట్ పెడితే విచారణకు అడ్డుపడినట్టా?.. రామ్‌కు బాసటగా చంద్రబాబు
posted on Aug 17, 2020 @ 2:30PM
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం ఘటనపై సినీ నటుడు రామ్ పోతినేని చేసిన ట్వీట్స్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. సీఎం వైఎస్ జగన్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా కుట్ర జరుగుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, రామ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన విజయవాడ ఏసీపీ సూర్యచంద్రరావు.. రామ్ కి వార్నింగ్ ఇచ్చారు. "అగ్ని ప్రమాదం కేసును ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దర్యాప్తునకు ఆటంకం కలిగించేలా ఎవరు ప్రయత్నించినా ఊరుకోబోము. విచారణకు అడ్డొస్తే, అవసరమైతే రామ్ కి కూడా నోటీసులు ఇస్తాం'' అని విజయవాడ ఏసీపీ అన్నారు.
విజయవాడ ఏసీపీ వార్నింగ్ ఇచ్చిన కొద్దిసేపటికే రామ్ మరో సంచలన ట్వీట్ చేశారు. అసలైన కుట్రదారులకు కచ్చితంగా శిక్షలు పడతాయని, చట్టంపై తనకు పూర్తి నమ్మకం ఉందని రామ్ అన్నారు. అంతేకాదు, ఈ వివాదానికి సంబంధించి ఇకపై ఎలాంటి ప్రకటనలు చేయబోనని రామ్ స్పష్టం చేశారు.
కాగా, రామ్ కు టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతు తెలిపారు. రామ్ పై విజయవాడ ఏసీపీ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాలరాయడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చని పేర్కొన్నారు. ట్వీట్ పెట్టడమే విచారణకు అడ్డుపడటంగా నోటీసులు ఇస్తామని బెదిరించడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. రాష్ట్రంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఏవిధంగా కాలరాస్తున్నారో అనడానికి ఇది మరో రుజువని.. రాష్ట్రంలో ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని, ప్రశ్నించే గొంతును అణిచేయాలని చూడటం ప్రజాస్వామ్యానికి చేటు అని చంద్రబాబు అన్నారు.