ఇరాన్ ఇంధన నౌకలు హ్యూస్టన్ తీరానికి

ఇరాన్ దేశంపై ఇప్పటికే కఠిన ఆంక్షలు విధించిన అమెరికా తాజాగా ఆ దేశ నౌకలను హ్యూస్టన్ తీరానికి తరలించింది. ఇరాన్ నుంచి చమురు నింపుకుని వెనిజులా వెళుతున్న భారీ నౌకలను ఫస్ట్ టైమ్ అమెరికా సీజ్ చేసింది. ఇప్పటికే ఇరాన్, వెనుజులా దేశాలపై ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలను విధించింది. అయితే ఆ రెండు దేశాల మధ్య ఇంధనం సరఫరా చేసే నౌకలను నిర్బంధించడం ఇదే మొదటిసారి. ఈ అంశాన్ని 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' ప్రచురించింది.   ఇప్పటికే అమెరికా ప్రభుత్వం ఇరాన్ పై అణు పరీక్షలు, క్షిపణుల పరీక్షలను నిర్వహించకుండా ఆంక్షలు విధించింది. తాజాగా లూనా, పండి, బీరింగ్, బెల్లా అనే పేర్లున్న నౌకలను సైన్యం సహాయంతో సముద్రంలో సీజ్ చేసింది అమెరికా. వాటిని అమెరికాలోని హ్యూస్టన్ తీరానికి తరలించింది.  ఇరాన్ నుంచి ఈ ట్యాంకర్ షిప్ లు గ్యాసోలిన్ ఇంధనంతో వెనిజులా వెళుతున్నాయి. ఈ రెండు దేశాలపై ఆర్థిక ఒత్తిడిని పెంచే ఉద్దేశంలో భాగంగానే వీటిని సీజ్ చేసినట్టు తెలుస్తోంది.

అనుబంధాలే ఇతివృత్తాలుగా

ఆలిస్ రివాజ్ (14 ఆగస్టు 1901 - 27 ఫిబ్రవరి 1998)   అనునిత్యం తన జీవితంలో కనిపించే వ్యక్తులే ఆమె అక్షరాల్లో ఒదిగిపోయారు. నవలల్లో పాత్రధారులుగా మారి పాఠకులను అలరించారు. విభిన్నమనస్తత్వాలతో కూడిన వ్యక్తుల మధ్య అనుబంధాలను, ఆప్యాయతలను ఒకవైపు చెబుతూనే మరో వైపు స్త్రీవాదాన్ని అంతర్లీనంగా తన నవలల్లో ప్రతిబింబించారు. ఆమే స్విస్ రచయిత ఆలిస్ రివాజ్. స్విట్జర్లాండ్ ఇరవయ్యవ శతాబ్దపు ప్రధాన రచయితలలో ఒకరు.   స్విస్ మునిసిపాలిటీ లోని రోవ్రేలో  14 ఆగస్టు 1901న ఆలిస్ జన్మించారు. పాల్ గోలే, ఇడా ఎట్లర్ దంపతుల ఏకైక సంతానం ఆమె. తండ్రి ఉపాధ్యాయుడు. సోషలిజంపై ఆసక్తితో ఉపాధ్యాయ వృత్తిని వదిలి రచయితగా మారాడు. దాంతో వారి కుటుంబం లాసాన్ కు వెళ్లింది. ఆలిస్ కు సంగీతం అంటే చాలా ఇష్టం. పియానో నేర్చుకున్నారు. ఆ తర్వాత ఆమె ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ లో చేరారు. అప్పటివరకు తల్లిదండ్రుల్లో కలిసి నివరించిన ఆమె 25 సంవత్సరాల వయసులో రివాజ్ జెనీవాకు వెళ్లారు, అక్కడే చివరి వరకు ఉన్నారు.   అంతర్జాతీయ కార్మిక సంస్థతో చాలా సంవత్సరాలు పనిచేసిన తరువాత ఆలిస్ రచనారంగం వైపు మళ్లారు. ఆమె మొదటి నవల నౌజేన్ డాన్స్ లా మెయిన్ (క్లౌడ్స్ ఇన్ యువర్ హ్యాండ్స్) 1937 లో ప్రచురితమైంది. మరో నవల జేట్టీ టోస్ పెయిన్ (కాస్ట్ యువర్ బ్రెడ్) నవల కూడా ఆమెకు మంచి పేరు తీసుకువచ్చింది. అత్యుత్తమ రచనగా  అవార్డులు అందుకుంది. ఆమె రచనలు కళలు, కుటుంబంలోని అనుబంధాలు ఎక్కువగా కనిపిస్తాయి. అంతేకాదు స్త్రీవాద ధోరణి అంతర్లీనంగా ఉంటుంది. నవలలు, చిన్న కథలు, వ్యాసాలు, డైరీలతో పాటు ఆమె కవి జీన్-జార్జెస్ లోసియర్ గురించి కూడా అధ్యయనం చేసింది.     ఆలిస్ రచనల ద్వారా చాలా తక్కువ కాలంలోనే  స్విట్జర్లాండ్ లోని  ఫ్రెంచ్ భాషా రచయితలలో అగ్రగామిగా నిలిచారు. ఆలిస్ రివాజ్ 27 ఫిబ్రవరి 1998న  96 ఏండ్ల వయసులో మరణించారు. ఆమె రచనలు స్విస్ నేషనల్ లైబ్రరీలో అందుబాటులో ఉన్నాయి. ఆమె పేరు మీద జెనీవాలో ఒక వీధి, కళాశాల ఏర్పాటు చేశారు. అంతేకాదు 2002 నుంచి ఆలిస్ రివాజ్ అన్న పేరుతో ఇంటర్ సిటీ రైలు కూడా అక్కడ నడుస్తోంది. ఆమె పేరు ప్రజల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయింది.

ఏపీ రాజధాని భవిష్యత్తు ఈనెల 17 న తేలుతుందా..! 

ఏపీలో మూడు రాజధానుల అంశం పై ఇటు హైకోర్టు లోను అటు సుప్రీం కోర్టులోనూ పిటిషన్ లు దాఖలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే హైకోర్టు మూడు రాజధానుల బిల్లు పై స్టేటస్ కో ఇవ్వగా.. దీని పై స్టే కోరుతూ జగన్ సర్కార్ సుప్రీం కోర్టు తలుపు తట్టిన సంగతి తెలిసిందే. ఐతే ఆ పిటిషన్ లో తప్పులు దొర్లడంతో మళ్ళీ పిటిషన్లు దాఖలు చేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ పిటిషన్ పై ఆగష్టు 17న అంటే వచ్చే సోమవారం రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దీంతో ఈ అంశం పై సుప్రీం కోర్టు తీర్పు ఎలా ఉంటుందో అనే ఉత్కంఠ నెలకొంది.   ఏపీకి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఇప్పటికే రైతులు దాదాపు 250 రోజులుగా ఆ ప్రాంతంలో దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే జగన్ ప్రభుత్వం మాత్రం ఏపీకి మూడు రాజధానుల‌ ఏర్పాటు చేయాలని కృత నిశ్చయంతో ఉంది. ఇప్పటికే సీఆర్డీఏను కూడా రద్దు చేసారు. ఈ పరిస్థితుల్లో రాజధానుల అంశం చివరికి సుప్రీంకోర్టుకు చేరింది.

చిత్తూరులో మరో దారుణం.. వెంటనే స్పందించిన సోనూసూద్

కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన తరువాత మానవత్వం అనేది కనుమరుగవుతోంది. దీనికి ఉదాహరణగా మనం అనేక సంఘటనలు రోజు చూస్తున్నాం. తాజాగా ఎపి లోని చిత్తూరు జిల్లా గంగవరం గ్రామంలో ఇటువంటిదే ఒక ఘటన జరిగింది. గంగవరం గ్రామానికి చెందిన వెంకట్రామయ్య (73) అనే వ్యక్తి ఇంటి బయట పడుకున్నప్పుడు పక్కింటి ఆవు దాడి చేసింది. ఈ దాడిలో ఆవు అతని గుండెలపై తొక్కడంతో పక్కటెముకలు విరిగి వెంకట్రామయ్య తీవ్రంగా గాయపడ్డాడు.    దీంతో ఆదివారం ఉదయం అయన కూతురు హేమలత అతన్ని చికిత్స కోసం పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తీసుకుని వెళ్ళింది. అక్కడ డాక్టర్లు అతన్ని పరీక్షించి స్కానింగ్ చేయాలని, ఐతే తమ వద్ద ఆ సౌకర్యం లేదని చెప్పి వెనక్కి పంపారు. దాంతో ఆమె తన తండ్రిని దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించి ఇంటికి తీసుకుని వెల్లింది. మొన్న బుధవారం అతనికి ఊపిరి తీసుకోవడం కష్టం కావడంతో హేమలత తండ్రిని ఆటోలో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకు వెళ్లింది. ఐతే అక్కడ డాక్టర్ లేకపోవడంతో మళ్ళీ ప్రభుత్వాస్పత్రికి తీసుకుని వెడుతుండగా దారిలోనే వెంకట్రామయ్య ఆటోలోనే మరణించాడు. దాంతో ఆటో డ్రైవర్ శవాన్ని నడి రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు. దాంతో ఆమె నడిరోడ్డు మీద శవంతో రోదించడం ప్రారంభించింది. అంతేకాకుండా తన తండ్రి కరోనాతో చనిపోలేదని ఆమె ఎంత మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోలేదు.    ఐతే ఆమె రోదిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ దారుణ ఘటనపై సినీ నటుడు సోనూసూద్ స్పందించారు. వెంకటరామయ్య కుమార్తెను పరామర్శించి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి తన మనుషులను పలమనేరుకు పంపనున్నారు. ఈ రోజు అంటే శుక్రవారం బెంగళూరు నుంచి సోనూసూద్ మనుషులు వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోనున్నారు. అయితే సోనూసూద్ ఇప్పటికే చిత్తూరులో వ్యవసాయానికి ఎడ్లు లేక కన్నకూతుళ్లు నాగలి పట్టి లాగుతుండగా వ్యవసాయం చేస్తున్న ఓ రైతుకి ట్రాక్టర్ బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. రాబోయే పది తరాలకు సరిపోయేలా సంపాదించి ఇంకా సంపాదన పై ఆశ చావని.. ఒక్క పైసా కూడా ఇతరులకు సాయం చెయ్యని మహానుభావులు ఉన్న మన సమాజంలో సోను సూద్ వంటి వారు మన మధ్య ఉండడం నిజంగా మన అందరి అదృష్టం. రియల్లీ హాట్స్ ఆఫ్ టు యూ సోనూసూద్.

కోమాలోనే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ..

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉంది. ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నారని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రెఫరెల్‌ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఐతే అయన అవయవాలు మాత్రం పనిచేస్తున్నాయని డాక్టర్లు తెలిపారు. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం హిమోడైనమికల్లీ స్టేబుల్ అని తెలిపారు. అయితే హిమోడైనమికల్లీ స్టేబుల్ కు అర్ధం అసాధారణ రీతిలో గుండె కొట్టుకోవడం, చేతులు, కాళ్లు చల్లబడటం, ఛాతీ నొప్పి, మూత్రం తగ్గడం, లోబీపీ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆ వ్యక్తి బతికే ఉంటారు కానీ ఆరోగ్య పరిస్థితి మాత్రం విషమంగా ఉంటుంది. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఇలాగే ఉందని ఆయనకు చికిత్స చేస్తున్న వైద్యులు తెలిపారు.   గత సోమవారం తనకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ట్విటర్ వేదికగా ప్రణబ్ ముఖర్జీ వెల్లడించిన సంగతి తెలిసిందే. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఈ నెల 10న ఢిల్లీలోని ఆర్మీ రిసెర్చ్‌ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో ప్రణబ్ ముఖర్జీకి అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు. ఐతే చికిత్స తరవాత కూడా ఆయన పరిస్థితి విషమంగానే ఉంది. ఐతే ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ, కూతురు షర్మిష్ట ముఖర్జీ ఖండించారు. ప్రజలు పుకార్లను నమ్మవద్దని వారు సూచించారు.

అమరావతి పై సీఎం జగన్ అనూహ్య నిర్ణయం.. అందుకేనా..!

ఒక పక్క రాజధాని విశాఖకు తరలించేందుకు ముహూర్తాలు సిద్దం చేస్తున్న సమయంలో సీఎం జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అయన అధికారం చేపట్టిన నాటి నుండి అమరావతిలో ఎక్కడి నిర్మాణాలు అక్కడే ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే కొద్ది సేపటి క్రితం అధికారులతో సమావేశమైన సీఎం జగన్ అమరావతిలో ప్రస్తుతం ఏయేదశల్లో నిర్మాణాలు ఉన్నాయో అడిగి తెలుసుకుని వాటిని పూర్తిచేసే కార్యాచరణపై దృష్టి పెట్టాలని అధికారులకు కీలక సూచనలు చేసారు. దీని కోసం నిధుల సమీకరణకు ఆర్థికశాఖ అధికారులతో కలిసి కూర్చుని ప్రణాళిక సిద్ధంచేసుకోవాలని ఆదేశించారు. అదే విధంగా ఆన్ లైన్ లో ప్రజలు ఫ్లాట్ లు కొనుక్కున్న హాపీ నెస్ట్‌ బిల్డింగులను కూడా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు.   ఇది ఇలా ఉండగా రాజధాని తరలింపు బిల్లుల వ్యవహారం పై రాష్ట్ర ప్రభుత్వం రేపటిలోగా హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. ఇప్పటికే హైకోర్టు స్టేటస్ కో ఇచ్చిన నేపథ్యంలో ఒక పక్క అమరావతి రైతులు.. స్టే ఆర్డర్ ను కొనసాగించాలని కోరుతూ గురువారం హైకోర్టులో పిటిషన్లు వేశారు. రేపు ఆ పిటిషన్లతో పాటు.. ప్రభుత్వం దాఖలు చేసే అఫిడవిట్ ను కూడా పరిశీలించాక హైకోర్టు స్టే ఆర్డర్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడే ప్రభుత్వం తెలివిగా వ్యవహరిస్తు సరిగ్గా ఒక రోజు ముందు అమరావతిలోని నిర్మాణాలపై సమీక్షను నిర్వహించింది. సుమారు 15 వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్మాణం మధ్యలో ఆగిపోయినవాటిని పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అయితే సరిగ్గా మూడు రాజధానుల ప్రకటనకు పది రోజుల ముందు కూడా ఇలాంటి సమీక్షే చేసిన సీఎం అపుడు కూడా ఇవే ఆదేశాలిచ్చారు. ఇప్పుడు మాత్రం మరిన్ని వివరాలతో మీడియాకు రిలీజ్ చేశారు.    ఇప్పుడు ఇదే విషయాన్నీ ప్రభుత్వం రేపు అఫిడవిట్ లో పేర్కొనే అవకాశం ఉంది. అమరావతిని తాము నిర్లక్ష్యం చేయడం లేదని లెజిస్లేటివ్ రాజధానిగా కొనసాగుతుందని అంటే కాకుండా ఇక్కడ అభివృద్ధి పనులు ఆపలేదని కేవలం వికేంద్రీకరణలో భాగంగానే విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ పెడుతున్నామని పేర్కొనే అవకాశం ఉంది దాని కోసమే ఈ హడావిడి సమీక్ష సమావేశం అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక వేళ రేపు విశాఖకు వెళ్లటం సాధ్యం కాకపోతే ఈ ఆదేశాలు చూపి అమరావతికి మేము అన్యాయం చేయడం లేదు చూడండి అని చెప్పినా ఆశ్చర్యపోనక్కరలేదు. దీంతో ప్రస్తుతం ప్రజలందరి దృష్టి రేపు హైకోర్టులో జరిగే వాదనల పైన అలాగే కోర్టు ఇచ్చే తీర్పు పైనే ఉంది.

అచ్చెన్నాయుడుకి కరోనా పాజిటివ్

ఈఎస్ఐ కేసులో అరెస్టై, జ్యుడీషియాల్ రిమాండ్ లో ఉన్న అచ్చెన్నాయుడుకి రమేష్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే, రెండు రోజుల నుంచి జలుబు చేయటంతో వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా, ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో హాస్పిటల్ యాజమాన్యం, ఈ విషయం హైకోర్టుకు సమాచారం అందించింది. అయితే దీనిపై తమకు అధికారికంగా ఒక లేఖ ద్వారా ఈ విషయం చెప్పాలని హైకోర్టు ఆదేశించింది.    కాగా, ఈఎస్‌ఐ మందుల కొనుగోలులో అవకతవకలు జరిగాయని అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పైల్స్ ఆపరేషన్ జరిగింది అని చెప్పినా.. శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు దాదాపు 600 కిమీ కారులో తిప్పటంతో ఆయనకు బ్లీడింగ్ ఎక్కవై ఆపరేషన్ ఫెయిల్ అవ్వటంతో, మరో సారి ఆపరేషన్ చేసారు. ఇదంతా ఆయన జ్యుడీషియాల్ రిమాండ్ లో ఉండగానే జరిగింది.అయితే దీని పై మొదటి నుంచి టీడీపీ అభ్యంతరం తెలిపింది. ఇలా ఇష్టం వచ్చినట్టు తిప్పితే, ఈ పరిస్థితిలో కరోనా లాంటివి వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆయనను గుంటూరు జీజీహెచ్ నుంచి, విజయవాడ సబ్ జైలుకు తీసుకు రావటంపై కూడా టీడీపీ అభ్యంతరం చెప్పింది. ఇదే సమయంలో ఆయనకు రెండు ఆపరేషన్ లు జరిగాయని, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కోర్టులో కేసు వేయడంతో ప్రైవేటు హాస్పిటల్ కు వెళ్ళటానికి కోర్టు అనుమతించింది. దీంతో గత కొన్ని రోజులుగా ఆయన ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు.

జస్టిస్ ఈశ్వరయ్య ఆడియో టేప్ సర్కార్ కొంప ముంచుతుందా!!

గత కొద్ది రోజులుగా జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్ కాల్ ఆడియో ఎపి రాజకీయాలలో సంచలనం గా మారింది. హైకోర్టును కంటైన్ మెంట్ జోన్ గా మార్చాలని అంతే కాకుండా రిజిస్ట్రార్ జనరల్ మరణానికి చీఫ్ జస్టిస్ మహేశ్వరి కారణమంటూ వేసిన పిటిషన్ల కేసులో జడ్జ్ రామకృష్ణ వేసిన ఇంప్లీడ్ పిటిషన్ తీసుకున్న హైకోర్టు ఈ మొత్తం అంశం వెనక ఉన్న కుట్రను చేధించాలంటూ విచారణకు ఆదేశించింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఆర్వీ రవీంద్రన్ ను విచారణాధికారిగా నియనిస్తూ నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఇప్పుడు జస్టిస్ ఈశ్వరయ్యతోపాటు.. ఆయన వెనక ఉన్నవారి గుండెల్లో కూడా రైళ్లు పరిగెడుతున్నాయి.   చిత్తూర్ జిల్లాలో జడ్జ్ రామకృష్ణపై దాడులు జరగడం.. దాని వెనక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారని ఆయన ఆరోపించడం తెలిసిందే. దీంతో జస్టిస్ ఈశ్వరయ్య రామకృష్ణకు ఫోన్ చేసి ఆ వ్యవహారం సెటిల్ చేస్తానని చెపుతూ మరి కొన్ని విషయాల పై కూడా కామెంట్స్ చేసి ఇరుకున పడ్డారు. ఉద్దేశపూర్వకంగానే తాను చీఫ్ జస్టిస్ పై కేసులు పెట్టించినట్లు స్వయంగా ఈశ్వరయ్యే ఆ ఫోన్ సంభాషణలో చెప్పడం అంతే కాకుండా తరువాత జరిగిన మీడియా సమావేశంలో ఆ ఫోన్ లో మాట్లాడింది తానేనని ఆయన ఒప్పుకోవడంతో.. జడ్జ్ రామకృష్ణ అవన్నీ హైకోర్టు ముందు పెట్టారు. దీంతో ఈ విషయాన్ని హైకోర్టు సీరియస్ గా తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.   ఇప్పుడు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి విచారణలో అసలు సంగతులన్నీ బయటికొస్తే.. బహుశా అది రాజకీయంగా పెను సంచలనంగా మారే అవకాశం ఉంది. ఈ మొత్తం కుట్రలో ఎవరెవరు ఉన్నారనేది కూడా ఆసక్తికరంగా మారింది. అంతే కాకుండా జడ్జ్ రామకృష్ణ ఆరోపించినట్లుగా మొద్దు శీను హత్య కేసు కూడా టాంపరింగ్ జరిగిందనే దానిపై కూడా విచారణకు ఆదేశిస్తే.. అది మరో సంచలనం అవుతుంది. ఈ మొత్తం వ్యవహారం ఇక్కడితో ఆగకుండా దీని వెనుక ఉండి నడిపిస్తున్న ప్రభుత్వంలోని పెద్దలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం కూడా ఇరకాటం లో పడే అవకాశం కనిపిస్తోంది.

షాకింగ్.. రెండు వారాల్లో 97 వేల మంది చిన్నారులకు కరోనా

భారత్ లో ఓ వైపు కరోనా విజృంభిస్తోంటే, మరోవైపు త్వరలో స్కూళ్లను తెరిపించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాలో వేల సంఖ్యలో చిన్నారులు కరోనా బారిన పడ్డారన్న వార్త ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో గడచిన రెండు వారాల్లో 97 వేల మంది చిన్నారులు కరోనా బారిన పడ్డారని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ తెలిపింది.    అమెరికాలో ఇప్పటికే పలు స్కూళ్ళు తెరుచుకున్నాయి. మరికొద్ది రోజుల్లో అన్ని స్కూళ్ళు తెరుచుకునే అవకాశాలున్నాయనుకుంటున్న సమయంలో కరోనా మహమ్మారి పిల్లలపై ఏ విధంగా ప్రభావం చూపుతోందో అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్  చెప్పుకొచ్చింది.    అమెరికాలో గడిచిన నాలుగు నెలల్లో 3,39,000 మంది పిల్లలకు కరోనా సోకగా.. జూలై 16 నుంచి జూలై 30 మధ్య దాదాపు లక్ష మంది పిల్లలకు కరోనా సోకింది. దీంతో స్కూళ్లను తిరిగి తెరిపించడంపై అధికారులు పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది. త‌ల్లిదండ్రులు కూడా త‌మ పిల్ల‌ల‌కు ఆన్‌లైన్ క్లాసులే మేల‌ని భావిస్తున్నారట.   అమెరికాలో కేవలం రెండు వారాల్లో 97 వేల మంది పిల్లలు కరోనా బారిన పడటం క‌ల‌వ‌రానికి గురిచేసే వార్తనే చెప్పాలి. త్వరలో స్కూళ్లను తెరిపించేందుకు ప్రయత్నిస్తున్న ఇక్కడి ప్రభుత్వాలు.. ఆ నిర్ణయంపై పునరాలోచిస్తే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మనోవేదనతో నక్సలైటుగా మారతానని లేఖ రాస్తే.. నీ అంతు చూస్తామని బెదిరిస్తారా?

అధికార పార్టీకి చెందిన నాయకుడి ఇసుక లారీని అడ్డుకున్నందుకు.. గత నెల 18న తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీసుస్టేషన్‌ లో దళిత యువకుడైన ప్రసాద్ కు పోలీసులు శిరోముండనం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పై ఏపీలో తీవ్ర దుమారం రేగింది. దళిత సంఘాలు, విపక్షాలు అధికార పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.    అయితే ఈ ఘటనలో తనకు సరైన న్యాయం జరగడం లేదని ఆవేదన చెందిన బాధితుడు ప్రసాద్ ఇటీవల భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కి లేఖ రాశాడు. "ఇక్కడ నాకు ఎవరూ న్యాయం చేయడంలేదు. నక్సలైట్లలో చేరి నా పరువు కాపాడుకుంటాను. నాకు అనుమతి ఇప్పించండి." అని లేఖలో పేర్కొన్నాడు. దీంతో ఈ ఘటనపై రాష్ట్రపతి సీరియస్ గా స్పందించారు. ఈ మొత్తం ఘటనపై విచారణ జరిపేందుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించారు.   ఇదిలా ఉంటే తనకి న్యాయం జరగడం లేదంటూ తీవ్ర ఆవేదనతో రాష్ట్రపతికి లేఖ రాసిన దళిత యువకుడు ప్రసాద్ పై.. ఏపీ మంత్రి పినిపె విశ్వరూప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నక్సలైట్లలో చేరాలంటే ఎవరైనా వెళ్లి చేరవచ్చని అన్నారు. "నక్సలైట్లలో చేరతా అనుమతించండంటూ రాష్ట్రపతికి లేఖ రాశారట. దీనికి రాష్ట్రపతి అనుమతి అవసరంలేదు. వెళ్లి చేరవచ్చు కదా. నక్సలైట్ అని ముద్రపడిన తర్వాత చట్టపరంగా పోలీసులు చర్యలు తీసుకుంటారు" అని మంత్రి వ్యాఖ్యానించారు.   కాగా, మంత్రి విశ్వరూప్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. న్యాయం జరగట్లేదన్న మనోవేదనతో ఆ యువకుడు నక్సలైటుగా మారతానని రాష్ట్రపతికి లేఖ రాస్తే.. ఆ యువకుడికి న్యాయం చేయకపోగా మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని పలువురు తప్పుబడుతున్నారు.   మంత్రి విశ్వరూప్ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మనోవేదనతో ఆ యువకుడు నక్సలైటుగా మారతానని రాష్ట్రపతికి లేఖ రాశాడని.. మంత్రి స్థానంలో ఉన్న విశ్వరూప్ బెదిరింపు ధోరణిలో వ్యాఖ్యలు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నక్సలైటుగా చేరితే నీ అంతు చూస్తామని బెదిరిస్తారా మీరు పాలకులా? ప్రజల పాలిట భక్షకులా? అని ప్రశ్నించారు. శిరోముండనం ఘటనతో సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయకుండా ప్రభుత్వం దోబూచులాట ఆడుతుందని మండిపడ్డారు. దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడతామని రామకృష్ణ తెలిపారు.

జగన్ సర్కార్ కు హైకోర్టు మరో షాక్..

ఏపీలోని పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి జరిగిన భూసేకరణ అంశంలో ఏపీ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ హైకోర్టు ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని మైనింగ్ భూములను ఇతర అవసరాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ కేటాయించొద్దని ఆదేశించింది. మైనింగ్ భూములపై కేంద్ర ప్రభుత్వానికే పూర్తి అధికారం ఉంటుందని హైకోర్టు తెలిపింది. దీనికి సంబంధించి ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పలు చోట్ల ఇళ్ల పట్టాల కోసం మైనింగ్ భూములను కేటాయించారని దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు దీనిపై స్టే ఇస్తూ ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.   కాగా, ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మరో సారి వాయిదా పడింది. ఈ విషయంలో కోర్ట్ లో కేసులు నడుస్తున్న నేపథ్యంలో వాయిదా పడిందని తెలుస్తోంది.

ప్రగతిభవన్ ముట్టడి కేసులో కేసీఆర్ మనవడు అరెస్ట్ 

త్వరలో తెలంగాణాలో ఎంట్రెన్స్ పరీక్షలు కండక్ట్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో 37మంది ఎన్.ఎస్.యు.ఐ కార్యకర్తలు ప్రగతి భవన్ ను ముట్టడించిన సంగతి తెలిసిందే.   ప్రస్తుతం ఉన్న కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ వాయిదా వేయాల‌ని కోరుతూ ఈ ముట్టడి చేసారు. తాజాగా ఈ కేసులో కేసీఆర్ మనవడు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ముట్ట‌డిలో సీఎం కేసీఆర్ అన్న కుమార్తె రమ్యారావు కొడుకు రితేష్ రావు కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది. రితేష్ రావును పోలీసులు ఈ కేసులో ఏ5 గా చేర్చారు. దీంతో అతడిని కూడా అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా 14రోజుల రిమాండ్ విధించడంతో అంద‌ర్నీ చంచ‌ల్ గూడ జైలుకు త‌ర‌లించారు.   ఐతే ఈ అరెస్ట్ పై సీఎం కేసీఆర్ అన్న కూతురు, కాంగ్రెస్ పార్టీ నేత‌ ర‌మ్యారావు మండిప‌డ్డారు. ఎన్.ఎస్.యూ.ఐ కార్య‌క‌ర్త‌లు ఉద్యమం చేసింది ఆస్తుల కోస‌మో, క‌మిష‌న్ల కోస‌మో కాద‌ని.. కేవలం విద్యార్థుల ప్రాణాల‌ను కాపాడ‌లనే ఏకైక ఉద్దేశంతోనే వారు ఆందోళ‌న చేశార‌న్నారు.

రామజన్మభూమి ట్రస్ట్ చీఫ్‌కు కరోనా

అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఏర్పాటైన రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ క‌రోనా బారిన‌ప‌డ్డారు. రామమందిరం నిర్మాణానికి భూమి పూజ జరిగిన వారం రోజులకే ఆయనకు కరోనా సోకింది. మొద‌ట ఆయ‌న‌కు శ్వాసపరమైన ఇబ్బందులు ఏర్పడటంతో కరోనా పరీక్ష చేయ‌గా పాజిటివ్‌ గా తేలింది. దీంతో ఆయ‌న‌ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. శ్రీకృష్ణ జ‌న్మాష్ట‌మి వేడుక‌ల్లో పాల్గొనేందుకు మ‌థుర వెళ్లిన ఆయ‌న‌.. ప్ర‌స్తుతం అక్క‌డే చికిత్స తీసుకుంటున్నారు.    నృత్య‌గోపాల్ దాస్‌ కు కరోనా సోకిన విష‌యం తెలుసుకున్న‌ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. నృత్య గోపాల్ దాస్‌కు సరైన వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. అలాగే ఆయనకి మెరుగైన‌ వైద్య సదుపాయాలు అందించాల‌ని జిల్లా మేజిస్ట్రేట్‌ తో పాటు వైద్యులను సీఎం యోగి ప్రత్యేకంగా ఆదేశించారు.

తెలంగాణ సీఎస్ పై హైకోర్టు ఆగ్రహం

కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాము ఇస్తున్న ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో చీఫ్ సెక్రటరీ సోమేష్‌ కుమార్‌ ను తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ఈరోజు సోమేష్‌ కుమార్‌ హైకోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎస్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలు ఏ ఒక్కటి అమలు కాలేదని, తమ ఆదేశాలు ఎందుకు అమలు కావడం లేదని సీఎస్ ను ప్రశ్నించింది. కరోనాపై ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్వహరిస్తున్నారని ప్రశ్నించింది.   ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజలను డబ్బుకోసం పీడిస్తున్నాయని.. దీనిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సీఎస్‌ ను ఉద్దేశించి హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సమాధానంగా ఇప్పటి వరకు 50 మందికి నోటీసులు ఇచ్చామని సోమేష్‌ కుమార్‌ తెలిపారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రుల లైసెన్స్‌ రద్దు చేశామని చెప్పారు. దీంతో మిగిలిన ఆసుపత్రుల పరిస్థితి ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

క్వాలిఫికేషన్ లేకున్నా రాష్ట్రంలోని అన్ని పోస్టులు రెడ్లకే..!

ఏపీ ప్రభుత్వం ఒక కులానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది అంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు విమర్శించారు. క్వాలిఫికేషన్ లేకున్నా రాష్ట్రంలోని అన్ని పోస్టులు రెడ్లకే ఇస్తున్నారని ఆరోపించారు. చైర్మన్ పోస్టు ఉంటే రెడ్డికి.. ఎక్కడైనా రెండు పోస్టులు ఉంటే ఒకటి రెడ్డికే ఇస్తున్నారని అన్నారు. ఎస్వీబీసీ నుంచి ఏ డిపార్ట్ మెంట్ చూసుకున్నా వాళ్లే ఉన్నారంటూ పేరు పేరును చదివి వినిపించారు. రెడ్డి జులుం చేస్తున్నారని, సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తే జైల్లో పెడతారా? క్వాలిఫికేషన్ లేని ప్రతి రెడ్డికి ప్రభుత్వంలో ఉద్యోగమిస్తారా? అని రఘురామకృష్ణం రాజు నిలదీశారు.   ఇక, రాజధాని అమరావతి గురించి మాట్లాడటానికి తనకేం సంబంధమన్న వైసీపీ నేతలపై కూడా రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. తనకే సంబంధం ఉందని.. కొంతమంది పిచ్చి వాగుడు వాగుతున్నారని ఘాటుగా విమర్శించారు. అమరావతిపై మాట్లాడటం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. విజయవాడ నేను పుట్టి పెరిగిన ప్రాంతం. ఇక్కడి పరిస్థితులపై నాకు అవగాహన ఉంది. రాజధానికి ఇది సరైన ప్రాంతం అన్నారు. " రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాలు చెల్లవు. అమరావతే రాజధానిగా ఉంటుంది. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఏదీ సాగదు" అని రఘురామకృష్ణం రాజు తేల్చి చెప్పారు.

చిత్తూరు జిల్లాలో దారుణం.. భూమి కోసం గిరిజన యువకుడి హత్య

భూదాహానికి ఆంధ్రప్రదేశ్ లో దళితులు, గిరిజనులు బలైపోతూనే ఉన్నారు. అప్పు తీర్చలేదంటూ అధికార పార్టీకి చెందిన నాయకుడు గిరిజన మహిళని ట్రాక్టర్ తో తొక్కించి చంపిన ఘటన మరవక ముందే ఇప్పుడు గిరిజన యువకుడు బలైపోయాడు. భూమి కోసం డబ్బా బాబ్లీ(36) అనే గిరిజన యువకుడుని పొట్టన పెట్టుకున్నారు.   చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం చింతలపాళెం పంచాయతీ మరాఠీపురానికి చెందిన 112 షికారీ కుటుంబాలకు 1971 నుంచి మూడు విడతలుగా సుమారు 560 ఎకరాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. అయితే, చింతలపాళేనికి చెందిన కొంతమంది ఆ 560 ఎకరాల భూమిని కాజేసి పట్టాలు సంపాదించారు. దీంతో 2006 నుంచి షికారీలు తమ భూమి కోసం పోరాటం చేస్తున్నారు. ఈ నెల 7న షికారీలు గ్రామ సమీపంలోని పొలాల్లో గుడిసెలు వేశారు. దీన్ని సహించలేని అగ్రకులాల వారు దాడి చేయడంతో 23 మంది షికారీలు గాయపడ్డారు. అంతటితో వాళ్ళు ఆగలేదు. భూ పోరాటంలో కీలక పాత్ర పోషిస్తున్న డబ్బా బాబ్లీని లక్ష్యంగా చేసుకున్నారు. మంగళవారం రాత్రి బాబ్లీని దుండగులు హతమార్చి నీటి గుంతలో పడేశారు. బాబ్లీ సోదరుడు పరుశురామ్‌ ఫిర్యాదు మేరకు దాదాపు 30మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో అధికార పార్టీ నాయకుడు, మాజీ ఎంపీటీసీ రమణయ్యయాదవ్‌ ను ప్రథమ నిందితుడిగా పేర్కొన్నారు. కాగా, టీడీపీ నేత నారా లోకేష్ తాజాగా ట్విట్టర్ వేదికగా ఈ ఘటనపై స్పందించారు. "భూదాహానికి దళితులు, గిరిజనులు బలైపోతున్నారు. భూమి కోసం గిరిజన యువకుడిని పొట్టన పెట్టుకున్నారు." అని ఆగ్రహం వ్యక్తం చేశారు.    "మరాఠీపురానికి చెందిన 112 షికారీ కుటుంబాలకు 1971 నుంచి మూడు విడతలుగా సుమారు 560 ఎకరాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఆ భూమిని కొట్టేయడానికి అధికార పార్టీ నాయకులు దాడికి దిగి 23 మందిని గాయపర్చారు. గిరిజన యువకుడు డబ్బా బాబ్లీ ని అత్యంత కిరాతకంగా హత్యచేసారు. గిరిజన మహిళని అప్పు తీర్చలేదంటూ వైకాపా నాయకుడు ట్రాక్టర్ తో తొక్కించి చంపిన ఘటన మరవక ముందే ఇప్పుడు గిరిజన యువకుడు బలైపోయాడు." అంటూ లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.   "అధికార పార్టీ నాయకులు ఆక్రమించుకున్న భూమిని వెంటనే దళితులు, గిరిజన కుటుంబాలకు అందజేయ్యాలి. డబ్బా బాబ్లీ ని హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి." అని లోకేష్ డిమాండ్ చేశారు.

ఏపీకి కొత్త గవర్నర్ వస్తున్నారా..!

ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమించిన తరువాత బీజేపీ అధిష్టానం మంచి దూకుడు మీద ఉంది. ఎలాగైనా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసి 2024 లో వచ్చే ఎన్నికలలో జనసేనతో కలిసి అధికారాన్ని చేపట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ మేరకు పార్టీ స్టాండ్ దాటిన వారిని కూడా ఏమాత్రం క్షమించకుండా ఇమీడియట్ గా పార్టీ నుండి సస్పెండ్ చేసేస్తున్నారు.   దీనికి తోడు తాజాగా ఏపీలో కొత్త గవర్నర్ వస్తారని.. ప్రస్తుత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ని తప్పించబోతున్నట్టు ప్రచారం జోరుగా జరుగుతోంది. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ కొద్ది రోజుల క్రితం తమను సంప్రదించకుండా తీసుకున్న నిర్ణయాల పై అసంతృప్తిగా ఉన్న కేంద్రం ఆయనను మార్చేందుకు రంగం సిద్దం చేసిందని లేటెస్ట్ టాక్. మరీ ముఖ్యంగా నిమ్మగడ్డ ప్రసాద్ నియామకం అంశం, మూడు రాజధానుల బిల్లుల ఆమోదం వంటి అంశాలపై కేంద్రాన్ని సంప్రదించకుండా గవర్నర్ వ్యవహరించిన తీరుతో రాష్ట్రంలో ఎదగాలన్న పార్టీ ఆశయానికి గండి పడిందని అంతేకాక ఈ నిర్ణయాలు అటు కేంద్రాన్ని కూడా ఇరుకున పెట్టాయని అందుకే ఆయనను తప్పించి ఆయన స్థానంలో వేరే వారిని నియమించాలని బీజేపీ భావిస్తున్నట్టుగా వినికిడి.    అయన స్థానంలో వచ్చే కొత్త గవర్నర్ సెలెక్షన్ కూడా ఇప్పటికే అయిపోయిందని కూడా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పాండిచ్చేరి లెప్టినెంట్ గవర్నర్‌గా పని చేస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీనీ నియమిస్తే అటు సీఎం జగన్ దూకుడుకు కూడా కళ్ళెం వేయవచ్చు అని బీజేపీ అధిష్టానం భావిస్తోందట. అయితే ఈ ప్రచారం ఎంతవరకు నిజమో తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడక తప్పదు.

ఎంపీ విజయసాయి పేరుతొ దందా చేస్తున్న వైసీపీ నేత సస్పెన్షన్ 

ఎంపీ విజయసాయిరెడ్డి పేరు చెప్పి అధికారులను కూడా బెదిరించి భూ వివాదాల సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నారనే ఆరోపణపై విశాఖ వైసీపీ నేత కొయ్య ప్రసాద్ రెడ్డిని అధిష్ఠానం సస్పెండ్‌ చేసింది. విశాఖపట్నంకు చెందిన ప్రసాద్ రెడ్డిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పార్టీ అధికారిక ప్రకటన ఒకటి విడుదల చేసింది.    పార్టీ ముఖ్య నాయకుల పేర్లను దుర్వినియోగం చేయడం ద్వారా అయన భూ లావాదేవీలు సెటిల్ చేసినట్లు సమాచారం. విజయసాయి రెడ్డి, విశాఖ కలెక్టరేట్ పేర్లను ఉపయోగించి అయన అక్రమ కార్యకలాపాలకు పాల్పడడాన్ని పార్టీ క్రమశిక్షణా సంఘం తీవ్రంగా పరిగణించింది. దీంతో కఠిన నిర్ణయం తీసుకున్నట్లుగా పార్టీ అధిష్టానం వెల్లడించింది. అంతేకాకుండా ఇలాంటి అక్రమాలకు ఎవరు పాల్పడినా చర్యలు తప్పవని హెచ్చరించింది.    దివంగత వైఎస్‌ సీఎంగా వున్న సమయంలో ప్రసాదరెడ్డి రాష్ట్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పనిచేశారు. వైసీపీ ఆవిర్భావం నుండి కొంతకాలం కిందటి వరకూ అయన పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. ఐతే కొయ్య ప్రసాదరెడ్డి సస్పెన్షన్‌ ఉదంతం విశాఖ వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

శారదలేఖలతో చైతన్యం కల్పించిన కనుపర్తి వరలక్ష్మమ్మ

కనుపర్తి వరలక్ష్మమ్మ (6 అక్టోబర్ 1896 - 13 ఆగస్టు 1978)   విద్యలో పాటు విషయ పరిజ్ఞానం ఉన్న మహిళలు తమ సమస్యలనే కాకుండా సమాజంలో తనలాంటి వారు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించగలుగుతారు. సమస్యలను చర్చిస్తూ పరిష్కారాలను సూచిస్తూ అవగాహన కల్పిస్తారు. ఈ ప్రయత్నమే చేశారు ప్రముఖ రచయిత కనుపర్తి వరలక్ష్మమ్మ. శారదలేఖలు పేరుతో ప్రచురితమైన శీర్షిక ద్వారా మహిళల సమస్యలను చర్చిస్తూ వారిలో చైతన్యం కలిగించారు. సామాజిక మార్పు దృక్పథంతో సాగే ఆమె రచనలు ఎందరినో ప్రభావితం చేశాయి. తన రచనలకు గాను 1934లో గృహలక్ష్మి స్వర్ణకంకణాన్ని అందుకున్న మొదటి మహిళ. మద్రాస్, విజయవాడ ఆకాశవాణి కార్యక్రమాలలో పాల్గొన్న మొదటి మహిళ,  ప్రపంచ తెలుగు మహాసభలో సన్మానం పొందిన రచయిత్రి కూడా వరలక్ష్మమ్మ నే కావడం అభినందనీయం.   బాపట్లలో 1896లో అక్టోబర్ 6న వరలక్ష్మి జన్మించారు. తల్లిదండ్రులు హనుమాయమ్మ పాలపర్తి శేషయ్య. ఆమెకు ఏడుగురు తోబుట్టువులున్నారు. చిన్నతనంలోనే సాహిత్యంపై ఆసక్తితో ఆమె ఎన్నోపుస్తకాలు చదివేవారు. 13ఏండ్ల వయసులో విద్యాధికుడు, హెల్త్ ఇన్స్పెక్టరుగా పనిచేసే కనుపర్తి హనుమంతరావుతో 1909లో పెళ్లి జరిగింది. భర్త ప్రోత్సాహంతో ఉన్నత విద్యను అభ్యసించిన ఆమె ఎన్నో రచనలు, అనువాదాలు చేశారు. పదవులు అలంకరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ నుంచి ఉత్తమ రచయితగా సత్కారం అందుకున్నారు.   వరలక్ష్మమ్మ మొదటి కథ సౌదామిని 1919లో ఆంగ్లానువాదం చేశారు. ఆ తర్వాత ఆమె ప్రముఖ మాసపత్రిక గృహలక్ష్మి లో 1929 నుంచి 1934 వరకు ధారావాహికంగా శారదలేఖలు అన్న పేరుతో ఒక శీర్షిక రాశారు. ఆ కాలంలో మహిళలు ఎదుర్కోంటున్న అనేక సమస్యలు చర్చిస్తూ వాటికి పరిష్కారాలు సూచిస్తూ సాగే ఆ శీర్షికలు పాఠకాదరణ ఎంతో ఉండేది. ఆ తర్వాత  శారదలేఖలు అన్న పేరుతో పుస్తకంగా ప్రచురించేరు. ఆధునిక భావాలు గల శారద పాత్ర ద్వారా స్త్రీలని చైతన్యవంతం చేయడానికి దోహదం చేశాయి. ఒక రచయిత్రి ఒక పత్రికలో అంతకాలం ఒక కాలమ్ నిర్వహించడం అదే మొదటిసారి అని అంటారు. తన రచనలతో సమస్యలపై అవగాహన కల్పించిన రచయితగా ఆమె మహిళా పాఠకుల్లో అభిమానం సంపాదించుకున్నారు. సాహిత్యంలోని అనేక ప్రక్రియల్లో ఆమె రచనలు చేశారు. లేడీస్ క్లబ్, రాణి మల్లమ్మ, మహిళా మహోదయం, పునః ప్రతిష్ఠ వంటి నాటికలు, ‘ద్రౌపది వస్త్ర సంరక్షణ ‘ అనే ద్విపద కావ్యం, ‘సత్యా ద్రౌపది సంవాదం’, 'నాదు మాట' మొదలైన పద్య రచనలు చేసారు . ‘నమో ఆంధ్ర మాతా’ పేరుతో గేయాలు రాసారు . గాంధీ మీద దండకం కూడా రచించారు . ఇవే కాకుండా పిల్లల కోసం అనేక పాటలు, నవలలు, పిట్ట కథలు రచించారు. ప్రముఖుల జీవిత చరిత్రలు, కథలు రచించారు. అంతేకాదు ఆమె రచనలు కొన్ని తమిళ, కన్నడ, హిందీ భాషలలో కి అనువదించారు.   రచయితగానే కాదు స్వాంతంత్య్ర సమరంలోనూ ఆమె పాల్గొన్నారు. 1921లో విజయవాడ వచ్చిన మహాత్మా గాంధీ ని కలిసి జాతీయోద్యమంలో పాల్గొన్నారు . “నా జీవము ధర్మము , నా మతము నీతి , నా లక్ష్యము సతీ శ్రేయము. ఈ మూడింటిని సమర్ధించుటకే నేను కలము బూనితిని “ అని చెప్పుకున్న రచయిత్రి . మహిళల్లో పోరాటపటిమను తన రచనల ద్వారా పెంచారు.   సామాజిక సేవారంగంలోనూ విశేషకృషి చేశారు వరలక్ష్మమ్మ. బాలికల అభ్యున్నతి కోసం బాపట్లలో స్త్రీ హితైషిణి మండలిని స్థాపించి స్త్రీల కొరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి సమాజ సేవ చేసారు.   గుంటూరు జిల్లా బోర్డు సభ్యురాలిగా కొనసాగారు. గుడివాడ ప్రజలు ఆమెను ప్రేమగా కవితా ప్రవీణ అని పిలుచుకునేవారు. సాహిత్యరంగంలో రాణించి, స్వాతంత్య్రఉద్యమంలో పాల్గొన్ని మహిళాభ్యుదయం కోసం పనిచేసిన ఆమె 13 ఆగస్టు 1978న మరణించారు.