సుప్రీం కోర్టులో ఏపీ సర్కార్ కు మరో పెద్ద షాక్
posted on Aug 17, 2020 @ 1:05PM
పేదలకు ఇళ్ల స్థలాల అంశంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరో షాక్ తగిలింది. రాజధాని అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు ఈ రోజు సమర్థించింది. సుప్రీం కోర్టులో హైకోర్టు స్టే ను సవాలు చేస్తూ ప్రభుత్వం వేసిన రెండు పిటిషన్లపై విచారించిన చీఫ్ జస్టిస్ బొబ్డే ధర్మాసనం… హైకోర్టులో విచారణ సరిగ్గానే జరిగిందని అభిప్రాయపడింది. అంతేకాకుండా ఈ అంశాన్ని హైకోర్టులో తేల్చుకోవాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది.
రాజధాని భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ రాజధాని మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేస్తూ ఆర్-5 జోన్ పై ప్రభుత్వం ఉతర్వులను జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై రాజధాని ప్రాంతం రైతులు, అమరావతి పరిరక్షణ జేఏసీ హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై గతంలో విచారణ జరిపిన హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. హైకోర్టు స్టే పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. తాజాగా దీనిపై ఈరోజు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. హైకోర్టు స్టేను సమర్థించింది. హైకోర్టులో విచారణ సరిగ్గానే జరిగిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.