పవన్ అభిమానికి సీఎం జగన్ సాయం.. ప్రభుత్వం తరఫున సాయం చేసి ప్రచారమా?
posted on Aug 17, 2020 @ 2:04PM
'పవన్ కళ్యాణ్ అభిమానికి సీఎం వైఎస్ జగన్ సాయం' అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ అభిమాని నాగేంద్ర రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని, అతనికి అత్యవసర చికిత్స అవసరమంటూ ఓ స్వచ్ఛంద సంస్థ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ వైరల్ గా మారగా, ఈ వార్తపై పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు స్పందించారు. పవన్ అభిమాని అనారోగ్యానికి సంబంధించిన వార్తను సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో.. దీనిపై స్పందించిన సీఎం జగన్ వెంటనే నాగేంద్రకి రూ.10లక్షలు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎంవో స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ హరికృష్ణ ఆస్పత్రికి ఎల్‌వోసీ అందజేశారు. ప్రభుత్వ సాయంతో నాగేంద్రకు చికిత్స జరిగింది. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సీఎంవో అధికారులు పేర్కొన్నారు.
నాగేంద్ర అనారోగ్యానికి సంబంధించిన వార్తపై సీఎం జగన్ స్పందించి ప్రభుత్వం తరఫున సాయం చేయడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ విషయంలో కొందరి అత్యుత్సాహం మాత్రం విమర్శలకు దారి తీస్తోంది.
'పవన్ కళ్యాణ్ అభిమానికి వైఎస్ జగన్ సాయం' అంటూ ఏదో వ్యక్తిగతంగా జగన్ సాయం చేసినట్టు కొందరు ప్రచారం చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. అతను ఏ హీరో అభిమాని అయినా ముందు రాష్ట్ర పౌరుడు, అదే వేరే హీరో అభిమానికి సాయం చేస్తే ఇలా ప్రచారం చేసుకుంటారా?, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండబట్టే ఇలా ప్రచారం చేసుకుంటున్నారని తప్పుబడుతున్నారు. అదీగాక అక్కడ జగన్ వ్యక్తిగతంగా సాయం చేయలేదు. ప్రభుత్వం తరఫున చేశారు. అసలు ప్రభుత్వం అంటేనే పార్టీలకి, కులాలకు, వర్గాలకు అతీతంగా పనిచేయాలి. అలా పనిచేసినందుకు ఖచ్చితంగా అభినందించాలి. కానీ కొందరు మాత్రం పవన్ అభిమానికి జగన్ వ్యక్తిగతంగా సాయం చేసినట్టు ప్రచారం చేయడం మాత్రం తప్పని నెటిజనులు అభిప్రాయపడుతున్నారు.