సుప్రీం కోర్టులో అమరావతి కేసు మరో సారి వాయిదా..

ఆంధ్రప్రదేశ్‌లో పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలపై సుప్రీంకోర్టులో విచారణ మరో సారి వాయిదా పడింది. పాలన వికేంద్రీకరణతో పాటు సీఆర్‌డీఏ రద్దు చట్టాలపై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌ కో ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ జగన్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీని పైన రెండు రోజుల క్రితం చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణకు స్వీకరించింది. అయితే, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కుమార్తె అమరావతి రైతుల తరపున వాదిస్తుండటంతో ప్రధాన న్యాయమూర్తి ఆ కేసును నాట్ బిఫోర్ మీ అంటూ మరో బెంచ్ కు బదిలీ చేయాలని ఆదేశించారు.    దీంతో ఈ కేసు ఈరోజు జస్టిస్ నారీమన్ అధ్యక్షతన ఏర్పడిన బెంచ్ ముందుకు వచ్చింది. అయితే ఇక్కడ కూడా అమరావతి రైతుల తరపున జస్టిస్ నారీమన్ తండ్రి హాజరయ్యారు. దీంతో..నారీమన్ ఈ కేసును మరో బెంచ్ కు వాయిదా వేయాలంటూ నాట్ భిపోర్ మీ అంటూ కేసును మరో సారి వాయిదా వేసారు.    ఐతే ఒకే కేసు విషయంలో సుప్రీం కోర్టు లో వరుసగా రెండో సారి ఇలా జరగటం అరుదైన విషయం అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం సుప్రీంలో దాఖలు చేసిన పిటీషన్ పైన మరో బెంచ్ వద్ద విచారణ జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాల పైన హైకోర్టు ఈ నెల 27వ తేదీ వరకు స్టేటస్ కో అమలు చేయాలని ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఏపీ రాజధానిగా అమరావతిని చేర్చిన సర్వే ఆఫ్‌ ఇండియా

ఏపీలో రాజధాని అంశం వివాదాస్పదం అవుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. భారతదేశ పటంలో ఏపీ రాజధానిగా అమరావతిని చేర్చామని సర్వే ఆఫ్‌ ఇండియా కార్యాలయం తెలిపింది. ఈ మేరకు గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు సర్వే ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్‌ ప్రదీప్‌ సింగ్ లేఖ రాశారు. దేశ పటంలో ఏపీ రాజధానిగా అమరావతిని చేర్చామని లేఖలో పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆమోదం మేరకే లేఖను విడుదల చేస్తున్నామని ప్రదీప్‌ సింగ్ స్పష్టం చేశారు.   కేంద్ర ప్రభుత్వం గతేడాది రిలీజ్ చేసిన ఇండియా మ్యాప్‌ లో ఏపీ రాజధాని అమరావతి పేరు లేకపోవడం వివాదాస్పదమైంది. మ్యాప్‌ లో అమరావతిని పేర్కొనకపోవడాన్ని ఎంపీ గల్లా జయదేవ్ 2019 పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రస్తావించారు. అమరావతి పేరు లేకపోవడం ఏపీ ప్రజలతో పాటు, రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీని కూడా అవమానించినట్టేనని తెలిపారు. అమరావతితో కూడిన మ్యాప్‌ను రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో గల్లా జయదేవ్ మాట్లాడిన మరుసటి రోజే.. అమరావతితో కూడిన మ్యాప్‌ను కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. అయితే ఈ విషయంపై ఉన్నతాధికారుల ఆమోదం మేరకు తాజాగా గల్లా జయదేవ్‌కు సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా లేఖ రాసింది. దీనిపై గల్లా జయదేవ్ స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఇండియా మ్యాప్‌ లో ఏపీ రాజధాని అమరావతిని పేర్కొనకపోవడాన్ని తాను 2019 పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో లేవనెత్తానని చెప్పారు. దీంతో సర్వే ఆఫ్ ఇండియా ఈ అంశాన్ని పరిశీలించి తాజాగా ప్రకటన చేసిందని, ఏపీ రాజధానిగా అమరావతి పేరును పేర్కొంటూ మ్యాప్‌ ను అప్ డేట్ చేసిందని గల్లా జయదేవ్ ట్వీట్ చేశారు.

అమరావతి రైతులకు బాసటగా అయోధ్య వీరుడు.. ఫీజు కేవలం ఒక్క రూపాయి 

లాయ‌ర్ ప‌రాశ‌రన్ ఈ మధ్య కాలంలో ఈ‌ పేరు తెలియ‌ని వారుండ‌కపోవచ్చు. దీనికి కారణం కొన్ని ద‌శాబ్దాల పాటు సాగిన బాబ్రీ మసీద్ రామ జన్మభూమి వివాదంపై సుప్రీం కోర్టులో ఎంతో నిష్ఠతో వాదించి మన దేశానికి సంబంధించిన అతిపెద్ద స‌మ‌స్యను పరిష్కరణలో పాలు పంచుకున్నారు. అయన గ‌తంలో అటార్నీ జ‌న‌ర‌ల్‌గా కూడా సేవ‌లు అందించారు. అటువంటి పెద్ద లాయర్ ఇప్పుడు అమ‌రావ‌తి రైతుల త‌ర‌పున సుప్రీం కోర్టులో వాదించబోతున్నారు. దీంతో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెలకొంది.   ఇప్పటికే మూడు రాజధానులు, అమ‌రావ‌తి భూములు వివాదంపై సుప్రీం కోర్టులో వాదించేందుకు ప్ర‌ముఖ లాయర్ హ‌రీష్ సాల్వేను జగన్ ప్ర‌భుత్వం నియ‌మించుకుంది. ఎంతో స‌క్సెస్‌ఫుల్ లాయ‌ర్‌గా పేరున్న ఆయ‌న ఈ కేసును చేపట్టడంతో అమరావతి రైతులు ఆందోళ‌న చెందారు. దీంతో హ‌రీష్ సాల్వే స్థాయిలో త‌మ త‌ర‌పున పోరాడే మరో లాయ‌ర్ కోసం ప్రయత్నం చేసారు. అయితే ఎంత మందిని అప్రోచ్ అయినా వారు ఎక్కువ మొత్తంలో ఫీజు డిమాండ్ చేయడంతో రైతులు తీవ్ర నిరాశ‌కు గుర‌య్యారు. అయితే చివ‌రి ప్ర‌య‌త్నంగా వారు న్యాయవాద వృత్తిలో తల పండిపోయిన పరాశ‌రన్‌ను ఆశ్ర‌యించారు. రైతుల గోడు విని చ‌లించిపోయిన ప‌రాశ‌ర‌న్ వారి తరుఫున వాదించేందుకు అంగీకరించారు. అయితే ఈ కేసును అయన కేవ‌లం ఒక్క రూపాయి ఫీజు తోనే వాదించేందుకు అంగీక‌రించారు. ఇప్పటికే ప‌రాశ‌ర‌న్ త‌రుపున ఆయ‌న కుమారుడు మోహ‌న్ ప‌రాశ‌ర‌న్ అమ‌రాతి వివాదంపై రైతుల త‌ర‌పున వాద‌న‌లు వినిపిస్తున్నారు. రెండు రోజుల కిత్రం అమ‌రావతిపై జ‌రిగిన వాద‌న‌ల్లోనూ ప‌రాశ‌రన్ పాల్గొన్నారు. ఇప్ప‌టికే అమ‌రావ‌తి భూముల‌పై సుప్రీం కోర్టులో రైతుల‌కు అనుకూలంగా తీర్పు రావ‌డంతో.. రాజ‌ధాని త‌ర‌లింపు విష‌యంలోనూ తాము గెలుస్తామ‌ని ఆ రైతులు ధీమాగా ఉన్నారు.

భారత్ లో ముందుగా వచ్చేది ఆ వ్యాక్సినే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం...!

కరోనా తో ప్రపంచం తో పాటు భారత్ కూడా సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో అందరి చూపు వ్యాక్సిన్ పైనే ఉంది. ఇప్పటికే మన దేశంలోని భారత్ బయోటెక్, జైడస్ కాడిలా కంపెనీల వ్యాక్సిన్ల ట్రయల్స్ కీలక దేశాలలో ఉన్నాయి. అయితే మనదేశంలో అన్నిటి కంటే ముందుగా ఆక్స్ ఫర్ట్, అస్ట్రాజెనికా తయారు చేస్తున్న వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర అధికారి ఒకరు తెలిపారు. ఈ సంవత్సరం చివరిలోగా ఈ కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని, అయితే స్థానికంగా తయారవుతున్న వ్యాక్సిన్ లను కూడా నిశితంగా గమనిస్తున్నామని, అవి కూడా త్వరలోనే మార్కెట్లోకి వస్తాయని ఆయన తెలిపారు.    అంతేకాకుండా ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కు, స్వదేశీ వ్యాక్సిన్ లు మార్కెట్లోకి రావడానికి మధ్య కేవలం కొన్ని వారాల గడువు మాత్రమే ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ లో ఉండడంతో దానికే ముందుగా అనుమతి లభిస్తుందని భావిస్తున్నామని అన్నారు. ఈ వ్యాక్సిన్ పై పుణె కేంద్రంగా పనిచేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ట్రయల్స్ నిర్వహిస్తూనే భారీ ఎత్తున తయారు చేసే ప్రక్రియలో ఉందని తెలిపారు. ప్రస్తుతం సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆక్స్ ఫర్ట్, అస్ట్రాజెనికా వ్యాక్సిన్ పై మూడవ దశ ట్రయల్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

సుశాంత్ సింగ్ మృతి‌ కేసులో కీలక పరిణామం

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో మహారాష్ట్ర సర్కార్‌ కు ఎదురుదెబ్బ తగిలింది. సుశాంత్ ఆత్మహత్య కేసును సీబీఐ దర్యాప్తుకు అప్పగిస్తున్నట్లు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.   సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య కేసు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. విచారణ సమయంలో మహారాష్ట్ర, బీహార్ పోలీసులు మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం కూడా విమర్శలకు తావిచ్చింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీహార్‌ ప్రభుత్వం కోరింది. బీహార్‌ సీఎం వినతి మేరకు కేసును ఇప్పటికే సీబీఐకి కేంద్రం అప్పగించింది. అయితే, సుశాంత్ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించడంపై మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ కేసును మహారాష్ట్ర పోలీసులే పూర్తి దర్యాప్తు చేస్తారని, సీబీఐ విచారణ అవసరమే లేదని తేల్చి చెప్పింది.   ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుశాంత్ సింగ్ మృతి కేసులో సీబీఐ విచార‌ణ అంశంపై ఈ రోజు సుప్రీం కోర్టులో విచారాణ జరిగింది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు పేర్కొంది. ఈ కేసులో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను సీబీఐకి అప్పగించాలని ముంబై పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా, మహారాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి సహకరించాలని, అవసరమైతే ఈ కేసును తాజాగా ఫైల్ చేయవచ్చన్న సౌలభ్యం కూడా కల్పించింది.

కరోనా కేసుల్లో ఏపీ రికార్డులు.. ఆగస్టు చివరి నాటికి మరో లక్ష!!

ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా విజృంభణ నానాటికీ పెరుగుతోంది. గత 11 రోజుల్లోనే మరో లక్ష కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడు లక్షలు దాటింది.   మంగళవారం కొత్తగా 9,652 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,06,261కి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మహారాష్ట్ర, తమిళనాడుల్లో మాత్రమే మూడు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ జాబితాలో ఏపీ చోటు దక్కించుకుంది. మూడు లక్షల కేసులు దాటిన మూడో రాష్ట్రంగా ఏపీ రికార్డు నమోదు చేసింది.   ఏపీలో తొలి లక్ష కరోనా కేసులకు 137 రోజులు పట్టింది. రెండో లక్ష కేసులు మాత్రం కేవలం 11 రోజుల్లోనే నమోదయ్యాయి. అనంతరం మూడో లక్ష కేసులు కూడా 11 రోజుల్లోనే వెలుగు చూశాయి. ఈ స్థాయిలో కేసులు మరే రాష్ట్రంలో నమోదు కావడం లేదు.    రోజువారీ కేసుల్లో ఏపీ టాప్‌ లో ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రోజుకు సగటున పదివేల కేసులు నమోదు కావడంలేదు. మహారాష్ట్రలోనూ రోజుకు సగటున 8 వేల కేసులు మాత్రమే వెలుగు చూస్తున్నాయి.   ఏపీలో కేసుల సంఖ్య ఇంకా పెరుగుతుందని ఆరోగ్యశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆగస్టు చివరి నాటికి మరో లక్ష మంది కరోనా బారిన పడినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు.    కరోనా విజృంభణలో దేశంలో అంత్యంత ప్రమాదకర రాష్ట్రాలలో ఒకటిగా ఏపీ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఏపీలో మరో అవినీతి తిమింగలం.. నేల మాళిగలో తవ్వే కొద్దీ బంగారం..

ఏపీలో మ‌రో అవినీతి తిమింగలం బయట పడింది. మరో అవినీతి అధికారి అక్ర‌మార్జ‌నలో ఏకంగా విశ్వ‌రూపం చూపించాడు. అనంత‌పురం జిల్లా బుక్క‌రాయ స‌ముద్రం ఎస్సీ కాల‌నీ‌లో.. ట్రెజ‌రీ ఉద్యోగికి డ్రైవ‌ర్‌గా ప‌నిచేసే వ్యక్తి బంధువు ఇంట్లో భారీ ఎత్త‌న ఖ‌జానా బ‌య‌ట‌ప‌డటం తాజాగా సంచ‌ల‌నం రేపింది. ఎదో పురాతన కాలంనాటి గుప్త నిధులు బ‌య‌ట‌ప‌డిన‌ట్టు.. త‌వ్వే కొద్ది కిలోల కొద్ది బంగారం, వెండి నిల్వ‌లు వెలుగుచూశాయి. దాదాపు 8 ట్రంకు పెట్టెల్లో దాచిన‌ బంగారం, వెండి వస్తువుల‌ను తవ్వి తీసి చూసిన పోలీసులే షాక్ తిన్నారు. అంతేకాకుండా ఇదంతా అక్ర‌మార్జ‌న అని తెలియ‌డంతో వాళ్ళు కూడా గుడ్లు తేలేశారు.   వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా ట్రెజ‌రీ ఆఫీసులో కొన్నేళ్ల కిత్రం కారుణ్య నియామ‌కం కింద మనోజ్‌కుమార్ ఉద్యోగం పొందాడు. ఈ అవినీతి అధికారి బుక్కరాయసముద్రం ఎస్సీ కాలనీలో ఉండే నాగలింగం అనే వ్య‌క్తిని త‌న కారు డ్రైవర్‌గా నియమించుకున్నాడు. అయితే మ‌నోజ్‌కుమార్ అవితీనిపై ఇటీవ‌ల అనేక‌ ఫిర్యాదులు వస్తుండడంతో పోలీసులు అత‌ని క‌ద‌లిక‌ల‌పై దృష్టి పెట్టారు. ఈ క్ర‌మంలో డ్రైవర్ నాగ‌లింగం మామ ఇంట్లో మ‌నోజ్‌కుమార్ దాచిన సొమ్ము విష‌యం తెలిసింది. అయితే అదేదో కొద్ది మొత్తంలో ఉంటుందిలే అనుకొని సోదాలు నిర్వహించిన పోలీసులు బయట పడ్డ నిధులను చూసి నోళ్లు వెళ్ళబెట్టారు. ప్రస్తుతం మనోజ్, నాగలింగంలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నాగలింగం బంధువు బాలప్ప ఇంట్లో ఆయుధాలు ఉన్నాయని తమకు సమాచారం అందిందని, సోదాలకు వెళితే, బంగారం దొరికిందని, ఈ విషయంలో లోతుగా విచారిస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు.

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా పాజిటివ్ 

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయన ప్రస్తుతం కడప జైల్లో ఉన్నారు. బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4గా మార్చి నడుపుతున్నారనే కేసులో అరెస్టయిన జేసీ ప్రభాకర్ రెడ్డి బెయిల్ మీద విడుదలై ఇంటికి వస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆయన కోవిడ్ 19 నిబంధనలను ఉల్లంఘించారని, జనంతో భారీగా ర్యాలీ నిర్వహించారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఒక దళిత పోలీసు అధికారిని దూషించిన కేసులో ఆయనను కడప జైలుకు తరలించారు. అయితే తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా సోకిందని తెలియడంతో తాడిపత్రి, అనంతపురం ప్రాంతంలో పోలీసు బందోబస్తును పెంచారు.   ఇది ఇలా ఉండగా జేసీ ప్రభాకర్ రెడ్డిని ఉంచిన కడప జైలులోని ఖైదీలు, సిబ్బంది సహా మొత్తం 700 మంది నమూనాలను పరీక్షించగా, అందులో 303 మంది ఖైదీలు, 14 మంది సిబ్బంది, అధికారులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో కరోనా పాజిటివ్ వచ్చిన వారందరినీ వెంటనే ఐసోలేషన్ కేంద్రానికి తరలించామని, వారికి చికిత్సను అందిస్తున్నామని జైలు సూపరింటెండెంట్ నాయక్ వెల్లడించారు.

నేను మోడీకి లెటర్ రాస్తే మధ్యలో ఈయన హడావిడి ఏంటంట.. ఏపీ డీజీపీ పై బాబు ఫైర్

ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం పై దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రధాని మోడీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఫోన్ ట్యాపింగ్ పై తాను చేసిన ఆరోపణలపై వెనక్కి తగ్గరాదని, దీనిపై మరింత పోరాటం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిసైడ్ అయ్యారు. దీనిలో భాగంగా ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది వైసీపీకి ఎప్పట్నించో ఉన్న అలవాటని అయన విమర్శించారు. గతంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఫోన్ ను కూడా వైసీపీ ట్యాప్ చేసిందని అయన ఆరోపించారు.   అంతేకాకుండా ఏపీలో ఫోన్ల ట్యాపింగ్ పై చర్యలు తీసుకోవాలంటూ తాను ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాస్తే, దాని పై ఏపీ డీజీపీ స్పందించడం విడ్డూరంగా ఉందని బాబు అన్నారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలు కావాలంటూ డీజీపీ తనకు లేఖ రాయడం పట్ల చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై సాక్ష్యాలు కోరుతున్న డీజీపీ గతంలో తాను రాసిన లేఖలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. తాజాగా ఇప్పుడు డాక్టర్ల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారని, రోగులతో ఫోన్ లో మాట్లాడాలన్నా డాక్టర్లు హడలిపోయే పరిస్థితి దాపురించిందని చంద్రబాబు వివరించారు.

ఫేస్‌బుక్ చీఫ్‌ జుక‌ర్‌బ‌ర్గ్‌ కు కాంగ్రెస్‌ పార్టీ లేఖ

భారత్ లో బీజేపీకి ఫేస్‌బుక్ మ‌ద్ద‌తుగా ప‌నిచేస్తోందంటూ అమెరికా వార్తా సంస్థ ద వాల్ స్ట్రీట్ జ‌ర్న‌ల్ క‌థ‌నం నేపథ్యంలో ఫేస్‌బుక్ చీఫ్‌ మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్‌ కు కాంగ్రెస్‌ పార్టీ లేఖ రాసింది. ద వాల్ స్ట్రీట్ జ‌ర్న‌ల్ రాసిన క‌థ‌నంపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌పాల‌ని కోరింది. త‌మ డిమాండ్‌కు ఇత‌ర రాజ‌కీయ పార్టీల మ‌ద్ద‌తు కూడా ఉంద‌ని తెలిపింది.    ఈ మేర‌కు కాంగ్రెస్‌ పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కేసీ వేణుగోపాల్ ఫేస్‌బుక్ ఓన‌ర్ జుక‌ర్‌బ‌ర్గ్‌ కు లేఖ రాశారు. హింసను ప్రేరేపించే కంటెంట్‌ను అనుమతించేందుకు ఫేస్‌బుక్ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ అంఖి దాస్‌ బీజేపీకి పావులా మారారని లేఖలో కాంగ్రెస్‌ ఆరోపించింది. భారత్ లో 40 కోట్ల మంది ఫేస్‌బుక్, వాట్సాప్ వినియోగాదారులు ఉన్నార‌ని, వారంద‌ని న‌మ్మ‌కాన్ని తిరిగి పొందాంటే నిష్పాక్షిక విచార‌ణ జ‌ర‌పాల‌ని కాంగ్రెస్‌ డిమాండ్ చేసింది.  కేసీ వేణుగోపాల్ రాసిన లేఖ‌ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఎన్నో పోరాటాలతో తాము సాధించుకున్న ప్రజాస్వామ్యాన్ని పక్షపాతం, నకిలీ వార్తలు, విద్వేష ప్రసంగాల ద్వారా దెబ్బతీసేందుకు తాము అనుమ‌తించ‌బోమ‌ని, దీనిపై భార‌తీయులంద‌రూ ప్రశ్నించాలని రాహుల్‌ పేర్కొన్నారు.

ఇళ్ల స్థలాల పై జగన్ సర్కార్ కు హైకోర్టు మరో షాక్

ఎపి సీఎం జగన్ ప్రభుత్వానికి కోర్టులలో ఎదురు దెబ్బల పరంపర కొనసాగుతోంది. నిన్న రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు పై సుప్రీం కోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రోజు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించిన అంశంలో ఎపి హైకోర్టు జగన్ సర్కార్ కు మరో షాక్ ఇచ్చింది. తాజాగా ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలకు చెందిన స్థలాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ తిరుమలగిరిలోని ట్రైబల్ పాఠశాల స్థలం ఇళ్ల పట్టాలుగా ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ కేసు పై తదుపరి విచారణను కోర్టు 8 వారాలకు వాయిదా వేసింది.   ఎపి ‌లో 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీఎం జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో అమరావతి భూములతో సహా రాష్ట్రంలోని పలు వివాదాలలో ఉన్న భూములు కూడా ఉన్నాయి. అమరావతి భూములు, ఇతర భూములకు సంబంధించి అనేక న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. అమరావతిలో భూములను పేదలకు ఇళ్ల స్థలాలుగా పంచాలన్న జగన్ సర్కారు నిర్ణయంపై అమరావతి రైతులు హైకోర్టుకు ఎక్కడంతో అక్కడ బ్రేక్ పడింది. హైకోర్టు నిర్ణయం మీద జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా అక్కడ కూడా సర్కారుకు చుక్కెదురైంది. ఇలా వరుస సమస్యల నేపథ్యంలో ఇప్పటికి ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా పడుతూ వస్తోంది. మొదట మహా నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా జూలై 8న ఇళ్ల పట్టాలు ఇవ్వాలనుకున్నారు. అయితే కోర్టు కేసుల నేపథ్యంలో వాయిదా వేసి ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇవ్వాలని ప్లాన్ చేశారు. కానీ, కోర్టు కేసుల కారణంగా మళ్లీ వాయిదా పడి అక్టోబర్ 2న గాంధీ జయంతి నాటికి ఇవ్వాలని తాజాగా ప్రభుత్వం ఆలోచిస్తోంది.

ఏపీలో 3 లక్షలు దాటిన కరోనా కేసులు 

ఏపీలో కరోనా కేసులు 3 లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9652 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,396 మందికి పాజిటివ్ అని తేలింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,06,261కి చేరింది. కరోనా కారణంగా రాష్ట్రంలో కొత్తగా 88 మంది మృత్యువాత పడ్డారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 14 మంది, ప్రకాశం జిల్లాలో 11 మంది కరోనాతో కన్నుమూశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 2820కి  చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 9211 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 2,18,311 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 85,130 యాక్టివ్ కేసులున్నాయి.  

ఐపీఎల్ కొత్త స్పాన్సర్ ఖ‌రారు

ఐపీఎల్ టైటిల్ స్పాన్స‌ర్ షిప్ హ‌క్కుల‌ను 'డ్రీమ్ 11' ద‌క్కించుకుంది. రూ.222 కోట్ల భారీ మొత్తం బిడ్ దాఖలు చేసి హ‌క్కుల‌ను పొందినట్లు ఐపీఎల్ చైర్మ‌న్ బ్రిజేష్ ప‌టేల్ తెలిపారు. బిడ్ లో టాటా అన్ అకాడ‌మీ, ప‌తంజ‌లి, రిల‌య‌న్స్ , బైజూస్, డ్రీమ్ 11 వంటి కంపెనీలు పోటీ పడ్డాయి. అయితే ఫైన‌ల్ గా డ్రీమ్ 11 స్పాన్స‌ర్ షిప్ ద‌క్కించుకుంది.   కాగా, ఇటీవల ఐపీఎల్ స్పాన్స‌ర్ షిప్ నుంచి చైనా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ వివో త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే. ఐపీఎల్ స్పాన్సర్ షిప్ కోసం 2018లో వివో ఐదేళ్లకు ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఐపీఎల్ టైటిల్‌ స్పాన్సర్‌గా వివో 2022 వరకు కొనసాగాల్సి ఉంది. అయితే, భారత్- చైనా మధ్య సరిహద్దు లో జరిగిన ఘర్షణ నేపథ్యంలో తాము ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ షిప్ హక్కుల నుండి తప్పుకుంటున్నట్లు వివో ప్రకటించింది.   దాంతో కొత్త స్పాన్సర్స్ వేటలో పడిన బీసీసీఐ ఈ నెల 10 న స్పాన్సర్‌షిప్ కోసం టెండర్స్ ను ఆహ్వానించింది. అప్పటినుండి ఈ ఏడాది ఐపీఎల్ స్పాన్సర్ ఎవరు అవుతారు అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తాజాగా ఆ ఆసక్తికి తెరపడింది. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులను డ్రీమ్ 11 ద‌క్కించుకుంది.   కాగా, ఈ ఏడాది మార్చి లో జరగాల్సిన ఐపీఎల్ 13వ సీజన్ కరోనా కారణంగా వాయిదాపడింది. ఆ తర్వాత యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఐపీఎల్ 13వ సీజన్ ను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఐపీఎల్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

నాలుగో బిగ్ బాస్ ఎవరు?.. ఏపీలో ఫోన్ ట్యాపింగ్ నిజమేనా?

ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. న్యాయమూర్తుల ఫోన్‌లు ట్యాపింగ్‌ వ్యవహారంపై హైకోర్టులో విచారణ కూడా జరుగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు చెప్పిన పాయింట్.. ఫోన్ ట్యాపింగ్ అనుమానాలను బలపరుస్తోంది.   దాదాపు రెండు నెలల క్రితం హైద‌రాబాద్ పార్క్ హయత్‌ హోట‌ల్‌ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్, కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ భేటీ సమయంలో పార్క్ హయత్‌ హోటల్లో ఏదో జరిగిందంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. "పార్క్ హయత్ లో కమ్మనైన ప్రజాస్వామ్యం. దుష్ట చతుష్టయంలో ముగ్గురు దొంగలు అడ్డంగా దొరికారు. ఫేస్ టైం లో మాట్లాడిన నాలుగో బిగ్ బాస్ ఎవరు? మరిన్ని వివరాలు అతి త్వరలో..." అంటూ విజయసాయి ట్వీట్ చేశారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రఘురామ కృష్ణంరాజు ఇప్పుడు ప్రశ్నల వర్షం కురిపించారు. ఫోన్ ట్యాపింగ్ జరగకపోతే ఫేస్ టైంలో ఎవరెవరు ఎవరితో మాట్లాడారనే విషయం విజయసాయి రెడ్డికి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి పెట్టిన ట్వీట్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. తన ఫోన్ కూడా ట్యాపింగ్ కి గురైందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రమేయం ఉండకపోవచ్చని, అయితే ట్యాపింగ్ కు పాల్పడిన వ్యక్తులు ఎవరో తేల్చాలని కోరారు.  అంతేకాదు, ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఎలాంటి చర్యలు తీసుకోకుంటే ఈ అంశాన్ని తాను కచ్చితంగా పార్లమెంట్‌లో లేవనెత్తుతాని రఘురామ కృష్ణంరాజు హెచ్చరించారు.   రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యలు ఫోన్ ట్యాపింగ్ అనుమానాలను బలపరిచేలా ఉన్నాయి. పార్క్ హయత్‌ హోట‌ల్‌ లో ముగ్గురు భేటీ అయిన విషయం అందరికి తెలిసిందే. కానీ, నాలుగో వ్యక్తి ఫేస్ టైం లో మాట్లాడినట్టు విజయసాయికి ఎలా తెలుసు? అంటే, నిజంగానే ట్యాపింగ్‌ కి పాల్పడుతున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యలు అందరిని ఆలోచనలో పడేలా చేశాయి. మరి ఈ విషయంపై విజయసాయి ఎలా స్పందిస్తారో చూడాలి.

ఏడాది లోపే నిర్మాణం పూర్తిచేసేలా.. రిటైర్డ్ ఇంజనీర్ నియామకం

తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయాన్ని కట్టితీరాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే పలుమార్లు జరిగిన చర్చల్లో డిజైన్ ఖరారు చేశారు. ఏడాదిలోగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. అందుకు అనుగుణంగానే త్వరితగతిన ఈ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు వీలుగా రోడ్డు భవనాల శాఖలో కొత్త పోస్టు సూపరింటెండెంట్ ఇంజనీర్ సూపర్ న్యూమరరీను సృష్టించారు. ఈ పోస్టులో రిటైర్డ్ ఇంజనీర్ ఎం. సత్యనారాయణను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయం నిర్మాణం పూర్తి అయ్యే వరకు లేదా ఏడాది వరకు ఈ పోస్టులో ఆయన కొనసాగుతారు.   కొత్త సచివాలయ భవనిర్మాణ డిజైన్ ను ఆగస్టు 5న జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదించారు. గతంలో ఆరు అంతస్తుల్లో భవననిర్మాణం ఉండాలని అనుకున్నా స్పల్పమార్పులు చేస్తూ ఏడు అంతస్తుల్లో సచివాలయాన్ని నిర్మించేలా డిజైన్లో మార్పులు చేశారు. ఈ మేరకు అధికారులతో ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చర్చలు నిర్వహిస్తున్నారు.   జూలై 7 కూల్చివేత పనులను ప్రారంభించింది. కూల్చివేత సమయంలోనూ హైకోర్టు పలుమార్లు స్టే విధించినా ఆ తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కూల్చివేత పనులు ఇప్పటికే పూర్తి అయ్యాయి. భవనాల శిధిలాల తొలగింపు ప్రక్రియ వేగవంతం చేశారు. త్వరలోనే టెండర్లను పిలిచి నిర్మాణం ప్రారంభిస్తారు.   నిర్మాణ వ్యయం ఐదు వందల కోట్లు కొత్త సచివాలయ భవన నిర్మాణ అంచనా వ్యయం ఐదు వందల కోట్లు. అత్యంత ఆధునిక హంగులతో ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవన సముదాయం నిర్మిస్తారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, సలహాదారుల చాంబర్స్ కూడా అన్ని సౌకర్యాలతో ఉండనున్నాయి. ఆయా శాఖల మంత్రుల కార్యాలయాలతో పాటు కార్యదర్శుల కార్యాలయాలు, సెక్షన్ ఆఫీస్ లు, మీటింగ్ హాల్స్, వెయిటింగ్ హాల్స్, డైనింగ్, పార్కింగ్ సదుపాయాలతో కొత్త సచివాలయం నిర్మించనున్నారు.

ఫోన్ ట్యాపింగ్‌ పై ఎందుకు ద‌ర్యాప్తు జ‌ర‌ప‌కూడ‌దు: ఏపీ హైకోర్టు

ఫోన్ ట్యాపింగ్‌పై ఏపీ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. జ‌డ్జిలపై నిఘా ఉంచార‌ని, ఫోన్స్ ట్యాప్ చేస్తున్నార‌ని మీడియాలో వ‌చ్చిన క‌థ‌నాల‌తో అడ్వ‌కేట్ శ్ర‌వ‌ణ్ కుమార్ దాఖ‌లు చేసిన పిటిషన్‌ ను చీఫ్ జస్టిస్ మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఫోన్ ట్యాపింగ్‌పై విచారణకు ఆదేశిస్తే ఇబ్బందేమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.    అఫిడవిట్‌లో ఉన్న మీడియా కథనాన్ని చదివి వినిపించాలని హైకోర్టు కోరింది. ఐదుగురు జ‌డ్జిల ఫోన్లు ట్యాపింగ్‌కు గురయ్యాయని, జ‌డ్జిల క‌ద‌లిక‌ల‌పై ఒక అధికారిని ప్రత్యేకంగా ప్ర‌భుత్వం నియ‌మించింద‌ని కోర్టుకు న్యాయవాది శ్రవణ్ విన్నవించారు. ఆ అధికారి ఎవరో చెప్పాలని, ఆధారాలు చూపాలని ధర్మాసనం అడగగా.. తాను అధికారి పేరుతో అఫిడవిట్ దాఖలు చేస్తానని న్యాయవాది శ్రవణ్ చెప్పారు. అన్ని వివరాలతో అఫిడవిట్‌ను ఫైల్ చేయాలని శ్రవణ్‌ ను హైకోర్టు ఆదేశించింది.    మ‌రోవైపు ఈ అంశంపై ఎందుకు ద‌ర్యాప్తు జ‌ర‌ప‌కూడ‌దో చెప్పాల‌ని ప్ర‌భుత్వాన్ని హైకోర్టు ప్ర‌శ్నించింది. ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేసినా అది చిన్న విషయం కాదని.. దర్యాప్తుకు ఆదేశిస్తే అసలు విషయాలు బయటపడతాయి కదా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై ఏమైనా అభ్యంతరం ఉందా అని ప్రభుత్వం తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం తరపున అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ మొత్తం అంశంపై కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని టెలికాం స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌కు, కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు రెండు రోజుల గ‌డువు ఇస్తూ.. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

కేసీఆర్ సర్కార్‌ పై గవర్నర్‌ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్‌ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. కరోనా నియంత్రణలో కేసీఆర్ సర్కార్‌ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా కట్టడిలో కేసీఆర్ సర్కార్ క్రియాశీలకంగా వ్యవహరించలేదని, కరోనా ఉధృతిని ప్రభుత్వం అంచనా వేయలేకపోయిందని అన్నారు. కరోనా తీవ్రత, వ్యాప్తిపై ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ.. ఐదారు లేఖలు రాసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనలేదని గవర్నర్ పేర్కొన్నారు.   కరోనా బాధితులు ప్రభుత్వాస్పత్రుల్లో సదుపాయాలు లేక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారని అన్నారు. అన్ని వసతులు సమకూర్చామని ప్రభుత్వం చెబుతున్నా.. ప్రభుత్వాస్పత్రుల పట్ల రోగులు ఆసక్తి చూపట్లేదని తెలిపారు. సీఎం కేసీఆర్‌ తో సమావేశమైనప్పుడు ఈ విషయాలను గట్టిగానే చెప్పానని గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించారు.   కేసీఆర్ సర్కార్ పై గవర్నర్‌ తమిళిసై తాజా వ్యాఖ్యలు చూస్తుంటే.. తెలంగాణలో బలపడటానికి బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తోంది. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా కేసీఆర్ ఆరేళ్ళ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు బండి సంజయ్ కూడా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి దూకుడు పెంచారు. అవకాశం దొరికినప్పుడల్లా కేసీఆర్ పాలనా వైఫల్యాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తమిళిసై కూడా గవర్నర్ గా తన మార్క్ చూపిస్తూనే.. ఇప్పుడు ఏకంగా జాతీయ మీడియా సాక్షిగా కరోనా కట్టడిలో కేసీఆర్ సర్కార్ విఫలమైందని వ్యాఖ్యానించారు. చూస్తుంటే బీజేపీ అన్ని వైపుల నుండి కేసీఆర్ సర్కార్ ని గట్టిగానే టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. మరి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తోన్న బీజేపీ ఎంతవరకు విజయం సాధిస్తుందో చూడాలి. 

సెప్టెంబర్ 7 నుంచి వర్షాకాల సమావేశాలు

కోవిద్ నియమాలకు అనుగుణంగానే ఏర్పాట్లు   తెలంగాణ రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7 నుంచి జరగనున్నాయి. ఈమేరకు  సోమవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ పలువురు మంత్రులతో చర్చించారు. 20రోజుల పాటు నిర్వహించే ఈ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా, శాసన సభ్యులు భౌతిక దూరం పాటించేందుకు అనుగుణంగా అసెంబ్లీ హాలులో ఏర్పాట్లు చేయనున్నారు.  అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు ఈ ఏర్పాట్లను సమీక్షిస్తారు.   అసెంబ్లీ సమావేశాలలో ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, కరోనా ప్రభావం, వర్షాలు, పెరిగిన వ్యవసాయ సాగు, విద్యాసంవత్సరం ప్రారంభం తదితర ముఖ్యమైన అంశాలను చర్చిస్తారు. పలు బిల్లులు, తీర్మానాలతో పాటు రాష్ట్ర  ప్రభుత్వ విధాన నిర్ణయాలకు సంబంధించిన అనేక అంశాలను కూడా అసెంబ్లీ వేదికగా ప్రకటిస్తారు.   కరోనాను అరికట్టడంలో అధికార పార్టీ విఫలం అయ్యిందని, శాసనసభలో ఈ అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతోంది. కరోనాతో ప్రజలంతా అల్లాడుతుంటే ఆగమేఘాల మీద సచివాలయం కూల్చడాన్ని కూడా సభలో లేవనెత్తనున్నారు. కృష్ణాజలాల తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ఎండకట్టేందుకు భారతీయ జనతాపార్టీ ప్రణాళిక సిద్దం చేస్తోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ ఉదాసీన వైఖరిని ప్రశ్నిస్తున్న బిజేపి రాష్ట్ర నాయకులు అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించనున్నారు.

గన్నవరం ఎయిర్ పోర్ట్ భూములలో నాట్లు వేసిన రైతులు

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరం విమానాశ్రయం విస్తరణకు రైతులు తమ భూములు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎపి రాజధాని అమరావతి భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారడంతో విమానాశ్రయ అభివృద్ధికి భూములిచ్చిన రైతులు కూడా తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. గత ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీల అమలులో వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా వారు ఇచ్చిన భూముల్లో మళ్ళీ సాగు చేపట్టి సవాల్ విసిరారు. తాజాగా విమానాశ్రయ అభివృద్ధికి ఇచ్చిన భూముల్లో తిరిగి వ్యవసాయం చేయటానికి రైతులు సిద్ధమయ్యారు. కొందరు రైతులు దమ్ము చేసి నారుమళ్లు కూడా వేశారు. ఇప్పటికే విమానాశ్రయ స్వాధీనంలో ఉన్న ఈ భూముల్లో రైతులు సాగు చేపట్టడంతో ఎయిర్‌ పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉండిపోయింది. ఈ వ్యవహారం పై రైతులతో చర్చలు జరుపుతున్నా కూడా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది.   రాష్ట్ర విభజనకు ముందు గన్నవరం ప్రాంతం లో రియల్‌ భూమ్‌ ఉండడంతో భూముల ధరలు భారీగా ఉండేవి. ఇలాంటి పరిస్థితిలో రాష్ట్ర విభజన జరగటంతో పాటు టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేయటంతో విజయవాడ విమానాశ్రయానికి ప్రాధాన్యం పెరిగింది. విభజన చట్టంలో విజయవాడ విమానాశ్రయ అభివృద్ధికి కృషి చేస్తామని కేంద్రం పేర్కొంది. దీనిని దృష్టిలో పెట్టుకుని అప్పటి టీడీపీ ప్రభుత్వం విమానాశ్రయ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న భూముల సమస్యను పరిష్కరించింది. దీనికి అవసరమైన 700 ఎకరాల భూములను ఎయిర్‌పోర్టు అథారిటీకి అప్పగించింది. అయితే అప్పట్లో రైతులు తమ భూములు ఇవ్వటానికి మొదట నిరాకరించినా.. రాష్ట్ర ప్రభుత్వ జోక్యం చేసుకుని అమరావతి రైతులకు ఇచ్చే ప్యాకేజీ ఇస్తామని అప్పటి సీఎం చంద్రబాబు హామీ ఇవ్వటంతో రైతులు స్వచ్ఛందంగా తమ భూములు అప్పగించారు. రైతులకు ఏటా ఇచ్చే కౌలుతో పాటు కమర్షియల్‌, రెసిడెన్షియల్‌ ప్లాట్లు, ఇతర సదుపాయాలు కల్పించేందుకు అంగీకరించారు. ఈ క్రమంలో తమ స్వాధీనంలోకి తీసుకున్న భూముల్లో ఎయిర్‌పోర్టు అథారిటీ విస్తరణ పనులు చేపట్టింది. గన్నవరం ప్రాంత రైతుల ప్యాకేజీలో భాగంగా రాజధానిలో కమర్షియల్‌, రెసిడెన్షియల్‌ ప్లాట్ లు, యాన్యుటీ వంటి సౌకర్యాలు కల్పించడానికి అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే ఎన్నికల నాటికి మూడొంతుల మంది రైతులకు అమరావతిలో ప్లాట్లు కూడా కేటాయించారు.   అయితే ఎన్నికల తరువాత వైసీపీ ప్రభుత్వం విమానాశ్రయ రైతుల సమస్యలను పూర్తిగా పక్కన పెట్టేసింది. అప్పటికే ప్లాట్లు కేటాయించగా మిగిలిపోయిన రైతులకు ప్లాట్ల కేటాయింపు అటకెక్కింది. దీనికి సంబంధించి దాదాపు 108 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉన్నా ఇప్పటివరకు ఈ విషయంలో ఎటువంటి ప్రగతి లేదు. ఇది ఇలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులను తెరపైకి తేవడంతో అమరావతిలో భూముల ధరలు దారుణంగా పడిపోయాయి. దీంతో అమరావతి నుంచి పరిపాలనా కేంద్రం తరలిపోతే తమ త్యాగానికి కూడా విలువ లేకుండా పోతుందని.. తాము ఖరీదైన భూములను విమానాశ్రయ అభివృద్ధికి ఇచ్చామని, ఐతే ప్యాకేజీలో భాగంగా అమరావతిలో ఇచ్చిన ప్లాట్లకు విలువ లేకపోవటంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   దీంతో రన్‌వేకు సమీపంలో విమానాశ్రయం స్వాధీనంలో ఉన్న తమ భూముల్లో తాజాగా రైతులు దుక్కి దున్ని, దమ్ము చేసి వరినాట్లు వేస్తున్నారు. నూతన రన్‌వే వెంట ఉన్న నేవిగేషన్‌ కంట్రోల్‌ స్టేషన్‌ దగ్గర ఉన్న భూముల్లో వారు సాగు చేపట్టారు. ఈ పరిణామంతో ఎయిర్‌పోర్టు అధికారులు ఉలిక్కి పడ్డారు. రైతులతో చర్చలు సాగిస్తున్నా ఫలితం కనిపించలేదు. ఒకవేళ బలవంతంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తే.. రైతులు కోర్టును ఆశ్రయిస్తారని, అప్పుడు సమస్య జఠిలమవుతుందని, సామరస్యంగా చర్చలు జరుపుతున్నారు. అయితే ఇప్పటికే అమరావతి రైతులు కోర్టు బాట పట్టగా, తాజాగా తమకు జరుగుతున్న అన్యాయంపై గన్నవరం ప్రాంత రైతులు కూడా న్యాయపోరాటానికి సిద్ధమౌతున్నారు. ఇప్పటికే తమ సమస్యల పరిష్కరించటానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి పైగా సమయం ఇచ్చి ఓపికతో ఎదురు చూసామని, ఐతే తమ సమస్యలకు పరిష్కారం చూపకపోవడంతో ఇక న్యాయస్థానాన్ని ఆశ్రయించటానికి సిద్ధమవుతున్నారు.