రోహిత్ శర్మకు ఖేల్ రత్న.. తెలుగుతేజం సాయిరాజ్ కు అర్జున

క్రీడల్లో అత్యున్నతమైన అవార్డు రాజీవ్ ఖేల్‌రత్నకు అర్హత సాధించిన వారి జాబితాను కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఈ జాబితాలో క్రికెటర్ రోహిత్ శర్మ, రెజ్లర్ వినేష్ ఫోగట్, టెబుల్ టెన్నిస్ ఛాంపియన్ మనికా బాత్రా, 2016 పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ మరియప్పన్ తంగవేలు, హాకీ క్రీడాకారిణి రాణి రాంపాల్ ఉన్నారు. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుకు అర్హత సాధించిన అభ్యర్థులకు అవార్డులను రాష్ట్రపతి అందజేయనున్నారు.    కాగా, క్రికెట్‌లో రోహిత్ శర్మ కంటే ముందు సచిన్ టెండూల్కర్ 1998లో, అలాగే ధోని 2007లో, విరాట్ కోహ్లీ 2018లో రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు అందుకున్నారు.   అర్జున అవార్డు, ధ్యాన్ చంద్ అవార్డు, ద్రోణాచార్య అవార్డులకు అర్హత సాధించిన వారి పేర్లను కూడా కేంద్రం ప్రకటించింది. అర్జున అవార్డుకు క్రికెటర్లు ఇషాంత్ శర్మ, దీప్తి శర్మ, అథ్లెట్ ద్యుతి చంద్, షూటర్ మను భాస్కర్‌తో పాటు మరో 27 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. అర్జున అవార్డు విజేతల్లో తెలుగుతేజం, బ్యాడ్మింటన్ యువ కెరటం సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి కూడా ఉన్నాడు. సాత్విక్ సాయిరాజ్ డబుల్స్ లో ప్రపంచస్థాయిలో పదో ర్యాంకులో ఉండడం విశేషం. 

శ్రీశైలం పవర్‌ ప్లాంట్‌ ప్రమాదంలో 9 మంది మృతి

శ్రీశైలం పవర్‌ ప్లాంట్‌ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. అగ్ని ప్రమాదంలో లోపల చిక్కుకున్న తొమ్మిదిమందీ మృత్యువాత పడ్డారు. ఈ మేరకు తెలంగాణ జెన్‌ కో అధికారులు ప్రకటించారు. ప్రమాద సమయంలో 17 మంది ఉద్యోగులు ప్లాంట్‌లో ఉన్నారు. 9 మంది దురదృష్టవశాత్తు మంటల్లో చిక్కుకుని చనిపోయారు. మరో 8 మంది సురక్షితంగా బయటపడ్డారు. మృతుల వివరాలు: డీఈ శ్రీనివాస్ గౌడ్ (హైదరాబాద్) ఏఈ వెంకట్‌రావు (పాల్వంచ)  ఏఈ మోహన్ కుమార్ (హైదరాబాద్ ) ఏఈ ఉజ్మ ఫాతిమా (హైదరాబాద్) ఏఈ సుందర్ (సూర్యాపేట)  ప్లాంట్ అటెండెంట్ రాంబాబు (ఖమ్మం జిల్లా)  జూనియర్ ప్లాంట్ అటెండెంట్ కిరణ్ (పాల్వంచ)  హైదరాబాద్‌కు చెందిన అమర్ రాజా బ్యాటరీ కంపెనీ సిబ్బంది వినేష్ కుమార్, మహేష్ కుమార్ 

ఏపీ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు..!!

ఏపీ పాలిటిక్స్‌లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హాట్‌ టాపిక్‌ గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో మొత్తం 16 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న వారిలో సీబీఐతో పాటు సర్వీస్ ప్రోవైడర్లు ఉన్నారు. సీబీఐ, రిలయన్స్, జియో, వోడాఫోన్, ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్‌ఎల్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అసోషియేషన్ అధ్యక్షుడికి హైకోర్టు నోటీసులిచ్చింది. నాలుగు వారాల్లో సమాధానాలు చెప్పాలని.. వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా హాజరుకావాలని వారికి ఆదేశాలిచ్చింది.    కాగా, జ‌డ్జిలపై నిఘా ఉంచార‌ని, ఫోన్స్ ట్యాప్ చేస్తున్నార‌ని మీడియాలో వ‌చ్చిన క‌థ‌నాల‌తో అడ్వ‌కేట్ శ్ర‌వ‌ణ్ కుమార్ దాఖ‌లు చేసిన పిటిషన్‌ ను చీఫ్ జస్టిస్ మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించిన సంగతి తెలిసిందే. అఫిడవిట్‌లో ఉన్న మీడియా కథనాన్ని చదివి వినిపించాలని హైకోర్టు కోరింది. ఐదుగురు జ‌డ్జిల ఫోన్లు ట్యాపింగ్‌కు గురయ్యాయని, జ‌డ్జిల క‌ద‌లిక‌ల‌పై ఒక అధికారిని ప్రత్యేకంగా ప్ర‌భుత్వం నియ‌మించింద‌ని కోర్టుకు న్యాయవాది శ్రవణ్ విన్నవించారు. ఆ అధికారి ఎవరో చెప్పాలని, ఆధారాలు చూపాలని ధర్మాసనం అడగగా.. తాను అధికారి పేరుతో అఫిడవిట్ దాఖలు చేస్తానని న్యాయవాది శ్రవణ్ చెప్పారు. అన్ని వివరాలతో అఫిడవిట్‌ను ఫైల్ చేయాలని శ్రవణ్‌ ను హైకోర్టు ఆదేశించింది. అలాగే, ఈ మొత్తం అంశంపై కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను కూడా హైకోర్టు ఆదేశించింది.   హైకోర్టు ఆదేశించిన నేపధ్యంలో తాజాగా న్యాయవాది శ్రవణ్ కుమార్ అనుబంధ అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఈ అనుబంధ అఫిడవిట్‌లో ప్రభుత్వం ప్రత్యేకంగా ట్యాపింగ్ కోసం నియమించిన అధికారి పేరును, అలాగే కొంత మంది సర్వీస్ ప్రొవైడర్ల వద్ద నుంచి కాల్ డేటాను ఎలా సేకరించారో వివరించే ఆధారాలను సమర్పించినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాలను పరిశీలించిన ధర్మాసనం.. 16 మందికి నోటీసులు జారీ చేసింది.   న్యాయవాది శ్రవణ్ కుమార్ అఫిడవిట్‌ లో ఏం చెప్పారన్న విషయం బయటకు రాకపోయినప్పటికీ.. ఆయన సమర్పించిన వివరాలతో.. హైకోర్టు 16 మందికి నోటీసులు ఇవ్వడంతో ఆధారాలు బలంగానే ఉండి ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, నాలుగు వారాల తర్వాత కేసు విచారణకు రానుంది. అప్పుడు విచారణ కీలక మలుపులు తిరిగే అవకాశం ఉంది.

ప్రజల నుంచి ఎన్టీఆర్ ను దూరం చేయడం మీ తరం కాదు

గుంటూరు జిల్లా తెనాలిలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై టీడీపీ నేత నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలగొడితే కూలిపోవడానికి, ధ్వంసంచేస్తే ధ్వంసమైపోవడానికి ఆయన విగ్రహం కాదు ప్రజల మనస్సులో కొలువైన దైవం అని పేర్కొన్నారు.    స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి విగ్రహాలు లేకుండా చేయడం ద్వారా ప్రజలకు ఆయన్ని దూరం చేయగలమని సైకో మనస్తత్వంతో ఉన్న వైఎస్ జగన్, వైసీపీ నాయకులు అనుకుంటున్నారని విమర్శించారు. ప్రజల నుంచి ఎన్టీఆర్ ను దూరం చేయడం మీ తరం కాదని అన్నారు. తెనాలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి రాక్షస ఆనందం పొందిన వారిని అరెస్ట్ చేసి శిక్షించాలి అని లోకేష్ డిమాండ్ చేశారు. కాగా, గత కొంతకాలంగా ఏపీలో ఎన్టీఆర్ విగ్రహాల్ని ధ్వంసం చేస్తున్న, తొలగిస్తున్న ఘటనలు చాలా చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల నెల్లూరు జిల్లాలోని కావలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించడంపై తీవ్ర దుమారం రేగింది. అధికార పార్టీపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ సహా ఇతర  టీడీపీ నేతలు సీరియస్ గా తీసుకున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే.. బాలకృష్ణకు ఫోన్ చేసి, తానూ ఎన్టీఆర్ అభిమానినేనని, విగ్రహం ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.   నిజానికి కావలిలో ఎన్టీఆర్‌ విగ్రహాం తొలగింపుపై పలువురు వైసీపీ నేతలు సైతం ఆవేదనకు గురయ్యారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై మనస్తాపానికి గురై వైసీపీ సీనియర్ నాయకుడు కండ్లగుంట మధుబాబు నాయుడు, కావలి మాజీ కౌన్సిలర్ గంగినేని పద్మావతి వంటి నాయకులు పార్టీకి రాజీనామా చేశారు.   కులాలకు, పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా ఎన్టీఆర్‌ ని అభిమానించే వాళ్ళు ఎందరో ఉంటారు. ఆ విషయాన్ని మరిచి కొందరు ఎన్టీఆర్ విగ్రహాల్ని ధ్వంసం చేయడం, తొలిగించడం వంటివి చేసి విమర్శలు పాలవుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

శ్రీశైలం ప్రమాదంపై సీఐడీ విచారణకు సీఎం ఆదేశం

శ్రీశైలం పవర్ ప్లాంటులో జరిగిన అగ్నిప్రమాదంపై సీఐడీ విచారణకు సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. విచారణాధికారిగా సీఐడీ అడిషనల్‌ డీజీపీ గోవింద్‌సింగ్‌ ‌ను నియమించారు. ప్రమాదానికి గల కారణాలను వెలికి తీయాలని, ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులు బయటకు రావాలని చెప్పారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో సీఐడీ అడిషనల్ డీజీపీ గోవింద్ సింగ్ ను విచారణ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.   శ్రీశైలం పవర్ ప్లాంటులో జరిగిన ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిక్కుకున్నవారిని ర‌క్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి ప్రభుత్వ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సీఎం ఆదేశించారు.   కాగా, ప్రమాదంలో 9 మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే, ఏఈ సుందర్‌ నాయక్‌ (35) మృతదేహాన్ని రెస్క్యూ బృందం గుర్తించింది. మిగతా 8 మంది కోసం రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. అలాగే ఈ ప్రమాదంలో పలువురు గాయాలపాలయ్యారు.

స్వీడన్ లో ఎంపీల జీతమెంతో తెలుసా..!

ప్రైమరీ టీచర్ జీతం కన్నా తక్కువే..   కాఫీకి కూడా బిల్లు చెల్లించాల్సిందే ..!   అధికారం ఉన్నవారు జవాబుదారీగా ఉండాలి. ప్రజా ప్రతినిధులకు, ప్రభుత్వానికి సంబంధించిన పూర్తి సమాచారం ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉండాలి అన్నది స్వీడన్ లో మనం చూస్తాం. ఇక్కడి ప్రజాప్రతినిధుల జీతభత్యాలను, వారి జీవనవిధానాన్ని పరిశీలిస్తే షాక్ కావల్సిందే..   స్వీడిష్ ఎంపీలకు కార్యదర్శులు ఉండరు. వారి వేతనాలు కూడా చాలా తక్కువ. అంతేకాదు.. పార్లమెంటరీ క్యాంటిన్ లో వారు తాగే కాఫీకి కూడా బిల్లు వారి జేబు నుంచి చెల్లించాల్సిందే..   స్వీడిష్ పార్లమెంటు లో కేవలం మూడు కార్లు మాత్రమే ఉంటాయి. అవి కేవలం అధికారిక పర్యటనల కోసం మాత్రమే ఉపయోగించాలి. స్వీడిష్ ఎంపీలు ప్రజా రవాణా సౌకర్యాల కోసం ఎదురుచూడాల్సిందే. వారికి ఇయర్లీ టికెట్ జారీ చేస్తారు. 1957 వరకు ప్రజాప్రతినిధులకు వేతనాలు కూడా లేవు. ఆ తర్వాతే వారికి వేతనం ఇస్తున్నారు. ఇది అక్కడి కరెన్సీలో నెలకు 40వేల స్వీడిష్ క్రోనాలు(3,22,000 రూపాయలు) ఇది అక్కడ పనిచేసే ఒక ప్రైమరీ టీచర్ జీతం కన్నా తక్కువ. అంతకు మించి వారికి ఓవేతనం వచ్చే అవకాశం లేదు.   ఎంపీల నివాసం కోసం అపార్ట్ మెంటు సదుపాయాలు కల్పిస్తారు. అవి కూడా దేశ రాజధాని స్టాక్ హోమ్ వెలుపలే ఉంటాయి. ఇవి 45 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండే ఒక రూం ప్లాట్స్ మాత్రమే. విడిగా బెడ్ రూం అంటూ ఉండదు. వాషింగ్ మిషిన్, డిష్ వాషర్ గాని ఉండవు. ఎంపీలు వారి స్నేహితులను ఇక్కడికి అనుమతించకూడదు. వారి కుటుంబ సభ్యులైనా వచ్చి వుండేందుకు వీలు లేదు. ఎవరైనా వచ్చి ఒక రోజు ఉన్నా అందుకు అయ్యే ఖర్చు ఎంపీనే భరించాలి.   పార్లమెంటు కేఫటేరియాలో వెయిటర్స్ ఉండరు. ఎంపీలు వారికి కావల్సిన ఆహారాన్ని వారే డబ్బు చెల్లించి తీసుకోవాలి. తిన్న తర్వాత వారి ప్లేట్స్ వారు శుభ్రం చేయాలి.   ఎంపీలకు కార్యదర్శులు, వ్యక్తిగత సిబ్బంది ఉండరు. పార్టీ పరంగా మాత్రమే నియమించే కార్యదర్శులకు నిర్ధిష్ట మొత్తం వేతనంగా ఉంటుంది. ఎవరికీ వారు వ్యక్తిగతంగా నియామకాలు చేసుకోవడానికి వీలులేదు. తమ కార్యక్రమాల షెడ్యూల్ ను స్వయంగా వారే తయారుచేసుకోవాలి. అంతేకాదు వారికి వచ్చే ఫోన్ కాల్స్ కూడా వారే మాట్లాడాలి.   పార్లమెంటు భవనం ఆవరణలో వార్తపత్రికలు, మ్యాగజైన్స్ మాత్రం ఉచితంగా అందుబాటులో ఉంటాయి. మిగతా ఎంపీలతో కలిసి వాటికి షేర్ చేసుకోవాలి. అన్ని ప్రముఖ మీడియాల వార్తప్రతికలకు పార్లమెంటే చందా చెల్లిస్తుంది. ఎంపీలు ఎటైనా అధికారిక పర్యటనకు వెళ్ళాల్సి ఉన్నప్పుడు అతి తక్కువ ఖర్చు అయ్యే రవాణా వ్యవస్థను ఎంచుకోవాలి. ప్రైవేటు కారు అద్దెకు తీసుకున్నప్పుడు తక్కువ దూరం చూపించే మార్గంలోనే వెళ్లాలి. ఒకవేళ విదేశాలకు వెళ్లాల్సి వస్తే వారి మొత్తం పర్యటన ఖర్చు 50వేల స్వీడిష్ క్రోనాలు(4,30,000 రూపాయలు)లోపే ఉండాలి. మాజీ ఎంపీలకు జీవితాంతం ఫించన్ ఉండదు. పదవీ విరమణ తర్వాత రెండు సంవత్సరాలు వారి వేతనంలో 85శాతం ఇస్తారు. ఆ లోగా వారు కొత్త ఉద్యోగంలో చేరాలి.   ప్రాంతీయ రాజకీయ నాయకులకు ఈ మాత్రం జీతాలు కూడా ఉండవు. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికవ్వడం ప్రజలకు మంచి చేయడానికి అని భావిస్తారు. ఇందుకోసం ప్రతిఫలం ఆశించరు. ప్రజలకు సేవ చేయడం అనేది ప్రతిష్టాత్మకంగా భావించరు. దీనిని లాభదాయకంగా కూడా చూడరు.   ఇలాంటి నియమాలు పాటిస్తున్నారు కాబట్టే అక్కడ అవినీతికి ఆస్కారం లేదు. నాణ్యమైన జీవనశైలి, ఆరోగ్యం, విద్య, పౌర హక్కుల రక్షణ, సమానత్వం,  మానవ అభివృద్ధి వంటి అనేక అంశాల్లో స్వీడన్ ముందుంది.

సీఎం జగన్ శ్రీశైలం పర్యటన రద్దు.. జరిగింది ప్రమాదమా? కుట్రా?

ఏపీ సీఎం వైఎస్ జగన్ శ్రీశైలం పర్యటన రద్దు అయింది. తెలంగాణ లెఫ్ట్ పవర్ హౌస్‌ లో అగ్నిప్రమాదం సంభవించడం వల్ల జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు సీఎంవో అధికారులు ప్రకటించారు.   శ్రీశైలంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతున్న సందర్భంగా.. రాయలసీమతో పాటు పలు ప్రాజెక్టులకు తాగు, సాగునీటి అవసరాలకు నీటి తరలింపు అంశంతో పాటు, ప్రాజెక్టు వద్ద పరిస్థితులను సమీక్షించేందుకు, అక్కడ పూజలు నిర్వహించేందుకు ఇవాళ సీఎం జగన్ శ్రీశైలం వెళ్లాల్సి ఉంది. అయితే శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ పరిధిలో ఉన్న లెఫ్ట్ పవర్ హౌస్‌ లో గత రాత్రి అగ్నిప్రమాదం సంభవించిన విషయాన్ని సీఎంఓ అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడకు వెళ్లి పూజలు నిర్వహించండం, సమీక్షా సమావేశాలు నిర్వహించడం సబబుకాదని సీఎం భావించినట్టు తెలుస్తోంది. తెలంగాణ విద్యుత్‌ కేంద్రంలో జరిగిన ప్రమాదం పట్ల జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం నుంచి, యంత్రాంగం నుంచి.. తెలంగాణ అధికారులకు అవసరమైన సహాయం అందించాలని సీఎం ఆదేశాలు జారీచేశారు.   కాగా, నాగర్‌కర్నూల్ జిల్లాలోని  శ్రీశైలం ప్రాజెక్టు లెఫ్ట్ పవర్ హౌస్ లో షాట్ సర్క్యూట్ కారణంగా భారీ ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఎగిసిపడడంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. ప్రమాద సమయంలో 17 మంది ఉద్యోగులు విధుల్లో ఉండగా 8 మంది సొరంగం నుంచి బయటకు పరుగులు తీశారు. మిగిలిన 9 మంది ఉద్యోగులు సొరంగ మార్గంలోనే చిక్కుకున్నారు. ఏడు ఫైరింజన్‌ల ద్వారా మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు. దాదాపు మంటలు అదుపులోకి వచ్చాయి. సాయంత్రానికి పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.   ఇదిలా ఉంటే, ప్రమాదంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. జరిగింది ప్రమాదమా? కుట్రా? అని ప్రశ్నించారు. ఏపీ సీఎం జగన్ జల దోపిడికి కేసీఆర్ సహకరించేలా.. తెలంగాణలో విద్యుత్ ప్రాజెక్టులను చంపేసే కుట్ర జరుగుతోందని ముందే చెప్పామని రేవంత్ ఆరోపించారు. ప్రమాదం జరిగిన తీరు అనుమానాలకు తావిస్తోందని, ప్రమాదం పేరుతో కుట్రను కప్పిపెట్టే ప్రయత్నం ఉందేమో అనిపిస్తోందని అన్నారు. నిజానిజాలు తేలాలంటే ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్ చేశారు.

జేన్ ఆస్టిన్ నుండి అరుంధతీ రాయ్ వరకు

ప్రమదావనంతో పాఠకులకు చేరువై   మరణించిన తర్వాత శరీరదానంతో స్పూర్తి నింపిన రచయిత   మాలతీ చందూర్ (1930 - ఆగష్టు 21, 2013)   మహిళల జీవితంలో వంటింటి నుంచి ఉద్యోగనిర్వాహణ వరకు ఎదురయ్యే ఎన్నో సమస్యలకు సూచనలు ఆమె శీర్షిక ద్వారా లభించేవి. అందుకే ఆమె శీర్షికలు రెండు దశాబ్దాలకు పైగా పాఠకులను అలరించాయి. ఆమె రాసే "జవాబులు" శీర్షిక పేజీలను పుస్తకాలుగా బైండింగ్ చేసి చాలామంది దాచుకునేవారు. ఆమే ప్రముఖ రచయిత, సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత మాలతీచందూర్.   మూడు దశబ్దాలకు పైగా సాహిత్యరంగంలో రాణించిన ఆమె ప్రముఖ రచయిత జేన్ ఆస్టిన్ నుంచి అరుంధతీరాయ్ వరకు ఎందరో రచయితలు రాసిన  రచనలను తెలుగులోకి అనువాదం చేశారు. వాటిలో చాలా రచనలు స్వాతి మాసపత్రికలో  'పాత కెరటాలు'గా ప్రచురించారు. నవలా రచయిత్రిగా, మహిళా ఇతివృత్తాలపై కాలమిస్టుగా అనేక పురస్కారాలు అందుకొన్నారు. కేంద్ర సెన్సారు బోర్డు సభ్యురాలిగా పనిచేసే సమయంలో తమిళ సినిమాలను అర్ధం చేసుకోవటానికి తమిళ భాష నేర్చుకున్నారు. ఆ తర్వాత అనేక తమిళ రచనలను తెలుగులోకి అనువాదం చేశారు.   మాలతీ చందూర్  1930లో కృష్ణా జిల్లా లోని నూజివీడులో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు జ్ఞానాంబ, వెంకటేశ్వర్లు. ఆమెకు ఆరుగురు అన్నలు. నూజివీడులోనే ఎనిమిదవ తరగతి పూర్తి చేసిన తర్వాత ఏలూరులో వల్లూరు సెయింట్‌ థెరిస్సా స్కూల్లో ఇంగ్లీషు మీడియంలో చేరారు. అక్కడే చందూర్,  డి.కామేశ్వరి, సి. ఆనందారామం తదితరులతో పరిచయం ఏర్పడింది. ఏలూరులో ఇంటికి దగ్గరగా 'కథావీధి' అనే సాహిత్య పత్రిక ఉండేది. అక్కడికి విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ, దేవుల పల్లి కృష్టశాస్త్రీ, నండూరి సుబ్బారావు, వెంకటచలం తదితరులు వచ్చేవారట. వారందిరినీ చూడటం, వారి మాటలు వినడంతో ఆమెకు సాహిత్యరంగంపై ఆసక్తి పెరిగింది. 1947లో ఆమె, చందూర్‌ కలిసి చెన్నై వెళ్ళి పెండ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె ప్రైవేటుగా ఎస్‌ఎస్‌ఎల్‌సి పూర్తి చేశారు. 1949లో రచనలు చేయడం ప్రారంభించారు. రేడియో లో  తన  రచనలను చదివి వినిపించేవారు. ఆ తర్వాత 1950 నుంచి సాహిత్యంలో రాణించారు. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో 'నన్ను అడగండి' అంటూ మహిళల కోసం "ప్రమదావనం"  శీర్షికలను  దాదాపు రెండు దశాబ్దాలకు పైగా రాశారు. వంటలు, సరదా విషయాలతో పాటు మహిళలకు ఆంగ్ల సాహిత్యాన్ని కూడా పరిచయం చేశారు. విదేశాలకు వెళ్ళివచ్చిన వారి అనుభవాలు కూడా రాయించేవారు. ఆమె నిర్వహించే జావాబులు శీర్షిక ఎంతో పాఠకాధరణ పొందింది. పాతిక దాకా మహిళా ప్రధాన ఇతివృత్తాల్లో నవలలు రాయటమే కాక 300 కు పైగా ఆంగ్ల రచనలను తెలుగులోకి అనువదించారు. జేన్ ఆస్టిన్ నుండి అరుంధతీ రాయ్  వరకూ అనేక మంది ప్రముఖ రచయితల రచనలను ఆమె తెలుగులోకి అనువాదం చేశారు.  ఇవి  స్వాతి మాసపత్రికలో 'పాత కెరటాలు' శీర్షికన ప్రచురించారు.   నవలా రచయితగా, మహిళా సంబంధిత అంశాలను ప్రస్తావిస్తూ కాలమిస్టుగా అనేక రచనలు చేశారు. మహిళలు ఎదుర్కోంటున్న ఎన్నో సమస్యలకు ఆమె రచనలు పరిష్కారం సూచించేవి. మహిళల్లో ఆలోచన శక్తి, సమస్యను ఎదుర్కోనే యుక్తి పెంచేలా ఆమె రచనలు ఉండేవి. 17కు పైగా నవలలు రాసిన ఆమె కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం అందుకున్నారు. 21 ఆగస్టు, 2013న చెన్నైలో ఆమె తుదిశ్వాస విడిచారు. మరణానంతరం ఆమె శరీరాన్ని మెడికల్ కాలేజీకి దానం చేసారు. ఎందరికో ఆదర్శంగా నిలిచారు. 

ఆకాశరామన్న ఉత్తరం పై అమరావతి మహిళల ఆగ్రహం

ఏపీలో రాజధాని విషయం పై రచ్చ జరుగుతన్న సంగతి తెలిసిందే. అయితే అమరావతినే రాజధానిగా కొనసాగించాలని అక్కడి ప్రజలు చేస్తున్న ఆందోళన 248వ రోజుకు చేరింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రాజధాని విషయంలో మాకు సంబంధం లేదని హైకోర్టులో అఫిడవిట్ ఇవ్వడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.    ఈ సందర్భంగా అమరావతి మహిళలు మాట్లాడుతూ "రాజధాని రాష్ట్రానికి సంబంధించిన విషయం మాకు సంబంధం లేదంటున్నప్పుడు ఏ అధికారంతో రాష్ట్రాన్ని విడదీశారు. తిరిగి తెలంగాణ రాష్ట్రాన్ని కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ప్రకటించండి" అంటూ కేంద్రం పై మండి పదారు.    ఒకటే రాష్ట్రం దానికి ఒకటే రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ వారు ఆందోళన చేస్తున్నారు. అయితే తాజాగా "మీకు ఈ పరిస్థితి రావటానికి కారణం చంద్రబాబు" అంటూ మందడంలోని దీక్ష శిబిరానికి నిన్న గురువారం ఆకాశ రామన్న ఉత్తరం వచ్చింది. దీనిపై అక్కడ దీక్ష చేస్తున్న రైతులు, మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సోము వీర్రాజు వ్యూహంతో ఏపీలో టీడీపీ పతనం ఖాయమా..?

కొద్ది రోజుల క్రితం వరకు స్తబ్దుగా ఉన్న ఏపీ బీజేపీ, కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టిననాటి నుండి కొత్త జోష్ తో ముందుకు సాగుతోంది. అధ్యక్షడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మీడియాతో మాట్లడుతూ తమకు ఉన్న సొంత బలానికి జనసేన, ఇతర పార్టీల నుండి వచ్చే కొందరు నేతల బలం తోడైతే వచ్చే ఎన్నికలలో అధికారం బీజేపీ జనసేన కూటమిదేనని చెప్పి విపక్షాలలో సంచలనమ్ సృష్టించారు.   తాజాగా దీని పై అయన తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దీని కోసం అయన కొంత మంది తో ఒక టీమ్ ను ఏర్పాటు చేసి ముందుగా ఇతర పార్టీలలో ఉండి గుర్తింపు పొందని ముఖ్య నేతలకు సంబంధించిన జాబితాను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లీడర్లను ఏదో ఒక రకంగా బిజెపి లోకి తీసుకురాగలిగితే పార్టీ మరింత పటిష్టం అవుతుందని ఆయన ప్రయత్నం. అయితే దీనికంటే ముందు ఇప్పటికే ఇతర పార్టీల నుండి వచ్చి బీజేపీలో చేరిన కొంతమంది పైనా అలాగే మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వర్గంగా పేరుపడ్డ వారిని వీలయితే పార్టీ నుండి తప్పిస్తూ.. ఒకవేళ అలా సాధ్యం కానివారిని పార్టీ అధిష్టానం తో చెప్పి సైలెంట్ చేసే పనిలో వీర్రాజు బిజీగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి.   ఇతర పార్టీ నేతలను ఆకర్షించే క్రమంలో అయన చూపు ప్రస్తుతం టిడిపి పై ఉందని.. ఆ పార్టీ లో ఉండి బిజెపి అంటే ఆసక్తి ఉన్న వారి జాబితాను కూడా అయన సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఆ లిస్టులో ప్రముఖంగా మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ళ పేరు కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. ఆయనను కనుక తీసుకురాగలిగితే ఆయనతో పాటు మరి కొందరు ముఖ్య నాయకులు కూడా వస్తారని అయన ఆశాభావంతో ఉన్నారు. అలాగే రాయలసీమ నుండి జగన్ ప్రభుత్వం తాకిడికి విలవిలలాడుతున్న జేసి కుటుంబం, పరిటాల కుటుంబాలను కూడా వారితో సన్నిహితంగా మెలిగే బీజేపీ నేతలతో లాబీ నడుపుతున్నారని టాక్ నడుస్తోంది. ఇక కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు మంచి పదవులు అనుభవించి ఇపుడు సైలెంట్ గా ఉన్న నేతల పై సోము వీరాజు గురిపెట్టినట్లు తెలుస్తోంది. ఇలా టీడీపీ ముఖ్య నేతలను కనుక చేర్చుకోగలిగితే వారి వెంట ఉండే పార్టీ కేడర్ కూడా వచ్చి చేరతారు కాబట్టి బీజేపీకి తిరుగు ఉండదని.. అదే సమయంలో తెలంగాణాలో లాగా ఏపీలో కూడా టీడీపీ మటాష్ అవుతుందని అయన వ్యూహం గా కనిపిస్తోంది. ఇక తటస్థుల విషయానికి వస్తే సబ్బంహరి, హర్షకుమార్, అలాగే వైసిపి నేత దాడి వీరభద్రరావు పేర్లు కూడా వినిపిస్తున్నాయి.   అయితే ఇక్కడే మరో వాదన కూడా వినిపిస్తోంది. బీజేపీ కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యూహం కనుక విజయవంతమైతే బీజేపీ బలోపేతం సంగతేమో కానీ సీఎం జగన్ పార్టీ అయిన వైసిపి నెత్తిన పాలు పోసినట్లేనని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అయితే టీడీపీలోని కొంత మంది నాయకులు బీజేపీ లో చేరినా ఆ పార్టీ కేడర్ మాత్రం వచ్చే పరిస్థితి లేదని విశ్లేషకులు చెపుతున్నారు. అంతేకాకుండా ఎపి ప్రస్తుతం ఎదుర్కొంటున్న రాజధాని, ప్రత్యేక హోదా వంటి ముఖ్య సమస్యల పై బీజేపీ గోడమీద పిల్లిలాగా వ్యవహరిస్తున్న తీరుతో అసలు ఏపీ ప్రజలు ఎంతవరకు బీజేపీని ఆదరిస్తారనేది ఒక పెద్ద ప్రశ్న అని.. దీనికి కాలమే సమాధానం చెప్పగలదని విశ్లేషకుల అభిప్రాయం.

తెలంగాణలో కరోనా కేసులు లక్షకు చేరువలో

తెలంగాణ రాష్ట్రంలో కోవిద్ 19 వైరస్ విజృంభణ నానాటికీ పెరుగుతుంది. ప్రతిరోజూ వందలాది కేసులు కొత్తగా నమోదు అవుతూ లక్ష మార్క్ కు పాజిటివ్ కేసుల సంఖ్య చేరుకోనుంది. కోలుకుంటున్న వారి శాతం 77.43శాతంగా ఉంది. అయితే ఇప్పటికే ఆరున్నర లక్షల మందికి పైగా కరోనా వచ్చి పోయిందని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. కరోనా వచ్చిందన్న విషయం కూడా వారికి తెలియకుండానే నయం అయ్యిందని సరైన పద్దతిలో టేస్టింగ్, ట్రేసింగ్, ట్రిట్ మెంట్ జరగడం లేదని మరోవైపు ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   సెప్టెంబర్ నెలలో మొదటి రెండు వారాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని ఇండియా ఔట్ బ్రేక్ నివేదిక స్పష్టం చేస్తుంది. వైరస్ ను ఎదుర్కునే శక్తి ప్రజల్లో పెరుగుతోందని, ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాపిస్తున్న రేటు కూడా తగ్గుతోందని ఈ నివేదికలో పేర్కొన్నారు. మహా నగరాల్లో కేసుల సంఖ్య తగ్గుతూ, పట్టణాలు, గ్రామాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నందున ప్రభుత్వాలు పట్టణాలు, గ్రామాలకు వైద్యసేవలు విస్తరించాల్సిన అవసరం ఉంది.  అక్టోబర్ నెల చివరి వారం నుంచి చెన్నైలో,  నవంబర్ చివరినాటికి ముంబయి నగరం లోనూ  చాలావరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుందని ఈ తాజా నివేదిక చెబుతోంది. వ్యాక్సిన్ కూడా త్వరగా అందుబాటులోకి వస్తే  2020 చివరకి నాటికి పూర్తిగా కరోనా రహితంగా మారే ఆశలు కనిపిస్తున్నాయి.

వ్యాక్సిన్ భారీ ఉత్పత్తి కోసం భారత్ వైపు రష్యా చూపు..

ప్రపంచంలోనే మొట్టమొదటి కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను ఆమోదించిన రష్యా ఇప్పుడు ఈ టీకా డోసుల భారీ ఉత్పత్తి కోసం భారత్ వైపు చూస్తోంది. "స్పుత్నిక్ v" అని పిలవబడుతున్న ఈ వ్యాక్సిన్ ను ప్రపంచ వ్యాప్తంగా అందరికి అందించాలంటే, ఈ టీకాలను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఉన్నభారత్ తోనే అది సాధ్యం అవుతుందని రష్యా తాజాగా విశ్వాసం వ్యక్తం చేసింది. దీంతో తాము అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ "స్పుత్నిక్ v" ను భారీ ఎత్తున తయారు చేసేందుకు భారత్ సహకరించాలని రష్యా అధికారికంగా అభ్యర్థించింది. దీని కోసం భారత్ తమతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకోవాలని కోరుకుంటున్నామని, అప్పుడే వ్యాక్సిన్ డోస్ లను పెద్ద మొత్తంలో తయారు చేయగలమని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ సీఈఓ కిరిల్ దిమిత్రేవ్ వ్యాఖ్యానించారు. ఔషధాలను భారీగా ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న దేశాలలో భారత్ ఒకటని ఈ సందర్భంగా ఆయన అన్నారు.    కొద్దీ రోజుల క్రితం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తమ దేశం ప్రపంచంలోనే మొట్టమొదటి కోవిడ్ -19 టీకాను తయారు చేసినట్లు ప్రకటించారు. ఇది 'చాలా ప్రభావవంతమైన' పద్ధతిలో పనిచేస్తుందని, అలాగే వ్యాధికి వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంచుతుందని వారు తెలుపుతున్నారు. ఈ వ్యాక్సిన్ ను గమలేయా ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఆర్డిఐఎఫ్ కలిసి అభివృద్ధి చేసాయి.   "ప్రపంచం మొత్తానికి సరిపడా ఈ వ్యాక్సిన్ ను భారీ ఎత్తున తయారు చేయడం ఇప్పుడు చాలా ముఖ్యం. ప్రస్తుతం మేము ఇండియాతో భాగస్వామ్యాన్ని కోరుతున్నాం. గమేలియా వ్యాక్సిన్ ను భారీగా, అనుకున్న సమయానికి తయారు చేసి ఇవ్వగల సత్తా భారత్ కు ఉంది. డిమాండ్ కు తగ్గట్టుగా వ్యాక్సిన్ ను తయారు చేయాలంటే, ఇండియాలో ఉన్న ఫార్మా కంపెనీలతో భాగస్వామ్యం తప్పనిసరి. ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నాం" అని కిరిల్ దిమిత్రేవ్ అన్నారు. దీనికోసం రష్యాకు ఇతర దేశాల సహకారం ఉంటేనే వ్యాక్సిన్ మరింత త్వరగా అందరికీ దగ్గరవుతుందని తెలిపారు. తమ వ్యాక్సిన్ భారీ స్థాయిలో ఉత్పత్తి కోసం భారతదేశం, బ్రెజిల్, దక్షిణ కొరియా, క్యూబా వంటి దేశాలలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అయన తెలిపారు.   అంతేకాకుండా తమ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కేవలం రష్యాలో మాత్రమే కాకుండా, యూఏఈ, సౌదీ అరేబియాలోనూ జరుగుతున్నాయని, బహుశా బ్రెజిల్, ఇండియాలో కూడా జరుగుతాయని, కనీసం ఐదారు దేశాల్లో ఈ వ్యాక్సిన్ తయారీ దిశగా డీల్స్ కుదుర్చుకోవాలని తాము కోరుకుంటున్నామని అయన తెలిపారు. ఆయనతో పాటు మీడియా సమావేశంలో పాల్గొన్న గమలేయా డైరెక్టర్ అలగ్జాండర్ జింట్ బర్గ్ మాట్లాడుతూ ఇప్పటివరకూ తమ సంస్థ 20 వేల మందిపై వ్యాక్సిన్ ను ప్రయోగించిందని, వారిలో ఎవరికీ సైడ్ ఎఫెక్ట్ లు రాలేదని అంతేకాకుండా వారి శరీరాల్లో యాంటీ బాడీలు పెరిగాయని, ఈ వ్యాక్సిన్ సురక్షితమైనదని అన్నారు.

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం.. లోపలే చిక్కుకున్న సిబ్బంది

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో నిన్న రాత్రి 10:30 కి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తెలంగాణ జెన్‌కో మొదటి యూనిట్‌లోని ఓ ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద పెద్ద శబ్దాలతో మంటలు ఎగిశాయి. పవర్ హౌస్ లోపల దట్టమైన పొగ అలుముకోవడంతో పలువురు టీఎస్ జెన్‌కో ఉద్యోగులు అక్కడే చిక్కుకుపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో ఉన్న 17 మందిలో 8 మంది ఎగ్జిట్ ద్వారానికి దగ్గరగా ఉండటంతో, వారంతా పరుగులు పెడుతూ బయటకు వచ్చేశారు. మిగతా వారు పొగలోనే చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. మూడు సార్లు లోపలికి వెళ్లి దట్టమైన పొగ కారణంగా మళ్లీ వెనక్కి వచ్చారు. గతంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితి ఎదురవకపోవడంతో, రాత్రి 2 గంటల నుంచి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం ఆక్సిజన్ మాస్క్ లు ధరించి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ తీవ్రమైన పొగ కారణంగా.. ఘటనా స్థలానికి చేరుకోలేకపోతున్నారు.. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం పాతాళగంగ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీశైలంలో సహాయక చర్యలను మంత్రి జగదీష్ రెడ్డి సమీక్షిస్తున్నారు.   అయితే ఈ ఉదయం ప్రమాదం జరిగిన స్థలంలో సహాయక చర్యలు కొంత వేగవంతమయ్యాయి. ఈ సహాయక చర్యలలో సింగరేణి నుంచి భూ గర్భంలో కిలోమీటర్ల కొద్దీ వెళ్లి పనిచేసే నైపుణ్యమున్న సిబ్బంది , ఎన్డీఆర్ఎఫ్ కు సహాయంగా వచ్చి చేరాయి. అయితే రాత్రి నుంచీ లోపల ఉన్న వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులు, అధికారుల్లో ఆందోళన నెలకొంది.   శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో అగ్రిప్రమాదంపై తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు స్పందించారు. గురువారం రాత్రి ప్రమాదం జరగగా 1200 కేవీ లైన్‌ను ఐసోలేట్ చేశామని.. ఈ క్రమంలోనే ట్రిప్ అయ్యి ప్యానెల్ బోర్డులో మంటలు చెలరేగినట్లు వెల్లడించారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదని ఆయన చెప్పారు. లోపల అంతా పొగతో నిండిపోయిందని.. ఎంత నష్టం జరిగిందో ఇప్పుడే చెప్పలేమని తెలిపారు ప్రభాకర్ రావు. పవర్ హౌస్ లోపల చిక్కుకున్న ఉద్యోగులను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్‌కు కూడా వివరించామని ఆయన తెలిపారు.

అమరావతి రైతులకు న్యాయం జరిగి తీరుతుంది.. వైసీపీ ఎంపీ

వైసీపీ నాయకత్వానికి ప్రతి రోజు తన ఘాటైన విమర్శలతో చుక్కలు చూపిస్తున్న ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఈ రోజు మరోసారి మీడియాతో మాట్లాడుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. రాజధాని అమరావతి విషయంలో రైతులు ఏ మాత్రం అధైర్యపడవద్దని.. వారికి తప్పకుండా న్యాయం జరిగి తీరుతుందని అయన అన్నారు. అయితే రాజధానిని నిర్ణయించే విషయంలో రాష్ట్రాలదే అధికారమని కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్‌లో చెప్పడం బాధాకరమని అయన అన్నారు.   అంతేకాకుండా విశాఖపట్టణం ఇప్పటికే అభివృద్ధి చెందిందని, శ్రీకాకుళంలో కూడా చాలా పరిశ్రమలు ఉన్నాయని ఇప్పుడు కొత్తగా అభివృద్ధి చేయాల్సిన పనిలేదని అయన అన్నారు. కొత్త ప్రభుత్వం అభివృద్ధి చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ అభివృద్ధి చెందిన ప్రాంతాలను చెడగొట్టకుండా ఉంటే చాలని అయన అన్నారు. సీఎం జగన్‌కు కనుక రాయలసీమపై నిజమైన ప్రేమ ఉంటే అమరావతిలోనే రాజధానిని ఉంచి, రాయలసీమలో న్యాయ రాజధానిని ఏర్పాటు చేయాలని అయన సూచించారు.   ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో తాను పర్యటించాలనుకుంటున్నానని... తన పర్యటనకు అనుమతి ఇవ్వాలని ఎంపీ రఘురామకృష్ణంరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దీని కోసం అనుమతిని కోరుతూ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు అయన లేఖ రాశారు. ఈనెల 24వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తాను అమరావతిలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పర్యటిస్తానని ఆ లేఖలో తెలిపారు.

మోసం చేసిన స్నేహితులతో సీఐ కుమ్మక్కు.. దిక్కుతోచక రైతు ఆత్మహత్య

గుంటూరు జిల్లాలో మరో విషాదం చోటు చేసుకుంది. న్యాయం చేయాల్సిన సీఐ వేధింపులు తాళలేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకు జరిగిన మోసం పై జిల్లా ఎస్పీకి చేసిన ఫిర్యాదును కూడా సీఐ తప్పుదోవ పట్టించి తిరిగి వేధింపులకు పాల్పడటంతో ఆ అభాగ్యుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే తన ఆత్మహత్యకు కల కారణాలను, అలాగే తన ఆవేదనను.. ఆత్మహత్యకు ముందే ఒక సెల్ఫీ వీడియోలో ఆ రైతు రికార్డ్ చేసాడు.    వివరాల్లోకి వెళితే బసవయ్య అనే ఆ రైతును వ్యాపారంలో కొందరు భాగస్వాములు మోసం చేశారు. స్వతహాగా తాను అకౌంటెంట్ కావడం వల్ల కాటన్ బిల్లుల వ్యాపారం బాగుంటుందని నమ్మించి బ్యాంకులో లోన్లతో పాటు ప్రజల వద్ద నుంచి అప్పులు తీసుకొచ్చేలా చేసి స్నేహితులే మోసం చేశారని బసవయ్య సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు.    దీనిపై బసవయ్య జిల్లా ఎస్పీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే నిందితులతో కుమ్మక్కైన పట్టాభిపురం సీఐ కళ్యాణ్ రాజ్ కేసును తప్పుదోవపట్టించి రివర్స్ లో బసవయ్యను వేధించడం ప్రారంభించాడు. ఒక పక్క స్నేహితుల చేతిలో మోసపోవడంతోపాటు మరోపక్క సీఐ నుండి వేధింపులు ఎక్కువ కావడంతో ఆ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.    బసవయ్య ఆత్మహత్య తరువాత.. దీని పై పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా .. అందులో సీఐ కళ్యాణ రాజు పేరు లేకుండా చేయాలని బాధితులపై పోలీసులు ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే సీఐ కళ్యాణ రాజుపై ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

జీతాలు లేక రోడ్డెక్కి భిక్షాటన.. మాన్సాస్ ట్రస్ట్ చరిత్రలో ఈ పరిస్థితి ఎప్పుడైనా ఉందా?

తమకు మార్చి నుంచి జీతాలు ఇవ్వడం లేదు అంటూ ఇటీవల విజయనగరం కోట ముందు మాన్సాస్ ట్రస్ట్ ఉద్యోగులు భిక్షాటన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. 62 ఏళ్ల మాన్సాస్ ట్రస్ట్ చరిత్రలో ఈ దయనీయ పరిస్థితి ఎప్పుడైనా ఉందా? అని ప్రశ్నించారు.    విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ ఉద్యోగులు 5 నెలలుగా జీతాలు లేక రోడ్డెక్కి భిక్షాటన చేయడం కలిచివేసింది అన్నారు. 62ఏళ్ల మాన్సాస్ ట్రస్ట్ చరిత్రలో ఈ దయనీయ పరిస్థితి ఎప్పుడైనా ఉందా? 879 కుటుంబాలు ఇలా రోడ్డెక్కడం గతంలో చూశామా? అని ప్రశ్నించారు. ఇప్పుడెందుకిలా ట్రస్ట్ కు అప్రదిష్ట తెచ్చారు? అని మండిపడ్డారు.   ఎంతో ఆర్ధిక పరిపుష్టి ఉన్న మాన్సాస్ వంటి సేవాసంస్థ ఇప్పుడిలా కావడానికి కారణం ఎవరు? సజావుగా అందుతున్న సంస్థ సేవలను గాడి తప్పించింది ఇందుకేనా..? అని చంద్రబాబు నిలదీశారు.   "ఇలాంటి దుస్థితి మాన్సాస్ ట్రస్ట్ కు ఎప్పుడూ ఎదురు కాకూడదనే విజయనగరం రాజా పివిజి రాజు వేలాది ఎకరాల భూములతో, వందల కోట్ల నగదు  ఫిక్స్ డ్ డిపాజిట్లతో ట్రస్ట్ ను ఆర్థికంగా పరిపుష్టి చేసారు. అటువంటి సంస్థ ఇప్పుడిలా దిగజారడం చూస్తే ఎవరికైనా ఆత్మ క్షోభించక తప్పదు." అని చంద్రబాబు పేర్కొన్నారు.

స్వచ్ఛ సర్వేక్షణ్ 2020.. టాప్‌ 10లో మూడు ఏపీ నగరాలు

కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ‌‌ ‘స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్-2020’జాబితాను ప్ర‌క‌టించింది. దేశంలో అత్యంత స్వచ్ఛ‌మైన న‌గ‌రంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ లోని ఇండోర్ నగరం ప్ర‌థ‌మ స్థానంలో నిలిచింది. ఇలా వ‌రుస‌గా నాలుగో సారి ఇండోర్‌ మొదటి స్థానం కైవసం చేసుకోవ‌డం విశేషం. రెండో స్థానంలో గుజరాత్ లోని సూర‌త్‌, మూడో స్థానంలో మ‌హారాష్ట్ర‌లోని ముంబై నిలిచాయి. ఇక మొదటి పది స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, తిరుప‌తి నగరాలకు చోటు దక్కింది. దేశంలోనే ప‌రిశుభ్ర‌త గ‌ల న‌గ‌రంగా విజ‌య‌వాడ నాలుగో స్థానం ద‌క్కించుకుంది. తిరుప‌తి ఆరో ర్యాంకు, విశాఖ‌ప‌ట్నం తొమ్మిదో ర్యాంకు సాధించింది.    స్వచ్చ సర్వేక్షణ్ ర్యాంకులు ప్రకటించే పద్ధతిని 2016లో ప్రధాని మోడీ ప్రారంభించారు. దీనిలో భాగంగా పరిశుభ్రతను పాటించే 129 అత్యుత్తమ నగరాలు, రాష్ట్రాలకు పురస్కారాలు ఇస్తారు. తొలి సంవత్సరం దేశంలోనే పరిశుభ్ర నగరంగా మైసూరు నిలిచింది. ఆ తర్వాత ఏడాది ఇండోర్ పురస్కారం దక్కించుకుంది. అప్పటి నుంచి ఇండోర్ వరుసగా నాలుగోసారి మొదటి స్థానంలో నిలిచింది.   ఇక, దేశంలో పరిశుభ్ర రాష్ట్రాల్లో జార్ఖండ్ ప్ర‌థ‌మ స్థానంలో నిలిచింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఆరో స్థానాన్ని ద‌క్కించుకోగా, తెలంగాణ కూడా టాప్ 10లో చోటు సంపాదించుకుంది.

పుతిన్ ప్రత్యర్థి పై విషప్రయోగం.. రష్యాలో పెను దుమారం

రష్యాలో ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్నీ(44)పై గుర్తు తెలియని వ్యక్తులు విష ప్రయోగం చేయడంతో పెను దుమారం రేగింది. సైబీరియాలోని టోమస్క్ సిటీ నుంచి మాస్కోకు విమానంలో వెళ్తుండగా అలెక్సీ ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మార్గమధ్యంలో విమానంలో బాత్రూంకి వెళ్లిన అయన అపస్మారక స్థితిలో పడిపోయారు. అలెక్సీ బాత్రూమ్ నుంచి ఎంతకూ రాకపోవడంతో సిబ్బంది వెళ్లి చూడగా.. ఆయన కిందపడి పోయి ఉన్నారు.   వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని ఓమస్క్ సిటీలో అత్యవసరంగా ల్యాండ్ చేసి అక్కడి నుంచి దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. కోమాలో ఉన్నారని డాక్టర్లు తెలిపారు. అంతేకాకుండా ఆయన శరీరంలో విషం అవశేషాలు ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. ఐతే ఈ రోజు ఉదయం అలెక్సీ కేవలం టీ మాత్రమే తాగారని ఆయన అధికార ప్రతినిధి కిరా యార్మిష్ తెలిపారు. ఈ నేపథ్యంలో క్యాంటిన్‌లోనే ఎవరో టీలో విషం కలిపారని భావిస్తున్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు కేఫ్‌ను మూసివేసి.. ఆ ప్రాంతం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు .   "రష్యా ఆఫ్ ద ఫ్యూచర్" రాజకీయ పక్షానికి చెందిన అలెక్సీ నావల్నీ అవినీతి వ్యతిరేక ఉద్యమాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండడంతో ప్రజల్లో బలమైన నేతగా గుర్తింపు వచ్చింది. ఇపుడు ఏకంగా అధ్యక్షుడు పుతిన్ పైనే ఆరోపణలు చేస్తూ పలుమార్లు జైలుకు కూడా వెళ్లొచ్చాడు. ఆయనపై చాల సార్లు దాడులు కూడా జరిగాయి. గతంలో కూడా ఓసారి విషప్రయోగం జరిగింది.

టాప్ లో తెలంగాణ.. ఏపీ ఎక్కడుందో తెలుసా?

ఇంటింటికి నల్లా కలెక్షన్ల ద్వారా మంచి నీరు సరఫరా చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరధ ద్వారా మారుమూల గ్రామాలకు కూడా మంచి నీటి సరఫరా అందేలా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా నిర్వహించిన సర్వేలో తెలంగాణలో 98.31 శాతం ఇళ్ళకు మంచి నీటి నల్లా కలెక్షన్లు ఉన్నట్టు తెలిసింది. తెలంగాణ రాష్ట్రం 98.31 శాతం ఇళ్ళకు నల్లాలతో తాగునీటిని అందిస్తూ దేశంలోనే తొలిస్థానంలో నిలిచిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర జల ‌శక్తి మంత్రిత్వశాఖ జల్‌ జీవన్‌ మిషన్‌ వివరాలు ప్రకటించింది. తెలంగాణలో మొత్తం 54.38 లక్షల ఇళ్లుండగా వాటిల్లో 53.46 లక్షల ఇళ్లకు తాగునీరు అందుతోంది. తెలంగాణ తరువాత 89.05 శాతంతో గోవా రాష్ట్రం రెండో స్థానంలో నిలవగా, 87.02 శాతంతో కేంద్ర పాలిత ప్రాంతం పుదిచ్చేరి మూడో స్థానంలో నిలిచింది.    నల్లా కలెక్షన్లలో తెలంగాణ రాష్ట్రం తొలిస్థానంలో నిలిస్తే, మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ మాత్రం బాగా వెనకపడిపోయింది. ఈ జాబితాలో కేవలం 34.62 శాతంతో ఏపీ 13వ స్థానంలో నిలిచింది. ఇక 2.05 శాతంతో పశ్చిమ బెంగాల్, 1.86 శాతంతో మేఘాలయ చివరి స్థానాలలో ఉన్నాయి.  ఇందుకు సంబంధించిన వివరాలను తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేసి హర్షం వ్యక్తం చేశారు. "కేంద్ర జల శక్తి నివేదిక ప్రకారం.. తెలంగాణ 98.31 శాతం నల్లాల కనెక్షన్లతో తాగునీరు అందిస్తూ తొలిస్థానంలో నిలిచింది. మిషన్ భగీరథ ద్వారా ఈ తాగునీరు అందుతోంది. ఈ అద్భుత విజయానికి కారణమైన సీఎం కేసీఆర్ దూరదృష్టికి, కష్టపడి పనిచేసిన ఆర్‌డబ్ల్యూఎస్‌ టీమ్‌ కు అభినందనలు" అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.