ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో ఏపీ సర్కార్ పై కఠిన చర్యలు తీసుకోండి.. మోడీకి చంద్రబాబు లేఖ
posted on Aug 17, 2020 @ 11:09AM
ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వార్తలు దుమారం రేపుతున్నాయి. హైకోర్టు జడ్జ్ ల ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఒక ప్రముఖ దిన పత్రికలో వచ్చిన వార్తలు ఏపీలో రాజకీయంగా పెద్ద కలకానికి దారి తీస్తున్నాయి. తాజాగా ఫోన్ ట్యాపింగులతో రాష్ట్ర ప్రభుత్వం చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ మాజీ సీఎం చంద్రబాబు ప్రధానికి ఒక లేఖ రాశారు. ఏపీలో అధికార పక్షం అనుసరిస్తున్న విధానాలు భవిష్యత్తులో దేశానికి కూడా ముప్పు తీసుకువచ్చే అవకాశం ఉందని అయన ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వంటి అక్రమాలు, ఇతర చట్టవిరుద్ద చర్యలపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో విచారణకు ఆదేశించాలని అయన విజ్ఞప్తి చేశారు. బాబు రాసిన ఈ లేఖను ప్రధాని మోదీతో పాటు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు కూడా ఈ లేఖను పంపించారు.
చంద్రబాబు ప్రధాని మోడీకి రాసిన లేఖ సారాంశం
మీ నాయకత్వంలో దేశ భద్రత గణనీయంగా ఇనుమడించింది. ఉగ్ర శక్తుల నుంచి ముప్పు తగ్గి, దేశం వెలుపల సరిహద్దులు కూడా బలోపేతం చేయబడ్డాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఫోన్ల ట్యాపింగ్ రూపంలో రాజకీయ నాయకులకు, ఇతర వర్గాలకు చెందినవారికి ముప్పు పొంచి ఉంది దీనితో దేశ భద్రతకు వాటిల్లబోయే నష్టం గురించి మీ దృష్టికి తీసుకువస్తున్నాను.
వైసీపీ పాలనలో ఏపీ ప్రజలు తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలోని ప్రజాస్వామ్య సంస్థలపై దాడి జరుపుతోంది. అన్నిటికంటే ముందుగా గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడిదారులు, విధానాలపై దాడి చేసి… రాష్ట్ర పాలనా ప్రక్రియ పూర్తిగా పట్టాలు తప్పించారు. ఆ తరువాత రాష్ట్ర ఎన్నికల సంఘం, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటి ఇతర రాజ్యాంగ సంస్థలపైనే అలాగే దాడి చేసారు. వీటితో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ గళం వినిపిస్తున్న ప్రతిపక్ష పార్టీల నేతలు, లాయర్లు, మీడియా వ్యక్తులు, సామాజిక కార్యకర్తలపై దాడులు చేస్తూ ప్రభుత్వం బెదిరిస్తోంది. అటువంటి వారందరి ఫోన్‌లను చట్టవిరుద్ధంగా ట్యాపింగ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. తమ చర్యలకు న్యాయవ్యవస్థ నుండి అడ్డంకులు ఎదురవుతున్నాయనే ఉద్దేశంతో, ప్రజాస్వామ్య వ్యవస్థ మూడో స్తంభమైన న్యాయవ్యవస్థను కూడా పాలక వైయస్ఆర్సిపి ప్రస్తుతం లక్ష్యంగా చేసుకున్నట్లు తాజాగా కనిపిస్తోంది
తాజాగా వైసిపి ప్రభుత్వం చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ ల వల్ల రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 19, 21 ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతుందని అయన పేర్కొన్నారు. అంతేకాకుండా ఇల్లీగల్ సాఫ్ట్ వేర్ ద్వారా, చట్టవిరుద్ధంగా ఈ ట్యాపింగ్ జరుగుతోందని మేము ఆందోళన చెందుతున్నాం. దీర్ఘకాలంలో జాతీయ భద్రతకు కూడా ప్రత్యక్ష ముప్పు వచ్చే అవకాశం ఉన్నందున ఇది మరింత ప్రమాదకరమైనది. ఇటువంటి లేటెస్ట్ టెక్నాలజీ దుండగుల చేతిలో ఉండడం వల్ల వ్యక్తుల గోప్యత హక్కును కాలరాయడమే కాకుండా, అత్యున్నత స్థానాల్లోని వ్యక్తులను కూడా తమ దారికి తెచ్చుకోడానికి బ్లాక్ మెయిలింగ్, బెదిరింపులకు గురిచేయడానికి పరిస్థితులు దారితీస్తాయి. దీన్ని ఇపుడే కట్టడి చేయకపోతే ఎన్నో ఏళ్లుగా కష్టపడి నిర్మించుకున్న వ్యవస్థలు కూడా నాశనం అవుతాయి. కనుక ఏపీలోని ప్రభుత్వ, అలాగే ప్రైవేట్ సంస్థలు ఇలాంటి చట్టవిరుద్ద కార్యకలాపాలకు (ఫోన్ ట్యాపింగ్) కు మళ్లీ పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి అంటూ చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు.