దుబ్బాక ఉప ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత పోటీ!!
దుబ్బాక నుంచి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన సోలిపేట రామలింగారెడ్డి ఇటీవల అనారోగ్యం కారణంగా కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో దుబ్బాక నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ ఉపఎన్నికకు సంబంధించి ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత దుబ్బాక నుంచి పోటీ చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. రామలింగారెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి 60 వేలకు పైగా మెజారిటీతో గెలుపొందారు. అక్కడ టీఆర్ఎస్ కు తిరుగులేదని, కవిత పోటీ చేస్తే రికార్డ్ మెజారిటీతో కూడా గెలవొచ్చని, అందుకే కవిత దుబ్బాక నుంచి పోటీ చేయడానికి సిద్దమవుతున్నారని ప్రచారం జరుగుతోంది.
అయితే, దుబ్బాక నుంచి కవిత పోటీ చేయనున్నారన్న ప్రచారంతో ఆమెపైన, సీఎం కేసీఆర్ పైన రామలింగారెడ్డి అనుచరుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయట. రామలింగారెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా, కేసీఆర్ వెన్నంటి ఉన్నప్పటికీ మంత్రి పదవి దక్కలేదు. ఇప్పుడేమో ఆయన మరణించారని అందరూ బాధపడుతుంటే ఆయన కుటుంబంలో ఒకరికి టికెట్ ఇవ్వకుండా కవిత ని ఇక్కడ నుండి పోటీ చేయించాలని చూడటం ఏంటి? అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.
అయితే, కవిత దుబ్బాక నుంచి పోటీ చేయనున్నారనే ప్రచారాన్ని కొందరు కొట్టిపారేస్తున్నారు. ఎందుకంటే, ఆమె ఇప్పటికే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసి ఉన్నారు.
నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత కవిత కొంత సైలెంట్ అయ్యారు. తర్వాత ఆమె రాజ్యసభకు వెళ్తారని, లేదు ఎమ్మెల్సీ ఇచ్చి సీఎం కేసీఆర్ ఆమెని మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఇలా రకరకాలుగా ప్రచారం జరిగింది. చివరికి కేసీఆర్ కవితని ఎమ్మెల్సీ అభ్యర్థి గా ప్రకటించారు. ఇప్పటికే ఆమె నామినేషన్ కూడా వేశారు. కానీ కరోనా వల్ల ఎన్నికలు జరగలేదు. ఎప్పుడు జరుగుతాయో కూడా తెలియదు. ఈలోగా దుబ్బాక స్థానం ఖాళీ కావడంతో ప్రత్యక్ష ఎన్నికల్లో తలపడటానికి కవిత సిద్దమవుతున్నారని ప్రచారం మొదలైంది.
కరోనా కారణంగా దుబ్బాక ఉపఎన్నిక కూడా ఇప్పట్లో జరిగే అవకాశంలేదు. అదీగాక ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థి గా నామినేషన్ వేసున్న కవితని.. దుబ్బాక బరిలో దింపితే.. విమర్శలు వ్యక్తమవ్వడంతో పాటు.. రామలింగారెడ్డి అనుచరులకు, స్థానిక కేడర్ కి తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశముందని టీఆర్ఎస్ భావిస్తోందట. అందుకే, రామలింగారెడ్డి కుటుంబ సభ్యులకే ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇవ్వాలని టీఆర్‌ఎస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
మరోవైపు, దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున ఎవరు బరిలో నిలిచినా తాము పోటీకి సిద్దమంటున్నాయి విపక్షాలు. దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. దుబ్బాక ఉప ఎన్నికకు కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధం కావాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. బీజేపీ కూడా అభ్యర్థిని నిలపాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.