రోడ్డు మార్గం లో ఢిల్లీ టూ లండన్
రెండు ఖండాల్లోని 18దేశాలు చూసే అవకాశం
ప్రపంచాన్ని చూడాలి.. ప్రయాణాన్ని ఎంజాయ్ చేయాలి అనుకునేవారి కోసం ఒక అద్భుతమైన టూర్ ప్లాన్ అందుబాటులోకి రానుంది. రోడ్డు మార్గం ద్వారా ఢిల్లీ నుంచి లండన్ వరకు బస్ సర్వీస్ మే 2021లో ప్రారంభం అవుతుంది. గురుగ్రామ్ కు చెందిన అడ్వెంచర్స్ ఓవర్ ల్యాండ్ కంపెనీ బస్ టూ లండన్ పేరుతో ఈ టూర్ ప్లాస్ చేస్తుంది. వచ్చే ఏడాది అంటే 2021 మే నెలలో ఈ టూర్ ఫస్ట్ ట్రిప్ ప్రారంభంకానుంది. కరోనా తగ్గుముఖం పట్టిన వెంటనే బుకింగ్స్ ప్రారంభిస్తారు.
కారు ప్రయాణం ద్వారా ఇప్పటికే ప్రపంచాన్ని చుట్టివచ్చిన తుషార్ అగర్వాల్, సంజయ్ మదన్ లు ఈ బస్సు యాత్ర రూట్ మ్యాప్ సిద్దం చేశారు. ఇప్పటికే వరుసగా మూడేండ్లుగా(2017, 2018, 2019)వీళ్లు రోడ్డు మార్గం ద్వారా లండన్ వెళ్ళివచ్చారు. ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తూ విభన్నమైన ప్రదేశాలను, ఆయా ప్రాంతాల ప్రజల సంస్కృతులను, జీవనవిధానాన్ని తెలుసుకోవాలంటే రోడ్డు ప్రయాణమే బెటర్ అనుకునేవారి సంఖ్య ఎక్కువగా ఉందని వీరు అంటారు. అలాంటి వారి కోసమే ఈ ట్రిప్ ప్లాన్ చేశామంటున్నారు. తమ ప్రయాణ అనుభవాలతోనే అడ్వెంచర్స్ ఓవర్ ల్యాండ్ కంపెనీ ద్వారా బస్ టూ లండన్ పేరుతో ఈ టూర్ ప్రారంభిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా బస్ ను డిజైన్ చేయించారు. కేవలం 20సీట్లు మాత్రమే ఈ బస్ లో ఉంటాయి. ఈ టూర్ ను నాలుగు కేటగిరిలుగా విభజిస్తారు. పర్యాటకులు తమకు నచ్చిన కేటగిరిని ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో బిజినెస్ క్లాస్ సీట్లు కూడా ఉంటాయి. మొత్తం ప్రయాణం ఇరవై వేల కిలోమీటర్ల మేరకు ఉంటుంది. 70రోజుల ఈ ప్రయాణంలో ఆసియా, యూరప్ ఖండాల్లోని 18దేశాలను చూడోచ్చు. ఆయా దేశాల వీసా అనుమతులు, వసతి సదుపాయాలు, ప్రయాణ ఖర్చులు అన్నీ కలిసి 15లక్షల వరకు చెల్లించాలి.
టూర్ రూట్ మ్యాప్
ఈ టూర్ కు సంబంధించిన రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు. ఢిల్లీలో ప్రారంభమై అస్సాం మీదుగా దేశ సరహద్దులు దాటుతుంది. ఈ మొత్తం టూర్ లో పర్యాటకులు చూసే అవకాశం ఉన్న దేశాలు - మయన్మార్, థాయ్ లాండ్, లావోస్, చైనా, కిర్జికిస్తాన్, ఉజ్జెకిస్తాన్, కజకిస్తాన్ , రష్యా, లాట్వియా, లిథూనియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్, లండన్.