జగన్ పాలనలో రైతులకు గిట్టుబాటు ధర కలే
posted on Oct 1, 2020 @ 1:24PM
వైసీపీ విధానాలతో అన్నదాతల ఆత్మహత్యల్లో ఆంధ్ర 3 వ స్థానం
వైసీపీ ప్రభుత్వం తీరుపై అమలాపురం టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షురాలు అనంతకుమారి ధ్వజం
వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని అమలాపురం పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి ధ్వజమెత్తారు. గురువారం ఆమె మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఆచరణలో ఆ రైతులకు చేసిందేమీ లేదని విమర్శించారు. రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని లెక్కలు చెబుతూ వారికి ఆచరణలో మొండిచెయ్యి చూపుతుందని పేర్కొన్నారు. దేశానికి వెన్నుముక అని చెప్పబడుతున్న రైతుకు ఈ ప్రభుత్వంలో తీవ్ర అన్యాయం చేస్తుందని విమర్శించారు. కరోనా లాక్ డౌన్ లో పంట ఉత్పత్తులు కొనేవారు లేక అయిన కాడికి అమ్ముకునే దుస్థితి తీసుకువచ్చారని, గిట్టుబాటు ధర లభించకపోవడంతో పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా రాక చేసిన అప్పులు తీరక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకువచ్చారని ఆందోళన వెలుబుచ్చారు. రైతులకు అవసరమైన విత్తనాలు,ఎరువులు అందించడంలో విఫలం అయ్యారని పేర్కొన్నారు. గోదావరి జిల్లాల్లో ఇటీవల వరదలు, భారీ వర్షాలకు పంటలు నష్ట పోయినా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ విధమైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. జగన్ వచ్చిన తర్వాత అతివృష్టి అనా వృష్టి తో అన్నదాతలకు అన్ని కష్టాలే మిగిలాయని ఆందోళన వెలుబుచ్చారు.
ఈ పాలనలో ఏ పంటకు మద్దతు ధర లభించలేదని ధాన్యం, పసుపు, మొక్కజొన్న,కంది, శనగ పంట సాగు చేసిన రైతులు గిట్టుబాటు ధర లభించక నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం రైతులకు రూ.1,728 కోట్లు బకాయిలు ఉన్నాయని వీటిని ఎప్పుడు చెల్లిస్తారని ఆమె ప్రశ్నించారు.గతంలో 22 వేలు ఉన్న మిర్చి ధర 8 వేలకు పడిపోయిందని ధాన్యం కనీస మద్దతు ధర సాధారణ రకానికి 1815 ఉండగా రూ.1100 నుంచి 1300 కు కొనుగోలు చేశారని పేర్కొన్నారు.క్వింటా ధాన్యానికి రైతు 500 నుంచి 700 వరకు నష్టపోయాడని మొక్కజొన్నకు మద్దతు ధర 1760 ఉండగా 1400 కు కొనుగోలు చేశారని వేరుశనగ రూ.5090 ఉండగా రూ.4500 మినుములు 5700 ఉండగా 5000 కొనుగోలు చేశారని తెలిపారు.
జగన్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా రైతు ఆత్మహత్యలతో దేశంలోనే రాష్ట్రం 3 వ స్థానం లో ఉందని, 2018 లో 664 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడగా జగన్ అధికారం చేపట్టాక 2019లో 1029 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 1200 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని దేశంలోనే అత్యధికంగా రైతులు, వ్యవసాయ కూలీలు బలవన్మరణాలకు పాల్పడ్డ రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర కర్ణాటక ఆ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ మూడో స్థానంలో నిలిచిందని తెలిపారు.బడ్జెట్లో 64.06 లక్షల మందికి రైతు భరోసా పథకం వర్తింప చేస్తామని చెప్పి 45,00,263 మందికి కుదించారన్నారు.15.36 లక్షల మంది ఉన్న కౌలు రైతులను 1,58,123 మందికి తగ్గించారని ఇది నమ్మక ద్రోహం కాదా? అని ప్రశ్నించారు.సున్నా వడ్డీకి రైతురుణాలు ఇస్తామని చెప్పి మాట తప్పి మడమ తిప్పారని, 4వేల కోట్లు ఇస్తామని చెప్పి 2019 బడ్జెట్ లో రూ.100 కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు.ఇప్పుడు ఉచిత వ్యవసాయ విద్యుత్ అని చెబుతూ వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు ఏర్పాటు చేయడం ఏమిటి అని ప్రశ్నించారు.రేపు వచ్చే బిల్లులతో వారి నెత్తిన భారం మోపడానికి జరుగుతున్న ఎత్తుగడగా అభివర్ణించారు.
టీడీపి హయాంలో వ్యవసాయ రంగ ప్రగతి సాధించిదని ఆమె తెలిపారు.
వ్యవసాయానికి బడ్జెట్ టిడిపి ప్రభుత్వం మూడు నాలుగు రెట్లు చేసిందని 2013-14 లో వ్యవసాయానికి బడ్జెట్ 6,128 కోట్లు కాగా టిడిపి ప్రభుత్వం 2018-19 నాటికి రూపాయలు 19,070 కోట్లకు పెంచిందని ప్రకటనలో పేర్కొన్నారు.ఐదేళ్లలో రూపాయలు 81,554 కోట్ల బడ్జెట్ కేటాయించడం జరిగిందని రైతులకు రూ. 15,279 కోట్ల మేర రుణ మాఫీ చేశామని వ్యవసాయరంగంలో వృద్ధిరేటు సగటున 11% సాధించిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ ను చంద్రబాబు నిలబెట్టారని అనంతకుమారి ప్రకటనలో తెలిపారు.