కన్న తల్లికి కూడా దక్కని కడచూపు.. అర్థరాత్రి యూపీ పోలీసులచే గ్యాంగ్ రేప్ బాధితురాలి అంత్యక్రి
posted on Sep 30, 2020 @ 12:41PM
2012 లో జరిగిన నిర్భయ ఘటనను తిరిగి గుర్తు చేస్తూ యూపీలో దారుణ అత్యాచారానికి గురై నిన్న మరణించిన యువతి అంత్యక్రియలను నిన్న రాత్రి యూపీ పోలీసులు రహస్యంగా ముగించేశారు. ఈ తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో కనీసం కన్న తల్లితండ్రులు, కుటుంబ సభ్యులను కూడా అనుమతించకుండా, పోలీసులే ఆమె మృతదేహాన్ని దహనం చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. రెండు వారాల క్రితం సామూహిక అత్యాచారానికి గురైన ఆ యువతి శరీరంలోని పలు ఎముకలు విరిగిపోయి, నాలుక తెగిపోయి, అవయవాలు పనిచేయని స్థితిలో న్యూఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మరణించింది.
ఆ మహిళ కుటుంబ సభ్యులను, బంధువులను ఇళ్లలోంచి బయటకు రాకుండా పోలీసులు బ్యారికేడ్లు పెట్టి మరీ.. తెల్లవారు జామున 2:30 గంటల సమయంలో ఆమె అంత్యక్రియలు పూర్తి చేశారు. నిన్న రాత్రంతా కుటుంబ సభ్యులు, బంధువుల ఆందోళనతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒకపక్క తల్లి రోదిస్తూ తన కూతురు మృతదేహాన్ని అప్పగించాలని ఎంత మొత్తుకున్నా పోలీసులు పట్టించుకోలేదు. అంతేకాకుండా ఆమె చివరి చూపు కోసం కుటుంబ సభ్యులు.. మృతురాలిని తీసుకుని వెళ్తున్న అంబులెన్స్ ను అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఆమె చివరి చూపునకు కూడా అనుమంతించకుండా మహిళ మృతదేహాన్ని స్మశాన వాటికకు తీసుకుని వెళ్లారు. దీనికి వ్యతిరేకంగా నిరసనకు దిగిన మహిళ తండ్రి, సోదరులను యుపీ పోలీసులు స్కార్పియో వాహనంలో తీసుకుని వెళ్లారు. గ్రామంలో మహిళకు సంబంధించిన బంధువులు వాహనాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఒక మహిళ ఐతే రోడ్డుపై కూలబడి గుండెలు బాదుకుంటూ ఏడ్వడం కనిపించింది. ఐతే పోలీసులు నిరసనకారులను అడ్డు తొలగించి వాహనాన్ని స్మశాన వాటికకు తీసుకుని వెళ్లిన పోలీసులే తెల్లవారు జామున ఆ మహిళ మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. ఈ సందర్భగా పోలీసులు మానవహారంగా ఏర్పడి మీడియా ప్రతినిధులను, ఆ మహిళ కుటుంబ సభ్యులను, గ్రామస్థులను అడ్డుకున్నారు. చివరకు అక్కడ కేవలం పోలీసులు మాత్రమే మిగిలారు. తెల్లవారితే అక్కడ ఆందోళనలు పెరుగుతాయన్న అనుమానంతో భారీ భద్రత మధ్య అంబులెన్స్ ను నేరుగా శ్మశానానికి తీసుకెళ్లినట్లుగా పోలీసులు తెలిపారు. అయితే యూపీ పోలీసుల చర్యపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.