గులాబీ నేతలకు వల.. సంజయ్ యాత్ర.. బీజేపీ గ్రేటర్ ప్లాన్!
posted on Sep 30, 2020 @ 2:51PM
గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీ దూకుడు పెంచింది. వీలైనంత త్వరగా జీహెచ్ఎంసీ ఎన్నికలు జరపాలని కేసీఆర్ సర్కార్ ప్లాన్ చేస్తుండగా.. అదే స్థాయిలో కమలం నేతలు స్పీడ్ పెంచారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న బీజేపీ.. గ్రేటర్‌పై పట్టు సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటితేనే.. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో పట్టు బిగించవచ్చని భావిస్తోంది. అందుకే గ్రేటర్ ఎన్నికల కోసం అన్ని అస్త్రాలు సిద్ధం చేస్తోంది. గ్రేటర్ లో పార్టీని బలోపేతం చేసేందుకు సంస్థాగతంగా ఆరు జిల్లాలుగా విభజించి కొత్త అధ్యక్షులను నియమించింది. డివిజన్ల వారీగా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని, ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించాలని కొత్త అధ్యక్షులను రాష్ట్ర పార్టీ నాయకత్వం ఆదేశించింది.
గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికలను సవాల్ గా తీసుకుంటున్నారు బీజేపీ నేతలు. జీహెచ్ఎంసీలో మొత్తం 150 డివిజన్లుండగా, అందులో బీజేపీకి ప్రస్తుతం నలుగురు కార్పొరేటర్లే ఉన్నారు. ఇప్పుడు 70 సీట్లపై కన్నేసిన కమలం, ఆ సీట్లను గుర్తించి అందులో గెలుపు అవకాశాలపై కసరత్తు చేస్తోంది. గ్రేటర్లో తమకు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఉండడం మరింత కలిసి వస్తుందనే భావిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఓటర్లు కీలకం కానుండటం, దానికి కిషన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తుండడం, ఆయన కేంద్ర మంత్రి హోదాలో ఉండటంతో ఇది తమకు బాగా అనుకూలిస్తుందనే ధీమాలో పార్టీ క్యాడర్ ఉంది.
టిఆర్ఎస్ ఎత్తులను చిత్తు చేస్తూ, ఎప్పటికప్పుడు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు కమలం నేతలు. గ్రేటర్ లో బండి సంజయ్ తన మార్క్ చూపిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తూ, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ హడావుడి చేస్తున్నారు. దీంతో గ్రేటర్ లో కేటీఆర్ హవా కనిపించకుండా, బిజెపి బలం పెంచుకునేందుకు బండి సంజయ్ ప్లాన్ చేసారు. గ్రేటర్ ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో ఆయన పర్యటించాలనుకుంటున్నారని తెలిసింది. జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లలో కమల దళపతి పర్యటన ఉండేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన సర్వే కూడా నిర్వహిస్తున్నట్లు సమాచారం.
గ్రేటర్ పరిధిలో ఉన్న టిఆర్ఎస్ నాయకులు కొంతమంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారని బీజేపీ అంచనా వేస్తోంది. టీఆర్ఎస్ లో పోటీ చేసే అవకాశం దక్కనివారిని, పార్టీ తీరుతో ఆగ్రహంగా ఉన్నవారిని కమలం నేతలు గుర్తిస్తున్నారు. అటువంటి అసంతృప్తులను గుర్తించి బిజెపిలో చేర్చకోవాలని ప్లాన్ చేస్తోంది. ఓటర్లను ప్రభావితం చేయగలిగిన నాయకులను టిఆర్ఎస్ నుంచి బిజెపిలోకి తీసుకురావాలనే విధంగా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట. పార్టీ హైకమాండ్ కూడా ఇందుకు అంగీకరించిందని చెబుతున్నారు. ఇప్పటికే కొంత మంది నేతలు టిఆర్ఎస్ నుంచి బీజేపీ లోకి వచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వీరందరినీ త్వరలో ఒక వేదిక పైకి తీసుకొచ్చి పార్టీలో చేర్చుకుంటారని గ్రేటర్ బీజేపీ నేతలు చెబుతున్నారు.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ఉద్యమాలు చేస్తోంది. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలన్న డిమాండుతో చలో అసెంబ్లీకి పిలుపునిచ్చి సక్సెస్ అయ్యామని బీజేపీ భావిస్తోంది. గెరిల్లా వ్యూహంతో బీజేపీ కార్యకర్తలు పోలీసులకు చుక్కలు చూపించారని పార్టీలో టాక్. బీజేపీ చలో అసెంబ్లీ కారణంగానే అసెంబ్లీ సమావేశాలను అనుకున్న దానికంటే ముందుగానే వాయిదా వేశారన్న చర్చ నడుస్తోంది. బండి సంజయ్ దూకుడు గ్రేటర్‌లో బీజేపీ బలోపేతానికి ఉపయోగపడుతోందన్న వాదన వినిపిస్తోంది. గ్రేటర్‌లో బీజేపీకి గతంలో కంటే స్థానాలు పెరుగుతాయని ఇటీవల టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించడమే.. హైదరాబాద్‌లో బీజేపీ బలంగా ఉందనటానికి నిదర్శనమని కమలం పార్టీ నేతలు చెబుతున్నారు.