టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వేధిస్తున్నారంటూ హెచ్ఆర్సీ లో ఫిర్యాదు చేసిన మహిళ 

మిర్యాలగూడ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే భాస్కర్‌రావు తన కుటుంబాన్ని వేదిస్తున్నాడని మణెమ్మ అనే మహిళ హైదరాబాద్ లోని రాష్ట్ర మానవహక్కుల కమీషన్ (హెచ్ఆర్సీ)‌ కి ఫిర్యాదు చేసారు. తమ కుటుంబం పై అక్రమ కేసులు బనాయించి ఎమ్మెల్యే భాస్కరరావు వేధిస్తున్నారని మణెమ్మ ఆరోపించారు. మిర్యాలగూడలో కొందరు భూకబ్జాదారులు చెలరేగిపోతున్నారని వారికి ఎమ్మెల్యే అండగా ఉన్నారని ఆమె అన్నారు. తన భర్త లాయర్ అని, అయన ఎమ్మెల్యే బాధితుల తరపున వాదిస్తున్నారని ఆమె తెలిపారు. అయితే భుకబ్జ్దారులకు వ్యతిరేకంగా.. బాధితులకు అండగా ఉన్నందుకు తన భర్తపై కక్ష గట్టి.. అక్రమ కేసులు పెడుతున్నారని ఆమె వాపోయారు. అంతేకాకుండా భాస్కర్ రావు అక్రమాలను ప్రశ్నించినందుకు తన భర్త, కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే.. అయన అనుచరుల నుండి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని హెచ్ఆర్సీకి ఆమె విజ్ఞప్తి చేశారు.

గుంటూరు పోలీస్ స్టేషన్ పై దాడి కేసు ఎత్తివేతను ప్రశ్నించిన హైకోర్టు..

ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో పాత గుంటూరు పోలీస్ స్టేషన్‌పై కొంత మంది దాడి చేసి బీభత్సం సృష్టించారు. ఈ సందర్భంగా వారు పోలీసులపై దాడి చేసి వాహనాలకు నిప్పు పెట్టారు. అయితే దీనికి సంబంధించిన కేసులను వైసిపి ప్రభుత్వం ఎత్తివేస్తూ జీవో జారీ చేసింది. అంతేకాకుండా ఈ కేసులపై ప్రాసిక్యూషన్ ను ఉపసంహరించుకుంటూ ఫిబ్రవరి 17న రాష్ట్ర ప్రభుత్వానికి డీజీపీ లేఖ రాశారు. దీంతో డీజీపీ లేఖని ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్ట్‌ 12న 776 జీవో విడుదల చేస్తూ ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకోవాలని స్టేషన్‌హౌస్ ఆఫీసర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు ఆదేశాలు జారీ చేశారు.   అయితే తాజాగా హైకోర్టులో పసుపులేటి గణేష్ అనే వ్యక్తి ఈ జీవోను సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన కేసునే ప్రభుత్వం ఇలా ఎత్తేస్తూ పొతే.. ఇలాంటి నేరాలు భవిష్యత్‌లో పునరావృతం అయ్యే అవకాశం ఉందని.. కాబట్టి ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ జరపాలని హైకోర్టుకు పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈరోజు విచారణ సందర్భంగా ఈ ప్రభుత్వం ఇచ్చిన జీవోను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం జీవోలోని భాషపైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. జీవోలో నేరుగా ముస్లిం యువత అని పేర్కొనడంపై న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ పిటిషన్‌లో ఎన్ఐఎని కూడా పార్టీగా చేర్చాలని సూచించిన ధర్మాసనం.. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాకుండా పోలీస్ స్టేషన్ పై దాడి కేసును ఎత్తివేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబరు 1వ తేదీకి వాయిదా వేస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది.   అప్పట్లో ఓ చిన్నారిపై జరిగిన అత్యాచారం ఘటన విషయంలో పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసినప్పటికీ.. రాత్రికి రాత్రి కొంత మంది మూకుమ్మడిగా పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. అయితే ఆ ఘటన ఓ ప్రణాళిక ప్రకారం జరిగిందని అప్పట్లో పోలీసులు నిర్ధారించి అందులో పాల్గొన్న వారిపై కేసులు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఏపీలో కొత్తగా వచ్చిన వైసిపి ప్రభుత్వం ఆ కేసుల్ని ఉపసంహరించుకుటూ నిర్ణయం తీసుకుంది.

మంత్రి కొడాలి నాని విపక్షాల ట్రాప్ లో పడిపోయారట.. సజ్జల రామకృష్ణారెడ్డి కవరింగ్

సీఎం జగన్ తిరుమల పర్యటన సందర్భంలో మంత్రి కొడాలి నాని నోటి వెంట మాటల తూటాలు పేలిన సంగతి తెలిసందే. ఏపీలోని ప్రతిపక్షాలనే కాకుండా ఇటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, సాక్షాత్తు అటు ప్రధాని మోడీ పై కూడా మాటలు తూలడంతో బీజేపీ నేతలు మండి పడుతున్నారు. కొడాలి నానిని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలనీ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో వైసిపి నేతలు కవర్ చేసుకునే పనిలో పడ్డారు. తాజాగా ఈ వివాదం పై వైసీపీ ముఖ్యనేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. మంత్రి నాని ప్రతిపక్షాల ట్రాప్ లో పడి ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని.. ఆ వ్యాఖ్యలు మంత్రి వ్యక్తిగతమైనవని.. ఇటువంటి వ్యక్తిగత వ్యాఖ్యలను ఎవరిపై ఎవరు చేసినా సమర్థనీయం కాదని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఈ రకమైన వ్యాఖ్యలు చేసి విపక్షాల ట్రాప్‌లో పడొద్దని ఆయన పార్టీ వర్గాలకు సూచించారు.    సీఎం జగన్ నిన్న భక్తి శ్రద్ధలతో తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారని.. ప్రతిపక్షాలు ఈ విషయం పై కాకుండా ప్రజా సమస్యలపై ధర్నా చేసి ఉంటే బాగుండేదని ఆయన సలహా ఇచ్చారు. అంతేకాకుండా సీఎం జగన్‌ను టార్గెట్ చేసుకుని ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం జరుగుతోందని సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ఐతే రాష్ట్ర ప్రభుత్వంలోనే నెంబర్ 2 గా భావించే సజ్జల ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం గురించి మాట్లాడడం తాజాగా హాట్ టాపిక్ గా మారింది.

ఏసీబీకి చేరిన బెంజ్ వ్యవహారం.. ఆధారాలు చూపినా మంత్రిపై చర్యలు తీసుకోరా?

ఇటీవల ఏపీ రాజకీయాల్లో బెంజ్ కారు లంచం వ్యవహారం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. కార్మిక శాఖ మంత్రి జయరాం కుమారుడు ఈశ్వర్ కి ఈఎస్ఐ స్కాంలో ఏ14 గా ఉన్న కార్తీక్ ఖరీదైన బెంజ్ కారుని గిఫ్ట్ గా ఇచ్చారని టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. అయితే, ఆ కారు తన కుమారుడుది కాదని, కేవలం కారు కీస్ అందిస్తూ ఫోటో మాత్రమే దిగాడని మంత్రి జయరాం చెప్పుకొచ్చారు. కానీ, ఆయన కుమారుడు పలు సందర్భాల్లో ఆ కారులో చక్కర్లు కొట్టిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో మంత్రి సైలెంట్ అయ్యారు.   ఇదిలా ఉంటే, తాజాగా మంత్రి జయరాంపై చర్యలు తీసుకోవాలని ఏసీబీకి ఆధారాలతో మంత్రి అయ్యన్నపాత్రుడు ఫిర్యాదు చేశారు. గురువారం టీడీపీ నేతలతో కలిసి అయ్యన్న ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అయ్యన్న మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి జయరాం, జగన్ సర్కార్‌ పై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి జయరాం తనయుడు ఈశ్వర్ అవినీతిపై తాను ఆధారాలతో బయట పెట్టానన్నారు. ఒక వ్యాపారస్తుడు అంత ఖరీదైన కారు ఎందుకు బహుమతి ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈఎస్ఐ కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తితో మంత్రి, ఆయన తనయుడు ఫోటో ఎందుకు దిగారని ప్రశ్నించారు.   రాష్ట్రం లో అవినీతి జరిగితే క్షమించనన్న ముఖ్యమంత్రి ఇప్పుడేమయ్యారు అని ప్రశ్నించారు. అవినీతిపై ఫిర్యాదు చేయడానికి ఫోన్ నంబర్లు ఇచ్చారు. ఇదివరకే నేను కాల్ సెంటర్‌కి ఫోన్ చేసి పిర్యాదు చేశాను కానీ ఇంతవరకు స్పందన లేదని విమర్శించారు. ఈఎస్ఐ కేసులో మంత్రి అవినీతి చేశారని ఆధారాలు చూపించినా ఎందుకు స్పందించడం లేదు? అని నిలదీశారు. ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవలసింది పోయి మంత్రిని కాపాడాలని చూస్తున్నారని మండిపడ్డారు. అచ్చెన్నాయుడుని ఆధారాలు లేకుండా అక్రమంగా అరెస్టు చేశారు. మేము అవినీతికి పాల్పడ్డారని ఆధారాలు చూపిస్తే మాత్రం ఇంతవరకు చర్యలు తీసుకోలేదని విరుచుకుపడ్డారు. మంత్రి జయరాంని వెంటనే మంత్రి పదవి నుంచి తొలిగించాలని డిమాండ్ చేశారు. ఏసీబీపై మాకు నమ్మకం ఉంది. ఒకవేళ ఏసీబీ వద్ద న్యాయం జరగకపోతే గవర్నర్‌ను కలుస్తాం అని అయ్యన్న స్పష్టం చేశారు.

వివేకా హత్య కేసులో ట్విస్ట్.. సీబీఐకి కీలక ఆధారాలు లభ్యం

మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై సీబీఐ విచారణ కొనసాగుతోంది. పలువురు అనుమానితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. నిన్న ఇద్దరు కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకొని సీబీఐ అధికారులు విచారించారు. ఎంపీ అవినాష్ రెడ్డి సన్నిహితుడు, యురేనీయం కర్మగారంలో ఉద్యోగి ఉదయ్ కుమార్ రెడ్డి ఫోన్ సీబీఐ బృందం స్వాధీనం చేసుకుంది.   పులివెందులకు చెందిన చెప్పుల వ్యాపారి మున్నా. అతడి కుటుంబ సభ్యులను సీబీఐ అధికారులు విచారించారు. అయితే మున్నా బ్యాంక్‌ లాకర్‌లో 48 లక్షల నగదు, 25 తులాల బంగారాన్ని అధికారులు గుర్తించారు. ఇదేకాకుండా మరికొన్ని బ్యాంకులలో 20 లక్షల ఎఫ్‌డీలు కూడా ఉన్నట్లు తెలుసుకున్నారు. అతని బ్యాంక్ ఖాతాలను సీజ్ చేసి.. నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు.   గతంలో మున్నా ఫ్యామిలీ పంచాయితీలో వైఎస్ వివేకా కలగజేసుకున్నట్లు సమాచారం. మున్నా ముగ్గురిని వివాహం చేసుకోగా భార్య భర్తల పంచాయితీ వివేకా వద్దకు రావడంతో అప్పట్లో మున్నాను వివేకా మందలిచినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మున్నా మొదటి భార్యను విచారించి అనంతరం అనంతపురం జిల్లా కదిరిలో నివాసం ఉంటున్న మున్నా ఇంటికి వెళ్లి.. అతడి తల్లి సమక్షంలో బ్యాంక్ లాకర్ తెరిచి అందులో ఉన్న నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. అలాగే, మున్నా సన్నిహితులను, స్నేహితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.

కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలి.. లేదంటే ఆయన వ్యాఖ్యల వెనుక జగన్ ఉన్నట్టే

ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కొడాలి నానిని బర్తరఫ్ చెయ్యాలని, ఆయనపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.   విజయవాడలోని బీజేపీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి, పాతూరి నాగభూషణం, నూతలపాటి బాల, వంగవీటి నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు.    ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి ఎంత కాలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తారని ప్రశ్నించారు. కొడాలి నాని, రోజా వంటి వారు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ, యోగి ఆదిత్యనాథ్ వంటి వారి గురించి మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు. యోగిల గురించి నాని వంటి భోగిలు మాట్లాడుతారా అని విమర్శించారు.   రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ లు.. ప్రభుత్వానికి 'అయ్యా.. ఎస్' అనవద్దని సూచించారు. కొడాలి నాని వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసినా ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. అదే చర్చిపై రాళ్లు వేస్తే 41 మందిని అరెస్టు చేశారని, అమరావతిలో మహిళలపై కేసులు పెట్టి అరెస్ట్‌లు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నానిపై కేసు పెట్టి అరెస్ట్ చేయాలనేదే తమ డిమాండ్ అన్నారు. హిందూ సమాజం ఓపిక ఉన్నంత వరకే... ఆ తర్వాత ఎవరూ ఆపలేరని హెచ్చరించారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్న మంత్రులు క్యాబినెట్ లో ఉండకూడదని డిమాండ్ చేశారు. జగన్ చర్యలు తీసుకోకపోతే.. నాని చేత ఆయనే ఇలా మాట్లాడిస్తున్నది‌ వాస్తవం అవుతుందని విష్ణువర్ధన్‌ రెడ్డి అన్నారు. మరి, జగన్ ఈ వివాదంపై స్పందిస్తారో లేక ఇలాగే మౌనంగా ఉంటూ నాని వ్యాఖ్యల వెనుక తాను ఉన్నానని పరోక్షంగా సంకేతాలు ఇస్తారో చూడాలి.   మరోవైపు, గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట బీజేపీ కార్యకర్తలు కొడాలి నాని వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. అలాగే, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద కూడా బీజేపీ శ్రేణులు ధర్నాకు దిగారు. హిందూ దేవాలయాలపైనా, ప్రధాని పైనా అనుచిత వ్యాఖ్యలు చేసిన కొడాలి నానిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

బీజేపీకి జనసేన షాక్.. ఒకే రాజధానికి కట్టుబడి ఉన్నాం

ఏపీ రాజధానిగా అమరావతి ఉండాలన్న అభిప్రాయానికి కట్టుబడి ఉన్నట్లు జనసేన పార్టీ స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలతో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ తరఫున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శివశంకరరావు అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఇందులో జనసేన పలు అంశాలు ప్రస్తావించింది. ఏపీ ప్రభుత్వ మూడు రాజధానుల విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని.. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, 13 జిల్లాల సమగ్రాభివృద్ధే తమ వైఖరని క్లారిటీ ఇచ్చింది.    అమరావతిని రాజధానిగా ప్రతిపాదించినపుడు అన్ని రాజకీయ పక్షాలు మద్దతిచ్చాయని కోర్టుకు జనసేన హైకోర్టుకు తెలిపింది. ప్రభుత్వంపై నమ్మకంతో రాజధాని నిర్మాణం కోసం అమరావతి రైతులు తమ భూములను త్యాగం చేశారని గుర్తు చేసింది. రాజధాని కోసం భూములు ఇచ్చిన వారిలో ఎక్కువమంది పేద, సన్నకారు రైతులు ఉన్నారని.. వారిలోనూ ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారని వివరించింది. అమరావతిని అభివృద్ధి చేస్తారని నమ్మి భూములు త్యాగం చేశారని ప్రస్తావించింది.   గతంలో అమరావతికి మద్దతిచ్చిన వైసీపీ అధికారంలోకి వచ్చాక తన అభిప్రాయం మార్చుకుందని పేర్కొంది. మూడు రాజధానుల ఏర్పాటు  చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి.. రాజ్యాంగ, న్యాయపరమైన ప్రాతిపదిక లేదంటూ తన అభిప్రాయాన్ని జనసేన హైకోర్టుకు తెలియజేసింది. ప్రభుత్వం చట్ట సభల సాంప్రదాయాన్ని, రూల్స్ ని అతిక్రమించి బిల్లులను ఆమోదింపచేసుకుందని తెలిపింది. పాలనా వికేంద్రీకరణ చట్టం, సీఆర్‌డీఏ రద్దు చట్టాల్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరింది.   రాజధాని అంశం ప్రస్తుత, మాజీ ముఖ్యమంత్రుల మధ్య వ్యక్తిగత గొడవగా మారిందని అభిప్రాయపడింది. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి.. ప్రతీకారంతో సాగే పాలన, విభజించి పాలించే కుట్రలు సరికాదని పేర్కొంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా గత ప్రభుత్వ విధానాలు మార్చకూడదని వ్యాఖ్యానించింది. గత ప్రభుత్వ విధానాల్లో తప్పులు, అక్రమాలుంటే వాటిని సరిదిద్దేందుకు ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని.. కానీ విధానాలు మారిస్తే అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని జనసేన అఫిడవిట్‌ లో పేర్కొంది.    కాగా, బీజేపీ మాత్రం అమరావతి విషయంలో స్పష్టమైన వైఖరికి తెలియజేయకుండా రెండు నాలుకల ధోరణి ప్రదర్శిస్తుంటే.. మిత్రపక్షం జనసేన మాత్రం ఏపీ రాజధానిగా అమరావతి ఉండాలన్న అభిప్రాయానికి కట్టుబడి ఉన్నట్లు తేల్చి చెప్పాడం ఆసక్తికరంగా మారింది. జనసేనతో కలిసి వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్తున్న బీజేపీ.. రాజధాని విషయంలో జనసేన అభిప్రాయమే మా అభిప్రాయం అని చెప్తుందో లేక ఇలాగే రెండు నాలుకల ధోరణి ప్రదర్శిస్తుందో చూడాలి.

గోరటి కాదు దేశపతే! నాగేశ్వర్ కు సపోర్ట్? రూటు మారిన కారు 

తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై సస్పెన్స్ కొనసాగుతోంది. టీఆర్ఎస్ ఆశావహులంతా పార్టీ అధినాయకత్వానికి తమ విన్నపాలను అందిస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ ఈసారి పక్కా పొలిటికల్ రూట్ లో వెళ్లకుండా... ట్రాక్ మార్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమకారులకే అవకాశం ఇవ్వాలని గులాబీ బాస్ డిసైడ్ అయినట్టు సమాచారం. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో ముందున్న ప్రజాగాయకుడు, ప్రస్తుతం సీఎం ఓఎస్డీగా ఉన్న దేశపతి శ్రీనివాస్ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. కళాకారుడి కోటాలో ఈయనకు సీఎం కేసీఆర్ ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీకి ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న పేరు కూడా వినిపించింది. ఇటీవలే గోరటి.. సీఎం కేసీఆర్‌ను కూడా కలువడంతో ఆయనకు సీటు ఖాయమైనట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా పేర్లు మారిపోయి దేశపతికే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.  తెలంగాణలో గవర్నర్‌ కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. సభావత్‌ రాములునాయక్‌ సీటు మార్చి 2న ఖాళీ కాగా, నాయిని నర్సింహారెడ్డి జూన్‌ 19న, కర్నె ప్రభాకర్‌ ఆగస్టు 17న ఖాళీ అయింది. మూడు సీట్లను భర్తీ చేస్తారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కాని ఆశావహులు ఎక్కువగా ఉండటంతో  కసరత్తు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మండలిలో ప్రభుత్వ విప్ గా పని చేసిన కర్నె ప్రభాకర్‌కు ఎక్స్ టెన్షన్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. సీనియర్‌ నేత నాయిని నర్సింహరెడ్డికి కూడా మళ్లీ ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. మూడో స్థానం కోసం మాజీ ఎంపీ సీతారాంనాయక్‌, కరీంనగర్‌ మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌ , మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పేర్లు ఎక్కువగా వినిపించాయి. పీవీ కూతురు వాణికి కూడా ఇవ్వొచ్చని ప్రచారం జరిగింది. అయితే దేశపతికే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ సీటు ఖరారైందని తెలుస్తోంది.               గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలపైనా కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు టీఆర్ఎస్ వర్గాల సమాచారం. హైద్రాబాద్- రంగారెడ్డి-  మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి  ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. అయితే  నాగేశ్వర్ కు పోటీగా టీఆర్ఎస్ నుంచి పోటీకి నిలబెట్టకుండా, ఆయనకు మద్దతివ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. హైద్రాబాద్ సీటుకు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ను బరిలోకి దింపాలని కేటీఆర్ ప్లాన్ చేసినట్లు ఇటీవల ప్రచారం జరిగింది. అయితే బొంతు కాకుండా ప్రొఫెసర్ నాగేశ్వర్ కు సపోర్ట్ చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. నల్గొండ-వరంగల్- ఖమ్మం గ్రాడ్యుయేట్ స్థానం నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డిని పోటీకి దించే  అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రి మల్లారెడ్డి అల్లుడైన మర్రి రాజశేఖర్ రెడ్డి.. గత లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి లోక్ సభ సీటులో  రేవంత్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు.  మరోవైపు అధికార పార్టీగా ఉండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు ఇవ్వడంపై పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ నుంచి అధికారికంగా అభ్యర్థి పోటీ చేయకుంటే.. ఓడిపోతారనే భయంతోనే వెనక్కి తగ్గారని విపక్షాలు ప్రచారం చేసే అవకాశం ఉందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఉద్యమకారుడికే సపోర్ట్ చేస్తున్నందున పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చని మరికొందరు చెబుతున్నారు. టీజేఎస్ చైర్మెన్ కోదండరామ్ పోటీ చేయబోతున్నవరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మర్రి రాజశేఖర్ రెడ్డి గట్టి పోటీ ఇవ్వకపోవచ్చని ఆ మూడు జిల్లాల నేతలు అధిష్టానానికి చెబుతున్నారట.

గుడ్ న్యూస్.. రేపటి నుండి హైదరాబాద్ లో పూర్తి స్థాయిలో సిటీ బస్సులు.. 

దాదాపు ఆరు నెలల క్రితం హైదరాబాద్ లో ఆగిపోయిన సిటీ బస్సులు రేపు మళ్ళీ పూర్తీ స్థాయిలో అందుబాటులోకి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ శివారులోని డిపోల నుండి రెండు రోజులుగా పరిమిత సంఖ్యలో ఆర్డినరీ బస్సులనే నడిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 135 రూట్లలో డిపోకు 10-12 బస్సుల చొప్పున 229 బస్సులు గత రెండు రోజులుగా తిరిగాయి. ఐతే గ్రేటర్‌ పరిధిలోని బస్సు డిపోల్లో 3,200 సిటీ బస్సులున్నాయి. ఈ బస్సులను శుక్రవారం నుంచి పూర్తిస్థాయిలో నడిపేందుకు చర్యలు వేగవంతం అవుతున్నట్లుగా తెలుస్తోంది.    కరోనా మరియు లాక్ డౌన్ కారణంగా గత మార్చి 19న జిల్లా, సిటీ బస్సులు నిలిపివేసిన సంగతి తెల్సిందే. ఐతే బస్సులు నడుపుకొనేందుకు కేంద్రం అనుమతించడంతో మే 19న జిల్లా సర్వేస్సులు ప్రారంభమయ్యాయి. అయితే కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో సిటీ బస్సుల్లో సోషల్ డిస్టెన్స్ వంటి నిబంధనలు పాటించడం కష్టంగా ఉండటంతో హైదరాబాద్ లో బస్సులను నడిపేందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. ఐతే అటు కర్ణాటక ఇటు ఏపీలో కూడా సిటీ బస్సులు స్టార్ట్ కావడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో బుధవారం శివారు డిపోల నుండి కొన్ని బస్సులను ప్రారంభించారు. హైదరాబాద్ లో సిటీ బస్సులను ఏ క్షణంలోనైనా ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలని ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మకు సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ సూచించినట్లు సమాచారం. దీంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ అధికారులు దీనికి కావలసిన ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది.

తిరుమల నుండి హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరిన సీఎం జగన్.. ఎందుకంటే..

ఏపీ సీఎం జగన్ తిరుమల పర్యటన ఈ రోజు ఉదయంతో ముగిసింది. ఐతే తిరుమల నుండి అమరావతికి చేరుకోవాల్సిన సీఎం జగన్ పర్యటనలో చివరి నిమిషంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. సీఎం సతీమణి వైఎస్ భారతి తండ్రి అనారోగ్యం కారణంగా చివరి నిమిషంలో అయన హైదరాబాద్ కు బయలుదేరారు. కొద్దీ సేపటి క్రితం రేణిగుంట ఎయిర్ పోర్టు నుండి బయలుదేరిన అయన నేరుగా బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోన్నారు. తీవ్ర అనారోగ్యం కారణంగా సీఎం భార్య వైఎస్ భారతి తండ్రి గంగిరెడ్డి హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చేరారు. దీంతో ఈరోజు ఉదయం 11:30 గంటలకు నగరంలోని కాంటినెంటల్ ఆసుపత్రికి వెళ్లి తన మామగారైన గంగిరెడ్డిని పరామర్శించనున్నారు. తరువాత మళ్ళీ తిరిగి బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు.

అస్సాంలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కలకలం.. 12 వేల పందులను చంపేయాలని ప్రభుత్వ ఆదేశం

భారత్ లో కరోనా ఇప్పటికే కల్లోలం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. దేశంలో కరోనా మరణాలు 90 వేలకు చేరగా మొత్తం పాజిటీవ్ కేసుల సంఖ్య 57 లక్షలకు చేరుకున్నాయి. ఇది ఇలా ఉండగా అస్సాం రాష్ట్రంలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. ప్రమాదకరమైన ఈ ఫ్లూ కారణంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 18 వేలకు పైగా పందులు మృత్యువాత పడ్డాయి. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యాధి కొత్త ప్రాంతాలకు విస్తరించకుండా కఠిన చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ వ్యాపించిన ప్రాంతాల్లోని 12 వేల పందులను చంపేయాలని.. వాటి యజమానులకు నష్ట పరిహారం అందించాలని అస్సాం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ అధికారులను ఆదేశించారు. అధికారులతో జరిగిన అత్యవసర సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా, నిపుణుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని పందులను వధించాలని ఈ మొత్తం ప్రక్రియ దసరాకు ముందే పూర్తిచేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో 30 ప్రభావిత ప్రాంతాల్లో కిలోమీటర్ పరిధిలోని పందులను వధించనున్నట్టు ప్రభుత్వ అధికారులు తెలిపారు. అలాగే నష్టపరిహారాన్ని వాటి యజమానులు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని అధికారులు తెలిపారు.

జగన్ తిరుమల పర్యటన.. నో మాస్క్, నో డిక్లరేషన్‌

తిరుమల వేంకటేశ్వరస్వామికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున సీఎం వైఎస్ జగన్ పట్టు వస్త్రాలను సమర్పించారు. అయితే, జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని ప్రతిపక్షాలు పట్టుబట్టిన సంగతి తెలిసిందే. కానీ, డిక్లరేషన్‌ ఇవ్వకుండానే శ్రీవారి ఆలయంలోకి జగన్‌ ప్రవేశించారు. సంప్రదాయ వస్త్రధారణతో జగన్ నుదుట నామాలు పెట్టుకున్నారు. మొదట బేడీ ఆంజనేయస్వామి ఆలయంలో జగన్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత గరుడవాహన సేవలో పాల్గొన్నారు.    ఇదిలా ఉంటే జగన్ తిరుమల పర్యటనలో కోవిడ్ నిబంధనలను పాటించకపోవడం విమర్శలు తావిస్తోంది. ఏపీలో కరోనా విలయతాండవం చేస్తున్నా.. మొదటి నుండి మాస్క్ కి దూరంగా ఉంటున్న జగన్.. తిరుమల పర్యటనలోనూ మాస్క్ లేకుండానే కనిపించారు. జగన్ ఢిల్లీ పర్యటనను ముగించుకుని నేరుగా రేణిగుంట విమానాశ్రానికి వచ్చారు. అక్కడ ఆయనకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు రోజా, భూమన కరుణాకర్‌రెడ్డిలు ఇతర నాయకులు ఘన స్వాగతం పలికారు. అయితే, ఒకరిద్దరు తప్ప జగన్ తో సహా ఎవరూ మాస్క్‌లు పెట్టుకోలేదు. ఇక రేణిగుంట నుంచి నేరుగా జగన్ తిరుమల చేరుకున్నారు. అక్కడ కూడా జగన్ ముఖంపై మాస్క్ కనిపించలేదు. అసలే ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజూ 7 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డారు. అయినప్పటికీ, తిరుమల పర్యటనలో కూడా సీఎం ముఖంపై మాస్క్ కనిపించకపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరో పాతికేళ్ళు కూడా జగన్ డిక్లరేషన్ ఇవ్వరు.. ఏం చేసుకుంటారో చేసుకోండి: రోజా

సీఎం జగన్ తిరుమల పర్యటనలో డిక్లరేషన్ వ్యవహారం అంతకంతకు ముదురుతోంది. ఒక పక్క టీడీపీ, బీజేపీ, అలాగే హిందూ సంఘాలు వందల ఏళ్ళ నుండి ఉన్న సంప్రదాయాల ప్రకారం సీఎం జగన్ డిక్లరేషన్ పై సంతకం చేసి తిరుమల స్వామి వారిని దర్శించుకోవాలని పట్టు పడుతుండగా మరో పక్క మంత్రి కొడాలి నాని వంటి వారు సీఎం డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంటూ అటు ప్రతిపక్షాలు ఇటు హిందూ సంఘాల పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు.   మంత్రి కొడాలి నాని వ్యాఖ్యల దుమారం చల్లారాక ముందే తాజాగా నగరి ఎమ్మెల్యే రోజా అగ్నిలో ఆజ్యం పొసే పని చేస్తున్నారు. సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండానే పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఏం చేసుకుంటారో చేసుకోండని తాజాగా రోజా సవాల్ చేశారు. ఆమె అంతటితో ఆగకుండా.. వచ్చేమూడేళ్లు మాత్రమే కాదు.. జగన్ మరో పాతిక, ముఫ్పై ఏళ్లు సీఎంగా ఉంటారని అన్ని సంవత్సరాలు ఆయన డిక్లరేషన్ పై సంతకం పెట్టకుండానే తిరుమల దర్శననానికి వెళ్తారని ప్రకటించి మరో వివాదానికి తేరా తీశారు.   ఇప్పటికే ఓ వైపు కొడాలి నాని వ్యాఖ్యలతోనే హిందూ సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమయంలో ఎమ్మెల్యే రోజా కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో హిందూ సంస్థలు మరింతగా భగ్గమనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు తిరుమల శ్రీవారిపై నమ్మకంతోనే వెళ్తున్నప్పుడు తమకు విశ్వాసం ఉందని ఓ డిక్లరేషన్ ఇస్తే సమసిపోయే వివాదాన్ని ఇలా ఎందుకు ఉద్దేశపూర్వకంగా వివాదం పెద్దది చేస్తున్నారో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. వైసీపీలో కాస్త నోరున్న నేతలు ఎవరూ ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అసలు వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.   వైసిపి నేతలు కొడాలి నాని, రోజా తీవ్ర వ్యాఖ్యల వెనుక మరో కోణం ఉందని విశ్లేషకులు చెపుతున్నారు. కొద్దీ రోజులుగా ఏపీలో హిందూ ప్రార్థన స్థలాలపై వరుసగా జరుగుతున్న దాడులతో అటు వైసిపి, ఇటు బీజేపీ నేతల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడుస్తూ ఉండడంతో ఒక వర్గం ప్రజల్లోకి బీజేపీ చొచ్చుకుపోతుందని దీంతో ప్రతిపక్ష టీడీపీని నిర్వీర్యం చేయవచ్చనే ఉద్దేశంతో రెండు పార్టీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయని కొందరి విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే చర్యలు.. హిందూ ఆలయాలపై దాడులు జరిగితే మౌనం!

ఏడాది కాలంగా ఏపీలో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ నెల రోజుల వ్యవధిలో పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. అంతర్వేది నరసింహ స్వామి రథం దగ్దం, విజయవాడ దుర్గమ్మ గుడిలో వెండి రథానికి ఉండే సింహాలు మాయం, విజయవాడలో సాయిబాబా విగ్రహం ధ్వంసం, తాజాగా కర్నూల్ జిల్లాలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం.. ఇలా రాష్ట్రంలో వరుసగా ఘటనలు చేసుకుంటున్నాయి. అయితే, రాష్ట్రంలో ఈ స్థాయిలో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నా పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.   ఇటీవల కాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారంటూ ఎందరికో నోటీసులు ఇచ్చారు, కేసులు పెట్టారు. 60 ఏళ్ళు దాటిన పెద్దావిడను సైతం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ షేర్ చేశారంటూ విచారణ పేరుతో ఇబ్బంది పెట్టారు. కేవలం సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోస్ట్ లు పెట్టినందుకే.. కేసులు, విచారణలు అంటూ హడావుడి చేసిన పోలీసులు.. ఇప్పుడు హిందూ ఆలయాలపై ఈ స్థాయిలో దాడులు జరుగుతుంటే ఎందుకు సరైన చర్యలు తీసుకోలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రథం దగ్దం ఘటన తేనె తీసే క్రమంలో జరిగిందని, పిచ్చి వాళ్ళ పని అయ్యుంటుందని చెప్పుకొచ్చారు. విజయవాడ దుర్గ గుడిలో వెండి సింహాలు ఎలా మాయమయ్యాయో కనీస అంచనాకు రాలేకపోయారు. ఇక మిగతా దేవుళ్ళ విగ్రహాల ధ్వంసం ఘటనలు సరేసరి. ఇంతవరకు దాడులకు కారణమైన వారిని పట్టుకోలేకపోయారు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిని పట్టుకోవడం మీద పెడుతున్న శ్రద్ధ.. హిందూ ఆలయాలపై దాడులు చేస్తున్న వారిని పట్టుకోవడంలో ఎందుకు పెట్టలేకపోతున్నారు?. దేవుడు కూడా అధికార పార్టీకి చెందిన వాడైతే చర్యలు తీసుకుంటారా? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఏపీలో కరోనాతో మరో 55 మంది మృతి

ఏపీలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. కొన్ని రోజుల క్రితం వరకు ప్రతి రోజు 10 వేలకు పైగా కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం 7-8 వేల కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 72,838 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వీరిలో 7,228 మందికి పాజిటివ్‌ గా తేలింది. తాజా కేసులతో రాష్ట్రంలోని మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,46,530 కి పెరిగింది. గత 24 గంటల్లో 55 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో, ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,506 కి చేరింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 8,291 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 5,70,667కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 70,357 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ప్రధానిపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు.. జగన్ ఢిల్లీ టూర్ ఎఫెక్టేనా?

తిరుమల డిక్లరేషన్ పై మంత్ర కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యల వేడి చల్లారక ముందే కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాసేపటి క్రితం తిరుమల చేరుకున్న ఆయన.. ప్రధాని మోదీపైన సంచలన వ్యాఖ్యలు చేశారు.   తిరుమలకు జగన్ సతీసమేతంగా రావాలని, సంప్రదాయాన్ని పాటించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న వేళ.. ప్రధాని మోదీని కూడా సతీసమేతంగా ఆలయాలకు రమ్మని చెప్పాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, యూపీ సీఎం ఒంటరిగా ఆలయాలకు వెళ్తారు. జగన్ మాత్రం కుటుంబసమేతంగా ఆలయానికి రావాలా? మోదీ తన భార్యను తీసుకెళ్లి రామాలయంలో పూజలు చేయమనండి అంటూ కొడాలి నాని విరుచుకుపడ్డారు.   ఇక తనను బర్తరఫ్ చేయాలన్న బీజేపీ డిమాండ్‍పై కూడా స్పందించిన కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పదిమందిని వెంటబెట్టుకుని అమిత్‍షాను తొలగించాలంటే తొలగిస్తారా? అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ వచ్చిన బీజేపీకి.. అత్యధిక ఓట్లు వచ్చిన జగన్‍కు సలహాలు ఇచ్చే స్థాయి ఉందా? అని ధ్వజమెత్తారు.   బ్రహ్మోత్సవాల సమయంలో టీడీపీ, బీజేపీలు డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. బీజేపి అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించాకే ఆలయాలపై దాడులు పెరిగాయన్నారు. వెంకటేశ్వర స్వామిని కూడా చంద్రబాబు రాజకీయంగా వాడుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు వెంకన్నను వాడుకుంటే రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందే అన్నారు.   శ్రీవారిని దర్శించుకునే సమయంలో డిక్లరేషన్ సమర్పించాల్సిన అవసరం లేదని మరోసారి ఉద్ఘాటించిన ఆయన.. స్వామి వారిపై నమ్మకంతోనే భక్తులు తిరుమలకు వస్తారన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని, డిక్లరేషన్‌పై చర్చ జరగాలన్నారు. అసలు ఈ నిబంధన ఎప్పుడు నుంచి అమలులో ఉందో బహిర్గతం చెయ్యాలని.. ఈ నిబంధనను రాజులు పెట్టారా? బ్రిటీష్ వాళ్లు తీసుకొచ్చారా? అనే విషయంపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు.    తిరుమల వెంకన్న ఆశీస్సులతోనే జగన్ సీఎం అయ్యారని నాని చెప్పారు. సీఎం హోదాలోనే ఆయన తిరుమలకు వస్తున్నారని, స్వామికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారని అన్నారు. సీఎం జగన్‌కు కులాల, మతాలతో సంబంధం లేదన్నారు. హిందూ దేవాలయంలో హిందువులా, చర్చిలో క్రైస్తవుడిలా, మసీదులో నవాబులా ఉంటారని చెప్పుకొచ్చారు. పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సీఎంను టీటీడీ ఆహ్వానిస్తే డిక్లరేషన్ ఎందుకు సమర్పించాలని కొడాలి నాని ప్రశ్నించారు.    కాగా, ప్రధాని మోదీ పైనా, బీజేపీ పైనా ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయడానికి వేరే కారణం ఉందన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా ఢిల్లీ టూర్ లో సీఎం జగన్ కి అమిత్ షా క్లాస్ పీకారని వార్తలొచ్చాయి. ఏపీలో న్యాయ వ్యవస్థ పైనా, హిందూ ఆలయలపైనా జరుగుతున్న దాడుల నేపథ్యంలో జగన్ ని అమిత్ షా తీవ్రంగా మందలించారని తెలుస్తోంది. దీంతో ఉక్రోషంలో జగన్.. కొడాలి నానిని తిరుమలకు పిలిపించి మరీ మాట్లాడించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలతో హిందూ పెద్దల ఆగ్రహానికి గురైన కొడాలి నాని.. ఇప్పుడు ప్రధానిపై చేసిన వ్యాఖ్యలతో ముందు ముందు ఎలాంటి పరిణామాలు ఎదురుకుంటారో చూడాలి.

హైదరాబాద్ లో చినుకు పడితే గులాబీ పార్టీకి వణుకు.. 25 వేల కోట్లతో ఏం చేశారు?

చినుకు పడితే ఎవరైనా చిందేస్తారు. కాని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వాన పడుతుంటే అధికార గులాబీ పార్టీ నేతలు వణికిపోతున్నారు. హైదరాబాద్ ను  డల్లాస్ చేస్తాం, ఓల్డ్ సిటిని ఇస్తాంబుల్ చేస్తామని గతంలో గొప్పగా ప్రకటించారు కేసీఆర్. ఇప్పుడు కూడా చెబుతూనే ఉన్నారు టీఆర్ఎస్ నేతలు. అయితే  ఇప్పుడు చిన్న పాటి వర్షానికే హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది. ఐదు సెంటిమీటర్ల సరాసరి వర్షానికే సిటీలో రోడ్లు, కాలనీలు, డ్రైనేజీలన్ని ఏకమవుతున్నాయి. వరద నీటిలో పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. విశ్వనగరమో ఏమో కాని టీఆర్ఎస్ పాలనలో ఇంకా సమస్యలు పెరిగిపోయాయని,, గ్రేటర్ హైదరాబాద్ మరింత పూర్ గా మారిందని సిటీ ప్రజలు ఆరోపిస్తున్నారు.   ఆరేండ్లలో హైదరాబాద్ లో దాదాపు 25 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెబుతున్నారు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్‌ అతలాకుతలమైంది. రోడ్లన్నీ వరదకాలువలను తలపించాయి. సిటీలో రోడ్లు, కాలనీలు, డ్రైనేజీలన్ని ఏకమయ్యాయి. కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు సైతం కుంగిపోయాయి. గ్రేటర్ పరిధిలో నాలాలు, డ్రైనేజీలు ప్రజల పాలిట శాపంగా మారాయి. ఇంటి నుంచి బయటికి వస్తే ప్రాణాలను హరిస్తున్నాయి. వరదల్లో కొట్టుకుపోయి సిటీ ప్రజలు విగతజీవులుగా మారుతున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి 24 గంటల్లోనే నగరంలో ఇద్దరు వరద నీటిలో గల్లంతయ్యారు. నేరెడ్ మెట్ లో సైకిల్ పై రోడ్డుపైకి వచ్చిన బాలిక.. ఓపెన్ నాలాలో పడి కొట్టుకుపోయింది. 20 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత బాలిక డెడ్ బాడీ రెండు కిలోమీటర్ల దూరంలోని చెరువులో దొరికింది. బాలిక చనిపోయిన ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే మరొకరు వరద నీటికి బలయ్యాడు. సరూర్ నగర్ తపోవన్ కాలనీలో నవీన్ కుమార్ అనే వ్యక్తి.. రోడ్డుపై ప్రవహిస్తున్న వరద నీటిలో పడి కొట్టుకుపోయాడు. చివరికి 20 గంటల తర్వాత సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ లో నవీన్ శవాన్ని గుర్తించింది ఎన్డీఆర్ఎఫ్ టీమ్.                         దేశంలో ఎక్కడా లేనట్లుగా హైదరాబాద్ లో డిజాస్టర్ మేనేజ్ మెంట్ టీమ్ లను ఏర్పాటు చేశామని కేటీఆర్ వెబినార్లలో గొప్పలు చెప్పుకుంటారు. అయితే వరదలో కొట్టుకుపోయిన ఇద్దరు వ్యక్తులను 20 గంటలైనా గుర్తించలేకపోయారు. అందరూ చూస్తుండగానే నీటిలో కొట్టుకుపోయిన నవీన్ కుమార్ ను గుర్తించడానికి ఒక రోజంతా పట్టిందంటే గ్రేటర్ అధికారుల పనితీరు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. తమ బాలిక కనిపించడం లేదని తల్లిదండ్రులు చెప్పినా.. అధికారులు స్పందించ లేదని స్థానికులు ఆరోపించారు. వరదలు తమ కాలనీకి ముంచెత్తినా బల్దియా అధికారులెవరు తమకు సాయం చేయలేదని ముంపు బాధితులు ఆరోపిస్తున్నారు. వరదలో ఇండ్ల నుంచి బయటికి వెళ్లలేక నరకయాతన పడుతున్నా ఎవరూ రాలేదని చెబుతున్నారు. కార్లు కొట్టుకుపోయే పరిస్థితి ఉందంటే హైదరాబాద్ ను ఎలా అభివృద్ధి చేశారో ఊహించుకోవచ్చు. ముంబైలో 24 గంటల్లోనే ఒక్కోసారి 30 నుంచి 40 సెంటిమీటర్ల వర్షం పడుతుంది. అలాంటి వర్షమే హైదరాబాద్ లో పడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే భయంగా ఉంది. ఆరేండ్లలో 25 వేల కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టారో, ఏ నిర్మించారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.   సిటీ రోడ్లు నరక కూపాలుగా మారాయి. వరద నీరు పోయే నాలాలు విస్తరించలేదు, కొత్త కాల్వలకు గతి లేదు.. రోడ్లన్ని గుంతలుగానే ఉన్నాయి. మోకాలిలోతుకు పైగా నీరు నిలవడంతో ఎక్కడ గుంతలున్నాయో తెలియక వాహనదారులు అదుపుతప్పి కిందపడ్డారు. హైదరాబాద్‌ రోడ్లపై గుంత చూపిస్తే వెయ్యి రూపాయలు బహుమతిగా ఇస్తానని గతంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సవాలు విసిరారు. ఆ సమయంలోనే ప్రభుత్వంపై ప్రజల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. హైదరాబాద్ లో రోడ్లపై అన్ని గుంతలే ఉండటంతో సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ఆటాడుకున్నారు నెటిజన్లు. గుంత రోడ్ల ఫోటోలు పెడుతూ కేసీఆర్, కేటీఆర్ ను నిలదీశారు. ఎవరైనా గుంతలు లేని రోడ్డు చూపిస్తే  లక్ష రూపాయలు ఇస్తామని కొందరు కౌంటరిచ్చారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కేటీఆర్.. రోడ్లపై అన్ని గుంతలే ఉండటంతో నెటిజన్ల ప్రశ్నలకు జవాబు చెప్పలేక సైలెంట్ అయిపోయారు. మరి 25 వేల కోట్లతో ఏం చేశారనే ప్రశ్న అందరిలోనూ వ్యక్తమవుతోంది. డల్లాస్ చేయడం కాదు ముందు వరద నీరు పోయే మార్గాలు చూడాలని సీఎం కేసీఆర్ పై ఫైరవుతున్నారు ప్రజలు.    రెండేండ్లలో రెండు లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు.. అద్దాల్లా మెరిసే రోడ్లు.. డల్లాస్ నగరంలో ఉన్నటువంటి మోడల్ సౌకర్యాలు.. ఇవి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. హైదరాబాదీల కోసం ఎప్పుడూ చెప్పే మాటలు. కాని అధికారంలోకి వచ్చి ఆరేండ్లనా ఇచ్చిన హామీల్లో ఐదు శాతం కూడా అమలు కాలేదనే ఆరోపణలున్నాయి. డబుల్ బెడ రూమ్ ఇండ్ల హామీ సిటీలో నవ్వుల పాలైంది. ఆరేండ్లలో ప్రభుత్వం ఇచ్చిన హమీలో రెండు శాతం కూడా పూర్తి చేయలేకపోయింది. లక్ష ఇండ్ల నిర్మాణం పూర్తైందని ఇటీవల అసెంబ్లీలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పగా.. అలాంటిదేమి లేదంటోంది ప్రతిపక్ష కాంగ్రెస్, నగరంలో నిర్మాణంలో ఉన్న ఇండ్ల పరిశీలించిన సీఎల్పీ నేత భట్టి బృందం.. ఇప్పటివరకు 3 వేల 428 ఇండ్లు మాత్రమే పూర్తయ్యాయని లెక్కలతో సహా వివరించింది.    నాంపల్లిలో 1824 ఇండ్లు కట్టామని ప్రభుత్వం చెప్పగా... ఆ స్పాట్ ను పరిశీలించింది కాంగ్రెస్ టీమ్. అయితే అక్కడ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి 2015లో మంత్రులు చేసిన శంకుస్థాపన శిలాఫలకం కూడా మాయమవడం ఆశ్చర్యం కల్గిస్తోంది. ప్రభుత్వం ఇండ్లు కట్టిస్తామన్న ప్రాంతంలోనే 2017లో ఇల్లు కూలి ముగ్గురు చనిపోయారు. 2015లో ప్రారంభించిన ఇండ్లను పూర్తి చేసి పేదలకు ఇస్తే.. గోడ కూలి ముగ్గురు చనిపోయేవారు కాదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబానికి ఇప్పటికి కూడా ఎలాంటి సాయం చేయలేదని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ లో 226 ఇండ్లు పూర్తయ్యాయని సర్కార్ లిస్ట్ ఇవ్వగా.. అక్కడ కూడా ఇండ్లేమి కనిపించలేదు భట్టీ బృందానికి. హైదరాబాద్‌లో లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం చేశామని టీఆర్ఎస్ ప్రభుత్వం అబద్దాలు చెబుతుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సర్కార్ ఇచ్చిన ఇళ్ల జాబితా తప్పుల తడకగా ఉందన్నారు. GHMC పరిధిలో ప్రభుత్వం ఇంకెప్పుడు 2 లక్షల ఇళ్లు కడుతుందని భట్టి ప్రశ్నించారు.    తెలంగాణలోని జర్నలిస్టులందరికి డబుల్, త్రిబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కట్టిస్తామని ఉద్యమ సమయంలో చెప్పారు కేసీఆర్. ముఖ్యమంత్రి అయ్యాకా కూడా ప్రకటించారు. కాని ఆరేండ్లవుతున్నా అది అతిగతీ లేకుండా పోయింది. జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీకి ఇండ్ల స్థలాల కోసం వైఎస్సార్ హయాంలోనే భూమి కేటాయించారు. అయితే దానిపై  కోర్టులో కేసులు వేయడంతో ఆగి పోయింది. ఇప్పటికి సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లోనే ఉంది. ఆ కేసు వంకతో జర్నలిస్టులకు ఇచ్చిన హామీని అటకెక్కించారు తెలంగాణ ముఖ్యమంత్రి. ఇండ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టుల్లో వంద మంది వరకు చనిపోయారు కూడా. అయినా ఇండ్లకు మాత్రం మోక్షం కలగడం లేదు. కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం  కోర్టు కేసులతో సంబంధం లేకుండానే జర్నలిస్టులకు ఇండ్లు ఇవ్వొచ్చు. కాని ఇండ్లు ఇవ్వడమే ఇష్టం లేకనే కోర్టు వంకతో తప్పించుకుంటున్నారని జర్నలిస్టులు ఆగ్రహంగా ఉన్నారు.    కేసీఆర్ హామీల అమలు, హైదరాబాద్ నగర దుస్థితిపై విపక్షాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే పరిస్థితి ఇలా తయారైందని మండిపడుతున్నాయి. విశ్వనగరం చేస్తామంటూ హైదరాబాద్ ను విషాద నగరంగా మార్చారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నాయి. డల్లాస్ చేస్తామంటూ సిటిని ఖల్లాస్ చేశారని ఫైరవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉట్టి మాటలు కట్టిపెట్టి హామీల అమలుపై ఫోకస్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.  ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటే చాలని, లండన్, డల్లాస్ సిటీ తరహా సౌకర్యాలు తమకు అవసరం లేదని చెబుతున్నారు.   మరోవైపు సుమేధ, నవీన్ కుమార్ చనిపోయిన ఘటనలు ప్రభుత్వ పరువు తీశాయి. నాలాలో పడి ప్రాణాలు కోల్పోయిన పదకొండేళ్ల సుమేధ ఘటనకు మంత్రి కేటీఆర్ బాధ్యత వహించాలని చిన్నారి తల్లిదండ్రులు కేసు కూడా పెట్టారు. రాష్ట్ర మానవ హక్కుల సంఘం కూడా స్పందించింది. దీంతో తమకు ఇబ్బందిగా మారిందని గ్రహించిన ప్రభుత్వం దిద్దుబాట చర్యలకు దిగింది. ఇలాంటి సంఘటనలు జరగడం తప్పేనని అంగీకరించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సుమేధ తల్లిదండ్రులకు క్షమాపణ చెబుతామన్నారు. ఆఫీసర్ల పొరపాటు వల్లే దుర్ఘటన జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌‌‌‌ యాదవ్‌‌‌‌ చెప్పారు.

డిక్లరేషన్ పై దుమారం

1890లో రాసిన పిక్చరెస్క్ ఇండియాలోపుస్తకంలో ప్రస్తావన   కలియుగ దైవంగా ప్రపంచప్రఖ్యాతి గడించిన తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రవేశం కోసం ఇచ్చే డిక్లరేషన్ పై సంచలనాత్మక వ్యాఖ్యలు దూమారం రేపుతున్నాయి. ఇతర మతస్తులు ఆలయంలోకి ప్రవేశించినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలి అన్న అంశంపై వివాదం రోజురోజుకూ పెరుగుతుంది. తిరుపతి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి ముఖ్యమంత్రి హోదాలో పట్టువస్త్రాలు సమర్పించడానికి వస్తున్న వైఎస్ జగన్ కూడా డిక్లరేషన్ ఇవ్వాలన్న అంశంపై డిక్లరేషన్ చర్చల్లోకి వచ్చింది. ఏ గుడి, మసీదు, చర్చిలో లేని డిక్లరేషన్ తిరుమలలో ఎందుకు, ఈ డిక్లరేషన్ విధానాన్ని తీసేయాలంటూ వివాదాలకు తెరతీశాడు ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని. ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు , ఎవరిని అడిగి పెట్టారు అన్నదానిపై చర్చజరగాలన్నారు. వేరేమతం వారు సంతకం పెట్టకుండా గుడిలోకి వెళ్లితే అవిత్రమై పోతుందా, ఆచారం అంటే ఏమిటి సంతం పెట్టకుండా పోతే వెంకటేశ్వర స్వామికి అపచారం జరుగుతుందా అంటూ బాధ్యతారాహిత్యంగా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. డిక్లరేషన్ ఎవడికి ఇవ్వాలంటూ కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడుతూ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తూ చివరకి డిక్లరేషన్ ఎత్తివేయాలంటూ అసంబద్ధమైన వాదనను తెరపైకి తీసుకువస్తున్నారు.    అయితే ఈ డిక్లరేషన్ అంశంపై ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. 1890 లో విలియం కెయిన్ అనే బ్రిటీష్ పొలిటీషియన్, బాప్టిస్ట్ క్రైస్తవుడు రాసిన పుస్తకం పిక్చరెస్క్ ఇండియాలో ప్రస్తావన ఉంది. ఇంగ్లడ్‌నుండి భారతదేశాన్ని సందర్శించడానికి వచ్చే బ్రిటీష్ టూరిస్టుల కోసం, రైల్వే రూట్లు, స్టేషన్లు, ఆ దార్లో ఉన్న దర్శనీయస్థలాల గురించి వివరంగా రాసిన 650 పేజీల  పుస్తకంలో 488 -489 పేజీల్లో తిరుమల గురించిన వివరణ ఉంది. దాదాపు 14వేల మంది జనాభా మాత్రమే తిరుపతిలో ఉండేవారని, వెంకన్న కొలవై ఉన్న తిరుమలను 'అప్పర్ తిరుపతి' గా ప్రస్తావిస్తూ దేవాలయంలోకి మహమ్మదీయుల్ని, క్రైస్తవుల్ని అనుమతించరని రాశాడు. ఎవరైనా ఈ దేవాలయాన్ని దర్శించాలనుకుంటే తిరుపతి జిల్లా మేజిస్ట్రేటుకిగానీ, నార్త్ ఆర్కాట్ జిల్లా కలెక్టరుకిగానీ ముందే తెలియజేయాలని విషయాన్ని పేర్కొన్నారు. తమ దేశం నుంచి వచ్చే క్రైస్తవ యాత్రికుల సమాచారం కోసం రాసిన ఈ పుస్తకంలో తిరుమలలో పాటించే మతపరమైన కట్టుబాట్లను, ఆచారవ్యవహారాలు వివరించారు.    బ్రిటిష్ పాలనలోనే తిరుమల ఆచారాలకు ఎంతో విలువనిచ్చేవారని ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తిరుమల దేవాలయంలోని ఆచారాన్ని పాటించకపోవడం అధికార మదమే అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో తిరుమలను సందర్శించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలామ్ వంటి ప్రముఖులు ఎందరో ఈ దేవాలయం నిబంధనలు గుర్తించి డిక్లరేషన్ ఇచ్చారు. రాజైనా, ప్రధాని అయినా ఎవ్వరైనా సరే దేవాలయ నియమాలు పాటించి తీరాల్సిందే అంటూ హిందువు పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారు.    ఓటు బ్యాంకుగా మాత్రమే హిందువులను చూస్తూ దేవాలయ సంప్రదాయాలు, కట్టుబాట్లను కాలరాయాలని చూడటం క్షమించరాని అంశంగా పేర్కొంటున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని అనేక ప్రముఖ దేవస్థానాల్లో జరుగుతున్న విధ్యంసాలు హిందువుల మనుగడకు ప్రమాదకరంగా మారాయి. ఈ నేపథ్యంలో వందల ఏండ్ల నుంచి అమలులో ఉన్న తిరుమల తిరుపతి ఆచారాన్ని పాటించాలన్న బాధ్యత లేకుండా  డిక్లరేషన్ తీసివేయాలంటూ అనుచితంగా వ్యాఖ్యలు చేసినందుకు  క్షమాపణలు చెప్పాలని బిజేపి, తెలుగుదేశం పార్టీల నేతలు, హిందు పెద్దలు డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో హిందువుల మనుగడకు భంగం కలిగించేలా నాని వ్యాఖ్యలు ఉన్నాయంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం తిరుమల చేరుకోనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇస్తాడా ఇవ్వడా అన్నది చూడాలి.

ఏపీలో ఆలయాల పై కొనసాగుతున్న దాడులు.. కర్నూల్ జిల్లాలో మరో విగ్రహం ధ్వంసం..

ఏపీలో హిందూ దేవాలయాలు, దేవతా విగ్రహాలపై దాడులు కొనసాగుతున్నాయి. అంతర్వేది నరసింహ స్వామి రధం దగ్దం మొదలు రాష్ట్రంలో ఏదో ఒకచోట దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసమైన ఘటనలు బయటపడుతూనే వున్నాయి. ఓవైపు విజయవాడ దుర్గమ్మ గుడిలో రథానికి ఉండే సింహాలు మాయమైన ఘటన కలకలం రేపుతుండగా తాజాగా కర్నూల్ జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. కర్నూల్ జిల్లా పత్తికొండ మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఇక్కడ ఉన్న అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు నిన్న అర్థ రాత్రి సమయంలో విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు స్థానికుల ఆరోపిస్తున్నారు. విగ్రహం ఉన్న ప్రదేశం నుంచి దాన్ని తొలగించి... రోడ్డుపై కొంత దూరంలో పడేసి వెళ్ళిపోయారు.   ఈ దేవాలయం మంత్రాలయం నుండి బెంగళూరు వెళ్లే ప్రధాన రహదారి పక్కన ప్రతిష్టించారు. ఈ ప్రాంతంలో అధికంగా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని నివారించేందుకు సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం ఇక్కడ అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని నెలకొల్పారు. ఈ స్వామి వారిని స్థానికులు, రైతులు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. అయితే ఈ విగ్రహాన్ని ఎవరు ధ్వంసం చేశారో, ఎవరు రోడ్డుపై పడేశారో తేల్చాలని స్థానికులు, హిందూ ధర్మ పరిరక్షకులూ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.