భారత్ పై ట్రంప్ తీవ్ర ఆరోపణలు!!
posted on Sep 30, 2020 @ 7:33PM
భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. భారత్ ను మిత్ర దేశంగా, ప్రధాని మోదీని మిత్రుడిగా పలుమార్లు అభివర్ణించిన ఆయన.. తాజాగా వాతావరణ కాలుష్యానికి భారత్ కారణం అని, కరోనా మరణాల సంఖ్యపై భారత ప్రభుత్వం ఖచ్చితమైన సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు.
అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్ 3న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియలో భాగంగా.. అధ్యక్షబరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ మంగళవారం రోజు తొలి డిబెట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో జరిగింది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు.
డిబెట్ లో పలు అంశాలపై ట్రంప్, బైడెన్ వాదించుకున్నారు. కరోనాను కట్టడి చేయడంలో ట్రంప్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అమెరికాలో 2లక్షల మంది ప్రాణాలు కోల్పోవడానికి ట్రంపే కారణం అని బైడెన్ విరుచుకుపడ్డారు. దీనికి బదులిచ్చిన ట్రంప్.. చైనా, రష్యా, భారత్ లో కరోనా కారణంగా ఎంత మంది మరణించారో మీకు తెలుసా? అని ప్రశ్నించారు. కరోనా మరణాల పై భారత్ కచ్చితమైన సమాచారం ఇవ్వడం లేదని ట్రంప్ ఆరోపించారు.
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న వాతావరణ మార్పులపై కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా ట్రంప్.. రష్యా, చైనా, భారత్ ల వల్లే అత్యధికంగా వాతావరణం కాలుష్యం జరుగుతుందని అన్నారు. ఈ మూడు దేశాలు కాలుష్య కారకాలను తీవ్ర స్థాయిలో గాలిలోకి విడుదల చేస్తున్నాయని ఆరోపించారు.