అందరూ నిర్దోషులైతే.. మరి మసీదును కూల్చింది ఎవరు?
posted on Sep 30, 2020 @ 5:21PM
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. మసీదు కూల్చివేత కుట్రకాదని, ముందస్తు ప్రణాళిక ప్రకారం జరగలేదని, కూల్చివేతకు సరైన సాక్ష్యాధారాలు లేవని జడ్జి ఎస్‌కే యాదవ్ పేర్కొన్నారు. దీంతో ప్రధాన నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతీ సహా 32 మంది నిందితులు నిర్దోషులుగా తేలారు. అయితే కోర్టు తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు తీర్పుని స్వాగతిస్తుండగా.. కొందరు మాత్రం అందరూ నిర్దోషులే అయితే బాబ్రీ మసీదు ఎలా కూలింది? అని ప్రశ్నిస్తున్నారు.
బాబ్రీ కూల్చివేతపై సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా స్పందించారు. సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. బాబ్రీ కూల్చివేత చట్ట విరుద్ధమని నవంబర్ 9న సుప్రీం పేర్కొందని, కానీ సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు అందుకు విరుద్ధంగా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లాలని రణదీప్ డిమాండ్ చేశారు.
సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్వాగతించారు. అద్వానీ, జోషి, ఉమాభారతితో పాటు నిర్దోషులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం అన్నారు. ఈ తీర్పు ఊహించిందే. ఆ ఎపిసోడ్ ను మనం మరిచిపోవాల్సిందే. బాబ్రీ మసీదు కూల్చివేత జరగకుంటే రామజన్మభూమి భూమిపూజను చూసి ఉండేవారమే కాదు అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.
ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తీర్పుపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'హిట్ అండ్ రన్ కేసులో డ్రైవర్లు నిర్దోషులుగా ప్రకటించబడ్డారు. న్యాయాన్ని భూస్థాపితం చేశారు.' అని ట్వీట్ చేశారు.
కోర్టు తీర్పుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారతీయ న్యాయవ్యవస్థకు చీకటి రోజు అని అన్నారు. అందరూ నిర్దోషులైతే.. మరి మసీదును కూల్చింది ఎవరని ప్రశ్నించారు. బాబ్రీ మసీదు దానంతట అదే కూలిపోయిందా? అని అసహనం వ్యక్తం చేశారు. మసీదును ఎవరు కూల్చారో ప్రపంచం మొత్తం చూసిందన్నారు. మసీదును కూల్చండి అని ఉమా భారతి నినాదాలు చేశారని గుర్తుచేశారు. ఈ తీర్పుపై సీబీఐ హైకోర్టుకు వెళ్లాలని ఒవైసీ సూచించారు.
మరోవైపు, తీర్పు వెలువడిన నేపథ్యంలో బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రగ్యా సింగ్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పడు వైరల్ అవుతున్నాయి. గతేడాది లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రగ్యా సింగ్ మాట్లాడుతూ.. "నాడు బాబ్రీ మసీదును కూల్చివేశా. ఇప్పుడు మళ్లీ అక్కడికి వెళ్లి రామాలయం నిర్మాణంలో పాల్గొంటా. అలా చేయకుండా ఎవరూ మమ్మల్ని అడ్డుకోలేరు" అని వ్యాఖ్యానించారు. అలాగే, "బాబ్రీ మసీదును కూల్చివేసినందుకు మేమెందుకు బాధ పడాలి? నిజానికి అందుకు మేము గర్వపడుతున్నాం." అంటూ ఆమె ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పడు వైరల్ అవుతున్నాయి.