ఎమ్మెల్సీ ఎన్నికల ఎఫెక్ట్! ఉద్యోగుల బకాయిలు క్లియర్
posted on Oct 1, 2020 @ 11:29AM
తెలంగాణలో తరుచూ ఎన్నికలు వస్తే బాగుండని ప్రజలు, ఉద్యోగులు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎవైనా ఎన్నికలు ఉంటే తప్ప ప్రభుత్వం సమస్యలపై స్పందించడం లేదు. అందుకే ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూసే నిరుద్యోగులు, సమస్యల పరిష్కారానికి తిప్పలు పడుతున్న జనాలు, పెండింగ్ డిమాండ్ల సాధనకు ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాల వారిది ఇదే అభిప్రాయం. జనాలు అనుకుంటున్నట్లే కేసీఆర్ సర్కార్ పని తీరు కూడా ఉంటోంది. తాజాగా అది మరోసారి నిజమైంది.
తెలంగాణలో త్వరలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజార్టీ ఓటర్లు ఉద్యోగులే. కొంత కాలంగా కేసీఆర్ ప్రభుత్వంపై ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. నాలుగేండ్లు అవుతున్నా పీఆర్సీ కమిటీ పత్తా లేకుండా పోయింది. ఉద్యోగుల బదిలీలు, ప్రమోషన్లు ప్రహాసనంగా మారాయి. ఉద్యోగ సంఘాలు ఎంతగా మెత్తుకుంటున్నా ప్రభుత్వంలో కదలిక లేదు. ఇక కరోనా సమయంలో ఉద్యోగాల వేతనాల్లో సగం కోత పెట్టింది సర్కార్. ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించినా.. ఆదాయం లేదనే కారణంతో మూడు నెలల పాటు ఉద్యోగులకు సగం జీతమే ఇచ్చింది. దీంతో ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం మరింత ఎక్కువైంది.
శాసనమండలి ఎన్నికల్లో ఉద్యోగుల తమకు వ్యతిరేకంగా పని చేస్తారనే భయం టీఆర్ఎస్ లో ఉంది. దీంతో దిద్దుబాట చర్యలు చేపట్టింది. కొన్నేళ్లుగా తమ వేతనాల బకాయిల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఊరటనిచ్చింది. పెన్షనర్లకు 2 విడతల్లో, ఉద్యోగులకు 4 విడతల్లో బకాయిలు చెల్లించనుంది. ఈ మేరకు జీవో రిలీజైంది. పింఛనుదారులకు అక్టోబర్, నవంబర్ లో 2 విడతలుగా బకాయిలు చెల్లిస్తారు. ఇక ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, ఇతర సిబ్బందికి బకాయిల్ని అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో 4 విడతలుగా చెల్లించబోతున్నారు. కరోనా సంక్షోభం కారణంగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో జీతాలు కట్ చేసింది ప్రభుత్వం.
కరోనా టైమ్ లో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ప్రజా ప్రతినిధులకు జీతాల్లో కోత విధించారు కేసీఆర్. పింఛన్లలో కూడా కోత విధించడమేంటంటూ అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. హైకోర్టులోనూ విచారణ జరిగింది. అయినా వెనక్కి తగ్గలేదు కేసీఆర్. దీంతో అరకొర జీతాలతో బండి నెట్టుకొచ్చిన ఉద్యోగులు, పింఛనుదారులు త్వరలోనే ఆ బకాయిల్ని అందుకోబోతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల వల్లే తమ బకాయిలు చెల్లిస్తున్నారని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. పీఆర్సీ ప్రకటించాలంటే మళ్లీ ఎన్నికలు వస్తే బాగుండని చెబుతున్నారు.