ఏపీలో మద్య నిషేధం అన్నారు.. ఆదాయం మాత్రం 21 శాతం పెరిగింది.. ఏడాదిలో ఏం సాధించారు?

మందుబాబులు మద్యం తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకుని మరీ ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇస్తూ ఉంటారు. మన దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలే ఆయా ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరులు. అయితే ఏపీ అధికార పార్టీ మాత్రం తమ ప్రభుత్వానికి ఆదాయం కన్నా ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని చెప్పింది. దశలవారీగా మద్య నిషేధం చేస్తామని, ఐదేళ్లలో రాష్ట్రంలో పూర్తిగా మద్య నిషేధం చేస్తామని చెప్పుకొచ్చింది. కానీ, ప్రభుత్వం చెప్పిన దానికి జరుగుతున్న దానికి పొంతన లేదు. మద్యం మీద ప్రభుత్వం ఆదాయం ఏమాత్రం తగ్గలేదు. ఇక, ప్రజలు ఆనారోగ్యం పాలు కావడం కాదు, ఏకంగా ప్రాణాలే కోల్పోతున్నారు.   దశలవారీగా మద్య నిషేధం చేస్తామని చెప్పిన వైసీపీ.. అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని బెల్ట్ షాపులన్నీ మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత, ఏటా మద్యం షాపులను సంఖ్యను తగ్గించుకుంటూ వస్తామంటూ 2019 అక్టోబర్ 1 న కొత్త మద్యం విధానాన్ని తీసుకువచ్చింది. అందులో భాగంగా 4,380  మద్యం షాపులలో 33 శాతం తగ్గించారు. ప్రస్తుతం ఏపీలో 2934 షాపులు మాత్రమే ఉన్నాయి. మద్యం అమ్మకాలకు అనుమతించే సమయం కూడా తగ్గించారు. పర్మిట్ రూమ్‌లకు అనుమతి నిరాకరించారు. కానీ, మద్యంపై ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం విషయంలో మాత్రం మార్పు కనిపించడం లేదు. దీంతో రాష్ట్రంలో మద్యం నియంత్రణ లక్ష్యం నీరుగారుతుందా అన్న సందేహం వస్తోంది.   2019 ఆగస్టులో మద్యం ద్వారా ఏపీ ప్రభుత్వానికి రూ.1747.29 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది ఆగస్టులో ఆదాయం రూ.1635.07 కోట్లుగా ఉంది. అంటే, 6.42 శాతమే తగ్గింది. ఇక గత ఏడాది సెప్టెంబర్ ‌తో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్‌ లో ఇప్పటికే 21.27 శాతం ఎక్కువ ఆదాయం వచ్చింది. 2019 సెప్టెంబర్ కు గానూ రూ.1205.39 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది సెప్టెంబర్‌ లో మొదటి 24 రోజుల్లోనే రూ.1461.8 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ లెక్కలను గమనిస్తుంటే మద్యం దుకాణాలు తగ్గినా, మద్యం ద్వారా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో లోటు లేదని అర్థమవుతోంది. భారీగా పెంచిన ధరల కారణంగానే ప్రభుత్వ ఆదాయానికి లోటు లేకుండా పోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.   మద్యం ధరలు పెంచి మద్యం ప్రియులను దానికి దూరం చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ముఖ్యంగా లాక్‌డౌన్‌ సమయంలో మద్యం దుకాణాలు మూతపడి, తెరిచిన తర్వాత.. లిక్కర్‌ పై మొత్తం 75 శాతం పన్నులను పెంచింది. మద్యం అందుబాటు ధరలో లేకపోవడంతో శానిటైజర్లు తాగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో తీవ్ర విమర్శలు రావడంతో మద్యం ధరలను స్వల్పంగా తగ్గించింది. అలాగే ప్రభుత్వం వింత వింత పేర్లున్న బ్రాండ్లను తీసుకురావడంతో.. నాసిరకం మద్యాన్ని ఎక్కువ ధరలకు అమ్ముతూ ప్రజల ఆరోగ్యాలతో, జీవితాలతో ఆటలాడుతున్నారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. మరోవైపు, పొరుగు రాష్ట్రాల నుండి భారీగా అక్రమ మద్య రవాణా జరుగుతోంది. దీనికితోడు నాటుసారా తయారీ, అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి.   ఆదాయం కన్నా ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని.. ఏటా 20 శాతం చొప్పున మద్యం దుకాణాలు తగ్గించి, ఐదేళ్ల నాటికి కేవలం స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యం అందుబాటులో ఉండే విధంగా చేస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ ఈ ఏడాది కాలంలో జరిగిన పరిణామాలు చూస్తుంటే మద్య నిషేధం సాధ్యమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రేట్ల పెంపుతో ప్రభుత్వ ఆదాయానికి ఏ లోటు లేదు.. కానీ, ఎందరో శానిటైజర్లు, నాటుసారా తాగి ప్రాణాలకే ముప్పు తెచ్చుకుంటున్నారు. ఇలాగే వింత బ్రాండ్లు తెచ్చి, రేట్లు పెంచి.. కేవలం స్టార్ హోటళ్లకే మద్యం పరిమితం చేస్తే.. శానిటైజర్ మరణాలు, అక్రమ మద్య రవాణా, నాటుసారా తయారీ పెరిగే అవకాశముంది. కేవలం రేట్లు పెంచితే చాలు మద్యం ప్రియులు మందుకు దూరమవుతారన్న ఆలోచనను ప్రభుత్వం పక్కన పెట్టి.. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మద్య నిషేధం కోసం వేరే మార్గాలను అన్వేషించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జేపీ నడ్డా కొత్త టీమ్‌లో డీకే అరుణ, పురందేశ్వరి

బీజేపీ జాతీయ కార్యవర్గంలో మార్పులు చేర్పులు జరిగాయి. నూతన కార్యవర్గాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. కొన్ని కీలక పదవుల నుంచి కొందర్ని తప్పించి, కొత్త వారికి చోటు కల్పించారు. ముఖ్యంగా రాష్ట్రాల్లో నాయకత్వాన్ని అభివృద్ధి చేసే దిశగా నియామకాలు చేపట్టారు.    నూతన కార్యవర్గంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలకు కూడా సముచిత స్థానం లభించింది. తెలంగాణ నాయకురాలు డీకే అరుణకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి లభించింది. పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా డాక్టర్ రమణ్ సింగ్, ముకుల్ రాయ్, వసుంధరా రాజే, డీకే అరుణతో పాటు మొత్తం 12 మందిని నియమించారు. తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్ డాక్టర్ లక్ష్మణ్ ను ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా నియమించారు. ఆంధ్రప్రదేశ్ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఏపీకి చెందిన సత్యకుమార్ కు జాతీయ కార్యదర్శి పదవి అప్పగించారు. అయితే, తెలుగునేతలు రామ్ మాధవ్, మురళీధర్ రావులను ప్రధాన కార్యదర్శుల బాధ్యతల నుంచి తప్పించారు.

కరోనా పై తప్పుడు సంకేతాలతో భారత్ కు ముప్పు.. ఐసీఎంఆర్ ను హెచ్చరించిన లాన్సెట్

భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. అయితే దేశంలో మరణాల రేటు తక్కువగా ఉందని.. అలాగే ఇంకేముంది.. ఇదిగో వ్యాక్సిన్ అంటూ కొద్దీ రోజుల క్రితం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) హడావిడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ అనుసరిస్తోన్న విధానాలను విమర్శిస్తూ ప్రముఖ అంతర్జాతీయ మెడికల్ జర్నల్ లాన్సెట్ కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా ఉద్ధృతి దేశంలో అత్యధికంగా ఉన్నప్పటికీ భారత ప్రభుత్వం, అలాగే ఐసీఎంఆర్ ఏమీ కాదులే అన్న ధోరణితో వ్యవహరిస్తుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఐసీఎంఆర్ శాస్త్రీయ ఆధారాల నుంచి పక్కకు పోతోందని లాన్సెట్ మెడికల్ జర్నల్ తన సంపాదకీయంలో పేర్కొంది. ఐసీఎంఆర్ తాజా ధోరణులతో ప్రజలకు కూడా తప్పుడు సంకేతాలు అందుతాయని.. దీంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఈ చర్యలు నిరోధిస్తాయని తన సంపాదకీయంలో తెలిపింది. ఇటువంటి చర్యల వల్ల భారత్‌లో మరింత సంక్షోభం ఏర్పడుతుందని పేర్కొంది.   కరోనా వ్యాప్తి తీవ్రత పట్ల భారత సర్కారు చాలా పాజిటివ్ ధోరణితో ఉందని.. ఇంతటి కరోనా సంక్షోభం సమయంలో వాస్తవాలను దాచవద్దని కోరింది. ప్రజలకు అసలు నిజాలు చెప్పకపోతే పెద్ద ప్రమాదమని ఈ సందర్భంగా హెచ్చరించింది. కరోనా ముప్పును కప్పిపెడుతూ పూర్తి ఆశావాదాన్ని ప్రోత్సహిస్తూ చేస్తోన్న ఒత్తిడి కారణంగా భారత్‌లో శాస్త్రీయ సంస్థలు కూడా ఆ దిశగా ప్రభావితమవుతున్నాయని లాన్సెట్ పేర్కొంది. ఇదే సందర్భంలో భారత్‌ నుంచి కరోనాకు వ్యాక్సిన్ ను ఈ ఏడాది ఆగస్టు 15లోగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని కొన్ని నెలల క్రితం ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ చేసిన ప్రకటనను కూడా లాన్సెట్‌ తప్పుబట్టింది. అంతేకాదు. ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ మరణాల రేటు భారత్‌లో ఉందని ప్రభుత్వం వాదించడాన్ని కూడా తప్పుబడుతూ.. అసలు భారత్ చెబుతోన్న ఈ సంఖ్యలు పోల్చదగినవా? కాదా.. అనే విషయం తెలుసుకోవడం కూడా కష్టంగా ఉందని తెలిపింది. భారతదేశంలోని రాజకీయ నాయకులు శాస్త్రీయ ఆధారాలను, నిపుణుల సలహాలపై దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికింది.

అధికార పార్టీలో అసమ్మతి.. బీజేపీలోకి జంపింగ్స్.. కారుకు కష్టమేనా! 

సిద్ధిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడకముందే నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు రోజుకో రంగు పులుముకుంటున్నాయి. సోలిపేట రామలింగారెడ్డి మరణం తర్వాత సానుభూతి పవనాల కంటే అసంతృప్తే ఎక్కువగా కనిపిస్తుండడంతో కారు పార్టీకి తలనొప్పిగా మారింది. రామలింగారెడ్డి కుటుంబంపై సానుభూతి చూపాల్సిన టీఆర్ఎస్ నేతలు అసమ్మతి సెగ లేపుతున్నారు. నియోజకవర్గంలోని నాయకులు వేర్వేరు సమావేశాలు ఏర్పాటు చేసి తమ అసమ్మతిని వ్యక్తపరుస్తున్నారు. కొందరైతే ఏకంగా రామలింగారెడ్డి కుటుంబానికి టిక్కెట్ ఇవ్వద్దని తీర్మానాలు చేస్తూ హైకమాండ్ కు పంపిస్తున్నారు.   చేగుంట మండలంలో అధికార పార్టీకి భారీ షాక్ తగిలింది. మండలానికి చెందిన పలువురు టీఆర్ఎస్ ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, మండల నాయకులు, వందలాది మంది కార్యకర్తలు బీజేపీలో చేరిపోయారు. రెండు రోజుల క్రితం అసమ్మతి సమావేశం నిర్వహించిన ఈ నేతలు.. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పని చేసినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి వెంట నలుగురు వ్యక్తులు ఉండి దుబ్బాక రాజకీయానికి, టీఆర్ఎస్ పార్టీకి మచ్చ తెచ్చారని ఆరోపించారు. రాబోయే ఉపఎన్నికల్లో ఆ కుటుంబానికి టిక్కెట్ ఇస్తే మళ్లీ తమను అణగతొక్కుతారని చెప్పారు. కేసీఆర్‌ గ్రామాలుగా పిలవబడే 12 ఊర్ల నాయకత్వం కూడా సోలిపేట కుటుంబానికి టికెట్‌ ఇవ్వొద్దని డిమాండ్‌ చేస్తున్నది. గతంలో తాము సిద్దిపేట నియోజకవర్గంలో ఉండి, నియోజకవర్గాల పునర్విభజనలో దుబ్బాక మండలంతో కలిసి వివక్షకు గురవుతున్నామని వారంతా ఆవేదన చెందుతున్నారు.   సోలిపేట కుటుంబానికి టికెట్ ఇవ్వడంపై పార్టీలోని ఇతర సీనియర్ నేతలకు ఇష్టం లేదు. వారు కూడా తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు.  దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహంతో ఉన్నారు. గ్రామాల్లో తిరుగుతూ తనతో వచ్చే టీఆర్‌ఎస్‌ శ్రేణులను సమీకరిస్తున్నారు. తనకు టికెట్ ఇవ్వాలని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై శ్రీనివాస్ రెడ్డి ఒత్తిడి పెంచుతున్నట్లు చెబుతున్నారు. టికెట్ ఇవ్వకపోతే తన దారి తాను చూసుకుంటానని శ్రీనివాస్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. పార్టీ మరో సీనియర్‌ నాయకుడు మామిడి మెహన్‌రెడ్డి కూడా మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ సోలిపేట కుటుంబానికి టికెట్టు వద్దనే నినాదంతో పనిచేస్తున్నారు. పార్టీలో మొదటి నుంచి పనిచేసిన నిజమైన కార్యకర్తకు టికెట్ ఇస్తే తాము కలిసికట్టుగా గెలిపించుకుంటామని, అదే కుటుంబానికి ఇస్తే పార్టీ కార్యకర్తలకు అవకాశాలు ఎప్పుడు వస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఈ ఇద్దరు నేతలకు బీజేపీ కూడా వల వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రామలింగారెడ్డి కుటుంబానికి టికెట్ ఇస్తే.. శ్రీనివాస్ రెడ్డి, మెహన్ రెడ్డిలు అధికార పార్టీ గెలుపు కోసం ప్రయత్నాలు చేయకపోవచ్చని టీఆర్ఎస్ లోనే చర్చ జరుగుతోంది.    మరోవైపు దుబ్బాక ఉప ఎన్నికలో ఘన విజయం సాధిస్తామని చెబుతున్న టీఆర్ఎస్ ముఖ్య నేతలకు... నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆందోళన కల్గిస్తున్నాయి. రోజు రోజుకు అసమ్మతి పెరిగిపోతుండటంతో అధికార పార్టీలో అలజడి కనిపిస్తోంది. ఉప ఎన్నికల బాధ్యతలు చూస్తున్న మంత్రి హరీష్ రావుకు ఇది తలనొప్పిగా మారిందంటున్నారు. అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు ఎంతగా ప్రయత్నిస్తున్నా.. వారు వినడం  లేదని తెలుస్తోంది. చేగుంట మండల నేతల రాజీనామాతో మరింత అప్రత్తమైన హరీష్.. ఇతర మండలాల్లోని అసమ్మతి నేతలతో స్వయంగా మాట్లాడి కూల్ చేస్తున్నారని చెబుతున్నారు. మొత్తానికి సీఎం కేసీఆర్ సొంత జిల్లా, తన సొంతూరు పక్క నియోజకవర్గమైన దుబ్బాకలో నెలకొన్న అసమ్మతి టీఆర్ఎస్ ను పరేషాన్ చేస్తుందని తెలంగాణ భవన్ లో ప్రచారం జరుగుతోంది.

రెండు మూడు రోజుల్లో వాళ్ళు నాపై దాడి చేస్తారు.. రఘురామరాజు సెన్సేషనల్ కామెంట్స్ 

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు కు వైసిపికి మధ్య వ్యవహారం ఉప్పు నిప్పులా ఉన్న సంగతి తెల్సిందే. తాజాగా పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో రఘురామరాజుకు.. తోటి వైసిపి ఎంపీలకు మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రఘురామరాజు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కార్యాలయంపై దాడికి కార్యాచరణ రూపొందిందని.. మరో రెండు, మూడు రోజుల్లో దాడి కూడా జరగనుందని ఆయన అన్నారు. ఈ దాడి ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. తనపై దాడి చేస్తే ఆవేశపడి ఒక మాట అనే అవకాశం ఉందనే ఆలోచనల్లో వైసిపి వాళ్లు ఉన్నారన్నారు. తనను తోలు తీస్తా అన్నారని, ఊళ్లోకి రా.. పిచ్చికుక్కను కొట్టినట్టు కొట్టేస్తామని కొందరు తనను హెచ్చరించిన విషయాలను ఈ సందర్భంగా అయన గుర్తు చేశారు. కేవలం ఒక ఎంపీ అన్న వ్యాఖ్యలను తాను ప్రస్తావిస్తే.. దానికి ఏకంగా ఒక జాతిని సంఘటితం చేసి.. వాళ్ల జాతిని అవమానించినట్టు చిత్రీకరించారన్నారు. తాను అన్న మాటలకు రుజువులు ఉన్నాయని, అయితే తన వెనక జరుగుతున్న కుట్ర గురించి అందరికి తెలియాలనే ఈ విషయాలు తెలుపుతున్నానన్నారు. తనపై దాడి వార్తలు వారి ఆధ్వర్యంలోని ఒక ఛానెల్, అలాగే పేపర్‌లలో వస్తాయని ఆయన తెలిపారు. ఎన్నో దళిత సంఘాలు తనకు ఫోన్ చేసి మద్దతుగా ఉంటున్నారని అయన చెప్పారు. దీనిపై దళిత హిందూ నాయకులు తనతో మాట్లాడారని, వారి హక్కుల కోసం పోరాడటంతోనే తనకు మద్దతుగా నిలిచారన్నారు. కొంతమంది దళిత క్రిస్టియన్లు హిందువుల ముసుగులో రిజర్వేషన్లు కొట్టేస్తున్నారని... ఈ విషయాన్ని తాను పలు మార్లు ప్రస్తావించానన్నారు. అందుకే హిందూ దళిత నాయకులు తన వెంట నిలిచారన్నారు. అయితే ఈ వివాదం ఎటు దారి తీస్తుందో చూడాలి.

'అవనీర్' మీటర్ల కొను 'గోల్‌మాల్'పై.. విజిలెన్స్ నివేదికకు విలువేదీ?

విద్యుత్ మీటర్ల కొనుగోలులో 41 కోట్లు వృధా ఆ 12 మంది నుంచి రికవరీ చేయమని ఇంధన కార్యదర్శి ఆదేశం ‘షో’కాజులతో  మీనమేషాలు లెక్కబెడుతున్న ఎస్పీడీసీఎల్ సీఎండీ టీడీపీ హయాం నాటి అవినీతిపై చర్యలేవీ?   తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కడ  అవినీతి జరిగిందోనని వైసీపీ సర్కారు భూతద్దంతో అన్వేషిస్తోంది. ఆ లెక్కల కోసం తాపత్రయపడుతోంది. సీఐడి నోటీసులిస్తోంది. కానీ టీడీపీ జమానాలోనే 41 కోట్ల రూపాయలు, ఖరీదైన విద్యుత్ మీటర్ల కొనుగోలుపై గోల్‌మాల్ జరిగిందని, స్వయంగా ఇంధన శాఖ, విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. అయితే వైసీపీ సర్కారు ఆ నివేదికను అమలు చేయడం చేతకాక, చేతులెత్తేసింది. పైగా ఎవరినయితే దోషులుగా తేల్చి.. వారిపై క్రిమినల్ కేసులు పెట్టి, వారి నుంచి అంత సొమ్మునూ రికవరీ చేయాలని సిఫార్సు చేసిందో..  దానిని అమలుచేయకుండా, వారికి సంజాయిషీ నోటీసులిచ్చి కాలయాపన చేస్తోంది. ఫలితంగా.. ఎస్పీడీసీఎల్ సీఎండీ వ్యవహార శైలి, సహజంగానే అనేక అనుమానాలకు తావిస్తోంది. చివరకు ఆదేశాల్చిన ఇంధన శాఖ కార్యదర్శి, విజిలెన్స్ ఆదేశం- నివేదికకూ, పూచికపుల్ల పాటి విలువ కూడా లేకుండా పోయింది. ఇదీ ఏపీ ఎస్పీడీసీఎల్ వైచిత్రి.   ఎలాంటి ఆధారాలు లేని అమరావతి భూములలో.. లొసుగుల కోసం తెగ చెమటోడ్చి పనిచేస్తున్న జగన్మోహన్‌రెడ్డి సర్కారు.. 41 కోట్ల రూపాయల  విద్యుత్ మీటర్ల కోట్ల కొనుగోలు వ్యవహారంలో, అన్ని ఆధారాలతో స్వయంగా ప్రభుత్వ అధికారులే నివేదిక ఇచ్చినా.. ఇప్పటివరకూ దానిపై చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కబెడుతున్న వైనం విస్మయపరుస్తోంది. దీనికి సంబంధించి 12 మంది అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకుని, రెవిన్యూ రికవరీ యాక్టు ప్రకారం ఆ సొమ్మును వారి నుంచే రికవరీ చేయాలని స్వయంగా ఇంధనశాఖ కార్యదర్శి, విజిలెన్స్ ఇచ్చిన నివేదికను అమలు చేయకుండా, బుట్టదాఖలు చేస్తున్నారు. అంటే ప్రభుత్వం మారినప్పటికీ,  ఈ వ్యవహారంలో ఎంతమంది పెద్దల పలుకుబడి- ప్రభావం ఇంకా ఎంత బలంగా పనిచేస్తోందో స్పష్టమవుతోంది.   నాటి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన కథ ఇది. అంటే 30-11-2005లో అన్నమాట. అవనీర్ పవర్ టెక్నాలజీ కంపెనీ నుంచి విద్యుత్ మీటర్లను భారీ సంఖ్యలో, అప్పటి టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది.  ఎస్పీడీసీఎల్ చైర్మన్-ఎండీగా గోపాల్‌రెడ్డి ఉన్నారు. ఆ మేరకు అవనీర్ కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.  అయితే, సదరు కంపెనీ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్ మీటర్లలో, చాలావరకూ నాసిరకం-నాణ్యత లేనివే ఎక్కువ ఉన్నాయని, పైగా కంపెనీ గ్యారంటీ ఇచ్చిన గడవులోగానే మొత్తం సొమ్ము కంపెనీకి చెల్లించడంతో, ప్రభుత్వానికి 41 కోట్ల 46 లక్షల నష్టం వచ్చిందని విజిలెన్స్ అధికారులు తన నివేదికలో పేర్కొన్నారు. ఆ ప్రకారంగా అప్పట్లో ఈ వ్యవహారంలో బాధ్యులుగా ఉన్న సీఎండీ కె.రంగనాధ్, చైర్మన్‌గా ఉన్న పి.గోపాల్‌రెడ్డితోపాటు, వివిధ స్థాయిలో ఉన్న కె.పి. ఆనంద్, దామోదర్‌రావు, కె.ప్రకాష్, ఏ.చిన్నయ్య, టి.హన్మంత ప్రసాద్, ఆర్. శ్రీనివాసులు, వై.లక్ష్మీనరసయ్య, మిక్కిలి విజయకుమార్, బి.సుబ్రమణ్యం, ఏ.వేణుగోపాల్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి, వారి నుంచి ప్రభుత్వం నష్టపోయిన 41 కోట్ల 46 లక్షల రూపాయలను ఏపి రెవిన్యూ రికవరీ యాక్టు 1864 ప్రకారం వారి నుంచి వసూలు చేయాలని, ఇంధనశాఖ కార్యదర్శి 11-9-2020న ఎస్పీడీసీఎల్ సీఎండీ-చైర్మన్‌కు ఆదేశాలు జారీ చేశారు.   సహజంగా కొనుగోలు చేసిన కంపెనీ తమ వస్తువులపై, మూడు నుంచి- ఐదేళ్ల వరకూ గ్యారంటీ ఇస్తుంది. ఆ ప్రకారంగానే విద్యుత్ శాఖ వారికి పేమెంట్లు ఇస్తుంటుంది. ఒకేసారి సొమ్ము చెల్లిస్తే, ఇక కంపెనీ తన బాధ్యత నుంచి తప్పించుకుంటుందన్న ముందుచూపుతోనే, పేమెంట్లు విడతల వారీగా చెల్లిస్తారు. కానీ, సదరు అవనీర్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా, ఒకేసారి బిల్లు చెల్లించేయడంపై శాంతికిరణ్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. కాగా శాంతికిరణ్ అనే వ్యక్తి, గత టీడీపీ ప్రభుత్వంలో  విద్యుత్ మీటర్ల కోనుగోలులో అవినీతి జరిగిందని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి, ఆ వ్యవహారంలో 41 కోట్ల 46 లక్షల రూపాయలు ప్రభుత్వం నష్టపోయిందని నివేదిక ఇచ్చారు. దానితో సదరు మాజీ అధికారులంతా, ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, కోర్టు దానిని తిరస్కరించింది. కాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 మందిలో కొందరు పదవీ విమరణ చేయగా, మరికొందరు చనిపోయారు. ప్రస్తుతం సీజీఎమ్ హనుమత్ ప్రసాద్, పే ఆఫీసర్ లక్ష్మీనరసయ్య, జీఎం విజయ్‌కుమార్ మాత్రం ఇంకా సర్వీసులో కొనసాగుతున్నారు. అంటే.. శాంతికిరణ్ అనే వ్యక్తి, ఒకవేళ హైకోర్టును ఆశ్రయించకపోతే, ఈ 41 కోట్ల వ్యవహారం విజయవంతంగా సమాధి అయిపోయేదని స్పష్టమవుతోంది. మరి కోర్టుదాకా వెళ్లి, విజిలెన్స్ -ఇంధన కార్యదర్శి ఆదేశాలిచ్చిన ఈ వ్యవహారంపై మామూలుగా అయితే.. చర్యలు పంచకల్యాణి గుర్రంలా, శరవేగంగా ఉండాలి. ఇంధన శాఖ కార్యదర్శి అంటే సీఎండీ-చైర్మన్‌కు బాస్. అంటే కార్యదర్శి ఆదేశం, శిలాశాసనమన్నమాట. పైగా విజిలెన్స్ కూడా నివేదిక  ఇచ్చింది. మరి ఎస్పీడీసీఎల్ సీఎండీ ఇప్పటిదాకా వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు?  క్రిమినల్‌కేసులు ఎందుకు నమోదు చేయడం లేదు? వారి నుంచి ఆ 41 కోట్ల రూపాయలు ఎందుకు రికవరీ చేయడం లేదన్న ప్రశ్నలు, మెదడున్న ఎవరికయినా రావడం సహజం. మామూలు పామరులకే ఇన్ని సందేహాలు వచ్చినప్పుడు, పాలకులకు ఇప్పటిదాకా రాకపోవడమే విడ్డూరం. విస్మయకరం కూడా.   సదరు అవనీర్ కంపెనీ సరఫరా చేసిన విద్యుత్ మీటర్లకు సంబంధించి.. పర్చేజ్ ఆర్డర్ నెంబర్ 16/2003-2004 డేటెడ్ 24-5-2003న, అవనీర్ సరఫరా చేసిన ఎనర్జీ మీటర్లలో 92.80 శాతం  పనికిరాకుండా పోయాయని, విజిలెన్స్ తన నివేదికలో పేర్కొంది. పి.ఓ నెంబర్ 72/2004-2005 డేటెడ్  3-6-2004న సరఫరా చేసిన వాటిలో,  71.75శాతం మీటర్లు పనికిరాకుండా పోయాయని వెల్లడించింది. పి.ఓ నెంబర్ 317/2004-2005 డేటెడ్  1-1-2005న సరఫరా చేసిన వాటిలో, 72.25 శాతం మీటర్లు పనికిరాకుండా/నాణ్యత లేవని  తేలిందని విజిలెన్స్ తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది.   మరి ఇంత విస్పష్టంగా విజిలెన్స్ నిర్ధారించి, నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఎస్పీడీసీఎల్ సీఎండి హరనాధరావు బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుని, సొమ్ము రికవరీ చేయకుండా తాత్సారం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంధన శాఖ కార్యదర్శి ఆదేశాలకు భిన్నంగా.. వారికి  షోకాజులిచ్చి, వివరణ కోరడంపై మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. అంటే బాధ్యులకు మరింత గడువు ఇచ్చినట్లేనన్న వ్యాఖ్యలు విద్యుత్ శాఖ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దీనిపై ఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాధరావును ‘సూర్య’ వివరణ కోరింది. దానికి ఆయన.. వారికి షోకాజు నోటీసులిచ్చామని, దానిని చూసిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘ఏకంగా వారిపై చర్యలు తీసుకుంటే రేపు కోర్టుకు వెళితే ఇబ్బందవుతుంది. ఇప్పటి పరిస్థితి మీరు చూస్తున్నారు కదా. అందుకే ప్రొసీజరు ఫాలో అవుతున్నాం’ అని వ్యాఖ్యానించారు.   కాగా, కడపకు చెందిన ఓ ఎలక్ట్రికల్ కంపెనీ యజమాని.. ఈ మొత్తం వ్యవహారంలో చక్రం తిప్పుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన ఆశీస్సులతోనే ఇప్పటి అధికారి అత్యున్నత హోదా సాధించారని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో కొందరు, సదరు కడప కంపెనీ యజమాని ద్వారా లాబీయింగ్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజం ‘జగన్నాధుడి’కి ఎరుక!  అవినీతిని సహించేది లేదని ఇప్పటికి కొన్ని డజన్ల సార్లు చెప్పిన సీఎం జగన్మోహన్‌రెడ్డి, కరెంట్ మీటర్ల కొనుగోలులో.. 41 కోట్ల మేర గోల్‌మాల్ జరిగినా ఇంకా మౌనవ్రతం పాటించడమే ఆశ్చర్యం.   ఆయనది కడప. ఆయనకో పెద్ద ఎలక్ట్రికల్ కంపెనీ ఉంది. సర్కారుకు పరికరాలు కొనుగోలు చేయడంలో దానికదే సాటి. ఆర్డర్లు పట్టేయడంలో ఆరితేరింది. ఇప్పుడు పాలకులకూ ఆ కంపెనీ చాలా దగ్గర. అలాంటి కంపెనీపై సర్కారు, కోట్ల రూపాయల పెనాల్టీ విధించింది. కానీ, దయగల ప్రభువులు.. దానిని రద్దు చేసి, సదరు కంపెనీనిని కరుణించారు. -మార్తి సుబ్రహ్మణ్యం

కోర్టు చివాట్లు పెట్టినా మారన తీరు.. కరోనాపై బోగస్ లెక్కలు! 

తెలంగాణ రాష్ట్రంలో కరోనా టెస్టులు ,కేసులు, మరణాల లెక్కలపై  మొదటి నుంచి అనుమానాలున్నాయి. ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతుందనే ఆరోపణలున్నాయి. కరోనా కేసుల్లో తప్పుడు లెక్కలపై గతంలో హైకోర్టులోనూ విచారణ జరిగింది. సరైన నివేదికలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అయినా సర్కార్ తీరు మారలేదని, అవే తప్పులు చేస్తున్నారని, కరోనా టెస్టులు, కేసులు, మరణాల విషయంలో బోగస్ లెక్కలే చూపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కరోనా అంశంలో కేంద్రానికి ఇచ్చే లెక్కలు వేరేలా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చె బులిటెన్లలో మరోలా వివరాలు ఉంటున్నాయి. తాజాగా ఆగస్టు  నెలకు సంబంధించి కరోనా కేసులపై కేంద్ర ఆరోగ్య శాఖకు రాష్ట్ర వైద్య శాఖ పంపిన నివేదికలో తప్పుడు లెక్కల బండారం బహిర్గతం అయింది .   తెలంగాణలో ఆగస్టు నెలలో 8 లక్షల 79 వేల 479 మందికి కరోనా టెస్టులు చేసినట్టు కేంద్రానికి రాష్ట్ర హెల్త్​ డిపార్ట్​మెంట్ నివేదిక ఇచ్చింది. రాష్ట్ర పంపిన వివరాల ఆధారంగా కేంద్ర హెల్త్​ మినిస్టర్​ పార్లమెంట్‌‌‌‌లోనే ఈ వివరాలను వెల్లడించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ  బులెటిన్‌‌‌‌లో మాత్రం.. ఆగస్టులో 9 లక్షల 65 వేల 253 టెస్టులు చేసినట్టు చెప్తోంది. కేంద్రానికి ఇచ్చిన లెక్కకు, బులెటిన్‌‌‌‌లో చెప్పిన లెక్కకు 85 వేల 774 టెస్టుల తేడా ఉంది. అంటే తక్కువ టెస్టులు చేసి ఎక్కువగా చూపిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఇలా అసలు లెక్కలు బయటపడతాయనే ఉద్దేశంతోనే జిల్లాల వారీగా టెస్టులు, డెత్స్​ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.   తెలంగాణలో ప్రస్తుతం రోజు 2 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. జిల్లాల్లోనూ వైరస్ వేగంగా విస్తరిస్తోంది. వందల కొద్దీ కరోనా కేసులు నమోదవుతున్నా కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ అరకొరగానే టెస్టులు చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో ఆగస్టులో 4,270 టెస్టులు, వికారాబాద్ జిల్లాలో 5,268 టెస్టులు మాత్రమే చేసినట్లు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికలోనే ఉంది. మొత్తం 33 జిల్లాలకుగాను 27 జిల్లాల్లో రోజూ వెయ్యి కంటే తక్కువే టెస్టులు చేసినట్టు కేంద్రం వెల్లడించిన నివేదికతో వెల్లడైంది. స్టేట్‌‌‌‌ బులెటిన్‌‌‌‌లో రోజూ రాష్ట్రవ్యాప్తంగా 50 వేల నుంచి 60 వేల టెస్టులు చేస్తున్నట్టు చూపిస్తున్నారు. అయితే ఏ జిల్లాలో ఎన్ని చేశారో చెప్పడం లేదు. దీంతో అన్ని టెస్టులు చేస్తున్నారా, చేయకుండానే చేసినట్టుగా చూపిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.    టెస్టుల సంఖ్యే కాదు.. కరోనా కేసులు, మరణాల్లో కూడా ప్రభుత్వం తప్పుడు లెక్కలే చెబుతుందని క్షేత్రస్థాయిలో పనిచేసే డాక్టర్లు, జిల్లాల మెడికల్ ఆఫీసర్లే చెప్తున్నారు. రోజూ నమోదవుతున్న కేసులు, డెత్స్​లో సగం కూడా బయటపెట్టడం లేదని అంటున్నారు. అసలు లెక్కలు బయటపడకుండా ఉండేందుకే జిల్లాల్లో బులెటిన్లు  ఇవ్వొద్దని ఆదేశించారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.    మరోవైపు కరోనా టెస్టుల విషయంలో ఐసీఎంఆర్ సూచనలను రాష్ట్ర సర్కారు‌‌‌‌ పాటించడం లేదు. కరోనా లక్షణాలున్నవాళ్లకు యాంటీ జెన్ టెస్టులో నెగెటివ్ వస్తే.. ఆర్టీపీసీఆర్ టెస్ట్‌‌‌‌ చేయడం లేదు. యాంటీ జెన్‌‌‌‌ టెస్టులో ఫాల్స్‌‌‌‌ నెగెటివ్‌‌‌‌ వచ్చే అవకాశాలు 40 శాతం దాకా ఉందని ఐసీఎంఆర్ మొదట్నుంచీ చెప్తూనే ఉంది. లక్షణాలుండి యాంటీజెన్​లో నెగెటివ్ వస్తే.. ఆర్టీపీసీఆర్ చేయించాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో యాంటీ జెన్ టెస్టులు చేసి వదిలేస్తున్నారు. ఆర్టీపీసీఆర్ చేయాలని కోరినా పట్టించుకోవడం లేదని బాధితులు చెప్తున్నారు. రాష్ట్రంలో రోజూ 6 వేలదాకా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసే కెపాసిటీ ఉన్నా.. అందులో సగం కూడా చేయడం లేదని హెల్త్​ డిపార్ట్​మెంట్​ వర్గాలు చెప్తున్నాయి.   కరోనా టెస్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై గతంలో చాలా సార్లు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా అంశంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు సమర్పిస్తోందని అభిప్రాయపడింది. కేసులు, మరణాలు చాలా తక్కువగా రిపోర్టు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేసింది. కరోనా వైరస్ కట్టడిలో ప్రభుత్వం నిర్లిప్తత, ప్రైవేట్ ఆస్పత్రులు కట్టడి విషయంలో ప్రభుత్వ ఉదాసీన వైఖరి వంటి అంశాలపై దాఖలైన పిటిషన్లపై విచారించిన హైకోర్టు.. ప్రభుత్వంపై ఘాటైన కామెంట్లు చేసింది, కరోనా కేసులు, మరణాలను తక్కువగా చూపుతున్నారని అభిప్రాయపడింది. సమగ్ర నివేదిక అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రజారోగ్య రంగాన్ని అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చుపెట్టిందో కూడా సమగ్ర నివేదిక ఇవ్వాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనాకి ముందు ఎంత నిధులు కేటాయించారు, కరోనా తర్వాత ఎంత కేటాయించారనే అంశాలను తెలియజేయాలని కోరింది.

ఒక ఆకురౌడీ మంత్రి అయితే మాట్లాడే భాష, పాలన ఇలాగే ఉంటాయి.. జగన్ సర్కార్ పై బీజేపీ నేత ఫైర్

ఏపీ సీఎం జగన్ తిరుమల పర్యటన సందర్భంగా డిక్లరేషన్ పై సంతకం విషయంలో తీవ్ర రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో మంత్రి కొడాలి నాని అటు తిరుమల వెంకటేశ్వర స్వామి పై అలాగే ప్రధాని నరేంద్ర మోడీ పై చేసిన వ్యాఖ్యలు ఇంకా తీవ్ర దుమారం రేపుతూనే ఉన్నాయి. తాజాగా మంత్రి కొడాలి నాని వ్యాఖ్యల పై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్‌ స్పందిస్తూ ‘‘ఆకురౌడీ.. మంత్రి అయితే కేవలం భాష, బాడీ లాంగ్వేజ్‌ మాత్రమే కాదు పాలన కూడా ఎలా ఉంటుందనే దానికి ఏపీ ప్రత్యక్ష నిదర్శనం’’ అని వైసిపి సర్కార్ పై విరుచుకు పడ్డారు. రాష్ట్రంలో ప్రజల తలసరి ఆదాయం పెంచకుండా రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టేస్తూ.. భవిష్యత్తు తరాలకు తీరని ద్రోహం చేస్తున్నారని అయన ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో నిన్న జరిగిన పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ "ఒక మంత్రి సాక్షాత్తు దేవుడి పై చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుంటే సీఎం జగన్‌ మాత్రం కనీసం నోరు తెరవడం లేదని.. అసలు ఆయన ఏం చేస్తున్నారని సత్యకుమార్ ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ఆలయాలపై జరుగుతున్న వరుస దాడుల వెనుక కుట్ర కోణం ఉండి ఉంటుందని అయన అన్నారు.   తిరుమలలో డిక్లరేషన్‌ విషయంలో అందరికంటే ముందు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారని.. అయితే ప్రభుత్వ జీవోను సాక్షాత్తు ముఖ్యమంత్రే పాటించకపోతే ఇక సామాన్యులకు ఏం చెబుతారని అయన నిలదీశారు. ప్రజా సమస్యలతోపాటు పాలన పై స్పష్టతలేని సీఎం జగన్‌, పొరుగు రాష్ట్రాల్లోనేగాక విదేశాల్లో నియమించుకున్న అంతర్జాతీయ సలహాదారులతో చర్చించి అయినా పాలన సజావుగా సాగించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో చేపడుతున్న కార్యక్రమాలకు సీఎం జగన్‌ తన పేరు, తన తండ్రి పేరు పెడుతున్నారని.. ఏకంగా కొవిడ్‌-19 పాస్‌పై కూడా వైఎస్సార్‌ అని ముద్రించడం దీనికి పరాకాష్ఠ అని ఎద్దేవా చేశారు. ఏకంగా ప్రధాని మోదీపై తన కేబినెట్‌ లోని మంత్రితో విమర్శలు చేయించి, తరువాత తాపీగా అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అంటే ఆశ్చర్యకరంగా ఉందని సత్యకుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.

కరోనా మరణాలకు కారణాలు వెల్లడించిన శాస్త్రవేత్తలు

ప్రపంచవాప్తంగా మరణమృదంగం మోగిస్తూ రోజూ వేలాదిమంది ప్రాణాలు హరిస్తోంది కరోనా. యమపాశానికి ఎవ్వరైనా ఒక్కటే అన్న కర్కశత్వంతో సామాన్యల నుంచి సెలబ్రేటీల వరకు ఈ మహ్మమారి కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు.   సినీ ప్రముఖులు, రాజకీయనాయకులు, క్రీడాకారులు ఇలా ఒక్కరేమిటీ అన్ని వర్గాల్లో సంభవిస్తున్న మరణాలు కలచివేస్తున్నాయి. లక్షలాది రూపాయలు ఖర్చుచేసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో రోజుల తరబడి చికిత్స అందించినా ప్రాణాలకు గ్యారెంటీ లేదు. దీంతో ప్రజల్లోనే కాదు  వైద్యసిబ్బందిలోనూ కరోనా  మరణాలకు కారణాలు అంతుచిక్కడం లేదు. ఈ విషయంపై అమెరికాలోని రాక్‌ఫెల్లర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగుచూశాయి.   కరోనా మరణాలకు కారణం శరీరంలోకి ప్రవేశించిన కోవిడ్ 19 వైరస్ యాంటీబాడీలు తప్పుదోవ పట్టించి వారి రోగ నిరోధక వ్యవస్థపైనే దాడిచేస్తుందట. మరో కారణం లోప భూయిష్ట జన్యు ఉత్పరివర్తనాలు అన్నది శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది.   కరోనా బారినపడినప్పటికీ కొందరిలో ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకపోవడం, మరికొందరు కోలుకున్నప్పటికీ తిరిగి అనారోగ్యం పాలు కావడం వెనుక జీన్స్ మ్యూటేషన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని శాస్త్రవేత్తలు వివరించారు. శరీరంలోని యాంటీబాడీలను కూడా తప్పుదోవపట్టించేలా ఉంటున్నాయన్నారు. దీని కారణంగా సహజసిద్ధంగా మనిషిలో ఉండే రోగనిరోధకశక్తిలో భాగమైన 17 ప్రొటీన్లతో కూడిన ‘టైప్ ఐ ఇంటర్ ఫెరాన్’ లోపిస్తున్నట్టు పరిశోధనల్లో తేలింది. శాస్త్రవేత్తలు తమ పరిశోధన ఫలితాలను వెల్లడిస్తూ  ' వైరస్‌లు దాడిచేసినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ స్పందించడానికి ముందే  టైప్ ఐ ఇంటర్ ఫెరాన్లు  రక్షణ వ్యవస్థలను బలోపేతం చేస్తాయి.  అయితే, కొవిడ్ 19 వైరస్  తీవ్రస్థాయికి చేరుకున్నప్పుడు కొందరి శరీరంలోని యాంటీబాడీలు ఈ ఇంటర్‌ ఫెరాన్లను నాశనం చేస్తున్నాయి. మరికొందరిలో జన్యు ఉత్పరివర్తనల వల్ల యాంటీ బాడీస్  సరిపడా ఉత్పత్తి కావడం లేదు. ఈ కారణాలతోనే మరణాలు సంభవిస్తున్నాయి. అయితే ఎవరిలో ఏ విధంగా వైరస్ ప్రభావం ఉంటుందో అంచనా వేయడం కష్టం ' అన్నారు.  

అక్టోబర్‌ 9న ఎమ్మెల్సీ ఎన్నిక. కవిత గెలుపు లాంఛనమే! కేబినెట్ లో చేరబోతుందా?

కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక  షెడ్యూల్‌ విడుదలైంది. అక్టోబర్‌ 9న  ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు  ఉపఎన్నిక పోలింగ్‌ నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 12న  ఉప ఎన్నిక  ఓట్ల లెక్కింపు జరగనుంది. నిజానికి ఏప్రిల్‌ 7న పోలింగ్‌ జరగాల్సి ఉండగా కరోనా వైరస్‌ కారణంగా ఎన్నిక ప్రక్రియ వాయిదా పడింది.   ఉమ్మడి జిల్లా పరిధిలో 824 ఓట్లు ఉన్నాయి. టీఆర్‌ఎస్‌ నుంచి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి సుభాష్ రెడ్డి, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ బరిలో నిలిచారు.    నిజామాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఎన్నికైన భూపతిరెడ్డి పార్టీ ఫిరాయింపునకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయణ్ని అనర్హుడిగా ప్రకటిస్తూ ఆప్పటి మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ వేటు వేశారు. దీంతో ఖాళీగా ఉన్న నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మార్చి 12న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దాని ప్రకారం ఏప్రిల్‌ 7వ తేదీన ఎన్నికలు జరగాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో లాక్‌ డౌన్‌ ప్రకటించడంతో ఎన్నికల సంఘం ఉపఎన్నిక ప్రక్రియ వాయిదా వేసింది. ఆ సమయం ముగిసినా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మరోసారి 45 రోజులపాటు ఎన్నికకు గడువును పొడిగించింది కేంద్ర ఎన్నికల సంఘం.    నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓటర్లుగా మెజార్టీ ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ వారే ఉన్నారు. అయినా కవిత పోటీ చేస్తుండటంతో ఫిరాయింపులను ప్రోత్సహించింది అధికార పార్టీ. నిజామాబాద్ కార్పొరేషన్ కార్పోరేటర్లతో పాటు పలువురు కౌన్సిలర్లు, ఎంపీటీసీలు కారు పార్టీలో చేరారు. సొంత పార్టీ ప్రజా ప్రతినిధులు తనకు వ్యతిరేకంగా ఓటు వేస్తారనే భయంతోనే కవిత.. ఇతర పార్టీల నేతలకు వల వేస్తున్నారని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆరోపించారు.    ఇక మొదటి సారి ఎన్నిక వాయిదా పడగానే టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లను క్యాంపులకు తరలించారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలోనే వారందరిని ఒకే హోటల్లో పెట్టారు. క్యాంపులో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల జల్సాలు, డ్యాన్సుల వీడియోలు వైరలయ్యాయి. కరోనా సమయంలో భౌతిక దూరం పాటించకుండా అందరిని ఒకే చోట ఉంచడంపై విమర్శలు వచ్చాయి. దీంతో క్యాంపులను ఎత్తివేసింది టీఆర్ఎస్. ఇప్పుడు  పోలింగ్ తేది రావడంతో ప్రతిపక్ష పార్టీలు అప్రత్తమయ్యాయి. తమ ఓటర్లను క్యాంపులకు తరలించే ప్రయత్నం చేస్తున్నాయి.   లోకల్ బాడీ ఎమ్మెల్సీ పరిధిలో 824 ఓట్లు ఉండగా.. అందులో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే 532 మంది ఉన్నారని జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డి చెబుతున్నారు. ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత సునాయసంగా గెలుస్తారని తెలిపారు.    నిజామాబాద్ ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత గెలిస్తే .. తర్వాత రాష్ట్ర మంత్రివర్గంలోకి చేరుతారనే ప్రచారం జరుగుతోంది. కేబినెట్ లో చేరేందుకే కవిత మండలికి పోటీ చేస్తున్నారని కొందరు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే కవిత గెలిస్తే... కేంద్ర కేబినెట్ బెర్తు దక్కుతుందనే ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా ఆమె లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత చాలా కాలం ఆమె బయట తిరగలేదు. నిజామాబాద్ ఎమ్మెల్సీ నోటిఫికేషన్ రాగానే మళ్లీ యాక్టివ్ అయ్యారు కవిత. జిల్లా నేతలందరితో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ వేశారు.

కరోనా వ్యాప్తి తీవ్రం.. ఒక్క రోజే 3 లక్షలకు పైగా నమోదైన పాజిటివ్ కేసులు

కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా రికవరీలు పెరుగుతున్నా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. అయితే వైరస్ బలహీనపడిందని కొంతమంది శాస్త్రవేత్తలు చెపుతున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి మాత్రం మరింత తీవ్రమవుతోంది. నిన్న ఒక్క రోజే 3,13,629 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రపంచం మొత్తం కరోనా కేసుల సంఖ్య 3కోట్ల 27లక్షల 42వేల 591కి చేరింది. నిన్న ఒక్క రోజే 5700 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 9,92,835కి చేరింది. అయితే కొంత ఊరటనిచ్చే అంశం ఏంటంటే రికవరీ కేసుల సంఖ్య 2కోట్ల 41లక్షలకు పైగా ఉంది. ఇకపోతే ప్రస్తుతం యాక్టివ్ కేసులు సంఖ్య 75లక్షల 97వేలకు పైగా ఉన్నాయి. అమెరికాలో నిన్న కొత్తగా 50,617 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అమెరికాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 72లక్షల 35వేలు దాటింది. అదే సమయంలో నిన్న 803 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 2లక్షల 8వేలు దాటింది. ఇక బ్రెజిల్‌లో నిన్న కొత్తగా 32670 కేసులొచ్చాయి. దీంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 46లక్షల 92వేలు దాటింది. అంతేకాకుండా కొత్తగా 826 మంది చనిపోవడంతో.. మొత్తం మరణాల సంఖ్య లక్షా 40వేలు మించి పోయింది.   ఇది ఇలా ఉండగా ప్రస్తుతం మొత్తం కేసుల్లో అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. అయితే రోజువారీ నమోదవుతున్న కరోనా కేసుల్లో మాత్రం ఇండియా మొదటి స్థానంలో కొనసాగుతోంది. అదేవిధంగా మొత్తం మరణాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత మన భారత్ మూడో స్థానంలో ఉంది. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే రోజువారీ నమోదవుతున్న కరోనా మరణాల్లో ఇండియా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాటి స్థానాల్లో బ్రెజిల్, అమెరికా, మెక్సికో ఉన్నాయి. భారత్ లో కొత్తగా 86,052 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 58,18,570కి చేరింది. కొత్తగా 1,141 మంది మరణించడంతో.. మొత్తం మరణాల సంఖ్య 92,290కి చేరింది. అయితే కొత్తగా 81,177 మంది కరోనాతో పోరాడి వైరస్ పై విజయం సాధించారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 47,56,164కి చేరింది. ప్రస్తుతం భారత్‌లో 9,70,116 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. మనదేశంలో మహారాష్ట్రలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు అక్కడ 12,82,963 మందికి కరోనా సోకగా.. 34,345 మంది మృత్యువాత పడ్డారు. ఇక రెండో స్థానంలో ప్రస్తుతం ఏపీ ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్నాటక, యూపీ రాష్ట్రాలున్నాయి. ఇది ఇలా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో వైరస్ వ్యాప్తి తగ్గినట్లే తగ్గి మళ్ళీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. 

ఆ ఆరు గ్రామాలకు ఎవరూ వెళ్లొద్దు.. కృష్ణా జిల్లా కలెక్టర్ హెచ్చరిక

ఏపీలో కరోనా కల్లోలం రేపుతూనే ఉంది. ఇప్పటికే పాజిటివ్ కేసులు ఆరున్నర లక్షలు దాటాయి. అయితే ఏపీలో కరోనా వ్యాప్తి మొదలైన సమయంలో కృష్ణా జిల్లాలో పాజిటివ్ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదయ్యాయి. అయితే కాలం గడిచే కొద్దీ కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చాయి. మళ్ళీ కొద్దీ రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ జిల్లాలో తాజాగా 6 కంటైన్మెంట్ జోన్లను ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనందున కరోనా వ్యాప్తి నిరోధించడానికి వీటిని కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించినట్టు ఆయన తెలిపారు. ఈ కంటైన్మెంట్ జోన్లలోకి బయటి వారు ఎవరూ వెళ్లకూడదు... అలాగే కంటైన్మెంట్ జోన్లలో ఉండే వారు కూడా బయటకు రాకూడదు. అయితే వీరికి సంబంధించిన నిత్యావసర సరుకులు, మిగిలిన అవసరాలు అన్నీ స్థానికంగానే అందుబాటులో ఉండేలా ప్రభుత్వ యంత్రాంగం చూస్తుందని అయన తెలిపారు.   తాజాగా కృష్ణా జిల్లాలో కొత్త కంటైన్మెంట్ జోన్ల వివరాలు 1. అవనిగడ్డ మండలంలోని వేకనూరు గ్రామం 2. చల్లపల్లి మండలంలోని లక్ష్మీపురం గ్రామం 3. చందర్లపాడు మండలంలోని తోటరావులపాడు గ్రామం 4. గూడూరు మండలంలోని షబ్ధుల్లపాలెం గ్రామం 5. జగ్గయ్యపేట మండలంలోని తొర్రగుంటపాలెం గ్రామం 6. విస్సన్నపేట మండలంలో కోర్లమంద గ్రామం   ఇదే సమయంలో గత 28 రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాని గ్రామాల్లో కంటైన్మెంట్ జోన్ల నిబంధనలను తొలగించినట్లుగా కలెక్టర్ తెలియజేశారు. 1. ఘంటసాల మండలంలో కొడాలి గ్రామం 2. గుడ్లవల్లేరు మండలంలో పురిటిపాడు గ్రామం 3. గుడివాడ మండలంలో దొండపాడు గ్రామం 4. మచిలీపట్టణం మున్సిపలిటీలో టీచర్స్ కాలని 5. మచిలీపట్నం మండలంలో మంగినపూడి గ్రామం 6. నందిగామ మండలంలో ఐతవరం గ్రామం 7. మైలవరం మండలంలో దాసుళ్ళపాలెం గ్రామం 8. రెడ్డిగూడెం మండలంలో శ్రీరాంపురం గ్రామం 9. రెడ్డిగూడెం మండలంలో ముచ్చినపల్లి గ్రామం

హరీశ్ రావుకు బాలినేని కౌంటర్.. ఆ రూ.4వేల కోట్లు మా జేబుల్లో వేసుకోవట్లేదు

ఏపీ అధికార పార్టీ వైసీపీ, తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ మధ్య దూరం పెరుగుతుందా అంటే అవుననే అనిపిస్తోంది. ఇటీవల తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యవసాయ ఉచిత విద్యుత్ కనెక్షన్లకు మీటర్ల బిగింపు అంశంలో ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కేంద్రం ఇస్తామన్న రూ.4 వేల కోట్లకు ఆశపడి సీఎం జగన్ మీటర్ల పేరుతో ఏపీ రైతుల మెడకు ఉచ్చు బిగిస్తున్నారని విమర్శించారు. వ్యవసాయ ఉచిత విద్యుత్ కనెక్షన్లకు‌ మీటర్లు పెడితే.. తెలంగాణకు రూ.2500 కోట్లు, ఏపీకి రూ.4వేల కోట్లు ఇస్తామని కేంద్రం చెప్పిందని.. అయితే తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించిందన్నారు. కేంద్రం డబ్బుకు కక్కుర్తి పడి రైతుల మెడకు ఉరితాడు బిగించలేమని అన్నారు. కానీ, రూ.4 వేల కోట్లకు ఆశపడిన ఏపీ సీఎం జగన్.. మీటర్ల బిగింపుకు సమ్మతించారని వ్యాఖ్యానించారు.   హరీష్ రావు వ్యాఖ్యలపై తాజాగా ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. మీటర్లు అమర్చే విషయంలో కేంద్రంతో సఖ్యతగా ఉంటూ కష్టాల్లో ఉన్న రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రానికి మద్దతు ఇచ్చామన్నారు. కేంద్రం ఇచ్చే రూ.4 వేల కోట్ల నిధులను ప్రజా సంక్షేమం కోసమే ఉపయోగిస్తాం తప్ప, వాటిని తమ జేబుల్లో వేసుకోమనే విషయాన్ని తెలంగాణ మంత్రి హరీష్ రావు గ్రహించాలి అన్నారు. అయినా టీఆర్ఎస్ ప్రభుత్వంలా కేంద్రంతో ఒకరోజు మంచిగా ఉండడం, మరో రోజు గొడవ పడడం తమ నైజం కాదని చురక అంటించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో సఖ్యతతో ఉండడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్ బిల్లులకు సంబంధించి డిస్కంలకు చెల్లించవలసిన మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాలోనే జమ చేస్తామని, దీనిపై ఎవ్వరూ అనుమాన పడవలసిన అవసరంలేదన్నారు. కాగా, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో సఖ్యతతో ఉండడం తప్పెలా అవుతుందన్న బాలినేని.. ముందు ముందు కేంద్ర సహకారంతో.. రాష్ట్రానికి ఏమేం తీసుకొస్తారో, రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేస్తారో చూడాలి. 

బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. సరికొత్త నిబంధనలు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ సునీల్ అరోరా వివరాలు తెలిపారు. బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ సీట్లకు, మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. అక్టోబరు 28న తొలి దశలో 71 స్థానాల్లో, నవంబరు 3న రెండో దశలో 94 స్థానాల్లో, నవంబరు 7న మూడో దశలో 78 స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయని వివరించారు. నవంబరు 10 ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. ఎన్నికల నియమావళి తక్షణమే అమలులోకి వస్తుందని రావత్ ప్రకటించారు.   బీహార్‌లో మొత్తం 7.29 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, కరోనా నిబంధనల మేరకు బీహార్‌లో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో కరోనా జాగ్రత్తలు విధిగా పాటించాల్సిందేనని తెలిపారు. భారీ ర్యాలీలు, బహిరంగ సభలకు ఏమాత్రం అనుమతి లేదని తెలిపారు. నామినేషన్లు కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే నింపాలని, డిపాజిట్లను కూడా ఆన్‌లైన్ ద్వారా కట్టాలని ఆయన సూచించారు. ఇంటింటికి ప్రచారంలో భాగంగా కేవలం ఐదుగురు కార్యకర్తలు మాత్రమే వెళ్లాలని, నామినేషన్లు వేసే సమయంలో అభ్యర్థితో కేవలం ఇద్దరు మాత్రమే రావాలని స్పష్టం చేశారు.   బీహార్‌లో పోలింగ్‌ బూత్‌ల సంఖ్యను పెంచుతున్నామని తెలిపారు. ఒక్కో పోలింగ్‌ బూత్‌లో వెయ్యి మంది ఓటర్లను అనుమతిస్తామని చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద శానిటైజర్లు ఉంచుతామని, పోలింగ్ సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజులు ఇస్తామని తెలిపారు. వృద్ధులు, కరోనా రోగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, పోస్టల్‌ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. పోలింగ్‌ సమయాన్ని మరో గంట పెంచుతున్నామని తెలిపారు. సాధారణంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని, అయితే, కరోనా దృష్ట్యా ఈసారి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని సునీల్ అరోరా ప్రకటించారు.

సెక్యూరిటీని చూపి అందరిని బెదిరిస్తున్నాడు.. రఘురామరాజు పై ఎంపీ సురేష్ ఫిర్యాదు

వైసిపికి ఎంపీ రఘురామకృష్ణం రాజుకు మధ్య వివాదం మరింత ముదురుతున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా రఘురామరాజు కేంద్రం తనకు ఇచ్చిన భద్రతను చూపి అందరిని బెదిరిస్తూ.. భయపెడుతున్నారని బాపట్ల వైసిపి ఎంపీ నందిగం సురేష్ లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు. ఏకంగా త‌న చ‌ర్మం వ‌లిచేస్తాన‌ని, త‌నను కుల‌ప‌రంగా దూషించారంటూ సురేష్ ఈ సందర్భంగా రఘురామ రాజు పై ఆరోపించారు. ఎంపీ రఘురామ రాజుకు ఇచ్చిన భద్రతను వెంట‌నే తొల‌గించాల‌ని అయన త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే వైసిపికి కొరకరానికొయ్యగా తయారైన రఘురామ రాజునూ ఎదుర్కొనేందుకు వైసీపీ ఎంపీ సురేష్ ను ముందు పెట్టి.. ఆయ‌న కులం కార్డును తెర‌పైకి తెచ్చిన‌ట్లుంద‌ని రాజకీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే నిత్యం రచ్చబండ పేరుతొ వైసిపి నేతలపై ఘాటు కామెంట్లు చేసే ఎంపీ రఘురామ రాజు దీని పై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

అధికార పార్టీకి అభ్యర్థులు కరువు? పట్టభద్రులతో పరేషాన్!

ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి. ఈ సామెత వ్యాపారంలోనే కాదు రాజకీయాల్లోనూ సూటవుతోంది. ఇప్పటివరకు ఆ పార్టీ టికెట్ కోసం ఆశావహులు క్యూ కట్టేవారు. ఎలాగైనా టికెట్ ఇప్పించాలని ముఖ్య నేతల చుట్టూ ప్రదిక్షణలు చేసేవారు. కాని ఇప్పుడు సీన్ మారిపోయింది. టికెట్ ఇస్తామన్నా ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అధికార పార్టీగా ఉన్నా నేతలెవరు అటువైపు చూడటం లేదు. పోటీ చేయాలని హైకమాండ్ సూచిస్తున్నా.. తమ వల్ల కాదంటూ దండం పెట్టి పోతున్నారట లీడర్లు. ఈ పరిస్థితి తలెత్తింది తెలంగాణలో రూలింగ్ లో ఉన్న టీఆర్ఎస్ పార్టీలో. కేసీఆర్,కేటీఆర్ చెబుతున్నా.. పోటీ చేయడానికి నేతలెవరు ఆసక్తి చూపడం లేదని ప్రచారం జరుగుతోంది.     తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి  పట్టభధ్రుల ఎమ్మెల్సీ  ఎన్నికలు సవాల్ గా  మారుతున్నాయి. 2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ విజయం సాధించిన కారు పార్టీకి .. రెండుసంవత్సరాలు కూడా  కాకుండానే రివర్స్ సీన్ కనిపిస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అధికార పార్టీకి అభ్యర్థులే కరువైన పరిస్థితి నెలకొంది.  ఓటమి భయంతోనే పోటీకి  నేతలెవరు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. సిట్టింగులు తమ వల్ల కాదని చెతులెత్తేస్తుండగా.. కొత్త వారు పోటీకి వెనుకంజ వేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్న నిరుద్యోగులు,ఉద్యోగులు, టీచర్స్ లో కేసీఆర్ సర్కార్ పని తీరుపై  తీవ్ర వ్యతిరేకత ఉందన్న కారణంగానే  ఎన్నికల్లో పోటీకి ఎవరూ ఆసక్తి చూపడం లేదని భావిస్తున్నారు.    వచ్చే ఏడాది మార్చిలో వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్స్‌‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్స్‌‌ ఎమ్మెల్సీ రామచంద్రరావు ల పదవీకాలం కాలం ముగుస్తుంది. ఆ లోపే ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మండలి ఎన్నికలపై ఫోకస్ చేసిన ప్రధాన పార్టీలు ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టాయి. అయితే అధికార టీఆర్ఎస్ నేతలు మాత్రం దాన్ని పట్టించుకోలేదు. దీంతో రంగంలోకి దిగిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ మంత్రి కేటీఆర్.. ఎన్నికల జరగనున్న ఆరు జిల్లాల నేతలతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఓటరు నమోదు చేపట్టాలని పార్టీ ప్రజా ప్రతినిధులను ఆదేశిస్తున్నారు.  అయితే ఓటర్ నమోదు కోసం కార్యకర్తలతో మీటింగ్ పెట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫీడ్ బ్యాక్ చూసి ఆందోళన చెందుతున్నారట. నిరుద్యోగులు,ఉద్యోగులు, టీచర్స్ లో పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని కార్యకర్తలు స్పష్టంగా పెద్ద లీడర్లకు చెబుతున్నారట. ఓటర్ల నమోదు కార్యక్రమం చేపట్టిన పార్టీకి ప్రయోజనం ఏమీ ఉండదని స్పష్టం చేస్తున్నారట. ఇదే విషయాన్ని టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కేటీఆర్ కు చెప్పినట్లు చెబుతున్నారు.    గ్రాడ్యుయేట్స్‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం కష్టమేనని టీఆర్ఎస్ లీడర్లల్లనే చర్చ జరుగుతోంది. ఉద్యమ టైమ్ లో ఉన్న పరిస్థితులకు ఇప్పటికీ చాలా మార్పు వచ్చిందని చెబుతున్నారు. అందుకే గ్రాడ్యుయేట్స్‌‌ ఎలక్షన్స్ లో పోటీ చేసేందుకే అభ్యర్థులు భయపడుతున్నట్లు టీఆర్ఎస్ ఇంటర్నల్ మీటింగ్స్ లో చర్చ నడుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మళ్లీ పోటీ చేసేందుకు సిద్దంగా లేరని తెలుస్తోంది. పోటీ చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో ఆయనకు తెలుసు కాబట్టే ఆయన వెనుకంజ వేశారనే చర్చ పార్టీలో జరుగుతోంది. పోటీ చేయబోనని పల్లానే స్వయంగా పార్టీ పెద్దలకు చెప్పినట్లు చెబుతున్నారు.  మండలి ఏర్పాటు తర్వాత ఇప్పటి వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం నుంచి టీఆర్ఎస్ గెలవలేదు. ఈ నియోజకవర్గం నుంచి  హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ ను పోటీకి దింపాలని పార్టీ భావిస్తోంది. అయితే ఆయన కూడా పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదని సమాచారం.   2018 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచినప్పటికీ ఆ వెంటనే జరిగిన కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఓడిపోయారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన జీవన్ రెడ్డికి అధికార పార్టీ అభ్యర్థి కనీస పోటీ కూడా ఇవ్వలేదు. 2015 లో  జరిగిన వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్స్‌‌ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి అతి కష్టం మీద గెలిచారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నుంచి పోటీచేసిన దేవిప్రసాద్ ఘోరంగా ఓడిపోయారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, టీచర్ల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని టీఆర్ఎస్ లీడర్లే చెబుతున్నారు. ప్రస్తుతం ఆ వ్యతిరేకతను తట్టుకొని గెలవటం సాధ్యం కాదని ఓపెన్ గానే మాట్లాడుకుంటున్నారు.   మొత్తానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అధికార పార్టీకి అభ్యుర్థులే దొరకపోవడం ఆశ్చర్యకరంగా మారింది. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేననే విషయం దీంతో బయటపడుతుందనే చర్చ జరుగుతోంది. శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో తమకు ఎదురవుతున్న ఇబ్బందికర పరిస్థితిని టీఆర్ఎస్ ఎలా అధిగమిస్తుందో చూడాలి మరీ.

విజయవాడలో ఫ్లెక్సీల కలకలం.. అధికార పార్టీ నేతల బహిరంగ బెదిరింపులు!!

విజయవాడలో నిత్యం రద్దీగా ఉండే కనకదుర్గమ్మ వారధిపై అధికార పార్టీ నేతలు పెట్టిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. పరోక్షంగా కొందరిని టార్గెట్ చేస్తూ హెచ్చరిస్తున్నట్టుగా ఆ ఫ్లెక్సీలు ఉండటమే కాకుండా.. ఆ ఫ్లెక్సీలపై ఏకంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫోటో, వైసీపీ ముఖ్య నాయకులు జోగి రమేష్, విజయసాయి రెడ్డి ఫోటోలు ఉన్నాయి. ఆ ఫ్లెక్సీలు వైసీపీ టియుసి నాయకులు పేర్లు, ఫోటోలతో వెలిశాయి. అయితే ఆ వివాదాస్పద ఫ్లెక్సీలు చూసి అందరూ అవాక్కయ్యారు. అందులో ఏమి ఉంది అంటే.. "రాజ్యాంగ వ్యవస్థల పేరుతో మా ప్రభుత్వానికి సంకెళ్ళు వెయ్యాలని ప్రయత్నాలు చేస్తే మేము ఊరుకోం." అని హెచ్చరిస్తున్నట్టుగా ఉంది. అంతేకాదు, "మా ప్రభుత్వం ప్రజల అభిమానం ఆమోదం పొంది గెలిచింది, మా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మీకు ఎవరు ఇచ్చారు" అంటూ ఆ ఫ్లెక్సీల్లో రాసి ఉంది. దీంతో ఇప్పుడు ఈ ఫ్లెక్సీలు చర్చనీయాంశం అయ్యాయి. వైసీపీ టియుసి నాయకుడు మాడు శివరామ కృష్ణ పేరిట పెట్టిన ఈ ఫ్లెక్సీల్లో ఉన్న మాటలు పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలు ఎవరిని టార్గెట్ చేసి పెట్టారు? మా ప్రభుత్వాన్ని అడ్డుకుంటే ఊరుకోం అని ఏకంగా వార్నింగ్ ఇస్తున్నారా?. ఎవరిని బెదిరించటానికి ఇంత బహిరంగంగా ఫ్లెక్సీలు పెట్టారు? అనే చర్చ మొదలైంది. రాజ్యాంగ వ్యవస్థలు అని చెప్పి మరీ వార్నింగ్ ఇస్తున్నారు. మా ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచింది, మేము ఏమైనా చేస్తాం, మీరు ఎవరు ప్రశ్నించటానికి అనే ధోరణి ఎంతవరకు కరెక్ట్?. ప్రతిపక్ష పార్టీని అయితే డైరెక్ట్ గా విరుచుకుపడే వారని, ఇది కేంద్రాన్ని కానీ, కోర్టులను కానీ ఉద్దేశించి రాసినట్టు ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏకంగా రాజ్యసభలో కోర్టులను తప్పుబడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు ఆ ఆ వివాదాస్పద ఫ్లెక్సీల్లో ఆయన ఫోటో కూడా ఉంది. ఇక ఏపీలో హిందూ ఆలయాలపై జరుగుతున్న వరుస దాడులు, మంత్రి కొడాలి నాని వంటి వారు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, దీనికితోడు న్యాయవ్యవస్థపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు.. ఈ వరుస పరిణామాలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో జగన్ కి క్లాస్ పీకారని వార్తలొచ్చాయి. మరోవైపు, అవినీతి ఆరోపణల కేసులో జగన్ మరోసారి జైలుకి వెళ్లే అవకాశం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో "మా ప్రభుత్వానికి సంకెళ్ళు వెయ్యాలని ప్రయత్నాలు చేస్తే ఊరుకోం" అంటూ ఫ్లెక్సీలు పెట్టడం కలకలం రేపుతోంది. మరి ఈ వివాదాస్పద ఫ్లెక్సీలను వైసీపీ అధిష్టానం కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ ఖండిస్తారా? లేక ఆ ఫ్లెక్సీల వెనుక మేమున్నాం అన్న పరోక్ష సంకేతాలు ఇస్తారా చూడాలి. ఏదిఏమైనా ఇలా బహిరంగంగా ఫ్లెక్సీలు పెట్టి బెదిరింపులకు దిగడం మంచి పద్దతి కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పరిస్థితి విషమం.. కరోనాకు తోడు డెంగ్యూ

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కరోనా బారినపడి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నెల 14న సిసోడియాకు కరోనా సోకగా హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే ఆయనకు జ్వరం తగ్గకపోవడంతో పాటు, రక్తంలో ఆక్సీజెన్ లెవెల్స్ పడిపోవడంతో మూడు రోజుల క్రితం లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్ (ఎల్ఎన్‌జేపీ) ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయనకు తాజాగా డెంగ్యూ కూడా సోకడంతో అటు జ్వరం తగ్గకపోగా.. బ్లడ్ ప్లేట్‌లెట్లు కూడా క్రమంగా పడిపోతుండడంతో ఆయన ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు తెలిపారు. దీంతో ఆయనను లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్ ఆసుపత్రి నుంచి సాకేత్‌లోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించినట్టుగా అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఆయనను ఐసియులో ఉంచి చికిత్స చేస్తున్నారు.