తమ గొయ్యి తామే తవ్వుకుంటున్నారా! తిరుపతిలో ఏం చేయబోతోంది?
posted on Oct 1, 2020 @ 1:38PM
తిరుపతి లోక్ సభకు త్వరలో జరగనున్న ఉప ఎన్నిక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీట్ పెంచుతోంది. తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి ఢిల్లీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వైసీపీ ఎంపీ మరణంతో జరగబోతున్న ఉప ఎన్నికలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోవచ్చని, బిజెపికి ఆ సీటును ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఇదే ఏపీలో హాట్ హాట్ గా మారింది. నిజంగా టీడీపీ తిరుపతిలో పోటీ చేయకూడదని నిర్ణయించిందా.. బీజేపీకి మద్దతు ఇవ్వబోతుందా అన్న చర్చ రాజకీయ పార్టీలతో పాటు టీడీపీలోనూ జోరుగా జరుగుతోంది. తిరుపతిలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ పోటీ చేయకపోతే అది సంచలనమే కాబోతోంది. ఏపీలో రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉంది.
తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ పోటీ చేయకుంటే.. అది ఆ పార్టీ చేసిన పెద్ద తప్పిదమవుతుందనే చర్చ రాజకీయ వర్గాల నుంచి వస్తోంది. చంద్రబాబు అలాంటి నిర్ణయం తీసుకుంటే టీడీపీ తన గొయ్యి తానే తవ్వుకున్నట్లు అవుతుందని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత టీడీపీ నేతలు సైలెంట్ అయి పోయారు. పార్టీలో, ప్రభుత్వంలో పదవులు అనుభవించిన నేతలు సైతం కనిపించకుండా పోయారు. దశాబ్దాల పాటు మంత్రులు చేసిన సీనియర్లు కూడా ప్రజలకు, టీడీపీ కేడర్ కు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో ఏపీలో టీడీపీ కార్యక్రమాలు పెద్దగా జరగడం లేదు. అటు బీజేపీ మాత్రం పార్టీ బలోపేతం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. అందివచ్చే అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటుంది. అలయాలపై దాడులు, టీటీడీ డిక్లరేషన్ వంటి విషయాల్లో దూకుడుగా వెళ్లారు కమలనాధులు. టీడీపీ నేతలు మాత్రం ప్రకటనలు, ప్రెస్ మీట్లకే పరిమితమయ్యారు.
టీడీపీలో నెలకొన్న స్థబ్దతతో ఏపీలో ప్రస్తుతం రెండే పార్టీలు యాక్టివ్ గా ఉన్నాయనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. చంద్రబాబుకు వయసు మీద పడిందనే టాక్ కూడా వినిపిస్తోంది. టీడీపీ నేతలు ఎక్కడున్నారనే డౌట్స్ కూడా ప్రజల నుంచి వస్తున్నాయి. ఇలాంటి సమయంలో తిరుపతి ఉపఎన్నికలో టీడీపీ పోటీ చేయకపోతే.. ఆ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందనే చర్చ జరుగుతోంది. తిరుపతి సీటును బీజేపీకి ఆఫర్ చేస్తే.. టీడీపిపై ప్రజల్లో ఉన్న రూమర్ నిజం చేసినట్లు అవుతుందని కొందరు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే టీడీపీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదనుగా బీజేపీ మరింత దూకుడుగా ప్రజల్లోకి వెళ్లవచ్చని, టీడీపీని టార్గెట్ చేయవచ్చనే అభిప్రాయం కూడా వస్తుంది.
సహజంగా ఉప ఎన్నికల్లో అధికార పార్టీకే అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. తిరుపతిలో చనిపోయిన సిట్టింగ్ ఎంపీ వైసీపీ వ్యక్తే. అంటే అక్కడ వైసీపీకి అధికార పార్టీతో పాటు సిట్టింగ్ ఎంపీ చనిపోయిన సానుభూతి కూడా ఉంటుంది. సో .. తిరుపతిలో విపక్ష పార్టీగా ఓడిపోయినా తెలుగుదేశానికి పెద్ద ఇబ్బంది ఉండదు. అధికారంతో పాటు సెంటిమెంట్ తో వైసీపీ గెలిచిందని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా పోటీ చేయకపోతే వైసీపీని ఎదుర్కొనే సత్తా లేక పారిపోయిందనే విమర్శలు టీడీపీకి రావచ్చు. పార్టీకి భవిష్యత్ లో ఇది చాలా ప్రమాదకరంగా మారుతుంది. వైసీపీ ఆరోపిస్తున్నట్లే టీడీపీకి భవిష్యత్ లేదనే అభిప్రాయం జనాల్లోకి వెళ్లే అవకాశం ఉందనే ఆందోళన కొందరు తమ్ముళ్లలో వ్యక్తమవుతోంది.
బీజేపీ బలపడితే ఏపీలో టీడీపీకే ఎక్కువ ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిణామాలను ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. జాతీయ పార్టీ బలంగా ఉన్న మెజార్టీ రాష్ట్రాల్లో ఒక్క ప్రాంతీయ పార్టీనే నిలదొక్కుకోగలుగుతోంది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంది. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో మాత్రం కాంగ్రెస్ లేదా బీజేపీలో ఏదో ఒకటే బలపడుతోంది. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ ఉనికి కోల్పోయింది కాబట్టి జాతీయ పార్టీగా బీజేపీ బలపడే అవకాశం ఉంది. అదే సమయంలో ఒక్క ప్రాంతీయ పార్టీనే స్ట్రాంగ్ గా నిలబడవచ్చు. వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి.. ఆ పార్టీకి ఢోకా ఉండకపోవచ్చు. ఎటొచ్చి బీజేపీ బలపడితే నష్టపోయేది టీడీపీనే. అందుకే టీడీపీని బలహీనపరుస్తూ ఎదిగేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీకి సపోర్ట్ చేస్తే.. టీడీపీ కష్టాలు కోరి తెచ్చుకున్నట్లే అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బాబు ఎంతగా ప్రయత్నించినా బీజేపీ నుంచి ఏ విధమైన రెస్పాన్స్ రావడం లేదని కూడా తెలుస్తోంది. అయినా బిజెపి కేంద్ర పెద్దల దృష్టిలో పడేందుకు, అదేపనిగా వారిని పొగుడుతూ లేఖలు రాస్తూ సోషల్ మీడియాలో చంద్రబాబు హడావుడి చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఈ వ్యవహారాలన్నీ తెలుగు తమ్ముళ్లకు ఏమాత్రం నచ్చడం లేదు. ఏపీలో క్షేత్రస్థాయిలో బలంగానే ఉన్నా, కొన్ని పరిస్థితులు అనుకూలించకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని, మళ్లీ తప్పనిసరిగా పార్టీకి పునర్వైభవం వస్తుందని నమ్ముతున్నారు. అప్పటి వరకు చంద్రబాబు ఆగలేకపోతే ఎలా అంటూ సెటైర్లు వేస్తున్నారు. బిజెపిని నమ్ముకోవడం కంటే సొంతంగా పార్టీని పటిష్టం చేసే విషయంపై దృష్టిపెడితే మేలని కొందరు టిడిపి నాయకులు అధినేతకు సూచనలు చేస్తున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలోనూ చివరి వరకు రెండు కండ్ల సిద్ధాంతం వినిపించారు చంద్రబాబు. చివరకు అదే తెలంగాణలో టీడీపీకి శాపంగా మారింది. బీజేపీ పొత్తు కూడా అక్కడ టీడీపీని దెబ్బ తీసింది. బిజెపి బలంగా లేకపోయినా వారికి ఎక్కువ సీట్లు ఇవ్వడంతో పార్టీ దెబ్బతిన్నదని తెలంగాణ టీడీపీ నేతలే బహిరంగంగానే చెప్పారు. ఇప్పుడు ఏపీలోనూ అదే సీన్ కనిపిస్తోంది. టీడీపీని దెబ్బకొట్టడమే లక్ష్యంగా సోము వీర్రాజు టీమ్ కుట్రలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ సమయంలో అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటే ఏపీలోనూ టీడీపీకి తెలంగాణలో ఉన్న పరిస్థితి రావచ్చనే ఆందోళన కొందరు నేతల్లో వ్యక్తమవుతోంది. తిరుపతిలో బీజేపీకి సపోర్ట్ చేస్తే.. అది టీడీపీకి గుది బండగా మారుతుందని, అలాంటి అవకాశం ఇవ్వొద్దని తమ్ముళ్లు చెబుతున్నారు
అసెంబ్లీలో ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినా ఢీలా పడాల్సిన అవసరం లేదంటున్నారు కొందరు టీడీపీ నేతలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ 24 సీట్లకు పడిపోయినా.. తర్వాత పుంజుకుని అధికారం చేపట్టిందని గుర్తు చేస్తున్నారు. 1989లో టీడీపీ ఓడిపోయినా.. తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా మట్టి కరిపించిందని చెబుతున్నారు. ప్రజా సమస్యలు పోరాడుతూ ఉంటే చాలని, ఏపీలో టీడీపీదే మళ్లీ అధికారమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటే.. చేజేతులా మరో పార్టీకి బలపడే అవకాశం ఇచ్చినట్లేనని చెబుతున్నారు.
మరోవైపు తిరుపతి ఉప ఎన్నికపై జరుగుతున్న ప్రచారాన్ని కొందరు టీడీపీ నేతలు కొట్టి పారేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదంటున్నారు. గతంలోనూ ఇబ్బందులు వచ్చినా పార్టీని బలోపేతం చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారని చెబుతున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని, గెలుస్తుందని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓటమి భయంతోనే టీడీపీపై వైసీపీ ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తుందని కూడా కొందరు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్ని చర్చలు, ప్రచారాలు జరుగుతున్నా తిరుపతి ఉప ఎన్నిక విషయంలో చంద్రబాబు తీసుకోబోయే నిర్ణయం ఏపీ రాజకీయాల్లో కీలకం కాబోతుందని తెలుస్తోంది. సో.. చంద్రబాబు టీడీపీని ఫణంగా పెట్టేలా తిరుపతిలో బీజేపీకి మద్దతిస్తారా.. లేక బరిలో ఉండి అధికార వైసీపీని ఢీకొడతారా చూడాలి మరీ.