పాపం.. అధికారాల్లేని మంత్రులు!
posted on Oct 1, 2020 @ 12:43PM
పాపం.. అధికారాల్లేని మంత్రులు!
మంత్రి క్యాంపు ఆఫీసు ముందే చెత్తకుప్ప
మంత్రి చెప్పినా వినే దిక్కులేదట
కలెక్టరుకు లేఖ రాసిన మంత్రి మేకపాటి
తెలంగాణలోనూ మంత్రుల పరిస్థితి దయనీయమేనట
ఆంధ్రాలో మంత్రి పదవులు రాలేదని కొద్దికాలం కుమిలిపోయిన సీనియర్లు, ఇప్పుడు ఆ పదవులు రాకపోవడమే మంచిదన్న భావనలో ఉన్నారు. పదవులివ్వకుండా జగనన్న తమ పరువు కాపాడారని సంతోషిస్తున్నారట. నెల్లూరు జిల్లా మంత్రి మేకపాటి గౌతంరెడ్డి చెప్పినా చెత్త తొలగించని వైనం చూసి, తమకు పదవులు రాకపోవడమే మంచిదయిందని తమకు తాము ఓదార్చుకుంటున్నారట. అటు పదవులు పొందిన మంత్రులదీ అదే భావన. మునుపటి మాదిరిగా జగనన్నకు, ఇప్పుడు ఎవరినీ ఓదార్చే తీరిక లేకపోవడంతో.. పాపం మంత్రులు తలుపులు వేసుకుని, అద్దం ముందు నిలబడి తమను తామే ఓదార్చుకుంటున్నారట.
అధికారంలోకి వస్తే మంత్రులయి, పెత్తనం సాగించవచ్చని వైసీపీ నేతలు భావించారు. తీరా అధికారంలోకి వచ్చి, పదవులు దక్కించుకున్నా పెత్తనమంతా సీఎంఓదే కావడంతో నిరాశ చెందుతున్నారట. అటు అధికారులూ మాట వినక, ఇటు జనంలో పలుకుబడి పలచనవుతుండటంతో జుత్తుపీక్కోవలసి వస్తోందిట. మంత్రి పదవులు పొందిన వారిని చూసి, ఎమ్మెల్యేలు ఈర్ష్య పడుతుంటే.. ఎమ్మెల్యేల స్వేచ్ఛను చూసి, మంత్రులు ఈర్ష్య పడుతున్న వైచిత్రి కనిపిస్తోంది.
నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి, జగనన్న అత్యంత సన్నిహితుడే. విపక్షంలో ఉండగా, ఆర్ధికంగా నాలుగుచేతులేసిన వారిలో మేకపాటి కుటుంబం కూడా ఒకటి. అధికారంలోకి వచ్చిన తర్వాత, మేకపాటికి మంత్రి పదవి ఇచ్చినప్పటికీ, పాపం జిల్లాలో ఆయన మాట చివరకు శానిటరీ ఇన్స్‌పెక్టర్ కూడా పట్టించుకోకపోవడం లేదట. దీనితో మంత్రిని చూసి, సొంత పార్టీ నేతలే జాలిపడాల్సిన దుస్థితి. స్వయంగా మంత్రిగారి క్యాంపు ఆఫీసు వద్దే పేరుకుపోయిన కొండంత చెత్తను తొలగించాలని, మంత్రి గారి ఆఫీసు నుంచి చాలా ఫోన్లు వెళ్లాయట. అయినా ఖాతరు చేసే దిక్కులేదు. దీనితో అగ్గిరాముడయిన మంత్రి, సదరు అధికారికి ఫోన్ చేసి తన వద్దకు హాజరుకావాలని హుకుం వేశారు. ‘అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న’ అన్నట్లు.. ఆ అధికారి మంత్రి కంటే నాలుగాకులు ఎక్కువే చదవడంతో, డోంట్ కేర్ అన్నారు. దానితో కన్నెర్ర చేసిన మంత్రి గారు, ఆ అధికారి సంగతి తేల్చాలని జిల్లా కలెక్టరులకు లేఖ రాశారట. ఒకవేళ కలెక్టర్ మంత్రి గారి మాట విని, సద రు అధికారిపై చర్య తీసుకుంటే మున్సిపల్ ఉద్యోగ సంఘాలు ఊరుకోవు. చర్య తీసుకోకపోతే.. ఇప్పటికే సగం పోయిన మంత్రి పరువు, తర్వాత పూర్తిగా పోవడం ఖాయం. చూడాలి.. కలెక్టరు గారు ఏం చేస్తారో?
నిజానికి జగనన్న క్యాబినెట్‌లో.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి ఒకరిద్దరి మాటనే చెల్లుబాటవుతోంది. మిగిలిన వారి ఈతిబాధతల గురించి, ఎంత తక్కువగా చెప్పుకుంటే అంతమంచిది. వారి శాఖలన్నీ సీఎంఓనే పర్యవేక్షిస్తోంది. మంత్రులకు ‘ఆలోచించుకునే కష్టం’ కూడా కలగనీయడం లేదట. సచివాలయ స్థాయిలో కార్యదర్శి- ముఖ్య కార్యదర్శులు, జిల్లా స్థాయిలో కలెక్టర్లదే హవా. కాంగ్రెస్ హయాంలో ఉత్తరాంధ్రను ఊపేసి, నాటి సీఎం కిరణ్‌కునమార్‌రెడ్డినే ఖాతరు చేయని సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ పరిస్థితి చూసిన వారు, ఆశ్చర్యపడాల్సి వస్తోంది.
ఇక గతంలో మంత్రులుగా పనిచేసిన వారు ఇప్పుడు స్థితప్రజ్ఞత ప్రదర్శించి, ఎవరి నియోజకవర్గాలకు వారు పరిమితమయ్యారు. అధికారంలోకి వచ్చి 15 నెలలయినా ఇప్పటికీ, క్యాబినెట్‌లో ఉన్న మంత్రుల పేర్లు చాలామందికి తెలియవంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. పేరుకు పెద్ద శాఖలు నిర్వహిస్తున్న మంత్రులకూ పెద్దగా అధికారాలు లేవట. పేరుకు చాలా పెద్ద, కీలకమయిన రెవిన్యూ శాఖ మంత్రికి పెద్దగా పవరు లేదట. సరే అప్పటి నిమ్మకాయల చినరాజప్ప- నాయని నరసింహారెడ్డి.. లేకపోతే ఇప్పటి మేకతోటి సుచరిత-మొహమద్ అలీ హోంమంత్రులుగా ఉన్నా, లా అండ్ ఆర్డర్‌తోపాటు... డీఎస్పీ నుంచి సీఐల బదిలీ వరకూ సీఎంలే చూసుకుంటారు. కాబట్టి, హోంమంత్రుల అధికారాలు-ఆవేదన గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు.
అయితే... చంద్రబాబును ప్రతీ విషయంలో వ్యతిరేకిస్తూ... తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకుంటున్న జగనన్న, ఈ విషయంలో మాత్రం వారిద్దరి అడుగుజాడల్లో నడుస్తుండటం విశేషం. అప్పుడు బాబు-ఇప్పటికీ కేసీఆర్.. అధికారాన్ని సీఎంఓకే అనుసంధానం చేశారు. కెఇ కృష్ణమూర్తి లాంటి సీనియరే, ఎమ్మారో-ఆర్డీఓ బదిలీలు మీరే చేసుకోమని సీఎంఓకు దండం పెట్టి వచ్చారు. బాబు తీసుకునే నిర్ణయాలేమిటో, తమ జిల్లా కలెక్టర్లు చెబితే గానీ మంత్రులకు తెలిసేది కాదు.
తెలంగాణలో కూడా సేమ్ టు సేమ్. తెలంగాణలోనూ హరీష్‌రావు లాంటి వారికి తప్ప, ఎవరికీ అధికారాలు లేవు. అంతా సీఎంఓ ఆదేశాల మేరకే శాఖలు నడుస్తున్నాయి. ఫలానా వారిని నియమించుకునే అధికారం, మంత్రులకు లేదన్నది బహిరంగ రహస్యం. ఒకప్పుడు టీడీపీ-కాంగ్రెస్ ప్రభుత్వాలలో హవా చెలాయించి, జిల్లాల్లో ఏకపాత్రాభినయం చేసిన ప్రముఖులంతా, ఇప్పుడు తమ స్థానమేమిటో గ్రహించి, లౌక్యంగా వెళుతున్న పరిస్థితి. కేటీఆర్, హరీష్ తర్వాత మరొక మంత్రికి పెద్దగా అధికారాలు ఉన్నట్లు కనిపించదు. గతంలో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి వంటి కొద్దిమంది హవా కనీసం వారి శాఖలోనయినా నడిచేది.
ఆంధ్రాలో జగన్మోహన్‌రెడ్డినయినా, తెలంగాణలో కేసీఆర్‌ను అయినా మంత్రులు కలవాలంటే గగనమే. వాళ్లు పిలిస్తే తప్ప, తమంతట తాము వెళ్లి కలిసే పరిస్థితి లేదు. ఈ విషయంలో చంద్ర బాబు ఎంతో మెరుగని చెబుతుంటారు. వన్ టు వన్ కాకపోయినా, వెళ్లే ముందో-వచ్చే ముందో కనీసం బాబు దగ్గర ధర్మదర్శనం ఉంటుంది. తిరుమల వెంకన్న మాదిరిగా, ఆయన నిలబడితే సందర్శకులు క్యూలు కట్టి, తమ ఈతిబాధలు చెప్పుకునే అవకాశం ఉంటుంది. బాబు అప్పటికప్పుడు ఎలాంటి నిర్ణయం చెప్పకపోయినా.. వర్కవుట్ చేద్దాం. చూద్దాం. మాహాడదాం.. అనే మాటలు వినిపిస్తుంటాయి. కానీ కేసీఆర్-జగన్ వద్ద అది కూడా ఉండదన్నది ఆయా పార్టీ వర్గాల్లో బహిరంగంగా వినిపించే వ్యాఖ్య. ఎవరి స్కూలు వారిది మరి!
-మార్తి సుబ్రహ్మణ్యం