సోము కాముగా ఉన్నారేంటి? సాయి కోసమేనా..
posted on Sep 30, 2020 @ 10:27AM
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. జాతీయ నాయకురాలికి జాతిని అంటగట్టడంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. విజయసాయి వ్యాఖ్యలను పార్టీలకతీతంగా నేతలు ఖండిస్తున్నా.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం ఇంకా స్పందించ లేదు. తమ పార్టీ జాతీయ నాయకురాలిపై కులం పేరుతో వేరో పార్టీ ఎంపీ నీచంగా కామెంట్ చేస్తే.. పార్టీ బాస్ గా వీర్రాజు మాట్లాడకపోవడం చర్చనీయాంశంగా మారింది. సోము తీరుపై బీజేపీ నేతలే ఆగ్రహంగా ఉన్నారు. కులం పేరుతో చీప్ రాజకీయాలు చేస్తున్నా మాట్లాడకపోవడమేంటనీ మండిపడుతున్నారు.
పురందేశ్వరిపై విజయసాయి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఏపీ ఇంచార్జ్ సునిల్ దియోదర్ వెంటనే స్పందించారు. విజయసాయికి ఆయన తీవ్ర స్థాయిలో కౌంటరిచ్చారు. కుల, మతాలకు అతీతంగా దేశ నిర్మాణానికి పనిచేసే పార్టీ బీజేపీ అన్న సునీల్.. మీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితే కులం పేరుతో దాడి చేస్తారా? అర్హత చూసి ఆమెకు ఇచ్చిన బాధ్యతను కులంతో ముడిపెడతారా? అంటూ ప్రశ్నించారు. అన్ని కులమయం చేసిన వైసీపీ కులాల గురించి మాట్లాడటం ఎబ్బెట్టుగా ఉందని దియోదర్ ట్వీట్ చేశారు. ఫురందేశ్వరికి సునిల్ దియోదర్ ఇచ్చిన సపోర్ట్ స్థానిక నాయకత్వం ఇవ్వకపోవడమేంటనే చర్చ ఏపీలో జరుగుతోంది. సోము వీర్రాజు సైలెంట్ గా ఉండటంపై రకరకాల వాదనలు వస్తున్నాయి. విజయసాయి రెడ్డితో తనకున్న స్నేహ బంధం వల్లే సోము వీర్రాజు మాట్లాడటం లేదని కొందరు బీజేపీ నేతలే గుసగుసలాడుతున్నారు. మొదటి నుంచి వీర్రాజు వైసీపీకి అనుకూలంగా పనిచేశారని చెబుతున్నారు. బీజేపీ ప్రయోజనాల కంటే వైసీపీ కోసమే ఆయన ఎక్కువ కష్టపడ్డారని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు,
పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన పర్చూరు అసెంబ్లీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల్లో ఓడిపోయినా ఆయనింకా ఆ పార్టీలో ఉన్నారు. పురందేశ్వరిని కులం పేరుతో కామెంట్ చేసిన విజయసాయికి వెంకటేశ్వరావుది అదే కులమని తెలియదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దగ్గుబాటికి వైసీపీ టికెట్ ఇచ్చినప్పుడు ఇంపుగా అనిపించిన కులం.. పురందేశ్వరికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కాగానే కంపుగా మారిందా విజయసాయి అని నిలదీస్తున్నారు. ఇవేం రాజకీయాలని ఏకి పారేస్తున్నారు. కులం పేరుతో కంపు రాజకీయాలు చేయవద్దని విజయసాయిని హెచ్చరిస్తున్నారు నెటిజన్లు.
సమాజంలో నైతిక వెలువులు పెరగాలని తిరుమల వెంకన్నను విజయసాయి మొక్కుకున్నారు. దీనిపైనా సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. జాతీయ స్థాయిలో కీలక పదవి పొందిన తెలుగింటి ఆడపడుచుపై కులం పేరుతో అభ్యంతరకర పోస్టులు పెట్టడమేనా నైతిక విలువలంటే అని విజయసాయిని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మీకు నచ్చితే ఒకలా.. నచ్చకపోతే మరోలా చూస్తారా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రాజ్యాంగపరమైన కీలక పదవిలో ఉండి అన్నింటిని కులమయం చేసే విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి.. నైతిక విలువల గురించి మాట్లాడటం వినడానికే అసహ్యంగా ఉందంటూ మరి కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇప్పటివరకు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేసిన, ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న జీవీఎల్ నరసింహరావు తీరుపైనా ఏపీ కమలనాధులు కస్సుబస్సు మంటున్నారు. ఇంత జరుగుతున్నా జీవీఎల్ ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు. చిన్నచిన్న విషయాలపై స్పందించే జీవీఎల్ కు పురందేశ్వరిపై విజయసాయి చేసిన కామెంట్లు కనిపించడం లేదా అని నిలదీస్తున్నారు. అమరావతిపై హైకమాండ్ తనకొక్కరికే క్లారిటీ ఇచ్చిందని, ఏపీ నేతలు చెబుతున్నదంతా ఉత్తదేనని ప్రచారం చేసుకున్న జీవీఎల్.. పార్టీ జాతీయ నాయకురాలిని అవమానిస్తున్నా ఎందుకు రియాక్ట్ కాలేదని కమలం నేతలే కడిగి పారేస్తున్నారు. తనను జాతీయ కమిటి నుంచి తప్పించారనే అసంతృప్తితోనే జీవీఎల్ మాట్లాడటం లేదనే చర్చ కూడా జరుగుతోంది. మొదటి నుంచి వైసీపీకి మద్దతుగా ఉన్న జీవీఎల్ వైఖరి మరోసారి స్పష్టమైందని చెబుతున్నారు. ఎన్ని కారణాలున్నా సొంత పార్టీ మహిళా నేతను కించపరిచినా రియాక్ట్ కావకపోవడమేంటనీ ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.