అప్పుల ఊబిలో ఏపీ.. ఖర్చుపెడుతున్న ప్రతి రూపాయిలో 55 పైసలు అప్పు!!
posted on Sep 30, 2020 @ 6:11PM
ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. ఏడాదిలో చెయ్యాల్సిన అప్పు ఏపీ ప్రభుత్వం ఐదు నెలల్లోనే చేసింది. ఖర్చుపెడుతున్న ప్రతి రూపాయిలో 55 పైసలు అప్పుగా తీసుకొచ్చినవేనని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) నివేదిక ఇవ్వడం చూస్తేనే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆర్థిక సంవత్సరం సగం కూడా పూర్తికాకముందే ఏడాది కాలానికి అంచనా వేసిన అప్పు మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకుంది. ఇక రాబోయే రోజుల్లో అప్పులు ఏ స్థాయిలో ఉంటాయోనని ఆందోళన వ్యక్తమవుతోంది.
ఏపీ ప్రభుత్వం గత ఐదు నెలల్లో వివిధ రూపాల్లో రూ. 84,617.23 కోట్లు సమీకరించగా, అందులో రూ. 47,130.90 కోట్ల రుణాలు ఉన్నాయి. అంటే సమీకరించిన మొత్తంలో 55.7 శాతం అప్పే. అప్పుల రూపంలో ఈ ఏడాది రూ. 48,295.58 కోట్లు తీసుకోనున్నట్టు బడ్జెట్ అంచనాల సందర్భంగా ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఆగస్టు నాటికే ఆ మొత్తాన్ని తీసేసుకున్నట్టు కాగ్ నివేదిక తెలిపింది.
ఈ ఏడాది రూ.18,434.15 కోట్లు రెవిన్యూ లోటు లెక్కేస్తే, ఇప్పటికే (5 నెలలకు) రూ.38,199.33 కోట్ల రెవిన్యూ లోటు వచ్చింది. కరోనా కాలంలో ఆర్ధిక వ్యవస్థ మందగించటంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఈ పరిస్థితికి కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆదాయం పెరిగే మార్గాలు అన్వేషించకుండా, ఇలాగే అప్పులు చేసుకుంటూ వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ కాస్తా అప్పులప్రదేశ్ గా మారే అవకాశముంది.